ఆఖరికి ఆ బాటలోకే! | All parties come in way of Ysr congress party over Bifurcation issue | Sakshi
Sakshi News home page

ఆఖరికి ఆ బాటలోకే!

Published Tue, Jan 28 2014 3:27 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

All parties come in way of Ysr congress party over Bifurcation issue

ఈ తతంగాన్ని అన్ని రాజకీయ పక్షాలకన్నా ముందు పసికట్టిన పక్షం వైఎస్సార్ కాంగ్రెస్. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శాసనసభలో మొదట తీర్మానం చేసి, ఆ తరువాతే విభజన గురించి చర్చిద్దామని ఆ పార్టీ ప్రతిపాదించింది. కానీ ఆ ప్రతిపాదనను కేవలం రాజకీయ కక్షతోనే కాంగ్రెస్, టీడీపీ ఆదినుంచీ వ్యతిరేకి ంచాయి. చివరికి తెలుగుజాతి ఉమ్మడి ప్రయోజనాలనూ, సంక్షేమాన్నీ కాపాడగల విభజన వ్యతిరేక తీర్మానాన్నే ఆ రెండు పక్షాలు తలదాల్చవలసివచ్చింది!
 
 ‘విభజించు-పాలించు రాజకీయాల వల్ల ఉపఖండం ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకుంది. కలసి పని చేయలేకపోతే ఏదీ సాధించలేం. చర్చలూ, అంగీకారంతోనే సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ప్రజాస్వామ్యం లక్షణం’
 - రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
 
 ‘రిపబ్లిక్ డే’ (జనవరి 26, 2014) సందేశం
 ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు’ పేరుతో తెలుగుజాతిని చీల్చడానికి యూపీఏ నేడు ఆడుతున్న నాటకం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ గణతంత్ర దినోత్సవంలో ఇచ్చిన సందేశంతో బట్ట బయలయిందని భావించాలి! అసలు రాష్ట్ర విభజన ‘బిల్లు’ అనేది ఉద్దేశిత ‘బిల్లా’ లేక ‘ముసాయిదా బిల్లా’ అన్నది శాసన సభలో తలెత్తిన తాజా వివాదం! కేంద్రంలో ఒకడు ఇది ‘ముసాయిదా’నే అంటాడు, మరొకడు ‘ఏబ్బే! అసలు బిల్లే’’ అంటాడు! ఈ మధ్యలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబులకి ‘ఇది బిల్లు కాదు, ముసాయిదా బిల్లు మాత్రమే’నన్న జ్ఞానోదయం కలిగింది.
 
 ఆలస్యంగా జ్ఞానోదయం
 విభజన బిల్లు అస్తవ్యస్తంగా ఉండటమే గాక, విభజనతో తలెత్తే సమస్యలకూ, ఆర్థిక వనరుల విభజనకూ సంబంధించిన ఏ ఒక్క అంశానికీ వివరణలూ, పరిష్కారాలూ చూపనందున తిప్పి పంపాలని ముఖ్యమంత్రి శాసన సభాపతికి లేఖ పంపి సంచలనం సృష్టించారు. కానీ ఈ పనిని ఆయన 40 రోజుల క్రితమే చేసి ఉండాల్సింది. ఎందుకంటే ‘ముసాయిదా’గా కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి ద్వారా పంపిన ఈ నిరర్థక బిల్లు కేంద్ర న్యాయశాఖ పరిశీలించకుండానే రాష్ట్రా నికి చేరడం పెద్ద విశేషం! విభజనను ముఖ్యమంత్రి నిజంగానే అడ్డుకొనదలచి ఉంటే ఇన్ని రోజులు కాలక్షేపం చేయకుండా ‘ముసాయిదా’కు సంబంధించి కేంద్రం చేసిన ఈ తీవ్ర తప్పిదాన్ని రాష్ట్రప్రజల దృష్టికీ, ఓ వ్యక్తిని ప్రధానిగా ప్రమోట్ చేయడం కోసం తెలుగు జాతిని విభజన హింసకు గురి చేయడానికి సిద్ధమైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టికీ తెచ్చి ఉండాల్సింది.
 
 అసలు మోసం ఏదంటే -1950లో రాజ్యాంగం అవతరించినది లగాయతూ ఈ రోజు దాకా, ఎన్నడూ కీలకమైన ఒక బిల్లును చర్చ పేరిట ముసాయిదా రూపంలో ఏ రాష్ట్ర శాసనసభకూ పంపిన ఉదాహరణ లేదు. ఇది విభజనకు తొలి ఘట్టం. అయితే అదే లోక్‌సభ, రాజ్యసభల నిర్వహణ నిబంధనలకే విరుద్ధంగా ఉండటం మరో విశేషం. ఈ పరిస్థితీ, ఈ దుస్థితీ ఎందుకొచ్చాయి? వచ్చినది ఒరిజినల్ (అసలు) బిల్లు అయి ఉంటే దానిలో రాష్ట్ర విభజనను ఏ కారణాలపైన, ఏ లక్ష్యంతో, ఏ ఉద్దేశంతో తలపెట్టారో సుస్పష్టమైన ప్రకటన ఉండాలి. ఏ బిల్లుైనైనా (అసలు ‘బిల్లే’ అయితే) పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు ఆ బిల్లును అధికారికమైన ‘గెజిట్‌‘లో ప్రకటించాలని స్పీకర్ ఆదేశిస్తాడు. కానీ రాష్ట్ర విభజన కోసం వచ్చిన బిల్లు ‘ముసాయిదా’ (హోంశాఖ ప్రకటన ప్రకారం) మాత్రమే కాబట్టి, అదీ రాజ్యాడగ విరుద్ధంగా సవాలక్ష ‘లొట్ట’లతో మన శాసనసభకు వచ్చిన కాపీ కావడం వల్ల అది అసలు బిల్లు కాదని తేలిపోయింది!
 
 అంతేగాదు, ఈ బిల్లు లక్ష్య నిర్వచనం లేని పత్రం కావడం వల్ల, దానితో పాటు జత చేసి పంపించవల సిన శాసనాధికారాల బదలాయింపు, ద్రవ్య వ్యవహారాల మెమోరాండాలు కూడా లేవు! అందువల్ల ఈ ప్రత్యేక సంభారాలన్నింటినీ సమకూర్చుకున్న రూపంలో వచ్చిందే అసలు బిల్లు అవుతుంది. ముందు ‘ముసాయిదా’ అనీ, ఆ తరువాత తమకు తోచినట్టు ఏవేవో నిబంధనలూ, క్లాజులూ పరోక్షంగా చొప్పిం చవచ్చునని భావించి కేంద్రం పంపిన బిల్లు అసలు బిల్లు కాలేదు. ఇలాంటి ప్రయోగానికి తెలుగు జాతిని బలి చేయడం తగదని పాలకులు గ్రహించాలి.
 
 ముందే చెప్పిన వైఎస్సార్ సీపీ
 ఈ తతంగాన్ని అన్ని రాజకీయ పక్షాల కన్నా ముందు పసికట్టిన పక్షం వైఎస్సార్ కాంగ్రెస్. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మొదట శాసనసభ తీర్మానం చేసిన తరువాతే విభజన గురించి చర్చిద్దామని ఆ పార్టీ ప్రతిపాదించింది. కానీ ఆ ప్రతిపాదనను ముందు నుంచీ కేవలం రాజకీయ కక్షతోనే కాంగ్రెస్, టీడీపీ వ్యతిరేకించాయి. చివరికి తెలుగుజాతి ఉమ్మడి ప్రయోజనాలనూ, సంక్షేమాన్నీ కాపాడగల విభజన వ్యతిరేక తీర్మానాన్నే ఆ రెండు పక్షాలు తలదాల్చవలసి వచ్చింది! ఇది బలాబలాలు చూసుకునే సమయం గానీ, ఎవరు ఎవరిని ‘సాధిం చా’లో లెక్కించుకునే వేళ కూడా కాదని దారితప్పిన రాజకీయ నాయకులూ, వారి పక్షాలూ గ్రహించాలి.
 
  పార్లమెంటులో ఈ అసమగ్ర బిల్లును ఆదరాబాదరా ప్రవేశపెట్టేసి చేతులు దులిపేసుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అది అంత తేలిక కాదు. రాజ్యాంగ ‘అధికరణ-3’ ప్రకారం నల్లేరు మీద బండిలాగా ‘విభజన’ ప్రక్రియను డొల్లించుకువెళ్లడం సాధ్యం కాదు. ఈ విష యాన్ని సుప్రీంకోర్టు (ఉత్తరాంచల్ వర్సెస్ శ్రీవాత్సవ కేసు-2003) ఒక తీర్పులో స్పష్టం చేసింది.  పార్లమెంటు అధికారం భారత రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి మాత్రమే ఉండాలని సమున్నత న్యాయస్థానం చెప్పింది. చేసిన చట్టం రాజ్యాంగ పరిమితుల్ని అధిగమించి పోయినప్పుడు ఆ చట్టం సామంజ స్యాన్ని కోర్టులు ప్రశ్నించవచ్చని కూడా సుప్రీం చెప్పింది.
 
 పార్లమెంటు అధికారానికి సుప్రీంకోర్టు ఇన్ని పరిమితులు విధిస్తున్నా కేంద్ర ప్రభు త్వాలు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నాయి. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే కనీసం నెల రోజులు ముందుగానే నోటీసు ఇవ్వాలన్న నిబంధననూ ఉల్లంఘించిన సన్నివేశాలున్నాయి. ఆమాటకొస్తే, రాష్ట్రం సరిహద్దుల్నిగానీ, లేదా ఒక రాష్ట్రాన్ని మరో రాష్ట్రంలో కలపవలసి వచ్చినప్పుడుగానీ లేదా భూభాగంలో ఏదైనా ముక్కను వేరు చేయాలనుకున్నాగానీ ఆ రాష్ర్ట శాసనసభ సంపూర్ణ ఆమోదాన్ని పొంది తీరాలన్న హక్కును, అధికారాన్ని 370 అధికరణతో ఒక్క జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కల్పించారు. మిగతా రాష్ట్రాల శాసన వేదికలకు ఆ హక్కూ, అధికారం లేకుండా చేశారు! కేంద్ర పాలక రాజకీయ పక్షాల రాజ్యాంగ ఉల్లంఘన జమ్మూ కాశ్మీర్‌తోనే ప్రారంభమైంది. అక్కడి నుంచి ఎన్నో ఉల్లంఘనలు. పరిపాలనా సౌలభ్యం కోసం కేంద్ర, రాష్ట్రాల పరిధిలోనూ, ఉమ్మడిగానూ రాజ్యాంగం విభజించిన అంశాల జాబితాలోని రాష్ట్రాల పరిధిని ‘249-అధికరణ’ చాటున కేంద్రం ఉల్లంఘిస్తూనే ఉంది!
 
 రాష్ట్రపతిని కూడా మోసగించగలరు
 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సాధికార సిఫారసులపైన ఏర్పడిన తొలి భాషా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను కూడా కృత్రిమంగా విభజించాలని కేంద్రం చూస్తున్నది. అలాగే 356-357 అధికరణల చాటున, కాంగ్రెస్ అధికారానికి అక్కడ మూడినప్పుడల్లా ‘రాష్ట్ర పాలన స్తంభించిపోయింది లేదా శాంతి భద్రతలు కొరవడ్డాయ’న్న మిషపైన రాష్ట్రపతి పాలన విధింపునకు కేంద్ర కాంగ్రెస్ నాయకులు అనేకసార్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. చివరికి ఈ ఉల్లంఘనకు (బొమ్మైకేసులో) 1994లో సుప్రీంకోర్టు ‘పిడి’ పడేదాకా కాంగ్రెస్‌కు బుద్ధి రాలేదు. అందుకే కేంద్ర-రాష్ర్ట సంబంధాల పనితీరును సమీక్షించిన సర్కారియా కమిషన్ కూడా కాంగ్రెస్‌కు చెంపపెట్టు పెట్టవలసి వచ్చింది!
 
  చివరికి సుప్రీంకోర్టు అధికారాలను కుదించి కించపరచడానికి ఉద్దేశించిన 39-42వ అధికరణల ప్రవేశానికి కారకులు ఈ కాంగ్రెస్ పాలక శక్తులేననీ, వాటికి ‘ముగుదాడు’ వేసి నిర్వీర్యం చేసిన ఘనత సుప్రీంకోర్టుదేననీ మరచిపోరాదు! సప్త స్వాతంత్య్రాలను బంధించిన వ్యవస్థలో పత్రికా రంగం సహా అన్ని సంస్థలూ ఆనాడు ఎలా పతనమయ్యాయో మన ప్రత్యక్షానుభవం! చదవేస్తే ఉన్న మతి కూడా పోయిందన్నట్టుగా, 200 ఏళ్లలో అమెరికా రాజ్యాంగానికి 30 సవరణలు మాత్రమే రాగా, 1950లో భారత రాజ్యాంగం వచ్చింది మొదలు ఈ క్షణం దాకా 395 అధికరణలూ, 12 షెడ్యూళ్లు, 100కు మించిన సవరణలతో 64 ఏళ్లు గడిపేశాం. ప్రపంచంలో ఇంత సంక్లిష్టమైన సుదీర్ఘమైన రాజ్యాంగం ప్రపంచంలో లేదు. అయినా రాజ్యాంగం పొడవైన కొద్దీ, పాలకుల బుద్ధి కురచైపోతోంది! ఇది, రాష్ట్రపతిని కూడా మోసగించగల రాజ్యవ్యవస్థ!  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement