న్యూఢిల్లీ: జేడీయూ నేత శరద్ యాదవ్తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం భటీ అయ్యారు. ఆయనతో పాటు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధికార టీడీపీ అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష శాసనసభ్యులను కొనుగోలు చేస్తున్న తీరును నిరసిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని నినదిస్తూ..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.
శరద్ యాదవ్ను కలిసిన వైఎస్ జగన్ బృందం.. మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా శరద్ యాదవ్ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులనే జాఢ్యం దేశవ్యాప్తంగా విస్తరించిందని, అధికార పార్టీకి చెందిన వ్యక్తులు స్పీకర్ గా ఉన్నందువల్లే ఇది జరుగుతోందన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏపీ అధికార పార్టీ సాగిస్తున్న అప్రజాస్వామిక రాజకీయాలను జాతీయ స్థాయిలో ఎండగట్టడానికి, ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడానికి ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట జగన్ నేతృత్వంలో ప్రజా ప్రతినిధుల బృందం జాతీయ నేతల దృష్టికి తీసుకు వచ్చారు. వైఎస్ జగన్ బృందం ... హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులను కలిసి టీడీపీ అనుసరిస్తున్న వక్రమార్గాలను, ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వివరించారు.