సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం విషయంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు శుక్రవారం సమావేశం అయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2019 నాటికి కేంద్ర ప్రభుత్వమే పోలవరాన్ని పూర్తి చేయాలని వారు ఈ సందర్భంగా గడ్కరీని కోరారు. పోలవరంపై ఇచ్చిన హామీ అమలు అయ్యేటట్లు కేంద్రం చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్ సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని అన్నారు. గడ్కరీని కలిసినవారిలో ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాద్, అవినాశ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
భేటీ అనంతరం వైఎస్‌ఆర్ సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్ట్ అక్రమాలపై విచారణ చేయాలి. ఈ ప్రాజెక్టుకు ఎంత వ్యయమైనా కేంద్ర మే భరించాలి.2019 ఎన్నికలలోపే పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలి. దుగ్గరాజపట్నం పూర్తి చేయాలని గడ్కరీని కోరాం. అలాగే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ చేయొద్దని విజ్ఞప్తి చేశాం. ప్రైవేటీకరణ వల్ల జాతీయ భద్రతకు ముప్పు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగులకు అండగా ఉంటాం. మా రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందంటే ఈ క్షణమే పదవులు వదులుకుంటాం.’ అని అన్నారు.