Natwar Singh
-
నట్వర్ సింగ్ మృతికి ప్రధాని మోదీ సంతాపం
భారత విదేశాంగశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్(93) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నట్వర్ సింగ్ మృతికి పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో నట్వర్‌సింగ్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన సేవలను మోదీ కొనియాడారు. ప్రపంచ దౌత్యం, విదేశాంగ విధానాల విషయంలో నట్వర్‌సింగ్ సేవలు అమోఘమన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, సానుభూతి తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత్- యూఎస్ అణు ఒప్పందం విషయంలో ఆయన కీలకపాత్ర పోషించారు. సింగ్ రచనలు పలు అంశాలపై లోతైన అవగాహనను కలిగించాయి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్లో ఒక పోస్ట్‌లో సింగ్‌కు నివాళులర్పించారు. ‘విదేశాంగశా్ మాజీ మంత్రి నట్వర్‌సింగ్ మృతి వార్త బాధాకరం. భగవంతుడు ఆయన కుటుంబ సభ్యులకు దీనిని భరించే శక్తిని ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. Pained by the passing away of Shri Natwar Singh Ji. He made rich contributions to the world of diplomacy and foreign policy. He was also known for his intellect as well as prolific writing. My thoughts are with his family and admirers in this hour of grief. Om Shanti. pic.twitter.com/7eIR1NHXgJ— Narendra Modi (@narendramodi) August 11, 2024 -
కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్‌సింగ్ కన్నుమూత
కాంగ్రెస్ నేత, మాజీ విదేశాంగ మంత్రి కె నట్వర్ సింగ్(93) శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నట్వర్‌సింగ్ గత కొన్ని వారాలుగా మేదాంతలో చికిత్సపొందుతున్నారు.నట్వర్ సింగ్ 1931లో రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాలో జన్మించారు. సింగ్ కుటుంబ సభ్యులు ఒకరు శనివారం అర్థరాత్రి మీడియాతో మాట్లాడుతూ నట్వర్‌సింగ్ గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతూ, మేదాంతలో చికిత్స పొందుతున్నారన్నారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఢిల్లీలో జరుగుతాయని, ఈ కార్యక్రమాలకు అతని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరవుతారన్నారు.కాంగ్రెస్ మాజీ ఎంపీ నట్వర్ సింగ్ 2004-05లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో భారత విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. పాకిస్తాన్లో భారత రాయబారిగా కూడా పనిచేశారు. 1966 నుండి 1971 వరకు ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కార్యాలయంతో పనిచేశారు. నట్వర్‌సింగ్‌కు 1984లో పద్మభూషణ్ అవార్డు లభించింది. ఆయన పలు పుస్తకాలు రచించారు. -
టీ కప్పులో దౌత్యపు తుపాను
దౌత్య రంగంలో చిన్న ఘటన కూడా ఎంత సంక్షోభానికి దారితీయగలదో రుజువు చేసే ఘట్టమిది. కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సదస్సు 1983లో ఢిల్లీలో జరిగింది. ఆ సందర్భంలోనే మదర్ థెరెసాకు ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ను రాష్ట్రపతి భవన్లో అందించాలని బ్రిటిష్ రాణి రెండో ఎలిజబెత్ కార్యక్రమం ‘నిర్ణయమైంది’. ఈ విషయంలో ప్రధాని ఇందిరాగాంధీ సంతోషంగా లేరు. భారత రాష్ట్రపతి తప్ప మరెవరూ రాష్ట్రపతి భవన్లో అధికారిక కార్యక్రమం నిర్వహించకూడదు. దీన్ని లోక్‌సభలో ప్రతిపక్షాలు లేవనెత్తుతాయి. మీడియా దుమ్మెత్తిపోస్తుంది. ఆ సమయంలో ఇందిర సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. అటువైపున్న శక్తిమంతమైన మహిళలూ అలాగే స్పందించడంతో పెద్ద దౌత్య సంక్షోభం ‘టీ’ కప్పులో తుపానులా సమసిపోయింది. కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సదస్సు న్యూఢిల్లీలో 1983 నవంబర్‌లో జరిగింది. ఈ భేటీకి ప్రధాన సమన్వయ కర్తగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ నన్ను నియ మించారు. కామన్వెల్త్ అధినేతగా బ్రిటిష్ రాణి రెండో ఎలిజబెత్ ఈ సందర్భంగా న్యూఢిల్లీకి విచ్చేశారు. భర్త ప్రిన్స్ ఫిలిప్‌తో పాటు ఆమె రాష్ట్రపతి భవన్లో విడిది చేశారు. అయిదేళ్ల పదవీకాలం పూర్తయిన సర్ సానీ రాంఫల్ (గయానా రాజకీయ నాయకుడు) స్థానంలో కామన్ వెల్త్‌కు నూతన సెక్రటరీ జనరల్‌ను ఎన్నుకోవడం అనేది ఎజెండాలో తొలి అంశం. రాంఫల్ మరో అయిదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగాలని ఇందిరాగాంధీ కోరుకున్నారు. కానీ బ్రిటన్ ప్రధాని మార్గరేట్ థాచర్ దానికి సుముఖంగా లేరు. ఇందిర ఆ సమావేశానికి చైర్మన్‌గా ఉండేవారు. దాంతో ఆమె తన పలుకుబడిని ఉపయోగించి, రాంఫల్ రెండో దఫా పదవిలో కొనసాగేలా చేశారు. ఆ సందర్భంగా కామన్వెల్త్ సదస్సు వెలుపల ఒక చిన్న సంక్షోభం వచ్చినట్లే వచ్చి పక్కకు తప్పుకుంది. నాకు గుర్తున్నంత వరకూ అది సదస్సు రెండో రోజు. మదర్ థెరెసాకు ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ను ఇవ్వడానికి రాష్ట్రపతి భవన్లో కార్యక్రమం నిర్వహిస్తున్నారా అని రాష్ట్రపతి భవన్ అధికారులను నెమ్మదిగా అడిగి కనుక్కోమని ప్రధాని ఇందిర నాకు చెప్పారు. ప్రధానమంత్రి విన్నది నిజమేనని రాష్ట్రపతి భవన్ అధికారులు నిర్ధారించారు. ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రదాన కార్యక్రమానికి ఆహ్వాన పత్రికలు జారీ చేశారు. దానికి బకింగ్‌హామ్ ప్యాలెస్ స్టేషనరీని వాడారు. నాటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ కార్యదర్శిని లేదా సైనిక కార్యదర్శిని సంప్రదించకుండానే ఆ పని చేసేశారు. నేను ఈ విషయాన్ని ఇందిరాగాంధీకి చేరవేశాను. తాను విన్నదాంతో ఆమె సంతోషంగా లేరు. ఈలోగా ఎంపీ హెచ్ఎన్ బహుగుణ ప్రధానికి ఉత్తరం పంపారు. రాష్ట్రపతి భవనలో మదర్ థెరెసాకు బ్రిటిష్ రాణి అత్యున్నత పురస్కారం ఇస్తున్నట్లు తనకు తెలిసిందన్నది ఆ లేఖ సారాంశం. అయితే తాను విన్నది నిజం కాదని భావిస్తున్నట్లు ఆయన ముక్తా యించారు. భారత్‌లో రాష్ట్రపతి మాత్రమే ఆయన ఆధికారిక భవ నంలో పురస్కార కార్యక్రమం నిర్వహించగలరు. ఒకవేళ బ్రిటిష్ రాణి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికే ముందుకు వెళ్లినట్లయితే తానూ, ఇతర ప్రతిపక్ష నేతలూ కలిసి ఈ విషయాన్ని లోక్‌సభలో లేవనెత్తాల్సి ఉంటుందని ఆయన ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. బహుగుణ చెప్పింది నిజం. బ్రిటిష్ రాణి సిబ్బంది తెలీకుండా తప్పు చేశారు. ఆ తప్పును తప్పకుండా సవరించాల్సి ఉంది. చోగమ్ (కామన్వెల్త్ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతల సదస్సు) ప్రధాన సమన్వయకర్తగా, కనీవినీ ఎరుగని అసాధారణమైన ప్రోటోకాల్ ఉల్లంఘనతో నేను వ్యవహరించాల్సి వచ్చింది. నాటి బ్రిటన్ ప్రధాని మార్గరేట్ థాచర్‌కు ఈ విషయం తెలియజేసి ఆమె ఏం చెబుతారో తన దృష్టికి తీసుకురావాలని ఇందిరా గాంధీ నన్ను కోరారు. ఆనాడు భారత్‌లో అధికార బాధ్యతల్లో ఉన్న బ్రిటిష్ హై కమిషనర్ ఒక విజయవంతమైన, నిపుణుడైన దౌత్యవేత్త. రాష్ట్రపతి భవన్లో అలాంటి పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించకూడదని థాచర్‌కూ, బ్రిటిష్ రాణికీ ఈ విషయాన్ని తెలియజేయవలసిందిగా నేను బ్రిటిష్ హైకమిషనర్‌ను కోరాను. భారత్‌లోని బ్రిటన్ హైకమిషన్‌లో లేదా బ్రిటిష్ కమిషనర్ నివాసంలో ఆ అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చని నేను తెలియజేశాను. బ్రిటిష్ రాణి అంటే మాకు అపారమైన గౌరవం ఉందనీ, ఇక మదర్ థెరీసా అయితే మా దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనీ నేను ఆయనతో చెప్పాను. అదే సమయంలో ఈ విషయంలో మనం ముఖాముఖాలు చూసుకునే పరిస్థితి రాకూడదనీ వివరించాను. బ్రిటిష్ హైకమిషనర్ నాకు రెండు గంటల్లో ఫోన్ చేశారు. రాణి తలపెట్టిన వేదికను మార్చడానికి కూడా సమయం దాటిపోయిందని నాకు చెప్పారు. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు పంచడం అయి పోయిందనీ, పైగా ఈ విషయం చెబితే రాణి చాలా ఇబ్బంది పడతారనీ ఆయన చెప్పారు. పైగా బ్రిటన్ ప్రెస్‌కు ఈ కార్యక్రమం గురించి తెలిసిపోయింది. ఇది నిజంగా చెడ్డవార్తే. మార్గరేట్ థాచర్ ప్రతిస్పందనను భారత ప్రధాని ఇందిరాగాంధీకి తెలియజేస్తానని నేను బ్రిటిష్ హైకమిషనర్‌కు చెప్పాను. అయితే ఒక విషయం నేను స్పష్టం చేయదల్చుకున్నాను. రాష్ట్రపతి భవన్లో అలాంటి అధికారిక పురస్కార ప్రదాన కార్యక్రమానికి మనం అంగీక రించ కూడదని ప్రధాని ఇందిరాగాంధీకి నేను సిఫార్సు చేస్తానని తేల్చి చెప్పాను. ఇక్కడ మాముందు అత్యంత ప్రమాదకరమైన ప్రొటో కాల్ మందుపాతర సిద్ధంగా ఉంది. నలుగురు ప్రపంచ ప్రముఖ మహిళల ముందు జరుగుతున్న నాటకీయ పరిణామం అది. ఇద్దరు శక్తిమంతులైన ప్రధానమంత్రులు, ఒక రాణి, మరొకరు సన్యాసిని కంటే ఎక్కువైన మహిళ. ఈ కథ గానీ బయటపడిందంటే భారత్ మీడియా ఏం చేస్తుంది? అది వెలిగించే పెద్ద భోగిమంటను తల్చుకుంటేనే వణుకు పుట్టింది. తర్వాత బ్రిటిష్ ప్రధాని చెప్పిన మాటలను నేను ఇందిరాగాంధీకి నివేదించాను. ఇందిర ముఖంలో వెంటనే చిరాకును చూశాను. ఒక క్షణం అలాగే ఉండి, తర్వాత ఆమె గొప్ప నైపుణ్యంతో ఒక దౌత్యపరమైన గూగ్లి వేశారామె. ‘‘నట్వర్, థాచర్ వద్దకు వెళ్లి రాష్ట్రపతి భవన్లో బ్రిటిష్ రాణి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని నా మాటగా చెప్పు. కానీ ఈ విషయాన్ని మరుసటి రోజు భారత పార్లమెంటులో తప్పకుండా లేవనెత్తుతారని ఆమెకు చెప్పు. దీనిపై తప్పకుండా విమర్శలు చెలరేగుతాయి. పైగా రాణి పేరును కూడా దీంట్లోకి లాగుతారు. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉంటే మంచిది.’’ నిజంగానే ఒక అద్భుతమైన ప్రతిస్పందన అటువైపు నుంచి వెంటనే వచ్చింది. రాష్ట్రపతి భవనలో మదర్ థెరెసాకు అవార్డు ప్రదాన కార్యక్రమం జరగనేలేదు. మదర్ థెరెసాను ఎలిజబెత్ రాణి ఉద్యాన వనంలో తేనీటి విందుకు ఆహ్వానించారు. అక్కడే ఆమె నోబెల్ గ్రహీత అయిన మదర్ థెరెసాకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం ఆ కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవన్‌లోనే నిర్వహించి ఉంటే దౌత్యపరంగా ఎంత కల్లోలం చోటు చేసుకునేదో మదర్ థెరెసాకు అయితే అసలు తెలిసేది కాదు. చివరకు ఈ సమస్య పరిష్కారమైన తీరు నన్ను కూడా వ్యకిగతంగా ఎంతో సంతోషపెట్టింది. ఆ తర్వాత కామన్వెల్త్ దేశాధి నేతల సదస్సు ముగింపు సందర్భంగా బ్రిటన్ ప్రధాని మార్గరేట్ థాచర్ నన్ను ప్రశంసిస్తున్నట్టుగా సైగ చేశారు. భారత్ పర్యటనను ముగించుకుని బ్రిటన్ వెళ్లిపోయేముందు ఎలిజబెత్ రాణి నన్ను పిలిచారు. నా పట్ల ఆమె ఎంతో దయతో వ్యవహరించారు. మరింకె వరికీ అది దక్కి ఉండదనిపించింది. అంతే కాకుండా నాకు ఆమె ఒక రాచ బహుమతిని కూడా ప్రసాదించారు. కె. నట్వర్ సింగ్, వ్యాసకర్త మాజీ విదేశాంగమంత్రి (‘ఫస్ట్ ఇండియా’ సౌజన్యంతో) -
‘24 గంటల్లోనే కాంగ్రెస్‌లో చీలిక’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని ప్రియాంక గాంధీ చేపట్టాలని కోరుతున్న సీనియర్ నేతల జాబితాలో నట్వర్ సింగ్ చేరారు. పార్టీని సమర్థవంతంగా నడిపించే సత్తా ఆమెకే ఉందని అభిప్రాయపడ్డారు. గాంధీయేతర కుటుంబం వచ్చిన వారికి అధ్యక్ష బాధ్యతలు కట్టబడితే 24 గంటల్లోనే పార్టీ చీలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తమ కుటుంబానికి కాకుండా బయటి వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పగించాలన్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ పక్కన పెట్టాలని సూచించారు. ‘ఉత్తరప్రదేశ్‌లోని ఘోరావల్ గ్రామంలో కాల్పుల బాధితులను కలుసుకునేందుకు వెళ్లినప్పుడు ప్రియాంక పట్టుదలను మనమంతా చూశాం. ఆమె అనుకున్నది సాధించుకుని వచ్చారు. ప్రియంక కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలా, వద్దా అనేది రాహుల్ గాంధీ నిర్ణయంపై ఆధారపడివుంది. ఎందుకంటే తమ కుటుంబానికి చెందనివారే తదుపరి అధ్యక్షుడిగా ఉండాలని రాహుల్ అన్నారు. ఈ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. గాంధీ కుటుంబం మాత్రమే కాంగ్రెస్ పార్టీని నడిపించగదు. 134 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు అధ్యక్షుడు లేకపోవడం దురదృష్టకరం. పార్టీ ప్రెసిడెంట్‌గా గాంధీ కుటుంబ సభ్యులు తప్పా ఎవరిని ఊహించుకోలేన’ని నట్వర్ సింగ్ అన్నారు. ప్రియాంక గాంధీ అయితేనే వందశాతం న్యాయం చేయగలరని మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి అంతకుముందు అభిప్రాయపడ్డారు. ఆమె ఎన్నికకు పార్టీ సీనియర్లంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతారని, ప్రియాంకకు పోటీగా ఎవరూ ముందుకు రారని తాను బలంగా నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. -
ముస్లిం దేశాల సపోర్ట్ కూడా పాక్‌కు లేదు
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ భారత్‌ను దొంగదెబ్బ తీస్తున్న పాకిస్తాన్‌పై తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందే అన్న వాదనలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ స్పందించారు. పాకిస్తాన్‌తో యుద్ధం అంత మంచిది కాదని ఆయన వెల్లడించారు. పాకిస్తాన్‌పై దౌత్యపరమైన చర్యలు ఉండాలని.. అంతర్జాతీయంగా భారత్ ఇప్పుడు అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించడం మంచిదని నట్వర్ సింగ్ అభిప్రాయపడ్డారు. 56 సంవత్సరాలనుంచి సవ్యంగానే సాగుతున్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్‌తో యుద్ధం అంత సులభం కాదని.. ఒకవేళ భారత్ యుద్ధానికి దిగితే పాకిస్తాన్ తిరిగి దాడి చేస్తుందని నట్వర్ సింగ్ హెచ్చరించారు. ఇరు దేశాలకు అణ్వాయుధ సామర్థ్యం ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఒంటరిని చేయడంలో విజయం సాధించామని.. చివరికి ముస్లిం దేశాలు కూడా పాక్‌ను సపోర్ట్ చేయలేదని ఇటీవల ఐక్యరాజ్యసమితిలో నవాజ్ షరీఫ్‌కు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేశారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని.. దీనికి బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే అని విమర్శించారు. ఎల్ఓసీని అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించాలని నట్వర్ సింగ్ అన్నారు. -
పుస్తకాల సీజన్!
సంపాదకీయం: పుస్తకాలు ఇప్పుడు కాంగ్రెస్‌ను తెగ భయపెడుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు రాసి వెలువరిస్తున్న పుస్తకాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఆమధ్య సంజయ బారు, అటు తర్వాత నట్వర్‌సింగ్ గ్రం థాలు వెలువరిస్తే ఇప్పుడు మాజీ కాగ్ వినోద్ రాయ్ వంతు వచ్చింది. అతి త్వరలోనే తన అనుభవాలతో ‘నాట్ జస్ట్ యాన్ అకౌంటెంట్’ శీర్షికతో ఒక గ్రంథాన్ని తీసుకురాబోతున్నానని ఆయన ప్రకటించారు. అంతేకాదు... ఆ సందర్భంగా పెను దుమారం కలిగించే వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ వ్యాఖ్యలు వింటేనే ఆయన తెస్తున్న పుస్తకం మరెంత అలజడి రేకెత్తించగలదో అర్ధమవుతుంది. నట్వర్‌సింగ్ ప్రధానంగా చెరిగి పారేసింది సోనియాగాంధీనైతే సంజయ బారు గ్రంథంలో ప్రధాన పాత్ర మన్మోహన్సింగ్ది. అందులో సోనియాగాంధీకి సంబం ధించిన ప్రస్తావనలూ దండిగానే ఉన్నాయి. వినోద్ రాయ్ మౌలికంగా బ్యూరోక్రాట్ కనుక ఆయన ప్రధానంగా ప్రభుత్వంలోని పెద్దల గురించి... మరీ ముఖ్యంగా మన్మోహన్సింగ్ గురించి చెప్పవచ్చునని అంటున్నారు. అయితే, సోనియాగాంధీ ఈ పుస్తకాల దాడికి ప్రతి వ్యూహం రచించకపోలేదు. తాను దెబ్బలు కాచుకొనడంతో ఊరుకోక ఎదురుదాడికి ప్రయత్నించాలని ఆమె ఈసరికే నిర్ణయించుకున్నా అదంత సులభంగా అయ్యేది కాదు. పుస్తకం రాయడానికి ఓ ప్రణాళిక ఉండాలి. లక్ష్యం ఉండాలి. దాని గమనాగమనాలేమిటో తేల్చుకోవాలి. ఆ పుస్తకంలోని అంశాలు లీక్ చేయడానికైనా, పుస్తకాన్నే విడుదల చేయ డానికైనా అదునూ, పదునూ చూడాలి. ‘అనువుగాని కాలం’లో పుస్తకం రాసినా, కనీసం రాస్తున్నట్టు అవతలివారికి తెలిసినా పీకలమీదికి రావొచ్చు. పాత ఫైళ్లన్నీ బయటికొచ్చి కేసుల రూపంలో బుసలు కొట్టే ప్రమాదం ఉంటుంది. నట్వర్‌సింగ్‌కు ఈ సంగతి తెలుసు గనుకే ఓపిగ్గా వేచిచూశారు. ఇక పుస్తకంలో చెప్పవలసినవి ఏమిటో, చెప్పకుండా వది లేయాల్సినవేమిటో... చెప్పీ చెప్పకుండా సరిపెట్టవలసినవి ఏమిటో నిర్ణయించుకోవాలి. మరొకరు సాక్ష్యం చెప్పడానికి వీల్లేని ఘటనలైతే మరీ మంచిది. అలాగైతే సొంత బాణీయే వినిపిస్తుంది తప్ప ఎవరో వచ్చి ‘అసలు జరిగింది ఇదీ...’ అంటూ ఏకరువు పెట్టే వీలుండదు. పుస్తకం రాస్తానని చెప్పేముందు సోనియాగాంధీ వీటన్ని టినీ ఆలోచించారో లేదో?! ఆమె సంగతలా ఉంచి మన్మోహన్సింగ్ కుమార్తె దామన్‌సింగ్ తండ్రిని సమర్ధిస్తూ, ఆయన పనితీరును కీర్తిస్తూ ఇప్పటికే ఒక పుస్తకం వెలువరించారు. అయితే, వచ్చిన...రాబోతున్న పుస్తకాలన్నిటా పూసల్లో దారంలా ఒక విషయమైతే నిర్ధారణగా తెలుస్తుంది. ఆ పుస్తకాల్లో పేర్కొంటున్న అంశాలేవీ దేశ ప్రజానీకానికి కొత్తేమీ కాదు. అవి ఆనోటా, ఈనోటా దాదాపు అందరికీ తెలుసున్నవే. మీడియా ప్రభావం బాగా పెరిగింది గనుక కొన్ని అంశాలు ఇప్పటికే అచ్చులోకి కూడా వచ్చాయి. అయితే, అధికార పీఠానికి సమీపంగా మెలిగి, అందులో భాగస్తులైనవారు చెప్తుండటంవల్ల ఆ అంశాలకు మరింత సాధికారత వస్తున్నది. ఇదే