మృత్యు ముఖంలో జీవకళ
* నిమ్స్‌లో బాధితుడి చిరకాల కోరిక తీర్చిన కేటీఆర్
* చెదిరిన ‘సంతోష’ం కథనానికి స్పందన
సాక్షి, హైదరాబాద్: ‘ఏం సంతోష్.. ఆరోగ్యం ఎలా ఉంది? విషయం తెలిసిన వెంటనే నిన్ను కలిసేందుకు సత్తుపల్లి వద్దామనుకున్నా. తీరిక లేక రాలేకపోయా. ఆరోగ్యం గురించి ఆందోళన చెందకు. నీ కోసం వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని కూడా వెంట తీసుకొచ్చా. నీకు మేమంతా అండగా ఉంటాం. త్వరగా కోలుకోవాలి.
వీలైతే డిశ్చార్జ్‌కు ముందే మరోసారి వచ్చి కలుస్తా’... అంటూ నిమ్స్‌లో కొంత కాలంగా మృత్యువుతో పోరాడుతున్న ఖమ్మంజిల్లా బాలుడు సంతోష్ (14)కు మనోధైర్యాన్నిచ్చారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్. పేగులకు ఇన్‌ఫెక్షన్ సోకి మృత్యువుతో పోరాడుతున్న సంతోష్ ఆరోగ్య పరిస్థితిపై గత నెల 18న ‘సాక్షి’ ఖమ్మం ఎడిషన్‌లో చెదిరిన ‘సంతోష’ం శీర్షికతో కథనం ప్రచురించింది.
ఈ చిన్నారికి కేటీఆర్‌ను చూడాలన్నది చిరకాల కోరిక. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్వయంగా వచ్చి సంతోష్‌ను పలుకరించారు. బాధితునికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా నిమ్స్ డెరైక్టర్ మనోహర్‌ను ఆదేశించారు. కేటీఆర్ వెంట వైద్యఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.
పేగులకు ఇన్‌ఫెక్షన్...
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ నల్లంటి కృష్ణార్జునరావు, జ్యోతి దంపతుల రెండో కుమారుడు సంతోష్ సదాశివునిపేట జిల్లాపరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆటపాటల్లోనే కాదు చదువులోనూ ఎంతో చురుకు. బాసర త్రిబుల్‌ఐటీలో చదవాలనేది అతని ఆశయం. అయితే ఇటీవల ఉన్నట్టుండి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో స్థానిక ఆసుపత్రిలో సంప్రదించారు. పేగులకు ఇన్‌ఫెక్షన్ సోకిందని గుర్తించారు. ఖమ్మంలోని ఆషా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసి ఇన్‌ఫెక్షన్ సోకిన పేగులను తొలగించారు. ఇందుకు రూ.3 లక్షల వరకు ఖర్చు చేశారు.
ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోగా వైద్య ఖర్చులు భారంగా మారాయి. అంత స్తోమత లేక డిసెంబర్ 24న డిశ్చార్జ్ అయ్యి నిమ్స్‌లో చేరారు. కాగా, కేటీఆర్‌ను చూడగానే సంతోష్ ముఖం వెలిగిపోయింది. తనలో ఆత్మస్థైరం పెరిగిందని, త్వరలోనే కోలుకొంటానని సంతోష్ చెప్పాడు. సంపూర్ణ ఆరోగ్యంతో బాసర త్రిపుల్ ఐటీలో సీటు సంపాదిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.