టెక్సాస్: అమెరికాలోని తెలుగు ఎన్నారై దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన నకిరేకంటి శ్రీనివాస్(51), శాంతి(46)లు వారు నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌లో సోమవారం విగతజీవులుగా పడి ఉన్నారు. అయితే వారిద్దరినీ తుపాకీతో కాల్చడం వల్ల చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. దంపతులిద్దరి మధ్య చోటుచేసుకున్న కలహాల కారణంగానే శ్రీనివాస్ తన భార్య శాంతిని తుపాకీతో కాల్చి చంపి ఉంటాడని, అనంతరం తాను బెడ్‌రూంలోకి వెళ్లి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన నకిరేకంటి శ్రీనివాస్, శాంతి దంపతులు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో టెల్‌ఫేయిర్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. వారికి ఒక కుమారుడు(21), ఒక కుమార్తె(16) ఉన్నారు.
ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 5.40 గంటల సమయంలో వారి ఇంటి నుంచి తుపాకీ శబ్దాలు వినిపించడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వారి కుమార్తె ఇంటి తలుపు తీసింది. పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. అప్పటికే తుపాకీ కాల్పుల వల్ల శాంతి, శ్రీనివాస్‌లు మృతి చెంది కనిపించారు. శాంతికి తలపై శ్రీనివాస్‌కు ఛాతీపై బుల్లెట్ల గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అనంతరం వారి మృతదేహాలను వైద్య పరీక్షలకు తరలించారు. శ్రీనివాస్, శాంతి మధ్య గొడవ ఎందుకు జరిగిందన్న విషయమై వారి కుమార్తె వద్ద ఎలాంటి సమాచారం లేదని, కేసును విచారిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో కుమారుడు కాలేజీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. టెక్సాస్ యూనివర్సిటీలో చదువుతున్న అతడికి తల్లిదండ్రుల మృతి విషయాన్ని చేరవేశారు. స్థానికంగా ఉన్న శ్రీనివాస్ స్నేహితులను పోలీసులు విచారించగా.. సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో శ్రీనివాస్ తనకు కొన్ని ఈ మెయిల్స్ పంపించాడని తెలిపారు. ఈ మెయిల్ వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని శ్రీనివాస్ స్నేహితుడిని పోలీసులు ఆదేశించారు.
ఇదీ దంపతుల నేపథ్యం..
రెలియంట్ ఎనర్జీ కంపెనీలో శ్రీనివాస్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అలాగే ఇండో–అమెరికన్ చారిటీ ఫౌండేషన్‌కు ఆయన ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. శాంతి లింక్‌డిన్ ప్రొఫెల్ ప్రకారం.. ఆమె యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో ప్రాజెక్టు లీడ్/ఆర్కిటెక్ట్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ఆమె షెవరాన్‌లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో మేనేజర్‌గా పనిచేసినట్లు పేర్కొంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఆమె ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివారు. అనంతరం టెక్సాస్‌లోని ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఎమ్మెస్ పూర్తి చేశారు. అదే యూనివర్సిటీ నుంచి శ్రీనివాస్ కూడా మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం హూస్టన్‌లోని రైస్ యూనివర్సిటీ నుంచి శ్రీనివాస్ ఎంబీఏ పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment