సంపద సృష్టిపైనే దృష్టి | Arun jaitley budget 2015-16 mainly focus on wealth | Sakshi
Sakshi News home page

సంపద సృష్టిపైనే దృష్టి

Published Sun, Mar 1 2015 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM

సంపద సృష్టిపైనే దృష్టి

సంపద సృష్టిపైనే దృష్టి

అత్యంత ముఖ్యమైన విషయాన్ని దేశ ప్రజలలో అధిక సంఖ్యాకులు పట్టించుకోవడం లేదు. అందుకే పాలకుల ఆటలు సాగుతున్నాయి. ఏ పద్దుకు ఎంత ఎందుకు కేటాయిస్తున్నారో, ఎంత విడుదల చేశారో, ఎంత ఖర్చు చేశారో, ఎట్లా ఖర్చు చేశారో ప్రశ్నించి సమాధానం రాబట్టుకునే స్థాయికి పౌరసమాజం ఎదగనంత వరకూ పరిస్థితులు ఇట్లాగే ఉంటాయి.
 
మాటల కంటే అంకెలు నమ్మదగ్గవి. అంకెల కంటే అనుభవం మరింత విశ్వసించ దగినది. లోక్‌సభలో ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ‘మా మత గ్రంథం రాజ్యాం గం’ అంటూ నాటకీయంగా చేసిన ప్రకటన కానీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శనివారం నేర్పుగా సమర్పించిన కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు కానీ ఆచరణలోనే నిగ్గుతేలవు. ప్రభుత్వాధినేతల తాత్వికతకు అనుగుణంగానే బడ్జెట్ ప్రతిపాదనలు ఉంటాయి. సోనియాగాంధీ హయాంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఇష్టం ఉన్నా లేకపోయినా బడ్జెట్‌పైన అరుణారాయ్, హర్షమందిర్ వంటి సామాజికవేత్తల ప్రభావం ఉండేది. ఆర్టీఐ, నరేగా, తదితర చట్టాలు అట్లాగే వచ్చాయి.
 
ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేవారు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన అరవింద్‌లు (ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుబ్రమణ్యన్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పనగారియా). కార్పొరేట్ పరిష్వం గంలో పరవశించే మోదీకీ, ఢిల్లీలో పుట్టిపెరిగిన జైట్లీకీ విదర్భలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అప్పుల ఊబిలో కూరుకొనిపోయి దిక్కుతోచక ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల గోడు పట్టకపోవడంలో ఆశ్చర్యం లేదు. దళితులూ, ఆదివాసుల అభివృద్ధికోసం ఎస్‌సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్ అంటూ ఒకటి అవిభక్త ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీలు చేశాయని తెలియకపోవడంలో వింత లేదు.
 
పరిశ్రమలకు పెద్దపీట
సంపద సృష్టించే పరిశ్రమల అధిపతులకూ, కార్పొరేట్ రంగానికీ సకల సదుపాయాలూ కల్పించాలనీ, సృష్టిం చిన సంపద ఫలితాలు క్రమంగా జాలువారి నోటికి అందేవరకూ పేదలు వేచి ఉండాలనే సిద్ధాంతాన్ని విశ్వసించే పాలకులు తయారు చేసే బడ్జెట్ ప్రతిపాదనలలో పేదల పట్ల బాధ్యత కనిపించదు. కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా వాగ్దానాలను అమలు చేస్తే దేశంలో ఇంతమంది పేదవారు ఉండేవారు కాదు.
 బడ్జెట్ ప్రతిపాదనలను అర్థం చేసుకోవడం సాధారణ ప్రజలకు కష్టం. పార్లమెంటు సభ్యులలో కూడా ఆర్థికాంశాలు వంటబట్టించుకున్నవారికి తప్పితే తక్కినవారికి విషయం బోధపడదు.
 
 పార్లమెంటు భవనం నుంచి బయటికి వస్తుండగా టీవీ ప్రతినిధులు అభిప్రాయం అడిగితే అధికార పార్టీ సభ్యులైతే అద్భుతం, జన హితం అంటూ హర్షం ప్రకటిస్తారు. ప్రతిపక్ష సభ్యులైతే అంకెల గారడీ  అంటూ చప్పరిస్తారు. పేదల ఊసే లేదం టూ మొహం చిట్లిస్తారు. అత్యంత ముఖ్యమైన విషయాన్ని దేశ ప్రజలలో అధిక సంఖ్యాకులు పట్టించుకోవడం లేదు. అందుకే పాలకుల ఆటలు సాగుతున్నాయి. ఏ పద్దుకు ఎంత ఎందుకు కేటాయిస్తున్నారో, ఎంత విడుదల చేశారో, ఎంత ఖర్చు చేశారో, ఎట్లా ఖర్చు చేశారో ప్రశ్నించి సమాధానం రాబట్టుకునే స్థాయికి పౌరసమాజం ఎదగనంత వరకూ పరిస్థితులు ఇట్లాగే ఉంటాయి.
 
 బడ్జెట్ అంకెల వెనుక దాగిన నిగూఢమైన వాస్తవికతనూ, ఆర్థిక మంత్రి హృదయాన్నీ అర్థం చేసుకునేం దుకు ప్రతిపాదనల అధ్యయనం తోడ్పడుతుంది. అరుణ్ జైట్లీ చదివిన జమాఖర్చు అంచనాల చిట్టా విలువ 17.9 లక్షల కోట్లు. ఇందులో చేసిన అప్పులకి చెల్లించే వడ్డీలకూ, రక్షణ వ్యయానికీ సుమారు 7 లక్షల కోట్లు పోతుంది. మిగిలిన నిధులతోనే అందరినీ సంతృప్తి పరచాలి. ఆదాయానికీ, వ్యయానికీ ఎప్పుడూ లంగరు అందదు. ఈ మార్చితో ముగుస్తున్న ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్ళ ద్వారా మొత్తం 13.6 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే సవరించిన అంచనా ప్రకారం ఆదాయం 12.5 లక్షల కోట్లకు మించదు. పన్నుల ద్వారా ఆదాయం పెంచుకోవాలంటే ఆర్థిక కార్యకలాపాలు ముమ్మరంగా సాగాలి. వస్తూత్పత్తి, వినియోగం పెరగాలి.
 
అందుకోసం పెట్టుబడులు కావాలి. ప్రభుత్వం పెట్టుబడులు పెద్ద స్థాయిలో పెట్టలేదు కనుక ప్రైవేటు సంస్థలను ఆహ్వానించాలి. రెడ్ టేప్ (జాప్యం) కాదు రెడ్ కార్పెట్ వేస్తాం (సాదర స్వాగతం చెబు తాం) అంటూ ప్రధాన మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే మోదీ విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు వాగ్దానం చేసింది అందుకే. చిందబరం అయినా జైట్లీ అయినా మార్కెట్ ఎకానమీ చెప్పినట్టు నడుచుకోవాలి. కార్పొరేట్ రంగాన్ని మెప్పించాలి. పన్ను ఎగవేత కోసం పెట్టుదారులు మారిషస్, లగ్జంబర్గ్, స్విట్జర్లండ్ అడ్డదారులలో పెట్టుబడులు తీసుకొని రాకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2012-13లో ఆర్థిక మంత్రిగా ఉండగా గార్ (జనరల్ యాంటీ ఎవాయిడెన్స్ రూల్)ను ప్రతిపాదించారు.
 
 దానిని 2015 ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయాలన్న నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం (అంటే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేరు మీద నడిచే ప్రభుత్వం) నిరవధికంగా వాయిదా వేసుకోవడానికి కారణం విదేశీ పెట్టుబడిదారులను ఇబ్బంది పెట ్టకూడదనే. కార్పొరేట్ టాక్స్‌ను వచ్చే అయిదేళ్ళలో 30 నుంచి 25 శాతానికి తగ్గిస్తానంటూ మాట ఇచ్చింది స్వదేశీ పెట్టుబడిదారులు విదేశాలలో పెట్టుబడులు పెట్టకుండా నివారించడానికే. వ్యాపారం చేస్తున్నవారు ఎక్కడ ఎక్కువ సదుపాయాలు ఉంటే, ఎక్కడ లాభార్జనకు అవకాశాలు ఉంటే అక్కడికి వెడతారు. ఆసియా దేశాలన్నిటి కంటే భారత్‌లో కార్పొరేట్ టాక్స్ అధికం కనుక తగ్గించడం తప్పనిసరి. కాదని ఎట్లా అనగలం?
 
 ఆదాయం పెంచుకోవాలనీ, ఇతోధికంగా ప్రజాసంక్షేమంపైన ఖర్చు చేయాలనే ఆర్థిక మంత్రులు అందరూ సంకల్పిస్తారు. ప్రాథమికావసరాల రంగం (ఇన్‌ఫ్రా)లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వ సంస్థలలో వాటాలు విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ యేడాది (2014-15) డిస్‌ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా 63,000కోట్లు సంపాదించాలని అనుకుంటే అందులో సగం మాత్రమే సమీకరించగలిగింది. ఆ మేరకు వ్యయం తగ్గుతుంది. సర్వసాధారణంగా సంక్షేమ రంగానికే కోత పడుతుంది. ఈ సారి విఫలమైనప్పటికీ వచ్చే సంవత్సరం లక్ష్యం సాధిస్తామనే ఆత్మవిశ్వాసంతో 2015-16 బడ్జెట్‌లో కూడా ప్రభుత్వ సంస్థల వాటాలు విక్రయించి 60 వేల కోట్ల పైచిలుకు సొమ్ము సంపాదించగలమని అంచనా వేశారు. అరుణ్ జైట్లీ అంచనాలు నిజమవుతాయో, తల్లకిందు లవుతాయో ఏడెనిమిది మాసాల తర్వాత కానీ తేలదు.
 
 
 
 ధరలు పైపైకి, ద్రవ్యోల్బణం కిందికి
 బడ్జెట్ అంచనాలలో కొన్ని నమ్మశక్యం కాని అంశాలూ, కొన్ని అస్పష్టమైన విషయాలూ ఉన్నాయి. పెరుగుదల రేటును లెక్కించడానికి బేస్ ఇయర్ (ప్రాదిపదిక సంవత్సరాన్ని) 2004 నుంచి 2011-12కు ఎందుకు మార్చారో ఎవ్వరూ చెప్పడం లేదు. ఈ కారణంగానే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశంలో విహరిస్తున్నా ద్రవ్యోల్బణం రేటు తక్కువగా కనిపిస్తోంది. వృద్ధి రేటు అమాంతం 5.2 నుంచి 7.4కు పెరుగుతుంది. వచ్చే ఆర్థిక సంవత్స రంలో వృద్ధి రేటు 8 నుంచి 8.5 వరకూ ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేయడం వెనుకా ఇదే మర్మం. ఈ లెక్కలు చూసి ప్రపంచం విస్తుపోతుందనీ, నవ్వుకుంటుందనీ ఆర్థిక నిపుణులు చెబుతున్నప్పటికీ మన నాయ కులు విననట్టూ, కననట్టూ నటిస్తున్నారు.
 
 యూపీఏ ప్రభుత్వం సత్సంకల్పంతో ప్రారంభించి సవ్యంగా అమలు చేయలేని కొన్ని పథకాలను సరిచేసే ప్రయత్నం బడ్జెట్ ప్రతిపాదనలలో కనిపిస్తుంది. వాటిలో ముఖ్యమైనది ‘జామ్’ పథకం. యూపీఏ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కానీ, ఆధార్ కార్డులను కానీ తాము తిరస్కరించడం లేదనీ, కొనసాగిస్తామనీ చెప్పడం స్వాగతించదగినదే. సబ్సిడీలను తొలగించకుండా సబ్సిడీలలో మోసం జరగకుండా, కోత పడకుండా నేరుగా నిర్దేశించిన వ్యక్తులకే అందే విధంగా జన్‌ధన్ యోజనను ఆధార్‌కార్డు, మొబైల్ బ్యాంకింగ్ విధానాన్ని అనుసంధానం చేసి అమలు చేస్తామని జైట్లీ చెప్పడం ఆహ్వానించదగినదే. కానీ ఇప్పటికీ చాలా శాతం పేదవారి పేరుమీద బ్యాంకు ఖాతాలు తెరవనేలేదు. నగదు లావాదేవీలు లేకుండా బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బు పడే విధంగా ప్రభుత్వం చేయగలిగితే అంతకంటే కావలసింది ఏముంటుంది?
 
 అదే విధంగా ఉద్యోగులు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఐఎస్‌ఐఎస్) బదులు వేరే ఏదైనా ఆరోగ్య బీమా సంస్థలో సభ్యత్వం తీసుకోవచ్చుననీ, ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో మాత్రమే కాకుండా నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టుకోవచ్చుననే స్వేచ్ఛ ప్రసాదించడం కూడా అభినందనీయమే. ఖాయిలా పరిశ్ర మల పునరుద్ధరణ కోసం నెలకొల్పిన బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫినాన్స్ రీకనస్ట్రక్షన్ (బీఐఎఫ్‌ఆర్) రద్దు చేసి దాని స్థానంలో మరో వ్యవస్థ ఏర్పాటు సైతం ఆహ్వానించదగినదే. పనిలో పనిగా రఘురామ్ రాజన్‌కు పగ్గాలు వేస్తున్నారు. వడ్డీ రేటు పెంచకుండా ప్రభుత్వాన్ని చిరాకు పరిచినందుకేమో వడ్డీ రేటు పెంచడమో లేదో నిర్ణ యించే అధికారం ఆర్‌బీఐ గవర్నర్ అధ్యక్షతనే మానిటరీ పాలసీ కమిటీని నెలకొల్పుతారు. ఇందులో గవర్నర్‌కు ఒక్క ఓటు మాత్రమే ఉంటుంది. తక్కిన సభ్యులు ప్రభుత్వానికి అనుకూలురు ఉంటారనీ ప్రత్యేకంగా చెప్పు కోనక్కరలేదు.
 
 నల్లధనం భరతం పడతానంటూ ఎన్నికల ప్రచారంలో డంబాలు పలికిన నరేంద్రమోదీకి అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ తన వాగ్దానం నెరవేర్చడం ఎంత కష్టమో అర్థం కాలేదు. స్విస్ బ్యాంకులలో మూలుగు తున్న లక్షలకోట్ల రూపాయల నల్లధనం తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 వేల రూపాయలు జమచేస్తానన్న మోదీ ఇప్పుడు జీ-ట్వంటీ సదస్సులో ఈ విషయం మాట్లాననీ, స్విట్జర్లండ్ నుంచీ, ఇతర దేశాల నుంచీ సమా చారం సేకరిస్తున్నామనీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అంత మాత్రాన నల్లధనం మీద యుద్ధం అక్కర లేదని అర్థం కాదు. కానీ దాని కోసం కఠినమైన చట్టం తేవాలనీ, నేరం చేసినవారికి పదేళ్లు కఠిన కారాగార శిక్ష విధించాలనీ జైట్లీ చెప్పినప్పుడు అటువంటి చట్టం దుర్వినియోగం కావడం తథ్యమనే అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. రాజకీయ విభేదాల కారణంగా ప్రత్యర్థులపైన కక్షకట్టి చట్టాలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో చూసిన ప్రజలకు అరుణ్ జైట్లీ ఆశ్వాసన విశ్వాసం కలిగించదు.
 
 ద్రవ్యోల్బణం మాయాజాలం
 ఇటువంటి అనుమానాలే రాష్ట్రాలకు ఇతోధికంగా నిధులు ఇస్తున్నామంటూ మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం విషయంలో కలుగుతున్నాయి. దేశంలో వసూలైన పన్నుల మొత్తంలో 32 శాతం రాష్ట్రాలకు అందజేయడం పరిపాటి. దీనిని 42 శాతానికి పెంచాలంటూ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సును తు.చ. తప్పకుండా పాటిస్తామనీ, సహకార సమాఖ్య వ్యవస్థకు ప్రాణం పోస్తామనీ జైట్లీ ప్రకటించారు. పంచాయతీలకూ, మునిసిసాలిటీలకూ, ఇతర సంస్థలకూ ఇచ్చే నిధులను కూడా కలిపితే పన్నుల ఆదాయంలో 62 శాతం దాకా రాష్ట్రాలకు అందుతుందని ఆర్థిక మంత్రి సగర్వంగా చాటుతుంటే ఇదేమంత విషయం కాదని కాంగ్రెస్ నాయకులు కొట్టిపారేస్తున్నారు.
 
 లోగడ కూడా కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటా కింద ఇచ్చే నిధులకు ప్రణాళికా సంఘం వివిధ కేంద్ర పథకాల అమలు కోసం ఇచ్చే నిధులను కలిపితే 61.88 శాతం దాకా వస్తుందనీ (ప్రణాళికా సంఘం లెక్కలు), మోదీ అదనంగా చేసిన వితరణ ఏమీ లేదనీ వాదిస్తున్నారు. ఒక టి మాత్రం వాస్తవం. రాష్ట్రాలకు నిధులు ఎక్కువగా ఇస్తున్నాం కనుక సర్వశిక్షా అభియాన్ వంటి కేంద్ర పథకాలంటూ ఉండబోవనీ, అన్ని కార్యక్రమాలూ రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోనే అమలు కావాలనే విధానం అమలు జరిగే అవకాశం ఉంది. అందుకే కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి వెయ్యి కోట్లూ, నీటిపారుదలకు వెయ్యికోట్లూ కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు కేవలం వందకోట్లు విదిలించారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాపోతున్నది అందుకే.
 
 తెలుగు రాష్ట్రాలకు శూన్యహస్తం
 రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాలకు దక్కింది శూన్యం. పశ్చిమబెంగాల్, బిహార్‌తో సమానంగా ఆంధ్ర ప్రదేశ్‌కు కూడా ఆర్థిక ప్యాకేజి ఇస్తామని అన్నారు కానీ వివరాలు తెలియవు. ద్రవ్యలోటు తీర్చేందుకు ఇచ్చిన రూ. 500 కోట్లూ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పేరిట ఇచ్చిన రూ.350 కోట్లతో సరిపుచ్చుకోవాలన్నది ఎన్‌డీఏ సర్కార్ అభిమతం కాబోలు. శక్తికి మించిన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎంత మొరబెట్టుకున్నా కేంద్రం ఆలకించకపోతే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. అంగన్‌వాడీ వర్కర్లకు జీతాలు పెంచుతామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన కొంత సేపటికే కేంద్రం నుంచి నిధులు అందబోవని సంకేతం రావడంతో ఏమి చేయాలో తెలియని అయోమయం. ఈ విధంగా ఆశాభంగం చెందిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. కొత్త తరహా ఆర్థిక సంస్కృతికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది.
 మోదీనీ, అరుణ్‌జైట్లీనీ అదృష్టం వరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సౌష్టవంగా ఉంది. వారికి వారస త్వంగా వచ్చిన ఆర్థిక పరిస్థితులు సైతం అంత దుర్బలంగా ఏమీ లేవు. ఇంత సౌలభ్యం ఉన్నప్పటికీ, అంతర్జా తీయ చమురు ఉత్పత్తుల ధరలు పడిపోయి విదేశీ మారక ద్రవ్యం లక్షలకోట్లలో మిగిలిపోయినప్పటికీ వ్యవ సాయరంగానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి గురించి ఆలోచించక పోవడం అన్యాయం.
 
 కాంగ్రెస్ అయినా భాజపా అయినా మార్కెట్ ఎకానమీలో ఇదే అభివృద్ధి నమూనాను అమలు పరచవలసిందే. మరో అభివృద్ధి నమూనా అందుబాటులో లేదు కాబట్టి అరుణ్‌జైట్లీ అంచనాలు నిజం కావాలనీ, ఆయన ఆశించినట్టు నిధుల సమీకరణ జరగాలనీ, ద్రవ్యలోటు 3.5 శాతానికి మించకుండా ఉండాలనీ ఆశించాలి. కార్పొరేట్ రంగం వర్థిల్లి, విదేశాల నుంచి నిధులు ప్రవాహంలాగా వచ్చి ‘మేక్ ఇన్ ఇండియా’ స్వప్నం సాకారమై ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని కోరుకోవాలి. ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా లేనంత వరకూ అంతకంటే చేయగలిగింది మాత్రం ఏమున్నది?

త్రికాలమ్ : కె.రామచంద్రమూర్తి

సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement