హస్తిన చిచ్చు దృష్టి మరల్చే ఉచ్చు | bjp diverts JNU incident | Sakshi
Sakshi News home page

హస్తిన చిచ్చు దృష్టి మరల్చే ఉచ్చు

Published Thu, Feb 18 2016 12:48 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

హస్తిన చిచ్చు దృష్టి మరల్చే ఉచ్చు - Sakshi

హస్తిన చిచ్చు దృష్టి మరల్చే ఉచ్చు

‘‘జిల్లా కలెక్టర్లను విమర్శిస్తే కూడా దానిని రాజద్రోహంగా పరిగణించాలనే స్థాయికి ఇండియన్ పీనల్ కోడ్ 124-ఏ అమలు దిగజారడం నాకు గుర్తున్నది. కానీ ఈ రోజు ప్రజల భావాలు మారిపోయాయి. మనం ప్రజాస్వామ్య ప్రభుత్వాల పాలనలోకి అడుగుపెడుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వాలపై విమర్శను, ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసే దేశ భద్రత సమస్యలను విడివిడిగా చూడాలి. అందువల్ల‘‘రాజద్రోహం’’ అనే పదాన్ని తొలగించాల్సిందిగా నేను కోరుతున్నాను. నిజానికి ప్రభుత్వం పట్ల విమర్శనాత్మకంగా ఉండడమే ప్రజాస్వామ్యం.’’
 

 భారత రాజ్యాంగ రచనా సంఘం సభ్యులు కేఎం మున్షీ 1947లో వెలి బుచ్చిన అభిప్రాయాలు ఇవి. ఆయన సోషలిస్టు కాదు, కమ్యూనిస్టు అంత కన్నా కాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి స్వతంత్ర పార్టీకి, ఆ తర్వాత జనసంఘ్‌కు మారినవారు. ఆ జనసంఘ్ పునాదుల మీదనే భారతీయ జనతాపార్టీ ఆవిర్భవించిందని తెలిసిందే. ఆయన రాజకీయాలేవైనా, ఆయన మాటలు అంతా ఆలోచించాల్సినవి. రాజ్యాంగ సభలోప్రాథమిక హక్కులపై సుదీర్ఘ చర్చ జరిగిన తదుపరి రాజ్యాంగంలోని ఆర్టికల్-19 ప్రకారం భావప్రకటన స్వేచ్ఛను నిర్ధారించారు. ఈ సందర్భంగానే ఐపీసీ 124-ఏ సెక్షన్(రాజద్రోహం)పై కూడా చర్చ జరిగింది. ఈ సెక్షన్ కింద మొదట బ్రిటన్ రాణిని విమర్శిస్తే రాజద్రోహంగా పరిగణించేవారు. తదుపరి రాణి ప్రతినిధులపై విమర్శలకు కూడా ఈ చట్టాన్ని విస్తరింపజేశారు. ఆ తర్వాత దేశాన్ని విమర్శిస్తే కూడా రాజద్రోహమనే వరకు వెళ్లారు. గతంలో ఈ సెక్షన్ చాలా సార్లు దుర్వినియోగమైంది. ఇటీవల కూడా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే రాజద్రోహ నేరాన్ని విచ్చలవిడిగా ప్రయోగించారు. ఈ పరిణామాలను ఊహించే మున్షీ తదితరులు ఈ రాజద్రోహం అనే పదాన్ని తొలగించాలని కోరారు. కానీ అందుకు ఆమోదం లభించలేదు. దాని ఫలితా న్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. దానికి  సాక్ష్యం జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షులు కన్హయ్య కుమార్ అరెస్ట్.
 

 కన్హయ్య దేశద్రోహి అయితే బీజేపీనో?
 

 నిజానికి ఆర్టికల్-19లో పేర్కొన్న విధంగానే ‘‘భావప్రకటన, వాక్ స్వాతంత్య్రం, ఆయుధాల్లేని శాంతియుత సమావేశం’’ జేఎన్‌యూలో జరిగాయి. దానిని ధ్రువీకరిస్తూ హర్షిత్ అగర్వాల్ అనే జేఎన్‌యూ విద్యార్థి ఆ సంఘటన పూర్వాపరాలను తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఆయన కశ్మీర్ వేర్పాటువాదాన్ని సమర్థించడంలేదని, కానీ అటువంటి అభిప్రాయాలను విని, వాటిపై తన అభిప్రాయాన్ని ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఆయన కథనం ప్రకారం... భారత పార్లమెంటుపై దాడికి కుట్రపన్నిన అభియోగానికి ఉరిశిక్షకు గురైన అఫ్జల్ గురు స్మారక సమావేశాన్ని ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఏర్పాటు చేసింది. విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షులు కన్హయ్యకుమార్‌తోపాటు ఎస్‌ఎఫ్‌ఐ, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసి యేషన్ల మద్దతును కోరగా వారు అంగీకరించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) దీనిని వ్యతిరేకించి, సభకు అనుమతి ఇవ్వకూడదని యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చింది. అందువల్ల మైక్‌లు వినియోగించ రాదని విధించిన షరతుకు లోబడే సభను నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కశ్మీరీ విద్యార్థులంతా బయటి నుంచి వచ్చినవారే. కశ్మీరీ ఆజాదీ నినాదాలు చేసింది వారే తప్ప మిగతా విద్యార్థులెవ్వరూ కారు. హర్షిత్ ప్రత్యక్ష సాక్షిగా చెప్పిన విషయాలనే భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ధ్రువీకరిం చాయి. కన్హయ్య కుమార్‌కు, దేశ వ్యతిరేక నినాదాలకు ఏ సంబంధమూ లేదని వాళ్లు తేల్చి చెప్పారు. ఈ విషయాలు పత్రికల్లోనూ వచ్చాయి.
 

 కశ్మీర్ సమస్యపై భారత ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపైన అక్కడి యువకుల్లో తీవ్ర నిరసన ఉన్నది. వారిని సమర్థిస్తున్న మేధావులు, జర్నలిస్టులు, రచయితలు దేశవ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. వాళ్ళు ఎన్నో సార్లు తమ అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించారు. మరి కశ్మీరీ ఆజాదీ  జేఎన్‌యూలో మాత్రమే రాజద్రోహం ఎట్లా అయ్యిందో నేరం మోపిన వారే చెప్పాలి. అమెరికా సాగించిన వియత్నాం, ఇరాక్ యుద్ధాలకు వ్యతిరేకంగా వేలాది మంది అమెరికన్లు వీధుల్లో ప్రదర్శనలు చేశారు. పత్రికలు పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు వెలువరించాయి. అమెరికా ప్రభుత్వం వారిపై దేశద్రోహం కేసులు పెట్టలేదు. కానీ అఫ్జల్ గురు ఉరిశిక్షను వ్యతిరేకిస్తున్న వాళ్లంతా దేశ ద్రోహులే అన్నట్టు కేంద్ర మంత్రులంతా మాట్లాడుతున్నారు. కానీ అఫ్జల్ గురు ఉరిశిక్షను వ్యతిరేకించిన వారిలో న్యాయకోవిదులు, న్యాయమూర్తులు, రచయితలు ఉన్నారు.‘‘సుప్రీంకోర్టు తీర్పు అంతిమం కారాదు, కాకూడదు. మరణశిక్షపై పునరాలోచించడానికి కావాల్సిన ఆధారాలున్నాయి’’ అని అఫ్జల్ గురు ఉరి సందర్భంగా బహిరంగంగా ప్రకటించిన ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షాను కూడా దేశద్రోహిగా పరిగణిస్తారా? అఫ్జల్‌గురు మరణశిక్షను కశ్మీర్‌లోని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ ‘‘న్యాయాన్ని అపహాస్యం చేయడం’’గా అభివర్ణించింది. ఆ పార్టీతో కలసి ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేశారో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే చెప్పాలి.
 

 జేఎన్‌యూ ఘటనను చాకచక్యంగా వాడుకుంటున్నారు
 

 దేశ వ్యతిరేక నినాదాలను చేసిన వారిపై చర్య తీసుకోవాలని నిజంగానే భావిస్తే ఆ సభ వీడియో ద్వారా వారిని గుర్తించాల్సింది. కానీ ఆ పని చేయ లేదు. విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను అరెస్టు చేయడం వల్ల జేఎన్‌యూలో అశాంతి కలుగుతుందని, విద్యాలయం అట్టుడికి పోతుందని కేంద్రానికి తెలుసు. అయినా ఆ పనే చేసిందంటే ఒక విషయం స్పష్ట మౌతోంది. జేఎన్‌యూ ఘటనను బీజేపీ ప్రభుత్వం స్వీయ ప్రయోజనాల కోసం   వాడుకోవాలని చూసినట్టు అర్థమవుతోంది. అంతేకాదు ఆ ఘటనను హింసాపూరితంగా చేయాలని, తమ పార్టీ ఎమ్మెల్యే ఓపీశర్మ నాయకత్వంలో విద్యార్థులపై, జర్నలిస్టులపై దాడి చేయించింది. ఆ విధంగా జేఎన్‌యూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ చర్చనీయాంశం అయ్యింది. ఈ ‘దేశద్రోహం’ చర్చ, ఉద్వేగాలు ఇంకా రేగాలనే తిరిగి మళ్లీ దాడి చేయించింది. మొత్తంగా ఈ ఉదంతంపై కేంద్ర వైఖరి రెండు ప్రయోజనాలను ఆశించింది. ఒకటి, జేఎన్‌యూలోని వామపక్ష, ప్రజాస్వామ్య విద్యార్థి శక్తులకు దేశద్రోహ ముద్రవేయడం, రెండవది, హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యతో ఊపందుకున్న కుల వ్యతిరేక ఉద్యమాన్ని దెబ్బకొట్టడం. తద్వారా విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న కులాధిపత్యాన్ని, కుల వివక్షను, కుల అణచివేతను మరుగునపడేసి, చర్చను పక్కదోవ పట్టించడం. అదేవిధంగా ప్రతిపక్షాలను ఇందులోకి లాగి దేశద్రోహం, దేశభక్తి మీద పార్లమెంటులో విభజన తీసుకొచ్చి పైచేయి సాధించాలన్నది ప్రభుత్వం ఆలోచన. మంగళవారం ప్రతిపక్షాలతో ప్రభుత్వం జరిపిన భేటీలో రోహిత్ మరణం చర్చకైనా రాకపోవడాన్ని బట్టి ఈ ఎత్తుగడ ఎంత పకడ్బందీగా, చాకచక్యంగా అమలైందో అర్థం అవుతుంది. అంతేకాదు పార్లమెంటులో ఈ అంశంపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం  ప్రకటించించగలిగింది. మరి రోహిత్ వేముల మరణంపై దేశవ్యాప్తంగా ఉద్యమం వెల్లువెత్తినా దానిపై చర్చకు అది ఎందుకు సిద్ధం కాలేదు? హెచ్‌సీయూలో తమ రాజకీయ జోక్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, తమ మంత్రులను కాపాడుకునేందుకే అనేది స్పష్టం.
 

 కేంద్రం ఉచ్చులో పడతారా?
 

 హెచ్‌సీయూ పరిశోధక విద్యార్థి రోహిత్ బలిదానంతో వెల్లువెత్తిన విద్యార్థి ఉద్యమం, జేఎన్‌యూ విద్యార్థి కన్హయ్యపై రాజద్రోహం నేరం మోపిన కారణంగా రాజుకున్న విద్యార్థి ఉద్యమం రెండూ  నిజానికి ఒకదానికొకటి స్ఫూర్తినందించాయి. కానీ జాతీయత, దేశద్రోహం అనే పదాల మాటున రోహిత్ ఉద్యమాన్ని మరుగుపర్చే కుట్ర కూడా జరిగింది. ఈ రెండు పదాల మాటున ఉన్న వెన్నుపోటు ఎత్తుగడను అర్థం చేసుకోకపోతే పాలకుల కుట్రలో ప్రతిపక్షాలూ పావులు కాకతప్పదు. అంటే పద్ధతి ప్రకారం, జేఎన్‌యూలో జరిగిన సమావేశాన్ని చాలా చాకచక్యంగా కేంద్ర ప్రభుత్వం వాడుకోవాలని చూస్తున్నది. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో రోహిత్ మరణంపై కేంద్రాన్ని నిలదీసి, రోహిత్ చట్టం కోసం పట్టుబడతామని హామీలిచ్చిన పార్టీలన్నీ అప్రమత్తతతో ఉండటం అవసరం. లేనట్టయితే బీజేపీ పన్నిన రాజకీయ ఉచ్చులో ప్రతిపక్షాలు పావులయ్యే ప్రమాదం ఉన్నది. అంత మాత్రాన జేఎన్‌యూ ఘటనను వదిలిపెట్టాలని కాదు. కోర్టుల సాక్షిగా ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి   తోడ్పడుతున్న  మీడియాపై సైతం దాడులకు దిగిన ఫాసిస్టు రాజకీయాల నగ్నత్వాన్ని బట్టబయలు చేయడం కూడా తక్షణావసరమే.
 

 ‘‘విశ్వవిద్యాలయాలు కేవలం చదువుకు మాత్రమే పరిమితం కాకూ డదు. విద్యార్థులకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పాలి. విశ్వవిద్యాలయాలలో భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాథమికమైన అంశంగా ఉండాలి’’ అంటూ  2014 జూలైలో చికాగో విశ్వవిద్యాలయం ‘భావప్రకటనా స్వేచ్ఛ’పై ఒక డిక్లరేషన్‌ను ఆమోదించింది. దానిని అమెరికాలోని చాలా విశ్వవిద్యాలయాలు ఆమోదిం చాయి. విశ్వవిద్యాలయాల్లో విభిన్న అభిప్రాయాల మధ్య సంఘర్షణ ఉంటుం దని, దానిని అంగీకరించాలని కూడా చికాగో డిక్లరేషన్ స్పష్టం చేసింది. అదే విధంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయంగానీ, మద్రాస్ ఐఐటీ గానీ, ఢిల్లీ జేఎన్‌యూగానీ భావ సంఘర్షణలకు వేదికలుగా ఉన్నాయి. ప్రభుత్వాలు వాటిని గౌరవించాలి. అప్పుడు మాత్రమే దేశంలో నూతన ఆలోచనలకు ఒక అవకాశం ఉంటుంది. ‘‘నీవు చెప్పే దానితో నేను విభేదిస్తున్నాను. కానీ ఆ అభిప్రాయం చెప్పడానికి నీకున్న హక్కు కోసం నేను ప్రాణాలైనా ధార పోస్తాను’’ అన్న వోల్టేర్ మాటలను అర్థం చేసుకుని ఆచరించగలిగితేనే ప్రజాస్వామ్య స్ఫూర్తిని కనుమరుగు కాకుండా కాపాడుకోగలుగుతాం.
 

 మల్లెపల్లి లక్ష్మయ్య

 వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు  మొబైల్: 97055 66213

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement