
‘సత్తా’ ఎందుకు చాటలేదు?
సందర్భం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లోక్‌సత్తా అధ్యాయం ముగి సింది. ’కొత్త తరానికి కొత్త రాజ కీయం’ అనే నినాదంతో లోక్ సత్తా పార్టీని ప్రారంభించిన జయప్రకాష్ నారాయణ్ పదేళ్ళ ప్రస్థానం తర్వాత, ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రక టించారు. ఐఏఎస్ అధికారిగా అత్యంత విజయవంతమైన జేపీ, ఒక రాజకీయ నాయ కుడిగా మాత్రం విఫలం అయ్యారు. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీని స్థాపించి వచ్చే లోక్ సభ, అసెంబ్లీ ఎన్ని కలకు సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్ వంటివారు లోక్ సత్తా వైఫల్యం నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? 1996 నుండి ఇప్పటిదాకా అంటే 20 ఏళ్ళు జేపీతో కలసి పనిచేసిన వ్యక్తిగా, ఆయన్ని అతి దగ్గర నుండి చూసిన వ్యక్తిగా నా అభిప్రాయాల్ని పాఠకుల ముందు ఉంచుతున్నాను.
ఒక రాజకీయ పార్టీగా లోక్‌సత్తా విఫలం కావ డంలో, 50% పరిస్థితుల ప్రభావం ఉంటే, 50% జేపీ స్వయంకృతం. దేశం మీద ప్రేమ, నిజాయితీ ఈ రెండింటి విషయంలో జేపీని వేలెత్తి చూపడం సూర్యు డిపైకి ఉమ్మి వేయడం లాంటిదే. కాని, ఒక లీడర్‌గా జేపీలో చాలా లోపాలు ఉన్నాయి. ఆయన చాలా పొర పాట్లు చే శారు. లోక్‌సత్తాకి బలమైన కేడర్ లేకపోవడం పెద్ద మైనస్. లోక్‌సత్తా ఉద్యమసంస్థగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, ఓ 10% గ్రామాల్లో లోక్‌సత్తా శాఖలు ఉండేవి. వీటిని ఉపయోగించుకుని పార్టీకి కేడర్ నిర్మాణం చేసుకోకుండా, జేపీ హడావుడిగా రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఇప్పుడు పవన్ వంటివాళ్లు తమ అభిమానుల్ని కేడర్‌గా మార్చుకుని, వచ్చే ఎన్నికలనాటికి వారిని సిద్ధం చేసుకోవాలని భావిస్తు న్నట్లయితే, వారికి ఇప్పటి నుంచే రాజకీయ శిక్షణ, ఆర్గనైజేషన్ అనుభవం కోసం చిన్న చిన్న కార్యక్రమాలు అప్పగించడం అవసరం.
లోక్‌సత్తా పార్టీ ప్రారంభించినప్పుడు మంచి నాయకులు పార్టీలో చేరారు. కాని వారిని ఉపయోగించు కోవడంలో జేపీ విఫలం అయ్యారు. ఎవరు ఏ పనికి ఉపయోగపడతారు అనే అంచనా వేయడంలో జేపీది అత్యంత పేలవమైన రికార్డ్. ఉదాహరణకి ఓ ప్రముఖ సామాజిక కార్యకర్త, డాక్టర్ లోక్‌సత్తాలో చేరారు. ఆయన హైదరాబాద్ స్థాయిలో నెట్ వర్కింగ్ చేయగలరు, మంచి అధికార ప్రతినిధిగా వ్యవహరించగలరు. ప్రజలతో, కేడర్‌తో డీల్ చేయడం ఆయనకు రాదు. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి సంస్థాగత వ్యవహారాలు చూడమని చెప్పారు. ఆయన ఏ జిల్లాకి వెళ్ళినా జేపీకి ఆయనపై ఆరోపణలు వచ్చేవి, దీనితో జేపీ ఆయన మీద కోప్పడ్డారు, దానితో ఆయన అలిగి ప్రజారాజ్యంలోకి వెళ్ళారు.
జేపీ కనుక, ఆ వ్యక్తి చేయగల్గిన పనులు మాత్రమే అప్పగించి ప్రోత్సహిస్తే ఆయన ఒక పెద్ద అసెట్ అయ్యే వారు. జేపీ చేసిన ఇంకో పెద్ద తప్పు ఏంటంటే.. ఆయన దగ్గరికి రకరకాల భావజాలాలు, ఆలోచనలు ఉన్న వ్యక్తులు వచ్చారు. అందరూ వారివారి రంగాలలో కాస్త పేరున్న వారే. వీరు పార్టీని ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా నడపమని జేపీకి సలహాలు ఇచ్చేవారు. వీరందర్నీ కలిపి కూర్చోపెట్టి, ఒక తాటి మీదకు తీసుకొచ్చి, పార్టీకి ఒక డెరైక్షన్ చూపించే పని జేపీ ఎప్పుడూ చేయలేదు. అలాగే కార్యక్రమాలను సమీక్షించి పనిచేసింది ఎవరు? షో చేసింది ఎవరు? అనేది కూడా అంచనా వేసేవారు కాదు.
