
అబుదాబి: కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు పలు దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. యూఏఈలో కూడా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో జీవనోపాధి కోసం వెళ్లిన భారతీయుల ఆర్థిక పరిస్థితి అస్థవ్యస్థమంగా మారింది. వారు పని చేసే చోట యాజమాన్యం వేతనాలు చెల్లించకపోవడంతో వారి బతుకుతెరువు ప్రశ్నార్థకంగా మారింది. ఇక అక్కడి మన భారత వలస కూలీలను ఆదుకునేందుకు తాము ఉన్నామంటూ అబుదాబిలోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ (ఐఎస్‌సీ) వారు ముందుకు వచ్చారు. (నిరుపేదలకు చేయూతగా నిలిచిన జీవీఎంసీ)
ఈ సంస్థ గత 52 సంవత్సరాలుగా యూఏఈలోని మన తెలుగువారికి ఎన్నో విధాలుగా సేవలందిస్తోంది. ఇక కోవిడ్-19 నేపథ్యంలో అక్కడి తెలుగు వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కొక్కరికి 3 వారాలకు సరిపడే విధంగా వంట సామగ్రిని అందించింది. పరిస్థితులు మెరుగయ్యే వరకు కార్మికులను ఆదుకుంటామని ఈ కార్యక్రమానికి ముఖ్యదాతగా వ్యవహరిస్తున్న లూలూ గ్రూప్ అధినేత అజిత్ జాన్సన్ తెలియజేశారు. ఈ విపత్కర పరిస్థితుల నుండి బయటపడే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఐఎస్‌సీ సంస్థ అధ్యక్షుడు యోగేష్ చెప్పారు. ఇవే కాకుండా అన్ని కార్మిక గృహాలలో ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌లతో పాటు చేతి గ్లౌజులను కూడా అందజేస్తున్నామని సంఘం సంక్షేమ కార్యదర్శి రాజా శ్రీనివాస రావు పేర్కొన్నారు. యూఏఈలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత అధికంగా ఉండటంతో ఇక్కడి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా తమ సంఘం తరపున ఐసోలేషన్ సెంటర్‌ల ఏర్పాటుకు సన్నాహాలు చేశామని సంఘ కోశాధికారి షజీల్, కార్యదర్శి జయప్రదీప్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment