ఒర్లాండో : అమెరికా గ్రీన్ కార్డ్ కోసం అర్రులు చాచే టెక్నోక్రాట్లు చుట్టూ ఉంటే తాను అమితంగా ప్రేమించే భార్య కోసం గ్రీన్ కార్డును వదులుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల. తాను రాసిన ‘హిట్ రిఫ్రెష్’ పుస్తకంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. 1993లో సత్యా నాదెళ్ల అనూను వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం భార్యను తనతో పాటు అమెరికా తీసుకువెళ్లాలనుకున్నారు. అయితే అప్పుడున్న అమెరికన్ ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం గ్రీన్‌కార్డ్ కలిగిన వారిని వివాహం చేసుకుంటే వారి భాగస్వామికి వీసా తిరస్కరిస్తారు. దీంతో సత్యాతో కలిసి ఆమె సీటెల్ రాలేకపోయారు. ఈ నిబంధన ఆయనలో సంఘర్షణ రేపడంతో వెనువెంటనే గ్రీన్ కార్డ్ వదులుకోవాలని నిర్ణయించారు.
హెచ్1బీ వీసా కలిగి అమెరికాలో పనిచేస్తుంటే వారి భాగస్వాములు(భార్య లేదా భర్త) అమెరికా వచ్చేందుకు వెసులుబాటు ఉంది. ‘అప్పట్లో అనూయే నాకు ప్రాధాన్యం...అందుకే గ్రీన్ కార్డు వదిలి హెచ్1బి వీసాకు మొగ్గుచూపా’ నని తన అనుభవాలను పుస్తకంలో పొందుపరిచారు.తన నిర్ణయంపై అందరూ విస్తుపోయారని చెప్పారు. 1994లో ఢిల్లీలోని యూఎస్ ఎంబసీకి వెళ్లి గ్రీన్ కార్డును తిరిగి ఇచ్చేసి, హెచ్1బి వీసాకు దరఖాస్తు చేయాలనుకుంటున్నట్టు చెప్పగానే అక్కడున్న క్లర్క్ ఆశ్చర్యపోయాడని గుర్తుచేసుకున్నారు. ఎందుకలా అనుకుంటున్నారని అతను అడగ్గా ఇమిగ్రేషన్ ఇబ్బందులను వివరించానని..దాంతో హెచ్1బీ ఫామ్‌ను తనకందించారని పుస్తకంలో పేర్కొన్నారు.
హెచ్1బీ వీసా లభించడంతో తన భార్య తనతో కలిసి సీటెల్‌కు వచ్చిందని అక్కడ తాను జీవితాన్ని ప్రారంభించి..తామిద్దరం తమ జీవితం నిర్మించుకున్నామని వివరించారు. అప్పటి నుంచి నిత్యం తనను ఇమిగ్రేషన్ సలహాల కోసం ఎవరో ఒకరు సంప్రదిస్తూ ఉండేవారని చెప్పారు.