మీకసలు బాధ్యత లేదా.. రవిశంకర్‌పై కోర్టు మండిపాటు | you have no sense or responsibility, says NGT to Ravi Shankar | Sakshi
Sakshi News home page

మీకసలు బాధ్యత లేదా.. రవిశంకర్‌పై కోర్టు మండిపాటు

Published Thu, Apr 20 2017 2:21 PM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM

మీకసలు బాధ్యత లేదా.. రవిశంకర్‌పై కోర్టు మండిపాటు

మీకసలు బాధ్యత లేదా.. రవిశంకర్‌పై కోర్టు మండిపాటు

ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ మీద దేశంలోని అత్యున్నత పర్యావరణ కోర్టు తీవ్రంగా మండిపడింది. ''అసలు మీకు బాధ్యత అన్నది లేదా.. మీరు ఏం కావాలనుకుంటే అది చెప్పేసే స్వేచ్ఛ ఉందని అనుకుంటున్నారా'' అని ప్రశ్నించింది. గత సంవత్సరం ఢిల్లీలో యమునానది తీరంలో తాము మూడు రోజుల పాటు భారీగా నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవం వల్ల ఏమైనా నష్టం కలిగితే, దానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వాన్ని, కోర్టులను అడగాలి తప్ప తనను కాదని రవిశంకర్ వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎవరికైనా జరిమానా విధించాల్సి వస్తే, అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు విధించాలని అన్నారు. యమునా నది నిజంగానే అంత స్వచ్ఛంగా ఉండి ఉంటే, వాళ్లు ముందుగానే అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవాన్ని ఆపేసి ఉండాల్సిందని కూడా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులున్న రవిశంకర్ ఈ వ్యాఖ్యలను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. వాటిపైనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా మండిపడింది.

ట్రిబ్యునల్ ఆగ్రహంతో కామెంట్ చేసిన తర్వాత రవిశంకర్ తరఫున ఒక ప్రతినిధి స్పందించారు. తాము వేరేలా భావించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, అలాగే ట్రిబ్యునల్ చివరగా ఏమంటుందో దాని తుది ఉత్తర్వులలో తెలుస్తుందని చెప్పారు. తదుపరి విచారణ మే 7వ తేదీకి వాయిదా పడిందని చెప్పారు. ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన వేదిక, మొత్తం వెయ్యి ఎకరాల్లో విస్తరించిన కార్యక్రమం కారణంగా యమునానది తీరం మొత్తం సర్వనాశనం అయ్యిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిన నిపుణుల బృందం తేల్చిచెప్పింది. ఈ నష్టాన్ని పూడ్చాలంటే పది సంవత్సరాల సమయం, రూ. 42 కోట్ల ఖర్చు అవుతాయని నిపుణులు చెప్పారు.

అయితే యమునానది తీరానికి, అక్కడున్న సున్నితమైన పర్యావరణ వ్యవస్థకు నష్టం వాటిల్లిందన్న వాదనను ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, దాని వ్యవస్థాపకుడు రవిశంకర్ ఖండించారు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వొద్దని పర్యావరణ వేత్తలు గత సంవత్సరమే అడిగినా.. అప్పటికే సమయం చాలా తక్కువ ఉందని చెప్పిన ఎన్‌జీటీ.. నిర్వాహకులకు రూ. 5 కోట్ల జరిమానా విధించింది. ప్రపంచంలోనే ఇంత ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు తనకు అవార్డు ఇవ్వాల్సింది పోయి ఇలా చేస్తారా అని అప్పట్లోనే రవిశంకర్ మండిపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement