
బతుకమ్మ వచనం
అయ్యయ్యొ ఓ రామ ఉయ్యాలో..
బాల్యమే పండుగ... జీవితపు గాఢత అప్పుడు తప్ప మరెప్పుడూ అనుభవంలోకి రాదు...
కీసరగుట్ట స్కూల్లో ఉన్నప్పుడు వచ్చిందీ సమస్య. వరంగల్లు సైన్స్ ఫెయిర్ సరిగ్గా దసరా సెలవుల్లో పెట్టారు. ఇప్పుడు ‘మా’ పరిస్థితి ఏమిటి? ఫెయిర్‌కు వెళ్తే సెలవుల్లో కోత పడుతుంది. ‘తప్పనిసరిగా వెళ్లాల్సిందే’ అంటారేమోనని గుండెల్లో బస్సులు పరుగెడుతున్నాయి.
అప్పటికింకా రైలు ఎక్కలేదుగా నేను!
దోస్తులందరూ బ్యాగులు సర్దుకుంటున్నారు. బై చెప్పడం తెలియదు కాబట్టి చేతులు కలుపుకుంటున్నారు. వెళ్తూ వెళ్తూ ‘రాధిక’లోనో ‘ఆరాధన’లోనో చూడాల్సిన సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు. రమేష్‌గాడు మోహన్‌బాబు చొక్కా టక్ చేశాడు. రాజశేఖర్‌గాడు గ్యాంగ్‌లీడర్ షర్టును లూజుగా వదిలేశాడు. చివరికి నాదీ, అరవిందుదీ వాడిపోయిన ముఖాలు చూసి భీష్మాచారి సర్ ‘ఫర్లేదు లె’మ్మని చెప్పేసరికి పోతున్న ప్రాణం తిరిగొచ్చింది. దసరా సెలవులు మిస్సవ్వడమే! చలో నర్సింగాపురం!
మాటవరసకు దసరా సెలవులు అంటున్నానేగానీ నా వరకు అవి బతుకమ్మ సెలవులే. నిజానికి దసరా మగవాళ్ల పండుగ, బతుకమ్మ ఆడవాళ్ల పండుగ. ఆడవాళ్ల పండుగ అంటే కుటుంబ పండుగ. అప్పటికి నేనింకా అమ్మ పార్టీయే కాబట్టి పిల్లల పండుగ కూడా. అందరూ తలో పూవు వేస్తేనే కదా బతుకమ్మ!
రేపు ‘సద్దుల బతుకమ్మ’ అనంగా సాయంత్రం కిందిచేన్లో అమ్మ మోపెడు గునుగు కోసుకొస్తుంది. అంతకుముందే జరిగిన నిర్ణయం ప్రకారం బాపు వేములవాడ నుంచి రంగులు తెచ్చి పెట్టి వుంటాడు. ఎరుపు, ఆకుపచ్చ. గునుక్కు రంగు అద్దకపోతే తెలుపు. ‘మూడు రకాలూ’ సమకూరినట్టే!
ఇక, ఏ రొట్టో తొందరగా తినేసి, పెద్దచాపలో గునుగును పొతం చేయడానికి కూర్చుంటాం. ఆకులు తెంపి, వరుసగా పేర్చి, అమ్మ చేతికి అందిస్తుంటాం నేనూ, తమ్ముడూ. తలల్ని, తోకల్ని పద్ధతిగా ఈలపీటతో కోస్తుంటుంది అమ్మ. గుప్పెడుకో కట్ట చిటచిటా దారంతో కడుతుంటుంది చెల్లె. బాపు ప్రవేశం అప్పటికి జరగదు. పెద్దపీట మీద విలాసంగా నడుంవాల్చి బీడీ కాల్చుకుంటుంటాడు. ‘ఒక్క కథ జెప్పు బాపూ’ అని బాగా బతిమాలించుకున్నాక, లేచి, పటపటమనేలా నడుం విరుచుకుని, మా దగ్గర కూర్చుని, ‘ఆంజనేయుడు- కరక్కాయ ఇత్తు’ చెప్పడానికి పూనుకుంటాడు. అట్లాంటి రెండు మూడు కథలయ్యేసరికి, అడ్డగుల్ల నిండుగా గునుగు కట్టలు! రేపు వీటిదే పెద్దవాటా! అయితే, అప్పటికి, నన్ను త్వరగా పడుకొమ్మని అమ్మ తొందరపెడుతుంది. మబ్బుల్నే పెద్దబాపుతో తంగేడు పువ్వుకు పోవాలి కదా! తెల్లారి, ముఖమైనా కడగకుండా బయల్దేరతాం. గుట్ట, చెట్టు, పుట్ట అన్నీ తిరిగి, చెరో గంపెడు సంపాదిస్తాం. ఈ మధ్యలో చింతోట గురించో, గుర్రాలనూతి గురించో నాకు తెలియని స్థలపురాణాలేవో తెలుస్తాయి. పొద్దుపొడిచి, ఎండ చురుక్కుమంటున్నప్పుడు, పండ్లపుల్ల వేసుకుని తిరిగి వస్తుండగా, ‘పువ్వు మంచిగనే దొరికింది’ అని అభిమానపూర్వక ఈర్ష్యను ప్రదర్శిస్తుంది మరాటోళ్ల శోభమ్మ.
మేము వచ్చేసరికి పొలంకాడి నుంచి బాపు బంతిపువ్వులు, పట్నపుబంతులు తెంపుకొచ్చివుంటాడు. శీలమోళ్ల పెరట్లో గుమ్మడి చెట్టుందన్న జాడ తీసుకొని, అమ్మ వాటి ఆకులు, పువ్వు తెచ్చిపెట్టి వుంటుంది. స్నానాలు, భోజనాలయ్యాక, మిట్టమధ్యాహ్నం, బతుకమ్మ పేర్చుడు కార్యక్రమానికి బాపు నడుంకు తువ్వాలు బిగిస్తాడు. ఇత్తడి తాంబూళం అంచుల వరకూ మెత్తగా గుమ్మడి ఆకులు, మీద పసుప్చచ్చటి తంగేడు పువ్వు... తర్వాత ఆకుపచ్చ రంగు అద్దిన గునుగు పెడదామా? తెల్లటిదా? తెలుపే సహజమైంది కాబట్టి, ముందు దానికే స్థానం. మధ్యలో ‘కడుపులోకి’ పొతంచేసిన ఆకులు, పువ్వుల తునకలు... రంగులుగా, వరుసలుగా, పైన సమతలం ఉన్న బుజ్జిగుట్ట మాదిరిగా బతుకమ్మ ఊపిరి పోసుకుంటూ వుంటుంది.
తాజాగా తెంపాలి కాబట్టి చింతకుంటోళ్ల ఎనుగుకో, బండారోళ్ల కొట్టానికో పూసిన ఎర్రకట్లపూలు, పచ్చకట్లపూలు చెల్లి మెల్లిగా కొన్ని పట్టుకొస్తుంటే మరోవైపు ‘ఓ పద్మా, మీకు పోకబంతిపూలున్నాయే? లేకపోతే ఇన్నన్ని కొంచవోయే’ అని పంచిపెడుతూ అమ్మ... ‘పెద్దబాపోళ్లది పెద్దగున్నదా? మనదా?’ అని అటూయిటూ వెళ్తూ వస్తూ తమ్ముడు... వాళ్లది మాకన్నా ఎప్పుడూ పెద్దదే ఎప్పుడూ ముందే! అందాజాగా నాలుగవుతుండగా మాదీ పూర్తవుతుంది. గుమ్మడి గౌరమ్మ మధ్యలో కిరీటంలా కుదురుకుంటుంది. ఈలోపు మిగిలిన పూలతో సిబ్బిలో చెల్లె ‘చిన్న బతుకమ్మ’ పేర్చుకుంటుంది. రెంటినీ జాగ్రత్తగా అర్రలో కూరాడి, నీరాడి దగ్గర పెడతారు.
ఈలోపు పల్లె మీంచి డప్పు చప్పుడు వినబడుతుంది. బాపు ఎడ్లను కొట్టుకురావడానికి పొలానికి వెళ్తాడు. మేము కాళ్లూముఖాలూ కడుక్కుని తయారవుతూ ఉంటాం. వరి, నువ్వు, పెసర, మక్క సత్తుపిండులు... ‘ఐదు తీర్లకు ఒక్కటి తక్కువుంది.’ అంజక్క సాయానికి వస్తుంది. మలీద ముద్దలు పిసుకుతుంటుంది. కొత్తోళ్ల మణెక్క బతుకమ్మ ఎత్తుకుని వస్తూనే వుంటుంది. ‘జప్పన కానీ బిడ్డా’... పసుపు గౌరమ్మ కూడా పూర్తయింది. వాకిట్లోకి వెళ్లిపోయాయి బతుకమ్మలు.
మూడుబజార్ల దగ్గర కొందరు దింపుతారు. కొందరు నేరుగా మర్రి కిందకు వెళ్తారు. చివరగా ఎల్లమ్మ కాడ... ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’... పడుచులు, యువతులు, అమ్మలు, వదినలు, అత్తలు, ఆడబిడ్డలు, పాతబడటం వల్ల తప్పనిసరిగా పుట్టింటికి వెళ్లే అర్హత కోల్పోయిన కొత్త కోడళ్లు... చప్పట్లతో చప్పట్లను, భుజాలతో భుజాల్ని కలిపి, పెదాలు ఆడిస్తూనే చూపుల్తోనే పలకరించుకుని, గుండ్రంగా, నెమ్మదిగా, ఏకలయగా, అలలాగా, ముందుకూ వెనక్కీ ఊగుతూ... కదిలే జడల్తో, తలలో పూవుల్తో, నవ్వుల్తో, నగల్తో, కొత్త చీరల్తో, పాటల్తో, పసుపు కుంకుమల్తో...
పొద్దుగూకింది. బతుకమ్మలు తలలకెక్కాయి. వరుసగా, వరదగా, పూలే నడుస్తున్నట్టు, దీపాలై వెలుగుతున్నట్టు... ‘లచ్చక్కా, బాగున్నవా?’ ‘చెయ్యి ఇడిసిపెట్టద్దు బిడ్డా’ ‘చెరువుల ఏసేటప్పుడు పైలం’ ‘ఆ అండ్లున్నయి ఇంతపొడువు నీళ్లని...’
ముందువేసినవాళ్లు ఖాళీ తాంబూళాలతో తిరుగుముఖమై... ‘ఏమేమి పువ్వప్పుడే గౌరమ్మ, ఏమేమి కాయప్పుడే గౌరమ్మ’ అని పెద్దబాపు వీడ్కోలు పాడుతుండగా... మరెక్కడో లక్ష్మీదేవక్క గొంతు...
నేను ఏ జన్మ స్మృతులు రాస్తున్నాను? ఒకప్పుడు బతుకమ్మను తలుచుకోగానే వెన్నులోకి ఆనందం ప్రవేశించేది, మనసు నర్తించేది, పండుగ నాలోనే జరిగిపోయేది. జరిగిపోయేది అంటున్నానంటే, ఇప్పుడు పండుగ లేదా? పండుగ ఉంది; నేను అందులో లేను. సంపూర్ణంగా మమేకమై పాల్గొనడానికి కావాల్సినదేదో నాలో లోపించింది. దానికి వయసును మాత్రమే నిందించగలనా? నా బాల్యం హాస్టల్లో గడిచింది. నాన్నో, మామో వచ్చి తీసుకెళ్తారన్న ఆశ ఉండేది. ఇప్పుడు నాకు జీవితమే హాస్టల్ అయిపోయింది. నేనే నాన్ననూ, మామనూ అయిపోయాక, ఇందులోంచి నన్ను బయటపడేసేవాళ్లెవరు? అప్పుడు తెలియలేదుగానీ బాల్యమే పండుగ! జీవితపు గాఢత అప్పుడు తప్ప మరెప్పుడూ అనుభవంలోకి రాదు. అప్పుడు అర్థం కాకుండా అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది కానీ అనుభవంలోకి రాదు. ముందున్నది విముక్తి అనుకుని వెనకదాన్ని జాడించి వచ్చేశాను. ఇక నాకు మిగిలివున్నదల్లా నా చిన్ని కుమారుల రెండు జతల కుతూహలపు కళ్లలో చూపుగా మారిపోవడమే!
- పూడూరి రాజిరెడ్డి 9912347926