భూకంపాలతో బహుపరాక్ | be careful with earth quakes | Sakshi
Sakshi News home page

భూకంపాలతో బహుపరాక్

Published Tue, Apr 28 2015 2:23 AM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

నేపాల్ తాజా భూకంప బీభత్సం: కకావికలమైన చారిత్రక కట్టడాలు - Sakshi

నేపాల్ తాజా భూకంప బీభత్సం: కకావికలమైన చారిత్రక కట్టడాలు

ఏబీకే ప్రసాద్,  సీనియర్ సంపాదకులు
 
 ఆంధ్రప్రదేశ్ కోస్తాతీరంలో రాజధాని ప్రాంతంగా పేర్కొన్న విజయవాడ-గుంటూరు బెల్ట్ అంతా ప్రకృతి వైపరీత్యాలకూ, భూకంపాలకూ కేంద్రం కాగలదని జాతీయ స్థాయి నివేదికలు, ఐక్యరాజ్య సమితి స్థానిక సంస్థలతో జరిపిన సర్వేలు కొన్ని వెల్లడించాయి. భూకంపాలు (చిన్నవీ, పెద్దవీ) సంభవించగల ప్రాంతాలలో, ఇంతకుముందు పేర్కొన్న అయిదు జోన్లు సహా తాజాగా పరిస్థితులు మారుతున్నాయని అంచనా. ఇలా భూకంపాల స్వరూపాలు తారుమారవు తున్న ప్రాంతాల్లో విజయవాడ-గుంటూరు రాజధాని ప్రాంతం కూడా ఉందని భోగట్టా!
 
 ‘వాతావరణం, పర్యావరణాలలో శరవేగంగా వస్తున్న మార్పులు నేడు మానవాళి ఉనికికే ప్రమాదకరంగా ఉన్నాయి. ఇతర జీవరాశులకూ ఉపద్రవం తెస్తున్నాయి. ముంచుకొస్తున్న ఈ విలయాన్ని అన్ని దేశాలు గుర్తించాలి.’
 
 అలన్ రస్‌బ్రిడ్జర్ (‘ది గార్డియన్’ ఎడిటర్-ఇన్-చీఫ్ ఇంటర్వ్యూ నుంచి)
 ప్రకృతిలో ఇటీవల కాలంలో గతంలో కంటే చాలా ఎక్కువగా, తర చుగా దుర్ఘటనలు సంభవిస్తున్నాయి. అవే కొన్నిచోట్ల సునామీలుగా మారుతున్నాయి. మరికొన్నిచోట్ల భూకంపాలుగా, పెనుభూకంపాల రూపంలో కల్లోల పరుస్తున్నాయి. ఈ ఉత్పాతాలు పలు దేశాలను ముప్పెరగొంటున్నాయి. నేపాల్‌ను అతలాకుతలం చేసిన తాజా ఉప ద్రవం వంటి వాటికి ప్రధాన కారణాలలో ఒకటిగా భూమిని కుళ్ల బొడవ డాన్ని అలన్ పేర్కొన్నారు. భూ ఉపరితలాన్నే కాకుండా, భూమి పైపొర లను చీల్చుకువెళ్లి కుళ్లపొడుస్తూ వనరుల కోసం మానవావసరాల పేరిట, స్వలాభాపేక్షాపరుల స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొట్టడం గురించే ఆయన ప్రస్తావించారు.
 
 భూకంపం ఒక శాశ్వత హెచ్చరిక
 
 మన ఇరుగుపొరుగు హిమాలయ దేశం నేపాల్‌లో నిన్న మొన్న ప్రజల ప్రాణాలకూ, ఆస్తులకూ, చారిత్రక కట్టడాలకూ అపార నష్టం కలిగిస్తూ సంభవించిన భూకంపం (రిక్టర్ స్కేలు మీద 7.6గా నమోదైంది) ఒక గొప్ప అవసరాన్ని గుర్తు చేసింది. ప్రపంచ మానవాళి, శాస్త్ర సాంకేతిక నిపుణులు ఇకనైనా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కాకుండా, సమష్టిగా సమన్వయంతో మున్ముందు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అది మరీ మరీ హెచ్చరిస్తున్నది. చరిత్రలో అగ్నినీ, చక్రాన్నీ, చక్రగతినీ కనుగొన్నది లగాయితూ మానవ జాతి నిరంతర తపనతో సాగిస్తున్న ప్రగతిపథం ఉద్దేశం ఏది? సహ మానవుల జీవితాలను సుఖమయం చేయడానికి ఎప్పటికప్పుడు వినూత్న ఆవిష్కరణలతో అభ్యుదయాన్ని సాధించడం కోసమే. మనిషి దానినే సాధిస్తున్నాడు. ఇంటర్నెట్ (అంతర్జాలం) నుంచి, నానో టెక్నాలజీ (సూక్ష్మ సాంకేతిక పరిజ్ఞానం) నుంచి నానా రకాల పరిజ్ఞానాల దాకా మనిషి ఎగబాకాడు. ఇందుకు ఆనందించని వారంటూ ఎవరూ ఉండరు. కాకపోతే ఈ ఉపరితల సౌభాగ్యాన్ని చూసుకునే మురిసిపోకూడదు. భూగర్భంలో మనకు తెలియకుండా సాగుతున్న కదలికలను, దాని ఫలితాలను, పరిణామాలను చెప్పే పరిజ్ఞానం మనకు ఎంతో అవసరం. అలాగే, అగ్నిపర్వతాలు బద్దలు కావడంతో వెలువడుతున్న తాపశక్తి గురించి, విషవాయువుల గురించి కూడా మనం తెలుసుకుని అందుకు తగ్గట్టు మెలగవలసిన అవసరం ఉంది.
 
 మనిషిని పులకరింతలు జలదరింప చేయడం తెలుసు. అలాగే భూమికీ పులకరింతలు ఉన్నాయి. భూ ఉపరితల చెక్క (బిరుసైన భాగం) కింద ఖండాల పర్యంతం పరుచుకుని ఉండే శిలాఫలకాలకూ పులకరింత ఉంటుంది. అలాంటి పలకలు చిట్లి, విడిపోతున్న సమయంలో ఆ ఒత్తిడికి లోపలి పొరలలో ఖాళీలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ పలకలు (ప్లేట్స్) పరస్పరం ఢీకొన్నప్పుడు - చిన్నవైతే స్వల్పభూకంపాలూ, పెద్దగా ఢీకొంటే పెద్ద భూకంపాలూ సంభవిస్తాయి. పెద్ద భూకంపాల సంగతి వేరే చెప్పనక్కరలేదు. ఆస్తినష్టం, ప్రాణనష్టం భారీగా ఉంటుంది. అదొక పెను విషాదం. ఈ నష్టాల తీవ్రతను తెలియచేసే, పలకల కదలికలను వివరించే అధ్యయనాన్ని ‘ప్లేట్ టెక్టానిక్స్’ అంటారు.  భూఖం డాల మధ్య అంతర్లీనంగా సాగుతున్న ఈ మాలోకాన్ని గమనించిన భూగర్భశాస్త్ర, సాంకేతిక ప్రవీణులు దేశాలలో, ఆయా ప్రాంతాలలో, స్థాయి, తీవ్రత లను బట్టి భూకంపం సంభవించగల విభాగాలను గుర్తించారు. వాటిని మండలాలుగా పిలుస్తూ, స్థాయిని బట్టి విభజించారు.
 
 ఇప్పటికీ అంతుచిక్కని భూరహస్యం
 
 అయితే ఒకటి. ఎంతటి మనో విజ్ఞానశాస్త్రవేత్త అయినా మనిషి లేదా మాన సిక రోగి మనసులోని మర్మాన్నీ మాయనూ ఎలా సంపూర్ణంగా గ్రహించ లేడో, ప్లేట్ టెక్టానిక్స్ నిపుణులు కూడా భూగర్భంలో పలకలలో వచ్చే పరిణామాలను పూర్తిగా గ్రహించలేరు. అయితే ఏ రెండు ప్రాంతాల మధ్య తన వికృత చేష్టలను ప్రదర్శించవచ్చునో భూకంప క్రమానికి తెలుసునని అనిపిస్తూ ఉంటుంది. దీనికి తగ్గట్టే, ప్రతి 44 సంవత్సరాలకు ఒకసారి హిమా లయ ప్రాంతం భూకంపాలకు కేంద్రం అవుతోందని వీటి చరిత్రను బట్టి కనుగొన్నారు. అలాగే ఆ ప్రాంతం ఆ వికారపు చైతన్యానికి లోనుకాని సమయంలోనే, దక్షిణ భారత ప్రాంతాలు అదే వికారపు చైతన్యానికి లోనవుతూ ఉండడమూ చరిత్రే. 1800 సంవత్సరం నుంచి సంభవించిన భూకంపాలను అధ్యయనం చేసిన శాస్త్ర, సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. నిజానికి మనకు తెలిసిన పురా చరిత్రలో, ప్రపంచంలో సంభవించిన అత్యంత ఘోరమైన ఉపద్రవాలు 20వ శతాబ్దంలోనే పెల్లుబికినట్టు దాఖ లాలున్నాయి! మాంట్ పీలీ అగ్నిపర్వతం (వర్జిన్ ఐలెండ్స్) బద్దలైనది మొదలు ఉత్తరకాశీ, లాతూర్, జబల్పూర్, చామోలీ, భుజ్, సమత్రా, ముజఫరాబాద్ (1991-2005) వరకూ దాదాపు 300 పెను భూకంపాలు సంభవించినట్టు రికార్డులు తెలుపుతున్నాయి.
 
 విజయవాడ ప్రాంతానికి పెరిగిన ముప్పు
 
 మన దక్షిణ భారతంలో, ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో రాజధాని ప్రాంతంగా పేర్కొన్న విజయవాడ-గుంటూరు బెల్ట్ అంతా ప్రకృతి వైపరీత్యాలకూ, భూకంపాలకూ కేంద్రం కాగల ప్రమాదం ఉందని జాతీయ స్థాయి నివేదికలు, ఐక్యరాజ్య సమితి స్థానిక సంస్థలతో జరిపిన సర్వేలు కొన్ని వెల్లడించాయి. భూకంపాలు (చిన్నదీ, పెద్దదీ) సంభవించగల ప్రాంతాలలో ఇంతకు ముందు పేర్కొన్న అయిదు జోన్లలో కూడా తాజాగా పరిస్థితులు మారుతున్నాయని అంచనా. అంచనాలు తారుమారవుతున్న ప్రాంతాల్లో విజయవాడ-గుంటూరు రాజధాని ప్రాంతం కూడా ఉందని అంచనా. మన కోస్తా ప్రాంతం ‘మూడవ జోన్’లో ఉంది. ఈ ‘జోన్’ను మధ్యస్థ తీవ్ర భూకంపనలకు గురవుతున్న ప్రాంతంగా నిపుణులు నిర్ధారించారు. పెద్ద భూకంపాలకు కేంద్రంగా నాల్గవ జోన్‌ను, భీకర భూకంపాల ప్రాంతాన్ని ఐదో జోన్‌గానూ పేర్కొన్నారు. ఈ అంచనాల దృష్ట్యానే, విజయవాడ- గుంటూరు ప్రాంతాన్ని, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ‘త్రిపుల్ ఐటీ’ పరిశోధనా సంస్థ జరిపిన సర్వే ప్రకారం ఈ ప్రాంత (తక్కువ అడుగుల్లోనే నీరు పడుతుంది కాబట్టి) భూమి పొరల్లోనే భూకంపాలకు అనువైన 26 రకాల దోషాలు బయటపడ్డాయని తేలింది. ‘‘పెను ఉపద్రవానికి గురయ్యే దాకా పైకి సుఖంగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణ భుజ్, జబల్పూరులే. 2001లో పెను భూకంపం చుట్టబెట్టే దాకా భుజ్ సురక్షితమనే భావించాం. అలాగే సురక్షిత ప్రాతంగా భావించిన జబల్పూరును 1997లో భూకంపం కుదిపేసిందని మరవరాదు’’ అని ‘త్రిపుల్ ఐటీ’ సంస్థ సర్వే నిపుణులు స్పష్టం చేశారు!
 
 అందుకే, ప్రజాధనంతో డ్యాములు కట్టుకున్నాం, వ్యవసాయ భూము లకు నీళ్లందించేందుకు ఇరిగేషన్ కాల్వలు తవ్వుకున్నాం, కాని ఆహార పంటలు, పండ్లు, కూరగాయలందించే అలాంటి వ్యవసాయ భూముల్ని ‘కాంక్రీట్ అడవులు’గా మార్చేసే పక్షంలో డ్యాములు, కాల్వలు నిర్మించుకున్న ప్రయోజనం కాస్తా బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆ సంస్థ పరిశోధనా బృందం హెచ్చరించింది. విజయవాడకు 300 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న ప్రాంతాల పరిస్థితి ప్రస్తుత రాజధాని నిర్మాణ పద్ధతి వల్ల అధ్వానమవుతుం దని నిపుణుల భావన. అలాగే ఒకనాడు భూకంపాలకు దూరంగా ఉందను కున్న భారత భూఖండం ఇటీవల అనేక భూకంపాలకు గురవుతోంది. కనుకనే, లోగడ తక్కువ తీవ్రతతో భూకంపాలకు గురిచేసే ‘రెండవ జోన్’లో ఉన్న విజయవాడ ప్రాంతాలని ఇప్పుడు ఎక్కువ తీవ్రత కల భూకంపాలకు గురి కాగల అవకాశాలు ఉన్నదిగా నిర్ణయించి మూడవ జోన్‌లో చేర్చవలసి వచ్చిందని గమనించాలి. కాబట్టే ప్రపంచంలో ఎక్కడా ముందుగానే భూకంపాలను కచ్చితంగా ఊహించే శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం ఇంకా దృఢంగా కాళ్లూనుకోలేదని శాస్త్రవేత్తల అభిప్రాయం. అందుకే సుప్రసిద్ధ చిలీ కవి పాబ్లో నెరుడా కూడా ‘భూమి సూక్తం’ ఒకటి వినిపించి పోయాడు:
 
 ‘‘బహుశః ఈ భూమే మనకు బోధించగలదు అంతా నశించిందను కున్నప్పుడు కూడా నేను సజీవంగానే ఉన్నానని భూమి రుజువు చేస్తుంది’’ సుమా! అందుకే జీవితోత్సవ ఊరేగింపు కొనసాగుతూనే ఉండాలంటారు కాబోలు!
 (వ్యాసకర్త మొబైల్: 9848318414)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement