సౌదీ కంపెనీపై ఐక్య పోరాటం | Workers Strike on Saudi J And P Company Close | Sakshi
Sakshi News home page

సౌదీ కంపెనీపై ఐక్య పోరాటం

Published Fri, Oct 11 2019 1:40 PM | Last Updated on Fri, Oct 11 2019 1:40 PM

Workers Strike on Saudi J And P Company Close - Sakshi

ఆర్మూర్‌లో కలుసుకున్న జేఅండ్‌పీ కంపెనీ బాధితులు (ఫైల్‌)

ఎన్‌.చంద్రశేఖర్, మోర్తాడ్‌ (నిజామాబాద్‌ జిల్లా): సౌదీ అరేబియాలోని జేఅండ్‌పీ కంపెనీ మూతపడడంతో ఇంటికి చేరుకున్న తెలంగాణ కార్మికులు తమ వేతన బకాయిలను రాబట్టుకోవడానికి ఏకమయ్యారు. కంపెనీపై న్యాయ పోరాటానికి నడుంబిగించారు. గల్ఫ్‌ దేశంలోని కంపెనీపై మన రాష్ట్రం నుంచి న్యాయ పోరాటానికి దిగడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో జేఅండ్‌పీ కంపెనీ తన శాఖలను విస్తరించి ఎంతో మంది కార్మికులకు ఉపాధి కల్పిం చింది. ఈ కంపెనీలో వీసా కోసం కార్మికులు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించారు. అయితే, ఏడాదిన్నర కాలంగా నిర్వహణ లోపంతో కార్మికులకు సరైన పని చూపలేదు. చేసిన పని కి వేతనం కూడా ఇవ్వలేదు. కార్మికులకు కనీ సం అకామా (గుర్తింపు) రెన్యూవల్‌ చేయకపోవడంతో కార్మికులు తమ వీసా గడువు ముగిసి క్యాంపులకే పరిమితం అయ్యారు.

జేఅండ్‌పీ కంపెనీలో వివిధ దేశాలకు చెందిన కార్మికులు దాదాపు 1,500 మంది ఉండగా అందులో తెలంగాణ జిల్లాలకు చెందిన వారు 102 మంది ఉన్నారు. కాగా, కార్మికులు రియాద్‌లోని లేబర్‌ కోర్టులో మన విదేశాంగ శాఖ సహకారంతో న్యాయ పోరాటం చేశారు. న్యాయమూర్తి కార్మికుల పక్షాన నిలవడంతో కార్మికులు ఎట్టకేలకు రెండు నెలల క్రితం ఇళ్లకు చేరుకున్నారు. ఒక్కో కార్మికునికి కంపెనీ యాజమాన్యం రూ.1.50 లక్షల నుంచి రూ.3లక్షల వేతనం చెల్లించాల్సి ఉంది. వలస కార్మికుల్లో అందరూ పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే. తమకు   కంపెనీ నుంచి రావాల్సిన వేతన బకాయిల కోసం న్యాయ పోరాటం చేయడానికి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట్‌కు చెందిన సైండ్ల రాజారెడ్డి ముందుకు వచ్చారు. ఆ కంపెనీలో పనిచేసి నష్టపోయి ఇళ్లకు చేరిన తెలంగాణ జిల్లాలకు చెందిన వారిని ఏకంచేసి ఒక కమిటీ వేశారు. కమిటీ ఆధ్వర్యంలో సౌదీలోని కంపెనీ యాజమాన్యంపై న్యాయపోరాటానికి రూపకల్పన చేస్తున్నారు. ఇటీవల వారు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లోసమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్‌కార్యాచరణపై చర్చించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement