
కాలిఫోర్నియా : కాలిఫోర్నియా గవర్నర్ రేసులో ఉన్న అభ్యర్థుల్లో, ఇప్పుడు అందరి దృష్టి భారతసంతతికి చెందిన అమెరికన్ టెక్కీ శుభమ్ గోయల్(22)పైనే ఉంది. గవర్నర్ అభ్యర్థుల్లోనే అతిపిన్న వయస్సున్న శుభమ్ కొత్త టెక్నాలజీలనువాడుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన అతని తల్లిదండ్రులు కొన్నేళ్ల కిందటే అమెరికాలో స్థిరపడ్డారు. మీరట్‌కు చెందిన అతని తల్లి కరుణ గోయల్, లక్నోకు చెందిన తండ్రి విపుల్ గోయల్ సాఫ్ట్‌వేర్ రంగంలోనే పనిచేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో శుభమ్ విద్యను అభ్యసించారు. 2017లో చదువు పూర్తైన అనంతరం, వర్చువల్ రియాలిటీ కంపెనీలో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తూ కాలిఫోర్నియాలోని డాన్‌విల్లెలో నివాసం ఉంటున్నారు. 'కాలిఫోర్నియాలోనే పుట్టి పెరిగాను. టెక్నాలజీలో వస్తున్న నూతన ఆవిష్కరణలను ప్రజల సమస్యల పరిష్కారంలో వాడొచ్చు. నాకు తెలిసి ఎన్నికల ప్రచారంలో వర్చువల్ రియాలిటీని వాడుతున్న మొదటి వ్యక్తిని నేనే అనుకుంటా. బాహ్య ప్రపంచం రోజు రోజుకూ కొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతూంటే, రాజకీయాల్లో మాత్రం అవేవి కనిపించటంలేదు' అని శుభమ్ గోయల్ పేర్కొన్నారు. సామాజికమాధ్యమాల సహాయంతోనే కాకుండా, నగరంలోని వీధుల్లోనూ అతను మైక్ పట్టుకుని తనను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీతో కాలిఫోర్నియాలోని విద్యావ్యవస్థలోని అనేక సమస్యలను పరిష్కరించవచ్చని శుభమ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని సమూలంగా నిర్మూలించి, టెక్నాలజీని ఎక్కువగా వాడాలసిన సమయం ఆసన్నమైందన్నారు. రాజకీయాల్లో స్వతంత్రంగా, స్వేచ్ఛగా మాట్లాడేవారి అవసరం ఉందన్నారు. టెక్నాలజీతో పాలనలో పారదర్శకత ఉండేలా చూడొచ్చని అన్నారు.
నాలుగేళ్లకోసారి కాలిఫోర్నియా గవర్నర్ ఎన్నికలు జరుగుతాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో జెర్రీ బ్రౌన్, భారత అమెరికన్ అయిన నీల్ కష్కరీపై గెలుపొందారు. ఈసారి జరిగే ఎన్నికల్లో 27 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధంలేని కుటుంబం నుంచి వచ్చి, ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచిన శుభంకు టెక్నాలజీ స్లోగన్ ఏమేర సహాయ పడుతుందో వేచిచూడాలి.