కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమైన వైఎస్సార్‌సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు రెండోసారి సవరించిన అంచనా వ్యయం రూ.47,725 కోట్లకు ఆమోదం తెలిపేందుకు కేంద్ర జలశక్తిశాఖ అంగీకారం తెలిపింది. వెంటనే ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికశాఖకు, కేంద్ర మంత్రిమండలికి పంపి ఆమోదింపజేస్తామని జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హామీ ఇచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించి పెట్టుబడి క్లియరెన్స్ ఇవ్వాలని కోరుతూ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు బుధవారం కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో గంటపాటు సమావేశమయ్యారు. ఎంపీలంతా సంతకాలు చేసిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు.
అనంతరం ఎంపీలతో కలిసి విజయసాయిరెడ్డి సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘జలశక్తి మంత్రితో సమావేశమై 5 అంశాలను ప్రధానంగా చర్చించాం. మొదటిది పోలవరం ప్రాజెక్టుకు ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇవ్వడం గురించి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, జలశక్తిశాఖ పరిధిలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) 2017–18 ధరల సూచీని అనుసరించి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.55,656 కోట్లుగా ఆమోదం తెలిపి కేంద్ర జలశక్తిశాఖకు సిఫారసు చేశాయి. దీన్ని సీడబ్ల్యూసీ పరిధిలోని రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్‌సీసీ) పరిశీలించి సవరించిన అంచనా వ్యయం రూ.47,725 కోట్లుగా ఆమోదించి జలశక్తిశాఖకు సిఫారసు చేసింది. సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,656 కోట్లుగా సిఫారసు చేసి ఆమోదించాలని కోరాం. కానీ మంత్రి ఆర్‌సీసీ సిఫారసు చేసిన మేరకు రూ.47,725 కోట్లను ఆమోదిస్తామన్నారు. ఇక రెండో అంశం.. ఒక ఎస్క్రో ఖాతా పెట్టి అందులో డబ్బు జమచేయాలని కోరగా.. అది సాధ్యం కాదని, ఎప్పుడైనా వారం, 15 రోజుల్లో రీయింబర్స్ చేసేలా చూస్తామని చెప్పారు. ఇప్పటివరకు చేయాల్సిన రూ.1,907 కోట్ల రీయింబర్స్‌మెంట్‌ను చేస్తామని చెప్పారు’ అని విజయసాయిరెడ్డి వివరించారు.
పద్దుల వారీగా చూడొద్దని కోరాం..
‘అంచనా వ్యయాన్ని విభిన్న పద్దుల కింద టీఏసీ ఆమోదించింది. కాంపొనెంట్ వారీగా పద్దును పరిగణనలోకి తీసుకోవద్దని కోరాం. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తరువాత ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి చెప్పారు. మరోఅంశం.. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరాం. తప్పకుండా వర్తింపజేస్తామని, దాని ప్రకారమే అంచనా వ్యయాన్ని ఆమోదిస్తున్నామని స్పష్టత ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం తరలించడానికి మంత్రి అంగీకరించారు.’ అని తెలిపారు. టీఏసీ ఆమోదించిన ప్రతిపాదనలకు, జలశక్తి ఆమోదిస్తున్న ప్రతిపాదనలకు అంతరం ఉందని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ‘ప్రాజెక్టు అంచనా వేసినప్పుడు 51 వేల ఎకరాలు ప్రభుత్వ భూమిగా పరిగణించారు. కానీ సర్వే, భూరికార్డుల పరిశీలనల్లో అవి ప్రయివేటు, అసైన్డ్ భూములుగా తేలింది. తొలుత ప్రభుత్వ భూములని చెప్పినందువల్ల కేంద్రం ఇప్పుడు దాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. నిర్వాసితులకు న్యాయం చేసేందుకు వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. తరువాత పరిశీలిస్తామని చెప్పారు’ అని విజయసాయిరెడ్డి తెలిపారు.
సమావేశం సానుకూలంగా ముగిసింది
సమావేశం అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మీడియాతో మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్ ఎంపీలు లేవనెత్తిన అనేక అంశాలపై సమగ్రంగా చర్చించాం. సమావేశం చాలాచాలా సానుకూలంగా ముగిసింది..’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment