సంపాదకీయం: పుస్తకాలు ఇప్పుడు కాంగ్రెస్‌ను తెగ భయపెడుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు రాసి వెలువరిస్తున్న పుస్తకాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఆమధ్య సంజయ బారు, అటు తర్వాత నట్వర్‌సింగ్ గ్రం థాలు వెలువరిస్తే ఇప్పుడు మాజీ కాగ్ వినోద్ రాయ్ వంతు వచ్చింది. అతి త్వరలోనే తన అనుభవాలతో ‘నాట్ జస్ట్ యాన్ అకౌంటెంట్’ శీర్షికతో ఒక గ్రంథాన్ని తీసుకురాబోతున్నానని ఆయన ప్రకటించారు. అంతేకాదు... ఆ సందర్భంగా పెను దుమారం కలిగించే వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ వ్యాఖ్యలు వింటేనే ఆయన తెస్తున్న పుస్తకం మరెంత అలజడి రేకెత్తించగలదో అర్ధమవుతుంది.
నట్వర్‌సింగ్ ప్రధానంగా చెరిగి పారేసింది సోనియాగాంధీనైతే సంజయ బారు గ్రంథంలో ప్రధాన పాత్ర మన్మోహన్‌సింగ్‌ది. అందులో సోనియాగాంధీకి సంబం ధించిన ప్రస్తావనలూ దండిగానే ఉన్నాయి. వినోద్ రాయ్ మౌలికంగా బ్యూరోక్రాట్ కనుక ఆయన ప్రధానంగా ప్రభుత్వంలోని పెద్దల గురించి... మరీ ముఖ్యంగా మన్మోహన్‌సింగ్ గురించి చెప్పవచ్చునని అంటున్నారు. అయితే, సోనియాగాంధీ ఈ పుస్తకాల దాడికి ప్రతి వ్యూహం రచించకపోలేదు. తాను దెబ్బలు కాచుకొనడంతో ఊరుకోక ఎదురుదాడికి ప్రయత్నించాలని ఆమె ఈసరికే నిర్ణయించుకున్నా అదంత సులభంగా అయ్యేది కాదు. పుస్తకం రాయడానికి ఓ ప్రణాళిక ఉండాలి. లక్ష్యం ఉండాలి. దాని గమనాగమనాలేమిటో తేల్చుకోవాలి. ఆ పుస్తకంలోని అంశాలు లీక్ చేయడానికైనా, పుస్తకాన్నే విడుదల చేయ డానికైనా అదునూ, పదునూ చూడాలి. ‘అనువుగాని కాలం’లో పుస్తకం రాసినా, కనీసం రాస్తున్నట్టు అవతలివారికి తెలిసినా పీకలమీదికి రావొచ్చు. పాత ఫైళ్లన్నీ బయటికొచ్చి కేసుల రూపంలో బుసలు కొట్టే ప్రమాదం ఉంటుంది.
నట్వర్‌సింగ్‌కు ఈ సంగతి తెలుసు గనుకే ఓపిగ్గా వేచిచూశారు. ఇక పుస్తకంలో చెప్పవలసినవి ఏమిటో, చెప్పకుండా వది లేయాల్సినవేమిటో... చెప్పీ చెప్పకుండా సరిపెట్టవలసినవి ఏమిటో నిర్ణయించుకోవాలి. మరొకరు సాక్ష్యం చెప్పడానికి వీల్లేని ఘటనలైతే మరీ మంచిది. అలాగైతే సొంత బాణీయే వినిపిస్తుంది తప్ప ఎవరో వచ్చి ‘అసలు జరిగింది ఇదీ...’ అంటూ ఏకరువు పెట్టే వీలుండదు. పుస్తకం రాస్తానని చెప్పేముందు సోనియాగాంధీ వీటన్ని టినీ ఆలోచించారో లేదో?! ఆమె సంగతలా ఉంచి మన్మోహన్‌సింగ్ కుమార్తె దామన్‌సింగ్ తండ్రిని సమర్ధిస్తూ, ఆయన పనితీరును కీర్తిస్తూ ఇప్పటికే ఒక పుస్తకం వెలువరించారు.
అయితే, వచ్చిన...రాబోతున్న పుస్తకాలన్నిటా పూసల్లో దారంలా ఒక విషయమైతే నిర్ధారణగా తెలుస్తుంది. ఆ పుస్తకాల్లో పేర్కొంటున్న అంశాలేవీ దేశ ప్రజానీకానికి కొత్తేమీ కాదు. అవి ఆనోటా, ఈనోటా దాదాపు అందరికీ తెలుసున్నవే. మీడియా ప్రభావం బాగా పెరిగింది గనుక కొన్ని అంశాలు ఇప్పటికే అచ్చులోకి కూడా వచ్చాయి. అయితే, అధికార పీఠానికి సమీపంగా మెలిగి, అందులో భాగస్తులైనవారు చెప్తుండటంవల్ల ఆ అంశాలకు మరింత సాధికారత వస్తున్నది. ఇదే సోనియాగాంధీకైనా, మరొకరికైనా ఇబ్బందికరమనిపిస్తున్నది.
అభ్యం తరంగా కనబడుతున్నది. మిగిలినవారి మాటెలా ఉన్నా వినోద్ రాయ్ పుస్తకం బయటపెట్టేవి చాలానే ఉంటాయి. ఆయన కాగ్ పదవిలో ఉన్న ప్పుడే ‘కేంద్ర నిఘా సంఘం(సీవీసీ), సీబీఐలు స్వతంత్ర వ్యవస్థలుగా పనిచేయడంలేదని బహిరంగంగా ప్రకటించిన వ్యక్తి. ఈ రెండింటినీ ప్రజలు కూడా ప్రభుత్వ పనిముట్లుగా, జేబు సంస్థలుగా పరిగణిస్తున్నా రని కూడా ఆయనన్నారు. ఏదో నామమాత్రం నివేదికలిచ్చి చేతులు దులుపుకొనే పాత సంప్రదాయాన్ని పాతిపెట్టి, ఆ నివేదికలను గణాం కాల కీకారణ్యంనుంచి బయటకు తీసుకొచ్చి అందరికీ తేటతెల్లమ య్యేలా విశ్లేషించి చెప్పే సంప్రదాయాన్ని వినోద్ రాయ్ ప్రారంభిం చారు. కామన్‌వెల్త్ క్రీడల కుంభకోణం మొదలుకొని లక్షా 76 వేల కోట్ల రూపాయల 2జీ స్కాం, లక్షా 86 వేల కోట్ల రూపాయల బొగ్గు స్కాంవంటివి కాగ్ వెల్లడించింది ఆయన హయాంలోనే. కాంగ్రెస్‌కు ఇదెంత ఊపిరాడనీయని స్థితి కలిగించిందంటే...కాగ్‌ను బహుళ సభ్య వ్యవస్థగా మర్చాలని ఒక దశలో యూపీఏ సర్కారు ప్రయత్నించింది.
వినోద్‌రాయ్ తాజాగా చెప్పిన అంశాలు చాలా కీలకమైనవి. కామన్‌వెల్త్, కోల్‌గేట్ కుంభకోణాల్లో నివేదికలను సిద్ధం చేస్తున్నప్పుడు వాటిలో ‘కొందరు ప్రముఖుల’ పేర్లు తొలగించాలని యూపీఏ భాగస్వామ్య పక్షాల నేతలు తనవద్దకు రాయబారాలు నడిపారని ఆయన చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మన్మోహన్‌సింగ్‌పై కూడా నిశితమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా తుది నిర్ణయం ఎప్పుడూ తనదే కావాల్సి ఉండగా ఆయన కొన్నిసార్లు ఆ పనిచేసేవారు... మరికొన్నిసార్లు పట్టనట్టు ఉండిపోయేవారని విమర్శిం చారు. అంతేకాదు... సంకీర్ణ రాజకీయాల కోసం సుపరిపాలనను పణంగా పెట్టరాదని హితవు పలికారు. తొలి దఫా మాటేమోగానీ... మలి దఫాలో యూపీఏ పాలకులు తాము ప్రభుత్వాన్ని నడుపుతున్నా మన్న స్పృహనే కోల్పోయారు.
అంతక్రితం అయిదేళ్ల పాలనలో ఏం జరిగిందో వరసబెట్టి వెల్లడవుతున్నప్పుడైనా స్వీయ ప్రక్షాళనకు సిద్ధపడలేదు. సరిగదా... మరిన్ని కుంభకోణాలు జరగడానికి వీలు కలిగించారు. సీబీఐ వంటి సంస్థలను కక్ష సాధింపు వ్యవహారాలకు వాడుకున్నంతగా ఈ కుంభకోణాల కారకులపై చర్యలకు వినియోగించ లేదు. కనుకనే ఈ స్కాంలు మరింత విస్తరించాయి. ఇదే చిట్టచివరకు కాంగ్రెస్‌ను నిలువునా ముంచింది. యూపీఏ పదేళ్ల పాలనపై నిజానికి ఎందరు ఎన్ని పుస్తకాలు రాసినా ఇంకా చెప్పవలసినవి మిగిలే ఉంటాయి. కనుక వినోద్‌రాయ్ మాత్రమే కాదు... మరింతమంది తమ కలాలకు పనిబెట్టవలసిన అవసరం ఉంది. దానివల్లనైనా భవిష్యత్తు పాలకులకు ఎలా పాలించకూడదో అర్ధమవుతుంది.
పుస్తకాల సీజన్!
Published Thu, Aug 28 2014 2:26 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement