సాక్షి, న్యూఢిల్లీ: అడవుల పెంపకంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని కేంద్ర అటవీ పర్యవరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. సోమవారం ఇండియన్ ఫారెస్టు సర్వే రిపోర్ట్‌ను ఆయన న్యూఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో అత్యధికంగా 990 చదరపు కిలోమీటర్ల అడవుల విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. వృక్షాలను పెంచడం భారత జాతి సంస్కృతి అని, ప్రపంచంలో అడవులు అత్యధికంగా పెరిగిన దేశాల్లో ఇండియాలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో దేశంలో 13వేల చదరపు కిలోమీటర్ల అడవి పెరిగిందని, పారిస్ లక్ష్యాలకు అనుగుణంగా విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కంపా పథకం కింద అడవుల పెంపకానికి రూ. 40వేల కోట్లు రాష్ట్రాలకు ఇచ్చామని వెల్లడించారు. సర్వే నివేదికలో దేశ వ్యాప్తంగా గణనీయంగా అడవుల విస్తీర్ణం పెరిగిందని చెప్పారు.
అత్యధికంగా ఏపీ 990 చ.కి.మీ అడవులు విస్తీర్ణం పెరిగి పర్వతాల్లోని అడవుల శాతంలో 0.19 శాతం పెరిగిందని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో అడవుల శాతం తగ్గిందని, ఒక చెట్టు కట్ చేస్తే పది చెట్లు పెంచేలా ప్రణాళిక ఉండాలని అన్నారు. వెదురు బొంగులను గడ్డి జాతిలో వేయడం వల్ల వెదురు ఉత్పత్తులు పెరిగాయన్నారు. నల్లమలలో యురేనియం ఉందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే అనుమతిని ఇచ్చామని, నల్లమలలో ప్రకృతి పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. ఎర్ర చందనం భారత జాతి వృక్షం అయినా.. దానిని మనం పెంచకపోవడం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజస్థాన్‌లో జల స్వావలంబన వల్ల అడవుల విస్తీర్ణం పెరిగిందని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment