హనమకొండ: రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబం అది. రోజువారీగా కూలీకి వెళ్తేనే వారికి పూట గడిచే ఆ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. ఇందులో రెండో కుమారుడు కుటుంబ కలహాలతో ఇటీవల పురుగుల మందుతాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సకు రూ. 8 లక్షల వరకు ఖర్చు అయింది.
దీంతో దిక్కుతోచని పరిస్థితి.. పైగా చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితి..ఈ క్రమంలో తండ్రి ఎవరిని అప్పు అడిగిన లభించలేదు. దీంతో తన కుమారుడి ఆరోగ్యం కంటే ఏదీఎక్కువ కాదని భావించి గ్రామంలో తమకున్న తాతల నాటి ఆస్తి 30 గుంటల భూమిని అమ్మకానికి పెట్టాడు. వచ్చిన డబ్బుతో సరాసరి ఆస్పత్రికి వెళ్లి చెల్లించాడు. అయితే డబ్బు తీసుకున్న అనంతరం ఆస్పత్రి యాజమాన్యం చావు కబురు చల్లగా చెప్పారు.
క్షతగాత్రుడికి వైద్యం చేయలేమని చేతులేత్తేశారు. మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో చేసేది లేమీ లేక మరో ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భూమిజాగా అమ్మినా బతుకలేకపోతివి కదా కొడుకా అంటూ తల్లిండ్రులు మృతదేహంపై రోదించిన తీరు ప్రతీ ఒక్కరిని కదలించింది. బచ్చన్నపేట మండలంలోని కొన్నె గ్రామానికి చెందిన చెవుల నర్సయ్య, జయమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. రెండో కుమారుడు చెవుల సురేష్(27) హైదరాబాద్‌లో పెయింటింగ్ పని చేస్తున్నాడు.
రెండు నెలల క్రితం హైదరాబాద్ మల్కాజిగిరి కౌపూర్ గ్రామానికి చెందిన ప్రియాంకను వివాహం చేసుకుని అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో గత నెల 28న కుటుంబ కలహాల నేపథ్యంలో గడ్డి మందు తాగగా వాంతులు విరేచనాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సురేష్‌ను హైదరాబాద్ ఈసీఎల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ రూ.8 లక్షల వరకు ఖర్చు అయింది.
దీంతో తండ్రి నర్సయ్య గ్రామంలో తమకున్న 30 గుంటల భూమిని విక్రయించి ఆస్పత్రి బిల్లు చెల్లించాడు. అయితే బిల్లు చెల్లించిన అనంతరం అక్కడి వైద్యులు చేతులు ఎత్తివేశారు. దీంతో వెంటనే సురేష్‌ను పంజాగుట్టలోని నిమ్స్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స ఆదివారం పొందుతూ మృతి చెందాడు. దీనిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment