సీఎం జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిద్దాం | AP Representative of North America Ratnakar Appreciates YS Jagan Over English Medium in Govt Schools - Sakshi
Sakshi News home page

‘ఇప్పుడు వారికి హఠాత్తుగా వారికి తెలుగు భాష గుర్తుకొచ్చింది’

Published Thu, Nov 14 2019 9:54 PM | Last Updated on Fri, Nov 15 2019 10:44 AM

English Medium In All Govt Schools: Representative Of AP Govt For North America Ratnakar Appreciates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యా విధానంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని నార్త్‌ అమెరికా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధి రత్నాకర్‌ స్వాగతించారు. సీఎం జగన్‌ నిర్ణయం పేద, బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి, వారి బంగారు భవిష్యత్తు పునాది అవుతుందన్నారు. తమ కుటుంబ సభ్యుల్లో ఒక్కరినీ కూడా తెలుగు మీడియంలో చదివించని వాళ్లు.. ఇప్పుడు తెలుగు భాష గురించి పుంఖాను పుంఖాలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ మేరక ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘సమాజంలో పేదలు, అట్టడుగు వర్గాలు , ఆర్ధికంగా వెనుకబడ్డ వారు ప్రాధమిక చదువుల కోసం ఆధార పడే ప్రభుత్వ పాఠశాలల్లో  ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలంటూ , విద్యా మూలం మిదత్ జగత్ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకోగానే కొన్ని వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. హఠాత్తుగా వారికి తెలుగు భాష గుర్తుకొచ్చింది. తమ కుటుంబ సభ్యుల్లో ఒక్కరినీ తెలుగు మీడియంలో చదివించని వీరంతా తెలుగు భాష గురించి పుంఖానుపుంఖాలుగా మాట్లాడుతున్నారు. 

ప్రతి చిన్నారి మొదటి నుంచే కచ్చితంగా ఇంగ్లీషు మీడియంలో చదివితే ఎన్నో ప్రయోజనాలుంటాయన్నది సొంతగా నా జీవితంలో నేను ఎదుర్కొన్న సంఘటనలను బట్టి చెప్పవచ్చు. కడపలోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్న నేను ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడలేక, పూర్తి స్థాయి ప్రావీణ్యత లేక ఎన్నో అవకాశాలు కోల్పోయా. తప్పనిసరి పరిస్థితుల్లో గ్రాడ్యుయేషన్‌లో ఇంగ్లీషు మీడియంలోకి వచ్చినా.. భాష పూర్తిగా రాకపోవడం వల్ల ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. సాఫ్ట్‌ వేర్ నిపుణుడిగా అమెరికా వచ్చిన నాకు ఇంగ్లీషు భాషలో పట్టు లేకపోవడం వల్ల మొదట్లో  నా కెరియర్‌కు ఎంతో నష్టం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు మాట్లాడే భాష ఇంగ్లిష్. దాదాపు 150కోట్ల మంది మాట్లాడే ఇంగ్లీష్‌ వల్ల వ్యవహారం అంతా ఆ భాష చుట్టే తిరుగుతోంది. కేంబ్రిడ్జి యూనివర్సిటీ లెక్కల ప్రకారం చైనాలో దాదాపు 35కోట్లమంది ప్రజలకు ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉంది. భారత్‌లో ఆ సంఖ్య 10కోట్లే. ఇంగ్లీషు భాష గురించి నిజాయతీగా కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. తమ మనస్సాక్షిని ప్రశ్నించుకుంటే నిజాలు బయటపడతాయని ఆశిస్తున్నా.

1. నేషనల్‌గా, ఇంటర్నేషనల్‌గా ఏ ముఖ్యమైన పని చేయాలన్నా, బిజినెస్‌ నిర్వహించాలన్నాఇంగ్లీషు అవసరం కాదా?

2. ఉన్నత కొలువులకు బాటలు వేసే ఏ చదువు చదవాలన్నాఇంగ్లీషు తప్పనిసరి కాదా?

3. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏ యూనివర్సిటీలో విద్య అభ్యసించాలన్నా.. ఇంగ్లీషులో ప్రావీణ్యం లేకుంటే నిరాశే మిగలదా?

4. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ కావాలన్నా, ఇంటర్నెట్‌ నుంచి సమాచారం కావాలన్నా.. ఇంగ్లీషుపైనా ఆధారపడడం లేదా?

5. సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ ఎంతో ఉండి కూడా ఇంగ్లీషు సరిగా మాట్లాడలేక అమెరికా/యూకే వీసాలు రిజెక్ట్‌ అయి మనకు తెలిసిన వాళ్లెందరో నిరాశకు గురి కావాట్లేదా?

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇంగ్లిష్‌కు దాని విలువ తెలిసి ప్రాధాన్యమిస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు మొదట తమ పిల్లలకు ఇంగ్లిష్ నేర్పించి తరవాతే తమ భాష నేర్పుతున్నారు. జీవితంలో విజయం సాధించాలంటే ఇంగ్లిష్ నేర్చుకోవడమే మార్గమని నమ్ముతున్నారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్‌లో వాస్తవాలు పరిశీలించండి. అన్ని ప్రైవేట్‌ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియమే ఉంది. డబ్బున్న వారంతా తమ పిల్లలను ఇంగ్లీషులోనే చదివిస్తున్నారు. అంటే ఇంగ్లీషు మీడియం వ్యతిరేకించే వారి లక్ష్యం పేద, బడుగు, బలహీన వర్గాలా? వాళ్లు ఇంగ్లీషు చదువకోవడం వీరికి ఇష్టం లేదా? అణగారిన వర్గాలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం లేకపోవడం వల్ల అప్పో సప్పో చేసి మరీ ప్రైవేట్‌ కాన్వెంట్‌లలో చదివించే వారి కష్టాలు ఎప్పుడు తీరాలి?

 సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎంతో మంది విద్యార్థులకు ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాందించుకునే అవకాశం వస్తుంది. భవిష్యత్తులో వీరందరికి ఇంగ్లీషు మీడియం వల్ల ఎంతో ప్రయోజనం జరగనుందని కచ్చితంగా విశ్వసిస్తున్నా. ఏపీ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు లభించేలా బాటలు వేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయం మనస్పూర్తిగా స్వాగతిద్దాం. పార్టీలకు అతీతంగా.. ఇంగ్లీషు మీడియం నిర్ణయానికి జై కొడదాం’ అని రత్నాకర్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement