
వర్జీనియా : భారత సంతతికి చెందిన హిమాన్వి పనిదెపు(17)ని మిస్ వర్జీనియా టీన్ యూఎస్‌ఏ 2018 టైటిల్ వరించింది. ఈ కిరీటాన్ని దక్కించుకున్న మొదటి ఇండియన్ అమెరికన్‌గా ఆమె నిలిచారు. హిమాన్వి క్లిఫ్టన్లోని సెంట్రెవిల్లె హైస్కూల్లో చదువుకుంటున్నారు. 39 మంది యువతులతో పోటీ పడి ఈ అందాల కిరీటాన్ని చేజిక్కించుకున్నారు. డౌన్ టౌన్ నార్ఫోక్‌లోని టైడ్ వాటర్ కమ్యూనిటీ కాలేజీలోని రోపర్ థియేటర్‌లో మిస్ వర్జీనియా టీన్ యూఎస్‌ఏ 2018 టైటిల్‌ను హిమాన్వికి బహుకరించారు. మానసిక ఆరోగ్యం, డ్రగ్స్, ఆల్కహాల్‌లపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు హిమాన్వి తనవంతుగా వర్జినియాలో కృషి చేస్తున్నారు.
'నా కల నెరవేరింది. ఈ కిరీటం సాధించడంలో సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు' అని హిమాన్వి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు.