అన్నమయ్య అచ్చ తెలుగు
నేడు అవటానికి అన్నమయ్య వర్ధంతియే; అయితే, ఆయన వాడిన అచ్చ తెలుగు మాటలను తలచుకోవడం రానున్న తెలుగు సంవత్సరాది ఆవరణంలోకి ముందుగా ప్రవేశించడమే! అన్నమయ్య భాషా ప్రయోగంలో కూడా అప్పటమైన దేశ్య పదజాలపు సొంపు తొణకిసలాడుతుంది. ఆయన దేశ్య పదాభిమానమెంతటిదంటే బాగా ప్రసిద్ధమైన సంస్కృత పదాలకు కూడా దేశ్యపదాలనే వాడుకోవడం గమనించవచ్చు.
తెలుగులో మార్గ దేశి కవితాభేదాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. వస్తువులోను, ఛందస్సులోను, పదజాలంలోను మార్గకవిత్వం సంస్కృత కావ్య సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. దేశికవిత్వం పై అంశాల్లో సంస్కృత మార్గాన్ని అనుసరించక దేశీయ లక్షణాలతో కూడి ఉంటుంది. తెలుగులో శివకవులు దేశి కవితోద్యమాన్ని చేపట్టి తెలుగు కవిత్వంలో ఒక గొప్ప పరిణామాన్ని తీసుకొని వచ్చినారు. నన్నయ మార్గ కవిత్వంలోనే మహాభారత రచన చేయడం వల్ల తరువాతి తెలుగు కవులు ఎక్కువగా మార్గకవిత పైనే మొగ్గు చూపినారని భావించవచ్చు. మార్గ కవిత్వంలో సంస్కృత ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. పదప్రయోగ విషయంలో సంస్కృతపద బాహుళ్యాన్ని, దీర్ఘ సమాస రచనను గమనించవచ్చు. తిక్కన పదప్రయోగ విషయంలో మాత్రం సంస్కృత ప్రభావానికి లోనుగాక మహాభారత రచనలో దేశ్యపదజాలాన్నే ఎక్కువ పాళ్లలో వాడి దేశి లక్షణాన్ని పాటించినట్లుగా భావించవచ్చు.
భాషలో అంతకు ముందు వ్యవహారంలో స్థిరపడి ఉన్న దేశ్య పదజాలాన్ని వాడడమే కాకుండా సంస్కృత శబ్దాలకు కూడా దేశ్య శబ్దాలను స్వయంగా కల్పించి వాడడం కూడా కనిపిస్తుంది. అందుకే అతడు స్వాగతం, న్యాయదృష్టి, పద్మవ్యూహం, రక్త సంబంధం, జీవచ్ఛవం, దేశకాలాలు మొదలైన పదాలను క్రమంగా మేలురాక, నెఱిగుఱి, తమ్మిమొగ్గరం, నెత్తురుపొత్తు, మనుపీనుగ, నేలపొద్దులు ఇత్యాదిగా దేశ్య శబ్దాలను వాడడం కనిపిస్తుంది. 15, 16 శతాబ్దుల్లో వెలసిన తాళ్లపాక కవులు వేలకొద్ది సంకీర్తనలు, ఇతర కృతులు రచించి దేశి కవిత్వానికి పట్టం కట్టి తెలుగు సాహిత్యానికి అపారమైన సేవ చేసినారు.
వీరిలో అన్నమాచార్యులు ప్రముఖులు. అన్నమయ్య భాషా ప్రయోగంలో కూడా అప్పటమైన దేశ్య పదజాలపు సొంపు తొణకిసలాడుతుంది. ఆయన దేశ్య పదాభిమానమెంతటిదంటే బాగా ప్రసిద్ధమైన సంస్కృత పదాలకు కూడా దేశ్యపదాలనే వాడుకోవడం గమనించవచ్చు. ఈ దేశ్య పదాలలో కొన్ని తెలుగు భాషలో అంతకు ముందే ఉన్నవీ కావచ్చు. లేదా అన్నమయ్యే స్వయంగా కొన్నింటిని కల్పించుకొనీ ఉండవచ్చు. అలాంటి పదాలను కొన్నింటిని పరిశీలిద్దాం.
పాలకూడు: క్షీరాన్నం, పాయసం అనే శబ్దాలకు ఇది దేశ్యపదం. కూడుపదం ఇప్పటిలాగా ఒకప్పుడు మోటుపదం కాదు. సభ్యపదమే.
‘‘పనివడి వెన్నెల పాలకూడు గుడిచి తనివోని పెండ్లి దగిలెగా నీకు’’
అన్నమయ్య నాలుకకు క్షీరాన్నం కంటే, పాయసం కంటే పాలకూడే రుచికరమేమో.
గాలిమూట: శరీరం అన్న సంస్కృత పదానికి వాడిన దేశ్య శబ్దం. శరీరం గాలి మూటే కదా!
‘‘గాలిమూట జిక్కితిమి కన్నచోటే తొక్కితిమి
ఆలించి యేమిటి వారమయ్యేమో కాని’’
గాలిమూట జిక్కడమంటే శరీరధారులు కావడమన్నమాట.
సూదిరాయి, అంటురాయి: ఇవి ‘అయస్కాంత’ శబ్దానికి వాడిన దేశ్య శబ్దాలు. వీటిలో మొదటిది సూదిని లాగే రాయి అని మధ్యమపదలోపి సమాసం. ‘సూదంటురాయి’ అని వ్యవహారంలో ఉన్న శబ్దం.
