బోటు నడుపుతున్న అవినాష్
ఉక్కునగరం(గాజువాక): అనకాపల్లిలో ఎంసీఏ పూర్తి చేశాడు... అమెరికాలో ఎంఎస్ పూర్తిచేశాడు... అక్కడే ఉద్యోగం సంపాదించుకుని హాయిగా గడుపుతున్నాడు... భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలలు కంటున్న తరుణంలో మృత్యువు కాటేసింది. ఇష్టమైన బోటింగ్‌కు వెళ్లి ఈతకు దిగగా నీటిలో మునిగి చనిపోయాడు. ఈ దుర్ఘటన అమెరికాలోని న్యూజెర్సీలోని సరస్సులో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్టీల్‌ప్లాంట్ ఇంజినీరింగ్ షాప్స్ అండ్ ఫౌండ్రీ విభాగంలో జనరల్ ఫోర్‌మెన్ కూన వెంకటరావుకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయన కుటుంబంతో సెక్టార్ – 3లోని 144ఎ క్వార్టర్‌లో నివసిస్తున్నారు. కుమార్తె మృదులకు వివాహమైంది. కుమారుడు కె.అవినాష్ (31) అనకాపల్లి డైట్ కాలేజీలో ఎంసీఎ పూర్తి చేశాడు. అమెరికాలోని న్యూమెస్సికాన్ స్టేట్ యూనివర్సిటీలో 2016లో ఎంఎస్ పూర్తి చేశాడు. ప్రస్తుతం న్యూజెర్సీలో యూనియన్ పోస్టల్ సర్వీసులో పని చేస్తున్నాడు.
స్వతహాగా చురుకుగా, ఉత్సాహంగా ఉండే అవినాష్ బోట్ డ్రైవింగ్, స్విమింగ్‌లో నిష్ణాతుడు. శనివారం తన స్నేహితులతో సమీపంలో ఉండే హోప్తాకాంగ్ ఫిష్ లేక్‌లో బోటింగ్ వెళ్లాడు. తనే బోట్ డ్రైవ్ చేశాడు. ఒక ప్రాంతంలో ఈతకు డైవ్ చేయగా నీటిలోకి వెళ్లిన అవినాశ్ తేలలేదు. దీంతో కంగారుపడిన స్నేహితులు ఎంత వెతికినా కనిపించలేదు. వెంటనే స్థానిక అదికారులకు సమాచారం అందించగా వారు గాలింపు చేపట్టారు. ఈ విషయం ఆదివారం ఉదయం తండ్రి వెంకటరావుకు సమాచారం అందింది. దీంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. గాలింపులో సోమవారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది. న్యూజెర్సీ సమీపంలో ఉన్న బంధువులు, అక్కడి తెలుగు వాళ్లు అవినాష్ ప్రమాద సంఘటన విషయంలో స్థానిక పోలీసులతో సమన్వయం చేస్తున్నారు. అవినాశ్ తల్లి ప్రస్తుతం అనారోగ్యంతో ఉక్కు జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడి అధికారుల సూచనల మేరకు మృతదేహాన్ని విశాఖకు తీసుకురానున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు ఇలా ఆకస్మికంగా మృతి చెందటంతో ఉక్కునగరంలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment