టమాటో ఛాలెంజ్‌తో రైతులకు ఊరట | ATAFF helps farmers with Tomato Challenge initiative | Sakshi
Sakshi News home page

టమాటో ఛాలెంజ్‌తో రైతులకు ఊరట

Published Sat, Jun 20 2020 4:19 PM | Last Updated on Sat, Jun 20 2020 4:28 PM

ATAFF helps farmers with Tomato Challenge initiative - Sakshi

ఓ రైతు ఆవేదన వారిని కదిలించింది. ఎక్కడో సుదూరతీరాలలో ఉన్న నలుగురు యువకులు టమాటో రైతుల వేదనకు కరిగిపోయారు. వాట్సాప్‌లో చెక్కర్లు కొట్టిన ఓ వీడియో అమెరికా వరకు చేరింది. అది ఓ రైతు తన నాలుగెకరాల టమాటో పంట లాక్‌డౌన్ మూలంగా నాశనం అవుతోందని ఆవేదనతో రికార్డు చేసిన వీడియో. ఖండాంతరాలను దాటి వృత్తి రీత్యా డాక్టరైన వాసుదేవ రెడ్డి అనే యువకుని దృష్టిలో పడింది. వీడియోలో టమాటో పంటను అమ్ముకోలేక పారవేసే దృశ్యం అతనిని కదిలించివేసింది. దీనికి పరిష్కారం కనుగొనాలని భావించి ‘టమాటో ఛాలెంజ్’ పేరుతో ఓ పోస్టును తయారుచేసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. అతని స్నేహితులైన సుబ్బారెడ్డి, వెంకట్ కల్లూరి, డా. ప్రభాకర్‌లు సహకరించడంతో వారి టమాటో ఉద్యమం ఊపందుకుంది. 

అలా మొదలైంది !
ఆంద్రప్రదేశ్‌లో ఉన్నవారి స్నేహితుడు ప్రేమ్ కళ్యాణ్ కృషితో వారు చేసిన ఛాలెంజ్ గ్రామాలకు చేరింది. వారు నలుగురు పోగుచేసిన సొమ్ముతో పాటు విరాళాలుగా వచ్చిన దాదాపు రూ.50 లక్షల మొత్తాన్ని వారు ముందుగా టమాటో రైతులకు ఊరట కలిగించాలని భావించారు. ఇంతలో కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభం కావడంతో ఛాలెంజ్ ఉద్యమంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఈ ఛాలెంజ్‌లో భాగంగా రైతులను నేరుగా సంప్రదించి వారివద్ద నుండి మార్కెట్ ధరకు టమాటోను కొనుగోలుచేసి వాటిని ఉచితంగా పేదలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. లాక్‌డౌన్ మూలంగా ఎవరూ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితుల్లో పేదలకు ఇది వరంగా మారింది. తమ  పంట పాడైపోకుండా ఉంటే చాలని రైతన్నలు భావించే కాలంలో ఈ ఛాలెంజ్ వారికి ఉరటకలిగించింది. మొత్తానికి ఈ ఉద్యమం గ్రామాలకు పాకింది.

వాలంటీర్ల వ్యవస్థకు పునాది
కూరగాయల రవాణా సాధారణ రోజుల్లోనే ఒక ఛాలెంజ్. అలాంటిది లాక్డౌన్ కఠినంగా అమలువుతున్న రోజుల్లో అది మరీ కష్టం. ఈ వ్యవస్థను రెండుగా విభజించి పంట సేకరణకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి పంపిణీకి రెండవ బృందాన్ని సన్నధ్ధం చేశారు. పంటలు పండే ప్రాంతాలనుంచే రవాణా వాహనాలను సిద్ధంచేసి వాటికి ‘‘ఉచిత కూరగాయలు’’ అనే ఫ్లెక్సీలను కట్టి సరఫరాను ప్రారంభించారు. మొదట్లో చిన్నగా ప్రారంభమైనా రోజులు గడిచే కొద్దీ రవాణా సులువుగా మారిందని, రైతులను పంట చేలల్లోనే నగదు ఇచ్చేవిధంగా ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాలేదని, స్వచ్చందంగా ముందుకు వచ్చిన యువకులతో వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టామని, టమాటో ఛాలెంజ్ నిర్వహకులు ప్రేమ్ కళ్యాణ్  చెప్పారు. 

