కరోనా మహమ్మారితో విదేశాల్లో చిక్కుకుపోయిన భారత పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీనిలో భాగంగా విదేశాల నుండి భారత్‌కు వచ్చే విమానాల షెడ్యుల్‌ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ విడుదల చేసింది. వివిధ దేశాల నుండి కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్, పంజాబ్, జమ్మూ-కాశ్మీర్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్ లకు నడిపే విమానాల వివరాలను వెల్లడించారు.
మొదటివారంలో అమెరికా నుండి రెండు, కువైట్, బ్రిటన్, యూఏఈ, ఫిలిప్పీన్స్, మలేషియాల నుండి ఒక్కొక్క విమానం తెలంగాణకు నడుపుతారు. ఆంధ్ర ప్రదేశ్ వాసులు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలను ఉపయోగించుకునే వీలుంది. ఒక్కొక్క విమానంలో 200 నుండి 300 మంది ప్రయాణీకులను తీసుకురానున్నారు. కాగా భౌతిక దూరం పాటించే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సీట్ల సంఖ్యను పరిమితం చేస్తున్నట్లు తెలిసింది. ప్రయాణికులు భారత్ లోని విమానాశ్రయాల్లో దిగిన తర్వాత ఇమిగ్రేషన్, ఆరోగ్య శాఖల అధికారులకు సమర్పించాల్సిన పత్రాల నమూనాను కూడా విడుదలచేశారు.
కేరళకు ఎక్కువ విమానాలు
గల్ఫ్ సెక్టార్ లోని యూఏఈ దేశంలోని అబుదాబి నుండి కొచ్చి, హైదరాబాద్‌లకు, దుబాయి నుండి కొచ్చి, కోజికోడ్, చెన్నై, ఢిల్లీ, అమృత్ సర్ లకు, షార్జా నుండి లక్నోకు, సౌదీ అరేబియాలోని రియాద్ నుండి కోజికోడ్, ఢిల్లీలకు, దమ్మామ్ నుండి కొచ్చి, జిద్దా నుండి ఢిల్లీ, కొచ్చిలకు, బహరేన్ దేశంలోని మనామా నుండి కొచ్చి, కోజికోడ్ లకు, ఖతార్ దేశంలోని దోహా నుండి కొచ్చికి, కువైట్ నుండి కొచ్చి, కోజికోడ్, చెన్నైలకు, ఓమాన్ దేశంలోని మస్కట్ నుండి కొచ్చి, చెన్నై లకు మొదటి వారం విమాన షెడ్యూళ్లను ప్రకటించారు. గల్ఫ్ దేశాల నుండి కేరళ రాష్ట్రం లోని కొచ్చి, కోజికోడ్ లకు అత్యధిక విమానాలను నడపనున్నారు.
-మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు. మొబైల్: +91 98494 22622
Comments
Please login to add a commentAdd a comment