మహాతంత్రం కాదు, ప్రజాతంత్రం కావాలి
కశ్మీరీ పండితులపట్ల ప్రభుత్వ నిబద్ధతను చూసి మురవడంలో తప్పు లేదు. కానీ, ఇదంతా ఒక మహాతంత్రంలో భాగమని, దానికి ప్రమాదకర కోణం ఉందని అనిపిస్తుంటే కలవరపాటు సహజం. పండితుల పునరావాసంలో కశ్మీర్ పీఠంపై కాషాయ పతాకాన్ని ఎగరేసే అవకాశాన్ని చూడటం ఆందోళనకరం.
కశ్మీరీ ముస్లింలను ప్రజాస్వామ్య ప్రక్రియలో విస్తృత భాగస్వాములను చేసే బదులు వారు ఓటింగ్‌కు దూరంగా ఉండటం నుంచి లబ్ధిని పొందాలనుకోవడం దూరదృష్టిగల ఎత్తుగడ కాదు. దీనివల్ల హిందూ-ముస్లిం విభేదాలు మరింత పెరుగుతాయి. పండితులకు భద్రత ఉండదు.
సాంఘికశాస్త్రం
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రావడంతోనే కశ్మీరీ పండితుల కోసం ఆకర్షణీయమైన పునరావాస పథకాన్ని ప్రకటించింది. ఏ మాత్రం జాగు చేయకుండా ఎన్నికల హామీని నిలబెట్టుకున్నందుకు అభినందించవలసిందే.కశ్మీర్ లోయ కనీవినీ ఎరుగని వరద ముప్పును ఎదుర్కోవలసి వచ్చింది. వందలాదిగా జన నష్టం, భారీ ఆస్తి నష్టం. జనజీవనం కకావికలమైంది. ప్రధాని ఆగ‘మేఘాల’పై అక్కడకు చేరుకున్నారు. ప్రజల కష్టాలను తిలకించారు, చలించారు. మీ కష్టం మా కష్టమేనని బాధితులను ఓదార్చారు. వెయ్యి కోట్ల రూపాయల సాయం ప్రకటించారు. మీడియా శ్లాఘించింది.
దీపావళి పండుగ రోజు, దేశమంతటా సంబరాలు. ప్రధాని గుండెల్లో మాత్రం కశ్మీర్ గూడు కట్టుకొని ఉంది. హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. శ్రీనగర్‌లో వరద బాధితులను కలిశారు, ధైర్యం చెప్పారు. ఇక అక్కడి నుంచి నేరుగా సియాచిన్ మంచు కొండలపైకి.. అక్కడ మన జవాన్లు దుర్భర వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. ప్రతిక్షణం ప్రాణాలను పణంగా పెడుతూ దేశమాత మణిమకుటం చెక్కుచెదరకుండా కాపలా కాస్తున్నారు.
ఆ వీర జవాన్లతో ప్రధాని పండుగను పంచుకున్నారు. కష్టసుఖాలను కలబోసుకున్నారు, స్ఫూర్తిని నింపారు. ఆ రేయంతా అక్కడే గడిపారు. పుడమి తల్లి పులకరించిన ఉదాత్త సన్నివేశమనీ, నింగి నుంచి దేవతలు పూల వర్షం కురిపించారనీ రాయలేదు కానీ, దాదాపు ఆ స్థాయిలోనే మీడియా ప్రశంసల వర్షాన్ని కురిపించింది.
వేర్పాటువాదం తీవ్ర రూపం దాల్చి గత పాతికేళ్లుగా సంక్షుభితమై ఉన్న రాష్ర్టం పట్ల కేంద్రం స్పందనలో తప్పు పట్టాల్సిన విషయం ఏముంటుంది? అవన్నీ యథాలాపంగా జరిగిన వేర్వేరు స్పందనలే అయితే ప్రశంసించవలసినదే. ప్రజలపట్ల, కశ్మీరీ పండితులపట్ల ప్రభుత్వ నిబద్ధతను చూసి మురిసిపోవడం తప్పేమీ కాదు. కానీ, ఇదంతా ఒక మహాతంత్రంలో భాగమని వినిపిస్తున్నప్పుడు, అందులో ప్రమాదకర కోణం కనిపిస్తున్నప్పుడు కలవరపడకుండా ఉండటం సాధ్యం కాదు. జమ్మూ-కశ్మీర్‌లో ఆరు లోక్‌సభ స్థానాలున్నాయి. కశ్మీర్ లోయలో మూడు, జమ్మూలో రెండు, లద్ధాఖ్‌లో ఒకటి.
మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వీటిలో మూడు సీట్లను (జమ్మూ-2, లద్ధాఖ్-1) బీజేపీ గెలుచుకుంది. లోయలోని మూడు సీట్లలో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ గెలిచింది. ఈ ఫలితాలను బీజేపీ వ్యూహకర్తలు అసెంబ్లీ సీట్లలోకి తర్జుమాచేసి పరిశీలించారు. 34 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యత కనిపించింది. రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల సంఖ్య 87. కశ్మీర్ లోయలో 46, జమ్మూలో 37, లద్ధ్దాఖ్‌లో 4. బీజేపీకి జమ్మూలో 31 అసెంబ్లీ సెగ్మెంట్లలో, లద్ధాఖ్‌లో 3 సెగ్మెంట్లలో మెజారిటీ వచ్చింది. బీజేపీ వ్యూహకర్తల కళ్లు మిరుమిట్లు గొలిపిన అంకెలివి. 44 సీట్లు గెలిస్తే... కలనైనా ఊహించని కశ్మీర్ పీఠంపై కాషాయ పతాకాన్ని ఎగరేయవచ్చు.
అమిత్‌షా బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన వెంటనే ‘కశ్మీర్ మిషన్ 44 ప్లస్’ రూపుదిద్దుకొంది. జమ్మూ, లద్ధాఖ్‌లలోని సానుకూల వెల్లువను పటిష్టం చేసుకోవడం, కశ్మీర్ లోయలో నాలుగైదు సీట్లు సంపాదించడం, మరో నాలుగైదు సీట్లలో గెలవగల మిత్రపక్షాలు, ఇండిపెండెంట్లను సమకూర్చుకోవడం ఈ పథకం లక్ష్యం. అందులో భాగంగానే కశ్మీర్‌పై కేంద్రం శ్రద్ధాసక్తులు అపారంగా పెరిగాయి. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని కోరే సంస్థలన్నీ ఎన్నికల బహిష్కరణకు పిలుపును ఇస్తున్నాయి. అందువల్ల లోయలో అతి తక్కువ మంది మాత్రమే పోలింగ్‌లో పాల్గొంటారు. పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్‌లు ఆ ఓట్లనే పంచుకోవాలి.
దీన్ని నిశితంగా పరిశీలించిన బీజేపీ వరుస ఎన్నికల్లో అతి తక్కువ పోలింగ్ నమోదవుతున్న ఎనిమిది స్థానాలను ఎంపిక చేసింది. దాదాపుగా ఈ ప్రాంతాల నుంచే నాలుగు లక్షలమంది కశ్మీరీ పండితులు తీవ్రవాద దాడులకు భయపడి ఇళ్లూ, వాకిళ్లు వదిలి శరణార్థులుగా వెళ్లిపోయారు. వీరిలో చాలా మంది జమ్మూ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ పండితుల పునరావాస పథకాన్ని బీజేపీ చాకచక్యంగా వాడుకుంటోంది. ఈ పథకం కింద తిరిగి కశ్మీర్‌కు వెళ్లే ఒక్కో కుటుంబానికి ఇల్లు కట్టుకునేందుకు ఇరవై లక్షల రూపాయలిస్తారు. స్థిరపడేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సహకరిస్తాయి.
ఆ ఎనిమిది నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో శరణార్థి పండితులను ఓటర్లుగా నమోదు చేయించడం మూడు మాసాల కిందటే ప్రారంభమైంది. ఇదంతా ఎన్నికల ఎత్తుగడగానే కనిపించవచ్చు. ఇందులో తప్పేముంది అనిపించవచ్చు. కానీ, కశ్మీర్ సమస్యను శాశ్వతంగా హిందూ-ముస్లిం సమస్యగా మార్చే ఎజెండా దీంట్లో అంతర్లీనంగా ఉంది. దశాబ్దాలుగా పలు కష్టనష్టాలను అనుభవిస్తున్న పండితులను పావులను చేసి, వారిని మరింత ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టే విపరిణామం కనబడుతోంది. ‘రాజతరంగిణి’ పేరుతో కశ్మీర్ రాజుల చరిత్రను గ్రంథస్తం చేసిన కల్హణుడు ‘మూడు లోకాల్లోనూ అత్యుత్తమ ప్రదేశం కశ్మీరే’అంటాడు. ‘భూలోక స్వర్గమంటే ఎక్కడో లేదు. అది కశ్మీరే’నని అక్బర్ చక్రవర్తి కీర్తించినట్టు చెబుతారు. అటువంటి సుందరసీమలో వందల ఏళ్లుగా వైభవోజ్వల జీవితం గడిపిన మహా పండితులు కశ్మీర్ బ్రాహ్మణులు.
కశ్మీర్ పండితులుగా వారిని పిలవడం మొఘలాయిల కాలం నుంచి ఆరంభమైంది. 14వ శతాబ్దిలో ఆ ప్రాంతం అఫ్ఘాన్‌ల ఏలుబడిలోకి వచ్చింది. ఆ సమయంలోనే ఇస్లాం అక్కడకు ప్రవేశించింది. పలు హిందూ కులాలతోపాటు కశ్మీర్ బ్రాహ్మణులు కూడా పెద్ద సంఖ్యలో ఇస్లాం స్వీకరించారు. మతం మారినా వీరి ఇంటి పేర్లయిన భట్, కౌల్, సప్రూ, ధర్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కశ్మీర్ వేర్పాటువాద నాయకుల పేర్లలో కూడా ఈ ఇంటి పేర్లను చూస్తూనే ఉన్నాం. ప్రసిద్ధ ఉర్దూ కవి మహ్మద్ ఇక్బాల్ తాత పేరు కన్హయ్యాలాల్ సఫ్రూ. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పూర్వీకులూ కశ్మీరీ పండితులే. మహారాజా రంజిత్‌సింగ్ హయాంలో కశ్మీర్ సిక్కు సామ్రాజ్యంలో భాగం. ఆయన హయాం వరకు పండితుల వైభవం కొనసాగింది. తర్వాతి కాలంలో రాజాస్థాన నిరాదరణకు గురై, అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ తదితర ప్రాంతాలకు వలస వెళ్ళారు.
అలా వలస వెళ్లిన పండితుల వారసులే తొలి భారత ప్రధాని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ. అలాగే బీకే నెహ్రూ, పీఎన్ హక్సర్, డీపీ థర్, టీఎన్ కౌల్ వంటి సివిల్ సర్వీసు అధికారులు, రాజ్‌కుమార్, ఏకే హంగల్, అనుపమ్ ఖేర్ వంటి కళాకారులు కూడా వలస పండిట్ల వారసులే. కశ్మీర్ నుండి వారి వలసలు దఫదఫాలుగా సాగాయి. వీటిలోకెల్లా విషాదకరమైనది 1990వ దశకంలో జరిగిన భారీ వలస. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పెచ్చరిల్లి హిందువులపై దాడులు, హత్యలు, గృహదహనాలు పెచ్చరిల్లడంతో దాదాపు నాలుగు లక్షలమంది పండితులు లోయ నుంచి వె ళ్లిపోయారని అంచనా. వారిలో అత్యధికులు ఇంకా శరణార్థి శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు. ఈ శరణార్థులనే బీజేపీ ఇప్పుడు రాజకీయాస్త్రంగా మలచబోతోందని విమర్శలు వస్తున్నాయి.
పండితులకు కశ్మీర్‌లో పునరావాసం కల్పించడం పట్ల ఉగ్రవాద మతశక్తులకు తప్ప వేరెవరికీ పెద్ద వ్యతిరేకత లేదు. జిలానీ లాంటి హుర్రియత్ నేతలు కూడా ‘పండితులు కశ్మీర్ సంస్కృతిలో అంతర్భాగమని’ గతంలో బహిరంగంగానే ప్రకటించారు. ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల్లో కశ్మీర్ పండితులకు కశ్మీర్ ముస్లింలతోనే సారూప్యత ఎక్కువ. వారి అలవాట్లు దేశంలోని మిగతా బ్రాహ్మణులకు బిన్నమైనవిగానే ఉంటాయి. కశ్మీర్ ప్రజల స్వాతంత్య్రేచ్ఛ ఈ నాటిది కాదు. స్వతంత్ర ప్రతిపత్తి హామీతోనే కశ్మీర్ భారత యూనియన్‌లో భాగమైందని మరవకూడదు.
కశ్మీరీ యువతలోని అసంతృప్తిని ఆసరాగా చేసుకొని పాకిస్థాన్ ఉగ్రవాద శక్తులను పెంచి పోషిస్తున్న ఈ సమయంలో తాత్కాలిక, సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వటం వాంఛనీయం కాదు. ముస్లిం ప్రజలను మన ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎంత విస్తృతంగా భాగస్వాములను చేస్తే అంత మంచిది. అందుకు భిన్నంగా వారు ఓటింగ్‌కు దూరంగా ఉండటాన్ని రాజకీయ ప్రయోజనంగా మలచుకోవాలని చూడటం దూరదృష్టితో కూడిన ఎత్తుగడ కాదు.
దీనివల్ల హిందూ-ముస్లిం విభేదాలు మరింత పెరుగుతాయి. ఉగ్రవాద శక్తులు బలపడతాయి. పునరావాసం పొందే పండితులకు భద్రతా ఉండదు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో అనుసరించిన సోషల్ ఇంజనీరింగ్ కశ్మీర్‌కు వర్తించేది కాదు. ఉత్తరప్రదేశ్, కశ్మీర్ ఒకటి కావు. పెళ్లికి, చావుకీ ఒకే మంత్రం పనికిరాదు. రంగస్థలం మీద నటుడు బాగా నటిస్తే ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. చప్పట్లకు రెచ్చిపోయి, శ్రుతి మించి నటిస్తే రాళ్లేస్తారు.