
‘ఆశా’లకు ఆత్మగౌరవం ఉండదా?
సందర్భం
అనేక పర్యాయాలు తెలంగాణ ప్రభుత్వానికి వినతులు అందించిన అనంతరం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆశాలు పోరుబాట పట్టారు. వారు కోరుతున్నది గొంతెమ్మ కోరికలు కాదు. అయ్యా! సేవ చేస్తున్నాం. పనికి తగ్గ కనీస వేతనం నిర్ణయించండి. మా బతుకులు బాగు పడాలంటే మీరిచ్చే రెండు వందలో, పది హేను వందలో సరిపోవు. సమాజానికి సేవ చేస్తున్న మమ్మల్ని కార్మికులుగా గుర్తించండంటూ వేడుకుంటున్నారు. ఇవేవీ ప్రభుత్వానికి వినబడటం లేదు. పైగా సమ్మెలేంటని ప్రశ్నిస్తు న్నారు. పోరాటాలంటేనే ఏవగింపుగా మాట్లాడుతున్నారు.
సమ్మెలపై ఉక్కుపాదం, ఆశాలపై లాఠీచార్జీలు, సీఐటీయూతోనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయా? అని హేళన చేయడం దేనికి సంకే తం? ప్రజలకు సేవ చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్ ఎం) ఒకటి. దీని కిందనే ఆశావర్కర్లు పనిచేస్తున్నారు. తెలంగాణలో 25 వేల మంది ఆశావర్కర్లున్నారు. ప్రతిరోజూ ఇంటింటికీ తిరిగి పేద లకు మందులివ్వడం, ఆస్పత్రిలో చేర్పించడం, గర్భిణీ స్త్రీలను గుర్తించి అన్ని పరీక్షలూ చేయించి సుఖప్రసవం జరిగేట్టు చూడటం, బాలిం తలకు, పసిపిల్లలకు ఆరోగ్య సేవలందించడం వంటి ఎన్‌ఆర్ హెచ్‌ఎం నిర్ణయించిన 36 పనులను వీరు చేయాలి.
పనిని బట్టి పారితోషికం చెల్లిస్తామని చెబుతున్న ప్రభుత్వం చెల్లింపులు లేని పనులెన్నో ఆశాల చేత చేయిస్తోంది. కానీ నెలంతా పనిచేస్తే రూ. 400 నుంచి రూ.1,500లకు మించి రావటంలేదు. ఈ కాస్త పారితోషికాన్ని కూడా 39 నెలలుగా బకాయి పెట్టారు. జాతీయ ఆరోగ్య కమిషన్ నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి 1,050 కోట్ల నిధులు కేటాయిస్తోంది. వాటిలో పది శాతం ఆశాలకు కేటాయించాలని నిబంధన ఉన్నా ఖర్చు చేసేందుకు పాలకులకు చేతులు రావటం లేదు. ఆ పది శాతం నిధులతో ఒక్కో ఆశాకు కనీసం రూ.3,500లు చొప్పున చెల్లించవచ్చు. కేంద్ర నిధులను తన ఖజానా నుంచే ఇస్తున్నట్లుగా ఫోజు కొడుతున్న ప్రభుత్వం వేతనమే లేకుండా బతకమని చెబుతోంది.
యాదగిరిగుట్ట, వేములవాడ, గోదావరి పుష్కరాలు, బోనాలు, బతుకమ్మ పండగలకు వందలకోట్లు ఇస్తారు. గిరిజన తండాలు, గూడేలు, దళిత కాలనీలు, అట్టడుగు వర్గాలుండే చోట గొడ్డుచాకిరీ చేస్తున్నా, ప్రభుత్వాలకు ఆశాలపై కనీస జాలిలేదు. తెలంగాణ రాష్ట్ర మొస్తే వెట్టిచాకిరుండదని కేసీఆర్ చెప్పారు. గద్దెనెక్కాక నిజాంను తలపించేలా వెట్టి చేయిస్తున్నారు. తమను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.15,000లు ఇవ్వాలని, పెన్షన్, గ్రాట్యుటీ, ప్రసూతి సెలవులు కల్పించి పెండింగ్ బకాయిలను ఇవ్వాలని అనేక దఫాలుగా ఆశాలు ప్రభుత్వానికి చెప్పుకున్నారు. ఏలికలు పెడచెవిన పెట్టడం వల్లే 14 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చారు. పరిష్కరించకపోవడంతో సమ్మెలోకి దిగారు. ఆశావర్కర్ల వెనుక ఏపీ సీఎం హస్తం ఉందని, ఆంధ్ర తొత్తులు, ఆంధ్ర కుక్కలు సమ్మె చేయిస్తున్నాయి అంటున్నారు.
మరి ఆశాలు ఎవరికి సేవలందిస్తున్నారు? ఆంధ్రా ప్రజలకా లేక తెలంగాణ ప్రజలకా? అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆశాలకు జీతం పెంచుతానని టీఆర్‌ఎస్ నేతలు అనలేదా? కడుపుమండి సమ్మె చేస్తుంటే ఆశాలతో మాకు సంబంధం ఏమిటని ఒక మంత్రి, సమ్మె చేస్తే వేతనాలు పెం చాలా అని ఒక మంత్రి, ఆంధ్రా కుక్కలు సమ్మె చేయిస్తున్నాయని మరో మంత్రి నోరుపారేసుకోవడం ఏం సంస్కారం? తెలంగాణ ఆత్మగౌరవం గురించి కోడై కూసిన నేతల నుంచేనా ఇలాంటి మాటలంటున్నది అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. తమ గోడు వినండని వినతి పత్రాలివ్వడానికి వెళితే భౌతిక దాడులు జరిగిన ఘటనలు ఎప్పుడూ జరగలేదు. ఇదేనా కొత్త తెలంగాణలో మహిళలకిచ్చే గౌరవం? స్వరాష్ట్రం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా ఇంకా ఎన్నిరోజులు ఆంధ్ర పాట పాడతారో? బాంచెన్ దొరా నీ కాల్మొక్తనే రోజులు పోయాయని కేసీఆర్ దొర తెలుసుకోవాలి. పిట్టలదొర మాటలు మాని బాధ్యతను గుర్తెరిగి ఆశాల సమస్యలు ఇకనైనా పరిష్కరించాలి
యాటల సోమన్న
వ్యాసకర్త సీఐటీయు రాష్ట్ర కమిటీ సభ్యులు. 9490098486