లక్నో : కుంభమేళాకు విచ్చేసిన మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాత్ ఈసారి గంగలో మునక వేయకుండా ఉండలేకపోయారని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రయాగరాజ్(అలహాబాద్)లో జరుగుతున్న కుంభమేళా సోమవారం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన యోగి మాట్లాడుతూ.. ‘ 2013లో మారిషస్ ప్రధాని ఇక్కడికి వచ్చినపుడు కాలుష్యం, పరిసర ప్రాంతాల్లో దుర్వాసన, సరైన వసతులు లేకపోవడంతో గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించకుండానే వెళ్లిపోయారు. దూరం నుంచే గంగాదేవికి నమస్కరించారు. అయితే ఈసారి మాత్రం ఆయన గంగా నదిలో మునక వేసి తరించారు’ అని పేర్కొన్నారు.
ఈసారి 3200 మంది ఎన్నారైలు వచ్చారు
ప్రధాని నరేంద్ర మోదీ చొరవ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతోనే గంగా ప్రక్షాళన కొనసాగుతోందని యోగి వ్యాఖ్యానించారు. 2019 కుంభమేళాకు దాదాపు 3200 మంది ఎన్నారైలు తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారని పేర్కొన్నారు. అదే విధంగా 70కి పైగా దేశాలకు చెందిన రాయబారులు గంగాస్నానం ఆచరించారని, ఇదొక రికార్డు అని హర్షం వ్యక్తం చేశారు.
కాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా కుంభమేళా పేరుగాంచింది. ఈ ఆధ్మాత్మిక వేడుకకు యునెస్కో గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. ఇక మహాశివరాత్రితో పాటు కుంభమేళా చివరిరోజు కావడంతో సోమవారం పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పవిత్ర సంగమానికి పోటెత్తారు. జనవరి 15 న ప్రారంభమైన కుంభమేళాలో భాగంగా సోమవారం సాయంత్రం నాటికి మొత్తం 24.05 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో పరిసరాలన్నీ శివన్నామ స్మరణతో మారుమ్రోగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment