దొంగలు తమ 'ఆర్ట్' చూపించారు!
యమునా నది ఒడ్డున మూడురోజులపాటు జరిగిన 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' భారీ సాంస్కృతిక వేడుకలో దొంగలు తమ చోరకళను ప్రదర్శించారు. ప్రపంచ సాంస్కృతిక ఉత్సవానికి వచ్చిన విదేశీయులూ, స్వదేశీయుల వద్ద తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. 29 ఏళ్ల ఓ రష్యా మహిళతో సహ 112 మంది వద్ద తమ కళను చాటారు. మొబైల్ ఫోన్లు, పర్సులు, ల్యాప్‌టాప్‌లు.. ఇలా వస్తువులను గుట్టుచప్పుడు కాకుండా కొట్టేశారు.
ఈ వేడుకకు సంబంధించి ఇప్పటివరకు 72 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో అత్యధికం దొంగతనాల గురించే ఉన్నాయని పోలీసులు తెలిపారు. పర్యావరణ వివాదాలు చుట్టుముట్టినా 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' స్థాపకుడు శ్రీశ్రీ రవింశకర్ ఆధ్వర్యంలో 'ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం' ఆదివారం ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. మూడురోజుల ఈ వేడుక సందర్భంగా వేదిక వద్ద 30 మందికిపైగా పిక్‌పాకెటర్లు, దొంగలను అరెస్టు చేశామని, ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెట్టి జైలుకు పంపించామని చెప్పారు.
ఇక ఢిల్లీ సన్‌లైట్ కాలనీ పోలీసు స్టేషన్‌లో నమోదైన 72 ఎఫ్‌ఐఆర్‌లలో అత్యధికం దొంగతనానికి సంబంధించినవే. డబ్బు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పర్సులు, గుర్తింపు కార్డులు పోయాయంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీనికితోడు వేదిక వద్ద ఏర్పాటుచేసిన ఓ గణేష్ విగ్రహాన్నీ దొంగలు వదిలిపెట్టలేదు. ఢిల్లీ పోలీసుల 'లాస్ట్ అండ్ ఫౌండ్' యాప్‌కు ఏకంగా మొబైల్ ఫోన్లు పోయినట్టు 40 ఫిర్యాదులు అందాయి. సాంస్కృతిక వేడుకలో ప్రదర్శన ఇవ్వడానికి వచ్చిన రష్యా మహిళ బ్యాగును కూడా దొంగలు కొట్టేశారు. ఆమె ఇలా వేదిక వద్దకు వచ్చి.. తిరిగి గదికి రాగానే.. గ్రీన్ రూమ్‌లోని ఆమె బ్యాగు మాయమైంది. అందులో దుస్తులు, ఇతర వస్తువులు ఉన్నాయి. దీంతో సాంస్కృతిక ఉత్సవంలో ఆమె పాల్గొనలేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
యమునా నది ఒడ్డున నిర్వహించిన ఈ భారీ వేడుకతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ 'ఆర్ట్ ఆఫ్ లివింగ్'పై రూ. 5 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికిప్పుడు అంతమొత్తాన్ని చెల్లించలేమని ఆ సంస్థ కోరడంతో.. రూ. 25 లక్షలు ముందుగా చెల్లించి ఈ వేడుకను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.