టమాటోతో మొదలై అన్ని కూరగాయలకు!
ముందుగా టమాటో రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో మొదలైన ఛాలెంజ్ కరోనా కష్టకాలంలో అన్ని రకాల కూరగాయలు తోడయ్యాయి. చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి, కొత్తకోట మండలాల్లో టమాటో కొనుగోళ్లు ప్రారంభం కాగా, ఉల్లిపాయలు, క్యారెట్, క్యాబేజీ, చిలకడదుంప, వంకాయలు, పచ్చి మిర్చి, మామిడి పండ్లు, బత్తాయిలు లాంటి పంటలను సైతం ఈ ఛాలెంజ్‌లో భాగంగా సేకరించి ఉచిత పంపిణీ చేశారు. నెల్లూరు  జిల్లాలోని వింజమూరు తదితర మండలాలు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో సైతం కూరగాయాలను కొనుగోళ్లు చేసి లాక్‌డౌన్ సమయం నెలన్నర రోజుల పాటు నిత్యం సరఫరా చేయడం ఈ ఎన్నారై బృందం కృషికి నిదర్శనం.

మా పంట పండింది!
‘‘నా రెండకరాల పొలంలో పండించిన టమాటో పంట కొనే నాదుడు లేక పారబోయలేక సతమతం అవుతున్నసందర్భంలో టమాటో ఛాలెంజ్ సభ్యులు నన్ను సంప్రదించారు. నేను  చెప్పిన ధరకే నా పంట కొనుగోలు  చేసి ఆ మరునాడే పంట దిగుబడి సిద్ధంచేసి వారికి అందించాను. కరోనా కష్టకాలంలొ పొలంలోనే నాకు పంట సొమ్ము చేతికి రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను’’అని తంబళ్లపల్లికి  చెందిన రైతు జీ. హరినాథ్ అన్నారు. 

మొత్తం 400 టన్నుల కూరగాయాలను కొనుగోలు చేసి పేదలకు  ఆయా జిల్లాలోని దాదాపు లక్ష మంది పేదలకు ఉచితంగా పంపిణీ చేయడం విశేషం. దాదాపు 13 టన్నుల చిలకడ దుంప, 40 టన్నుల టమాటో, 2 టన్నుల క్యాబేజీ, 3 టన్నుల వంకాయలు, 5 టన్నుల క్యారెట్ పంటలను చిత్తూరు జిల్లా రైతుల నుంచే కొనుగోలు చేయటం విశేషం. వీటిని రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో ఉచితంగా పంపిణీ  చేసినట్టు, నిర్వహకులు ప్రేమ్ కళ్యాణ్ వెల్లడించారు. టమాటో ఛాలెంజ్‌ను సేవగా భావించిన యువకులు వారివారి జిల్లాలలో ఉచిత కూరగాయల పంపిణీని చేపట్టారు.

దాదాపు 200 మంది రైతలు ఈ ఛాలెంజ్ ద్వారా తమపంటను సరైన ధరకు అమ్ముకోగలిగారని సాధారణంగా మొదలైన ఈ ఛాలెంజ్ ఈ స్థాయిలో విజయవంతం కావడం ఆనందంగా ఉందని అమెరికాలో నివాసం ఉంటున్న డా.వాసుదేవ రెడ్డి అన్నారు. ఈ విజయం అందుకున్న తర్వాత రైతులకు అండగా నిలిచేందుకు అమెరికన్ తెలుగు అసోసేషన్ ఫర్ ఫార్మర్స్ (ఏటీఏఎఫ్‌ఎఫ్‌) అనే సంస్థను ప్రారంభించినట్టు వాసుదేవ్ చెప్పారు. ఈ స్వచ్ఛంధ సంస్థ ద్వారా రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలన్న యోచనలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ‘‘ఇది తొలి విజయం.. ఈ విజయం మరిన్ని విజయాలకు పునాది అవుతుందని విశ్వశిస్తున్నాం,’’ అని ఈ యువ వైద్యులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement