నల్లజాతి ‘తెల్ల’గొడుగు
లింకన్ రాజకీయ జీవితం బానిసత్వ వ్యతిరేక చింతనతోనే మొదలైందని విశ్లేషకుల అభిప్రాయం. 1837 నుంచి, తుది శ్వాస విడిచే వరకు ఆయన బానిస వ్యతిరేక ఉద్యమాన్ని, నిజానికి యుద్ధాన్ని నడిపాడు. తన 28 ఏళ్ల వయసులోనే ఇలినాయీస్ జనరల్ అసెంబ్లీలో ప్రజాప్రతినిధిగా మొట్టమొదటిసారి తన బానిసత్వ వ్యతిరేక విధానాన్ని ప్రకటించాడు. బానిస వ్యవస్థ అన్యాయమే కాక, దుర్మార్గమైన విధానమని, బానిసత్వం పట్ల సానుకూల వైఖరి కలిగి ఉండడం మరింత అనైతికమని నినదించారు.
పరీక్షగా తేరిపార చూసేసరికి దుడ్డుకర్ర పెకైత్తి అతనివైపే దూసుకొచ్చింది ఓ ఆకారం, అది తెల్లోడి ఆకారం. అంతలోనే కుంటా తలమీద దుడ్డుకర్ర విరిగింది. కుంటా మోకాళ్లమీద కూలబడిపోయాడు. కుంటాకి తలపేలిపోతుంది. ఒళ్లు తిరుగుతుంది. తన నిస్సత్తువ మీద తనకే కసి పుట్టింది. కన్నీళ్లు, నెత్తురు, చెమటల మధ్య కళ్లకి మసక కమ్మింది.
బయట కొందరు తెల్లవాళ్లు విచిత్రంగా అరుస్తున్నారు. కానీ కుంటాకి అర్థం కాలేదు. ‘మూడువందల యాభై..నాలుగు వందలు, ఐదు.... ఆరువందలు అనండి. ఎట్లా ఉన్నాడో చూడండి. గాడిదలాగా చాకిరీ చేయకపోతే నన్నడగండి’. ఆ కేకలు, వాటి అర్థం తెలియక కుంటా భయంతో గిజగిజలాడిపోయాడు. వెంటనే మరో గొంతు లేచి ‘ఏడు యాభై, ఎనిమిది, ఎనిమిదీ యాభై’ అని మూడుసార్లతో ఆ వేలం పాట ఆగిపోయింది. కుంటా అమ్ముడైపోయాడు. దీని తర్వాత కుంటా వారసులు ఏడు తరాలుగా అమెరికా గడ్డమీద బానిసలుగా బతికారు.
అది 1863వ సంవత్సరం. బానిసలందరికీ స్వేచ్ఛను ప్రకటిస్తూ నాటి అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ (ఫిబ్రవరి 12,1809 - ఏప్రిల్ 15, 1865) చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. బానిసవాడల్లో అంతులేని ఆనం దం. నల్లవాళ్లంతా పాకల్లోంచి బయటకొచ్చి లక్షల సంఖ్యలో గుమిగూడారు. ‘ఇన్నాళ్లకి స్వాతంత్య్రం వచ్చింది. థాంక్ గాడ్’ అని కేకలు పెట్టారు. కానీ కొద్దిరోజులకే పిడుగులాంటి వార్త. అబ్రహాం లింకన్ హత్యకు గురయ్యాడు. బానిసవాడలన్నీ దుఃఖ సాగరంలో మునిగిపోయాయి. తమకు విముక్తి ప్రసాదించిన దేవుడు ఇక లేడన్న వార్త వారిని తీవ్రంగా గాయపరిచింది.
ఇవి చీకటిఖండం ఆఫ్రికా నుంచి నల్లజాతి మనుషులను పశువుల్లా కొనుక్కొచ్చి తెల్లవారికి తరతరాల కట్టుబానిసలుగా చేసిన రక్తచరిత్రలోని కొన్ని పంక్తులు. ఆఫ్రికా నుంచి అమెరికాకు బానిసల్ని కొని తేవడం 1619లో ప్రారంభమైంది. ఇరవై మందితో మొదలైన బానిసల సంఖ్య 1810 నాటికి పది లక్షలు దాటింది. నల్ల బానిసలు లేనిదే తెల్లవాళ్లకు తెల్లారని రోజులవి. ఇదే విషయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఇంగ్లిష్ నవల ‘రూట్స్’లో ఎలెక్స్ హెలీ అక్షరీకరించారు (తెలుగు అనువాదం ‘ఏడుతరాలు’). పుస్తకం చివరి భాగంలో బానిసలు విముక్తి సాధించిన ఘట్టాన్ని కూడా హెలీ వివరించారు.
బానిసల కట్టుబానిసత్వపు సంకెళ్లను తెగ నరికి స్వేచ్ఛను ప్రసాదించిన అబ్రహాం లింకన్ జయంతిని ఫిబ్రవరి 12వ తేదీన ప్రపంచమంతా జరుపు కుంటుంది. లింకన్ కెంటకీ రాష్ట్రంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి థామస్ లింకన్ వ్యవసాయంతో పాటు వడ్రంగి వృత్తిని కూడా సాగించేవాడు. తల్లి నాన్సీ హంక్స్ లింకన్ చిన్నతనంలోనే మరణించింది. ఆ తరువాత ఆ కుటుంబం కెంటకీ నుంచి ఇండియానా అనే రాష్ట్రానికి జీవనో పాధికై వలస వెళ్లింది.
ఆ తరువాత సరా బుష్ జాన్సన్‌ని థామస్ ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఆమె తనను కన్న కొడుకులా ప్రేమించే దని లింకన్ చాలాసార్లు ప్రకటించారు. వ్యవసాయం సంక్షోభంలో పడడంతో లింకన్ కుటుంబం మిస్సిసిపి నదిలో పడవ నడిపే వృత్తిలోకి దిగింది. లింకన్ చదువు కొనసాగిస్తూనే పడవ నడిపేవారు. మళ్లీ ఆ కుటుంబం ఇండియానా నుంచి డెక్టోర్ చేరింది. అప్పుడు లింకన్ వయస్సు 21 సంవత్సరాలు. అక్కడ కూడా ఆ కుటుంబం పడవ నడిపేది. 1831లో లింకన్ ఉద్యోగం వెతుక్కుంటూ న్యూసలేం పట్టణానికి వెళ్లారు. అక్కడ ఒక జనరల్ స్టోర్స్‌లో గుమాస్తాగా కుదిరారు. ఉద్యోగం చేస్తూనే ఇతర సామాజిక కార్య క్రమాల్లో పాల్గొంటూ పట్టణ ప్రజల్లో గుర్తింపు పొందాడు. ఆ సమయంలోనే బ్లాక్ హాక్ యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో లింకన్ ఒక స్వచ్ఛంద సైనికుడిగా పాల్గొని కెప్టెన్ స్థాయికి ఎదిగారు.
ఆ తరువాత మళ్లీ న్యూసలేంకు తిరిగి వచ్చి రాష్ట్ర శాసనసభకు పోటీ చేశారు. కానీ విజయం సాధించలేక పోయారు. మళ్లీ చదువుపై దృష్టి పెట్టి న్యాయ శాస్త్రం చదివారు. ఆ తరువాత న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూ, విగ్ అనే రాజకీయ పార్టీలో చేరి, చురుకైన పాత్ర నిర్వహించారు. 1834లో రాష్ట్ర శాసనసభకు పోటీ చేసి విజ యం సాధించారు. ఆ తరువాత వరుసగా నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1834లో మొదటిసారి ఎన్నికైనప్పుడు మిగతా అందరి సభ్యులకన్నా ఆయన వయసులో చిన్నవాడు. అప్పటినుంచే ఆయన సాధా రణ తెల్లజాతి ప్రతినిధి వలె కాక, మానవతా హృదయంతో స్పందించేవాడు. 1838లో నల్లజాతి ప్రజల హక్కుల కోసం, బానిసత్వ నిర్మూలన కోసం నిరంతరం కృషి చేస్తున్న పత్రికా సంసాదకులు ఎలిజా పరీష్ లవ్‌జాయ్ హత్య పట్ల లింకన్ తీవ్రంగా స్పందించారు.
లింకన్ రాజకీయ జీవితం బానిసత్వ వ్యతిరేక చింతనతోనే మొదలైం దని విశ్లేషకుల అభిప్రాయం. 1837 నుంచి, తుది శ్వాస విడిచే వరకు ఆయన బానిస వ్యతిరేక ఉద్యమాన్ని, నిజానికి యుద్ధాన్ని నడిపాడు. తన 28 ఏళ్ల వయసులోనే ఇలినాయీస్ జనరల్ అసెంబ్లీలో ప్రజాప్రతినిధిగా మొట్ట మొదటిసారి తన బానిసత్వ వ్యతిరేక విధానాన్ని ప్రకటించాడు. బానిస వ్యవస్థ అన్యాయమే కాక, దుర్మార్గమైన విధానమని, బానిసత్వం పట్ల సాను కూల వైఖరి కలిగి ఉండడం మరింత అనైతికమని నినదించారు. ‘‘నేను అనైతి కమైన బానిసత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఇది అమెరికా ప్రజా స్వామ్య తత్వానికి విరుద్ధమైనది. దీన్ని కొనసాగించడం అంటే మనల్ని మనం వంచన చేసుకోవడం తప్ప మరొకటి కాదు.’’ అని బానిసత్వ అనుకూ లురపై(అక్టోబర్ 16, 1854) ధ్వజమెత్తారు.
ఆగస్టు 1, 1858లో ఆయన చెప్పిన మాటలు రాజనీతిశాస్త్రం మీద చెరగని ముద్ర వేశాయి. ‘‘నేను బాని సగా ఉండడానికి ఎట్లాగైతే అంగీకరించనో, యజమానిగా ఉండడానికి కూడా అంగీకరించను. ఇది నా ప్రజాస్వామ్య భావం. దీన్ని ఏ పద్ధతిలో వ్యతి రేకించినా అది ఎంత మాత్రం ప్రజాస్వామ్యం కాదు.’’ ఆ తర్వాత తన ప్రత్యర్థి స్టీఫెన్ డగ్లస్‌తో జరిపిన వాదోపవాదాలు ప్రజలందరినీ ఆకర్షింప జేశాయి. వీటితో పాటు అక్టోబర్ 18, 1858న జేమ్స్ అండ్ బ్రౌన్‌కు రాసిన లేఖలో సామాజిక, రాజకీయ సమానత్వం ప్రజలందరికీ అన్ని జాతులకు సమానంగా అందాలనే సూత్రాన్ని గుర్తుచేశారు.
మనుషులందరూ సమాన మనే గొప్ప ప్రాథమిక సూత్రాన్ని నేను విశ్వసిస్తానని కూడా ప్రకటించారు. బానిసత్వ నిర్మూలన ప్రకటనకు కొన్ని సంవత్సరాల ముందు అంటే సెప్టెంబర్ 17, 1859 సిన్‌సినాటాలో చేసిన ప్రసంగంలోనూ బానిసత్వం లోని అనైతికతను ఎత్తిచూపారు.
లింకన్ గాఢంగా విశ్వసించే ప్రజాస్వామ్యయుత భావాలే అతనిని 1861లో, 52 ఏళ్ల వయస్సులో అమెరికా అధ్యక్షుడిని చేశాయి. దక్షిణ రాష్ట్రాలన్నీ లింకన్ అధ్యక్షతన కొనసాగలేమని అంతర్యుద్ధాన్ని ప్రకటిం చాయి. అంటే బానిసత్వ వ్యవస్థను రక్షించడానికే ఈ యుద్ధం చేస్తున్నట్టు కూడా ఆయా రాష్ట్రాలు స్పష్టం చేశాయి. అయినా లింకన్ వెనకడుగు వేయ లేదు. సెప్టెంబర్ 22, 1862న బానిస విముక్తి ప్రకటనను చేసి, జనవరి 1,1863 నుంచి అది అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు.
‘ఎమానిస్పేషన్ ప్రొక్లెమేషన్’గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రకటన అమెరికా చరిత్రను తిరగరాసింది. ఈ ప్రకటన యావత్ ప్రపంచానికీ మార్గ నిర్దేశనం చేసింది. ఈ ప్రకటన జరిగి ఇప్పటికి 150 సంవత్సరాలు దాటింది. ఈ ఒకటిన్నర శతాబ్దాలలో అబ్రహాం లింకన్ వేసిన మార్గం అమెరికానే కాకుండా అనేక దేశాలను, ఉద్యమాలను, జాతులను, ప్రభావితం చేసి మానవ హక్కుల ఉద్య మానికి వేగుచుక్కగా నిలిచింది. అటువంటి చరిత్రా త్మకమైన ప్రకటనను స్వీకరించలేని దక్షిణాది శ్వేత జాత్యహంకారులు కుట్రపన్ని జాన్ విల్క్స్‌బూత్ అనే హంతకుని ద్వారా ఏప్రిల్ 14,1865న వాషింగ్టన్ డీసీలోని ఫోర్డ్స్ థియేటర్‌లో కాల్చి చంపారు. ‘‘అమెరికా గడ్డను భగవంతుడు తెల్ల జాతీయుల కోసం సృష్టించాడు. మిగతా ఏ జాతికి, ప్రత్యేకించి నల్లవారికి ఇక్కడ స్థానం లేదు. అటువంటి దేవుడి నిర్ణయాన్ని వ్యతిరేకించి మనుషులందరూ సమానం అనే చట్టాన్ని తీసుకొచ్చిన అబ్రహాం లింకన్‌కు కూడా ఇక్కడ బతికే అర్హత లేదు’’ అని జాన్‌విల్క్స్ బూత్ డైరీలో రాసుకుని నిర్దాక్షిణ్యంగా అమలు చేశాడు. 1982లో ‘చికాగో ట్రిబ్యూన్’ పత్రిక అమెరికా అధ్యక్షుల పనితీరుపైన 49 మంది చరిత్రకారులు, రాజనీతివేత్తల నుంచి అభిప్రాయాలు సేకరించింది.
అందులో నూటికి నూరు శాతం 1982 వరకు ఉన్న అధ్యక్షుల్లో అబ్రహాం లింకన్ అగ్రగణ్యుడుగా తేల్చారు. దీనిలో ఐదు అంశాలపైన వివరాలను సేకరించారు. నాయకత్వ లక్షణాలు, విజయాలు, సంక్షోభ నివారణలు, రాజకీయ మెలకువలు, వ్యక్తిత్వం, నిజాయితీ లాంటి విషయాలపైన ఆధారపడి ఈ నిర్ధారణకు వచ్చారు. ఇందులో ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్, జార్జ్ వాషింగ్టన్, థియోడర్ రూజ్‌వెల్ట్, థామస్ జఫర్సన్ అండ్రూ జాక్సన్, ఉడ్రో విల్సన్, హ్యారీ ట్రూమన్‌లు వరుసగా స్థానాలు దక్కించుకున్నారు.
ఏప్రిల్ 11, 1865న, అంటే లింకన్ హత్యకు నాలుగు రోజుల ముందు ఇచ్చిన చివరి ఉపన్యాసాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ‘‘ఈ ఎన్ని కల్లో శ్వేతజాతేతరులు కానీ, నల్లజాతీయులుగానీ ఒక్కరు కూడా గెలవక పోవడం నాకు అసంతృప్తిగా ఉంది. వారి శక్తి సామర్థ్యాలను అమెరికా ప్రగ తికి ఉపయోగించుకోకపోవడం విచారకరం.’’ అని ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఆనాడు వేసిన హక్కుల బీజం ఒక మహా వృక్షమై శ్వేతసౌధంలోనే నల్లజాతీయుడు బరాక్ ఒబామా కొలువుదీరే స్థాయికి చేరింది. అది లింకన్ హక్కుల ఉద్యమం ఎగురవేసిన విజయపతాక. అందువల్ల 150 సంవత్సరాల అనంతరం కూడా లింకన్ ఆలోచనలు, ఆకాంక్షలు ఇంకా సజీవంగా ప్రపంచప్రజలందరినీ ఉత్తేజపరుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
(ఫిబ్రవరి 12న అబ్రహాం లింకన్ జయంతి)
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213
- మల్లెపల్లి లక్ష్మయ్య