
ఆరాటం అసలుకు ముప్పు
నెహ్రూ, అరుణాచల్ తెగలను క్రైస్తవ బోధకులకు దూరంగా ఉంచి, హిందీ మీడియం విద్య ద్వారా జాతీయ-జాతీయవాద-ప్రధాన స్రవంతిలోకి తెచ్చారు.
జాతిహితం
నెహ్రూ, అరుణాచల్ తెగలను క్రైస్తవ బోధకులకు దూరంగా ఉంచి, హిందీ మీడియం విద్య ద్వారా జాతీయ-జాతీయవాద-ప్రధాన స్రవంతిలోకి తెచ్చారు. ఆ తర్వాతా ఇదే వైఖరి కొనసాగింది. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ అక్కడి తెగలను మెల్ల మెల్లగా హైందవీకరణ, భారతీయీకరణ చెందిస్తూ వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పుడిక అక్కడ కాంగ్రెస్‌కు బీ టీం కాదు. హైందవీకరణ వేగంగా సాగాలని అది కోరుతోంది. ఈ కోణం నుంచి చూస్తేనే అరుణాచల్ గవర్నర్ అసహనంగానీ, అస్సాం, త్రిపుర గవర్నర్ల కొన్ని ప్రకటనలుగానీ అర్థమవుతాయి.
‘నేఫాలో నెహ్రూ’ అనే ఆసక్తికర కథనం ఉంది. అయితే నమోదై ఉన్న చారిత్రక ఆధారం చూపి దాన్ని ధృవీకరించలేను. కాకపోతే, ఈశాన్య భారతంలో మీరు కొంత కాలం గడిపేట్టయితే పాత తరం వారి ద్వారా ఆ కథనం మీకు నమ్మకం కలిగించేంత తరచుగా వినిపిస్తుంది. 1952 అక్టోబ ర్‌లో నెహ్రూ అపాతని తెగ ప్రధాన భూభాగమైన జిరోను సందర్శించారు. తనతో పాటూ ఆయన తన కుమార్తె ఇందిరను కూడా తీసుకెళ్లారు. తెగ పెద్ద ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. ఇందిరంటే ఇష్టపడ్డాడు. నువ్వు మీ తెగకు పెద్దవు, నేను నా తెగకు పెద్దను. నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చెయ్యొ చ్చుగా? నీకు భారీగా కన్యాశుల్కాన్ని చెల్లిస్తానన్నట్టు మాట్లాడాడు. ఇవ్వజూ పిన కన్యాశుల్కంలో కొన్ని వందల మితున్లు కూడా ఉన్నాయి.
అవి ఆవుల కంటే ఎక్కువగా గేదెలనే పోలి ఉండే పశువులు. పాల కోసం కాక, మాంసం కోసం, బలివ్వడానికి, వ్యాపారానికి వాటిని పెంచుతారు. అలాంటి ఓ మితున్‌ను రాజ్‌భవన్ ముందు బలిచ్చినందుకు ఆగ్రహించిన ప్రస్తుత గవర్నర్, ముఖ్యమంత్రికి ఉద్వాసన పలికారు. అయితే, నాడు నెహ్రూ మాత్రం అపాతని తెగ పెద్ద మాటలకు నవ్వి, అతని కోరిక తనను ఎంత గానో కదలించిందనీ, కానీ ఇప్పటికే తన కుమార్తెను వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసేశానని చెప్పినట్టు తెలిసింది. మితున్‌ను బలివ్వడాన్ని, నేటి గవర్నర్ రాజ్‌కోవాకు భిన్నంగా నెహ్రూ అతిథికి చేసే అత్యున్నత సత్కారంగానే చూశాడు తప్ప అవమానంగా భావించలేదు. ఈ ఉదంతంలో ఆ తదుపరి కొంత వర్ణనాత్మకత చేరివుండొచ్చు. అయినా అది, ఈశాన్యమంటే నెహ్రూకు ప్రేమను వ్యక్తంచేస్తుంది. అలా అని వారసత్వంగా సంక్రమించిన ఆ ప్రాంత సమస్యలతో సక్రమంగా వ్యవహరించడం ఎలాగో ఆయనకు తెలుసని కాదు. ఆయన కొన్ని సమస్యలను పరిష్కరించారు, మిగతా వాటిని సంక్లిష్టం చేశారు.అదే క్రమంలో ఆయన ఆ ప్రాంతాన్ని పరిరక్షించి, పాలించి, రిపబ్లిక్‌లో విలీనం చేసే మూడు సిద్ధాంతాలకు పునాదులను కూడా వేశారు.
ఈశాన్యానికి నెహ్రూ మూడు సిద్ధాంతాలు
మొదటిది, ఆ ప్రాంత జాతి వైవిధ్యానికి రాజకీయాలలో విశాలమైన స్థానాన్ని కల్పించడం. దాని పర్యవసానంగానే 10 లక్షలు లేక అంతకంటే తక్కువ జనాభాగల నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, చివరకు అరుణా చల్‌ప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. భాషాప్రాతిపదికకు భిన్నంగా ఆప్రాంతంలో రాష్ట్రాలను జాతి ప్రాతిపదికపై విభజించాల్సి వచ్చింది. ఇక రెండవది, తిరుగుబాటు బెల్ వక్రరేఖా సిద్ధాంతమని నేను పిలిచేది. నాడు అస్సాంలో భాగమైన నాగా పర్వత ప్రాంతంలో 1950లలో తిరుగుబాటు బద్ధలైంది. నెహ్రూ సైన్యాన్ని పంపాడు. ఆ పోరాటం ఎంత తీవ్రంగా సాగిందంటే తిరుగుబాటుదార్లు ఐఏఎఫ్‌కు చెందిన ఒక డకోటా విమానాన్ని కూల్చేశారు. పెలైట్లను ‘‘బందీలు’’గా పట్టుకున్నారు. అయితే, నెహ్రూ, ఫిజో నేతృత్వం లోని తిరుగుబాటుదార్లతో చర్చలను మాత్రం నిలిపివేయలేదు. ప్రభుత్వం తిరుగుబాటుకు వ్యతిరేకంగా పోరాడుతుంది, నిర్దాక్షిణ్యంగా అణచేస్తుందే తప్ప, చర్చలకు తలుపులను మాత్రం మూసేయదు... అనేది చివరకు ఆయన వైఖరి ఆవిష్కరించిన సిద్ధాంతం.
తిరుగుబాటుదార్లు తాము ఎన్నటికీ గెలు పొందలేమని గుర్తించగలిగనపుడు తిరుగుబాటు హింసకు సంబంధించిన బెల్ వక్రరేఖ అధోముఖ స్థానాన్ని చేరుతుంది. ఎటు ఎందరి ప్రాణాలు పోయాయనే స్కోర్‌తో దానికి నిమిత్తం లేదు. ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం రాజకీయవేత్తలు, గూఢచారులు ఎదురు చూసేది సరిగ్గా అలాంటి సమ యం కోసమే. కొన్ని దశాబ్దాల కాలంలో ఈశాన్యంలోని అన్ని ప్రధాన తిరుగు బాటు గ్రూపులు రాజకీయాధికారానికి బదులుగా శాంతికి అంగీకరించాయి. ప్రభుత్వం ఈ విషయంలో అతి తీవ్రస్థాయి వెసులుబాటు వైఖరిని చూపాలి. రాజ్యాంగపరమైన సృజనాత్మకతను సైతం ప్రదర్శించాలి. సువిశాలమైన ఆర్టికల్ 370 నీడలో నాగాలలో ఉన్న కొన్ని ఆందోళనలకు భరోసాను కల్పించేలా ఆర్టికల్ 371 ఏ (1)ని అలా చేర్చినదే.
‘‘మెల్లగా త్వరితంచేయడం’’
ఇక మూడవ సిద్ధాంతం, అది ఈశాన్యంలోని అత్యంత మారుమూల నున్న విశాలమైన ఉత్తర అంచు నుంచి ఆవిర్భవించినది. అది పశ్చిమాన భూటాన్ నుంచి హిమాలయాలతోపాటే తూర్పున మయన్మార్ వరకు విస్తరించిన వలయాకారపు అంచు. అందులో చాలా భాగం టిబెట్ (చైనా) సరిహద్దున ఉన్నది. బ్రిటిష్ పాలకులు సైతం ఆ ప్రాంతానికివాయవ్య సరిహద్దు ప్రాంతం (ఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ) లాంటి ప్రత్యేక పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కన్యాశుల్కం, ప్రతీకార పరిహారం సహా ఆదివాసీ చట్టాలే ప్రధానంగా అమలు కావడాన్ని అనుమతించారు. ఆ ప్రాంతాన్ని ఎన్‌ఈఎఫ్‌ఏ (నేఫా) లేదా ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ అన్నారు. అది ప్రధాన భారతానికి అతి సుదూరంగా ఉన్న, అతి తక్కువ జనసాంద్రతగలిగిన ప్రాంతం. అయినా, ఈ వారంలో జరిగిన అల్లర్ల వరకు అక్కడ ఎన్నడూ వేర్పాటువాదం లేదా హింసాత్మకవాదం సవాలు ఎదురుకాలేదు. కానీ చైనావారు అది తమదేనని వాదించడం మొదలైంది, 1962లో చైనా ఆ ప్రాంతంపై దురాక్రమ ణకు పాల్పడింది. ఈశాన్య ప్రాంతాన్ని నెహ్రూ సాధారణ ఐఏఎస్ అధికారు లకు వదిలేయలేదు. అక్కడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా తీర్చిదిద్దిన భారత సరిహద్దు పాలనా సేవల (ఐఎఫ్‌ఏఎస్) అధికారులను పంపాడు. వారిలో ఎక్కువమంది అధికారులు సాహసికులు, అన్వేషణాత్మక వైఖరి కలవారు.
ఈ ఉన్నతాధికారుల గురించి నేను ఎరిగిన వాటిలో చాలా వరకు నారీ రుస్తుంజీ నుంచి తెలుసుకున్నవే. ఆ అధికారులలో అత్యంత ప్రముఖుడైన ఆయన ‘‘ఇంపెరిల్డ్ బోర్డర్స్: ఇండియాస్ నార్త్‌ఈస్టర్న్ బోర్డర్ లాండ్స్’’ (ఓయూపీ, 1983) అనే అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. నెహ్రూ అక్కడి తెగల గురించి మరింత మంచి అవగాహనను కోరుకున్నారని, ఇంగ్లిష్ మానవ జాతుల శాస్త్రవేత్త వెరియర్ ఎల్విన్‌ను సంప్రందించారని తెలిపారు. భారతదేశంలోని ఆదివాసులపై ఆయన అత్యంత ముఖ్యమైన అధ్యయనాన్ని చేశారు. ఆదివాసులకు సంబంధించి ఎల్విన్ సలహాలపై నెహ్రూ విశ్వాసం ఉంచారు. ఆదివాసులను ‘‘బయటి’’ ప్రభావాల నుంచి, వారిని ‘‘నాగరికు లను చేయడం’’ అనే బయటివారి ప్రమాదకరమైన, తప్పుడు అభిప్రాయం నుంచి పరిరక్షించడం ఎల్విన్ పద్ధతిలోని ముఖ్యాంశం. రుస్తుంజీ దాన్ని ‘‘మెల్లగా త్వరితంచేయడం’’ అన్నారు. నెహ్రూ ఆ భావన ను స్వీకరించారు.
నెహ్రూకు కూడా నేఫా ప్రాంతానికి చైనీయుల నుంచి ముప్పు ఉందనే ఆందోళన ఉండేది. ైచైనా మద్దతుతో సాగుతున్న నాగా తిరుగుబాటు వైరస్ నేఫాకు సోకితేనో? తూర్పుకొసన నాగాలాండ్‌తోపాటూ, అరుణాచల్‌ప్రదేశ్‌కు కూడా చైనాతో సరిహద్దు ఉంది. చైనావారు నడుచుకుంటూ ఇటు వచ్చేయ వచ్చనేట్టుండేది. నాగాల తరఫు ప్రతినిధులుగా విదేశీ క్రైస్తవ పాస్టర్లతో చర్చలు జరపాల్సి రావడం గురించి నెహ్రూ కలత చెందుతుండేవాడు. కాబట్టి నే డు అరుణాచల్‌ప్రదేశ్‌గా పిలుస్తున్న నేఫా ప్రాంతాన్ని క్రిస్టియన్ మత ప్రబోధకులకు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. హిందీ మీడియం విద్య ద్వారా అక్కడి తెగలను జాతీయ-జాతీయవాద-ప్రధాన స్రవంతిలోకి తెచ్చారు. అది, ఈశాన్యంలో హిందీ మాట్లాడే ఏకైక రాష్ట్రం. కేంద్రమంత్రి కిరణ్ రిజీజుతో హిందీలోనే మాట్లాడవచ్చు. నెహ్రూ తర్వాత కూడా ఇదే వైఖరి కొనసాగింది. అరుణాచల్‌లో చర్చి ప్రవేశం కంటే, హిందూ మతబోధ కులు, రామకృష్ణ మిషన్, ఆర్‌ఎస్‌ఎస్‌ల ప్రవేశాన్ని కోరుకుంటానని ఇందిరా గాంధీ, నానాజీ దేశ్‌ముఖ్‌తో అన్నారనే కథనాన్ని నేను పూర్తిగా విశ్వసిస్తాను. 1978లో (కేంద్రంలో జనతా ప్రభుత్వం ఉండగా) అరుణాచల్ శాసనసభ మత స్వేచ్ఛ చట్టాన్ని చేసి, మతమార్పిడిని దాదాపు అసాధ్యం చేసింది.
ఆ చట్టం ఇంకా బతికి బట్టకడుతుందోంటే దానికి కారణం కాంగ్రెస్- ఆర్‌ఎస్‌ఎస్‌ల మధ్య ఉన్న అంతకంటే పెద్ద సూత్రబద్ధమైన అంగీకారం వల్లనే. అందుకే కేంద్రంలో అధికారం చేతులు మారినప్పుడల్లా, అరుణాచల్ ప్రభుత్వం మొత్తంగానే అటు ఫిరాయించేస్తుంటుంది. జిగాంగ్ అపాంగ్ ‘అరుణాచల్ కాంగ్రెస్’ పేరిట యూపీఏ భాగస్వామిగా ఉన్నారు. ఆ తర్వాత అదే శాసనసభా పార్టీతో బీజేపీ ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. కాంగ్రెస్ తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావడంతోనే ఆయన మళ్లీ దానిలో చేరిపోయారు.
విచ్ఛిన్నమవుతున్న కాంగ్రెస్-ఆర్‌ఎస్‌ఎస్ ఐక్యత
అక్కడ బీజేపీ ఎదుగుదలతో ఆ ఐక్యత ఇప్పుడు విచ్ఛిన్నమైపోతోంది. ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆ ప్రాంతం అంటే వ్యామోహం ఎక్కువ. దాని కీలక భావజాల కర్తలు కొందరు ఆ ప్రాంతం కోసం తమ జీవితాలను అంకితం చేశారు. అయితే, అరుణాచల్ తెగలలో కొన్ని బౌద్ధాన్ని అనుసరించేవి. కొద్ది సంఖ్యలో వైష్ణవులూ ఉన్నారు. గతంలో ప్రకృతి అరాధకులుగా (యానిమిస్టులు) పిలిచినవారే ఎక్కువమంది. అతి పెద్ద తెగలైన ఆది (జిగాంగ్ అపాంగ్), నియిషి (నబోం టుకి), అపాతని (మాజీ సీఎం టోమో రిబా) తెగలవారు దొన్యి-పొలొ అనుయాయులు లేదా సూర్య, చంద్రుల ఆరాధకులు. హిందు వులు అనాదిగా గ్రహ దేవతలను ఆరాధిస్తున్నారాయె. కాబట్టి ఇది ప్రకృతి ఆరాధన ఎలా అవుతుంది? అనేది ఆర్‌ఎస్‌ఎస్ దృష్టి. పైగా శని ఆలయం ప్రస్తుతం పతాక శీర్షికల్లో ఉంది. నాగాలు, జిజోలు, ఖాసీలు, గారోలకు విభి న్నమైన రీతిలో కాంగ్రెస్ ఇన్ని దశాబ్దాలుగానూ అరుణాచల్ తెగలను మెల్ల మెల్లగా హైందవీకరణ, భారతీయీకరణ చెందిస్తూ వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పుడిక అరుణాచల్‌లో కాంగ్రెస్‌కు బీ టీం కాదు. అది ఇప్పుడు హైందవీ కరణ వేగంగా సాగాలని కోరుతోంది. అది ఎంపిక చేసి మరీ నియమించిన అరుణాచల్ గవర్నర్ అసహనంగానీ, అస్సాం, త్రిపుర గవర్నర్ల కొన్ని ప్రకటనలుగానీ ఈ కోణం నుంచి చూస్తేనే అర్థమవుతాయి. నబోమ్ తుకి నియిషీ తెగవాడే అయినా ఆయన అరుణాచల్‌లో అరుదుగా కనిపించే క్రైస్తవంలోకి పరివర్తన చెందిన వ్యక్తని తెలిసిందే.
శేఖర్ గుప్తా, twitter@shekargupta