ఒక దీర్ఘకాలిక లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేసేటప్పుడు, నిలకడైన నిర్ణయాలు ఉండాలి. లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటుందో, మార్గం కూడా అంతే స్పష్టంగా ఉండాలి. జేపీకి తన మార్గం మీద ఎప్పుడూ నిలకడలేదు. లోక్‌సత్తా ఉద్యమసంస్థ ద్వారా ఆయన కొన్ని సంస్కరణలు సాధించారు. మార్పుని వేగవంతం చేయడం కోసం ఆయన పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచి ఢిల్లీని ప్రభావితం చేయాలనుకున్నారు. అయితే, ఒకసారి రాజకీయాల్లోకి వచ్చాక, అధికారం ద్వారానే దేశాన్ని మార్చగలం అని నమ్మాక ఇక పూర్తి స్థాయిలో బరిలోకి దిగాలి. కాని, జేపీ కాసేపు పార్టీ ద్వారా, కాసేపు లోక్‌సత్తా ఉద్యమం ద్వారా, కాసేపు సురాజ్య ఉద్యమం ద్వారా, కొన్నాళ్ళు అధికా రంలో ఉన్న వాళ్లు తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయటం ద్వారా మార్పులు తేవాలని ప్రయత్నం చేశారు. అధికారం లేదా, గణనీయమైన ఓట్ల శాతం సాధించి దేశాన్ని మార్చాలనుకున్న ఆయన, ఆ దిశగా నిలకడ అయిన కృషి చేయలేదు.
జేపీకి జనంలో కలవడం అంత ఇష్టం ఉండదు. మనసులో జనం మీద అంతులేని ప్రేమ ఉన్నా, దాన్ని ఆయన వ్యక్తం చేయలేరు. పుస్తకాలు చదవడం, రాయడం, చర్చించడం మీద ఉన్న శ్రద్ధ, ఫీల్డ్ మీద ఉండదు. పదేళ్ళ పార్టీ ప్రస్థానంలో ఆయనంతట ఆయన ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం ఒక్కటంటే ఒక్కటి కూడా తీసుకోలేదు. 2009 ఎన్నికల ముందు అయితే, ఆయన తాను ముఖ్యమంత్రి అయితే ఏ రంగాన్ని ఎలా బాగు చేయాలి అంటూ ఆలోచించిన దాన్లో పది శాతం సమయం కూడా, తాను అధికారంలోకి ఎలా రావాలో ఆలోచించి ఉండలేదు..
ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడవడం దగ్గర నుంచి చూశాక జేపీకిమనుషుల మీద నమ్మకం పోయింది. తల్లి మీద ఒట్టు వేసి, ఎన్టీఆర్‌కు ద్రోహం చేయం అని జేపీకి మాట ఇచ్చిన వ్యక్తి, 24 గంటల్లో మాట మార్చి బాబు వైపు చేరిపోవడంతో ఆయనకు మనుషు లంటే నమ్మకం పోయింది. నమ్మితే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉన్నమాట నిజమే; కాని, రాజకీయాల్లో కనీసం నలుగురైనా నమ్మకస్తులు లేకపోతే మనుగడ సాగించడం కష్టం.
కొత్తపార్టీ, అదీ ఒక ఆదర్శంతో పెట్టినప్పుడు, ఎంతో మంది యువత ఎన్నోరకాల ఆలోచనలతో వస్తారు. వీరిని వెన్నుతట్టి ప్రోత్సహించడం, పొరపాట్లను సరి దిద్దడం చాలా అవసరం. జేపీ గుడ్డిగా అందర్నీ ప్రోత్స హించేవారు. పార్టీలో జేపీ తర్వాతి స్థానంలో ఎక్కువ కాలం పనిచేసిన ఒకాయన మాత్రం అందర్నీ నిరాశ పర్చేవారు. యువత చిన్న విషయాలకే అసంతృప్తి చెందుతారు. ఇలా అసంతృప్తికి గురైన చాలా మంది యువత పార్టీకి దూరం అయ్యారు. ఇవన్నీ కలసి ఎన్నికల రంగం నుంచి లోక్‌సత్తా నిష్ర్కమణకు దారితీశాయి.
- నరేష్ శిరమని
వ్యాసకర్త పాత్రికేయుడు మొబైల్: 9912655225