‘‘ఆటదియైతేజాలు నంటుకొనేవు గక్కున
వాటమైన సూదిరాతివలెనే నీవు’’
గోరొత్తు, గోరితాకు, గోరిచేత, గోరివాత, గోరికోత, గోరిగీత ఇవి ‘నఖక్షతం’ అన్న సంస్కృత శబ్దానికి తెలుగుసేత పదాలు. క్షతం అన్న పదం ఇట ఒత్తు, తాకు, చేత, వాత, కోత అన్న పదాలుగా అనువదింపబడింది.
‘‘తావుకొన్న వలపులు తారుకాణలైన చోట్ల
కావరపు గోరొత్తులు కమ్మబూవుతాకులే’’
‘‘చేసెనా అంగన నీకు చేసన్న లెల్లాను
వ్రాసెనా చెక్కుల గోరివాతలెల్లాను’’
చలిమందులు: ‘శీతలోపచారాలు’ అన్న సంస్కృతపదానికి వాడిన తెలుగు దేశ్యపదం. ‘చలిని కలిగించే మందులు’ అని మధ్యమ పదలోపి సమాసం. ప్రబంధాల్లో ఈ పదమెక్కడా కనిపించదు.
‘‘వలపుల వడ దాకె వనిత నిన్నుబాయగ
అలరి చలిమందుల కప్పణీవయ్యా’’
పసిడి చీరవాడు: పీతాంబరుడన్న ప్రసిద్ధ సంస్కృత పదానికి దేశ్యీకరణ. చీరపదం అంబర పర్యాయం.
‘‘పసిడి చీరవాడవు పాలు దచ్చితివి గాన
పసిడి బోలినది చేపట్టెను నీ కరము’’
ఎముకలయిల్లు: అస్థిపంజరానికి చక్కని దేశ్యపదం.
‘‘భ్రమసి పొరలదోలు పై వేసుకొన్నవాడ
యెముకలయింటిలో ఇరవైనాడ’’
పాముపడకవాడు: శేషశయనునికి తెలుగురూపం.
‘‘పాముపడకవాడ పట్టకురా ఆ
పామువంటి యారు నీకు బాయదు గదే’’
ఉన్నకాలము: వర్తమానకాలము.
‘‘చన్నకాలమున వున్నకాలమున
నున్నవాడు యీ వుపేంద్రుడే’’
చెవులపండుగ: శ్రోత్రపర్వం అన్న సంస్కృతపదానికి తెలుగు ప్రతిపదానువాదం. ‘కనులపండుగ’ వంటి శబ్దం.
‘‘చెప్పేరి నీకొక సుద్ది చెవులపండుగగాను
ఇప్పుడొకటె వెదకె నిందాకా నిన్ను’’
ఊరుపుగాలి: నిశ్శ్వాసవాయువుకు తెలుగుపదం.
‘‘వొప్పగుబ్రాణములవి వూరుపుగాలివెంట
యెప్పుడు లోనివెలికి నెడతాకును’’
పూసగొండి: కలహశీలుడనే అర్థంలో వాడబడ్డ పదం. తమిళంలో పూశల్ అంటే కలహమని అర్థం.
‘‘పుక్కటవలపుతోడి పూసగొండితనమేల పక్కన మొఱగితేను పగలు రేయౌనా’’
ఇక, ‘మధురవాణి’కి మధురమైన అచ్చ తెలుగుపదం చక్కెరమాటలాడి. అధరామృతానికి తెనుగు సేతలు మోవితేనె, మోవితీపు. ‘పల్లవశయ్య’కు తెలుగురూపాలు చిగురుబడక, చిగురుపాన్పు. ‘పుష్పశయ్య’కు తెలుగు అనువాదం పూబరపు. దీపావళి పండుగకు దేశ్య వ్యవహారం దివ్వెలపండుగ. ‘దివ్వెలపండుగో యనన్’ అని కొరవి గోపరాజు ప్రయోగం. ఇప్పటికీ తెలంగాణంలో దివ్వెలపండుగకు వికృతిరూపమైన దీలి పండుగ వాడుకలో ఉన్నది.
సంధ్యాసమయానికి అన్నమయ్య వాడిన దేశ్యశబ్దం దివ్వెలెత్తు పొద్దు. దీపాలు పెట్టే సమయం అని అర్థం. ఇప్పటికీ జానపదులు సంధ్యాసమయాన్ని ‘దీపాలు పెట్టే పొద్దు’ అని వ్యవహరించడం ఉన్నది. నలినదళాక్షుడన్న సంస్కృతానికి అన్నమయ్య తెలుగు అనువాదం కలువరేకులవంటి కన్నులాతడు. పుష్పబాణాలకు దేశ్యప్రయోగం నారసపు విరులు. మకరకుండలాలకు తెలుగు భావానువాదం మొసలిమొకపు సొమ్ములు.
‘‘మొసలిమొకము సొమ్ములు సెవులనుబెట్టి/ విసవిస నవ్వీని వీడు గదమ్మా’’ ముఖపద్మముకు అన్నమయ్య వాడిన పదం తమ్మిమోము. ప్రణయకోపానికి దేశ్యపదం పొలయలుక. తారాపతికి దేశ్యపదం చుక్కలరాయడు. శుభవార్తకు దేశ్యపదం మేలుసుద్ది. ఈ విధంగా అన్నమయ్య ప్రసిద్ధమైన సంస్కృతపదాలు వాడే చోట్ల వాటికి బదులుగా దేశ్యపదాలు వాడి తన దేశ్యపదాభిమానాన్ని చాటుకున్నాడు.
- ఆచార్య రవ్వా శ్రీహరి
9959886020