సోనియాగాంధీకైనా, మరొకరికైనా ఇబ్బందికరమనిపిస్తున్నది. అభ్యం తరంగా కనబడుతున్నది. మిగిలినవారి మాటెలా ఉన్నా వినోద్ రాయ్ పుస్తకం బయటపెట్టేవి చాలానే ఉంటాయి. ఆయన కాగ్ పదవిలో ఉన్న ప్పుడే ‘కేంద్ర నిఘా సంఘం(సీవీసీ), సీబీఐలు స్వతంత్ర వ్యవస్థలుగా పనిచేయడంలేదని బహిరంగంగా ప్రకటించిన వ్యక్తి. ఈ రెండింటినీ ప్రజలు కూడా ప్రభుత్వ పనిముట్లుగా, జేబు సంస్థలుగా పరిగణిస్తున్నా రని కూడా ఆయనన్నారు. ఏదో నామమాత్రం నివేదికలిచ్చి చేతులు దులుపుకొనే పాత సంప్రదాయాన్ని పాతిపెట్టి, ఆ నివేదికలను గణాం కాల కీకారణ్యంనుంచి బయటకు తీసుకొచ్చి అందరికీ తేటతెల్లమ య్యేలా విశ్లేషించి చెప్పే సంప్రదాయాన్ని వినోద్ రాయ్ ప్రారంభిం చారు. కామన్వెల్త్ క్రీడల కుంభకోణం మొదలుకొని లక్షా 76 వేల కోట్ల రూపాయల 2జీ స్కాం, లక్షా 86 వేల కోట్ల రూపాయల బొగ్గు స్కాంవంటివి కాగ్ వెల్లడించింది ఆయన హయాంలోనే. కాంగ్రెస్‌కు ఇదెంత ఊపిరాడనీయని స్థితి కలిగించిందంటే...కాగ్‌ను బహుళ సభ్య వ్యవస్థగా మర్చాలని ఒక దశలో యూపీఏ సర్కారు ప్రయత్నించింది. వినోద్‌రాయ్ తాజాగా చెప్పిన అంశాలు చాలా కీలకమైనవి. కామన్వెల్త్, కోల్గేట్ కుంభకోణాల్లో నివేదికలను సిద్ధం చేస్తున్నప్పుడు వాటిలో ‘కొందరు ప్రముఖుల’ పేర్లు తొలగించాలని యూపీఏ భాగస్వామ్య పక్షాల నేతలు తనవద్దకు రాయబారాలు నడిపారని ఆయన చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మన్మోహన్‌సింగ్‌పై కూడా నిశితమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా తుది నిర్ణయం ఎప్పుడూ తనదే కావాల్సి ఉండగా ఆయన కొన్నిసార్లు ఆ పనిచేసేవారు... మరికొన్నిసార్లు పట్టనట్టు ఉండిపోయేవారని విమర్శిం చారు. అంతేకాదు... సంకీర్ణ రాజకీయాల కోసం సుపరిపాలనను పణంగా పెట్టరాదని హితవు పలికారు. తొలి దఫా మాటేమోగానీ... మలి దఫాలో యూపీఏ పాలకులు తాము ప్రభుత్వాన్ని నడుపుతున్నా మన్న స్పృహనే కోల్పోయారు. అంతక్రితం అయిదేళ్ల పాలనలో ఏం జరిగిందో వరసబెట్టి వెల్లడవుతున్నప్పుడైనా స్వీయ ప్రక్షాళనకు సిద్ధపడలేదు. సరిగదా... మరిన్ని కుంభకోణాలు జరగడానికి వీలు కలిగించారు. సీబీఐ వంటి సంస్థలను కక్ష సాధింపు వ్యవహారాలకు వాడుకున్నంతగా ఈ కుంభకోణాల కారకులపై చర్యలకు వినియోగించ లేదు. కనుకనే ఈ స్కాంలు మరింత విస్తరించాయి. ఇదే చిట్టచివరకు కాంగ్రెస్‌ను నిలువునా ముంచింది. యూపీఏ పదేళ్ల పాలనపై నిజానికి ఎందరు ఎన్ని పుస్తకాలు రాసినా ఇంకా చెప్పవలసినవి మిగిలే ఉంటాయి. కనుక వినోద్‌రాయ్ మాత్రమే కాదు... మరింతమంది తమ కలాలకు పనిబెట్టవలసిన అవసరం ఉంది. దానివల్లనైనా భవిష్యత్తు పాలకులకు ఎలా పాలించకూడదో అర్ధమవుతుంది. -
సీక్వెల్ తో మరీ వెంటాడతారట?
సినిమాలే కాదు ఇప్పుడు పుస్తకాలకు కూడా సీక్వెల్..... వస్తున్నాయి. సీక్వెల్ రావటంలో విశేషం ఏమీ లేకున్నా.... గతంలో చాలా పుస్తకాలు అలా వచ్చివవే. అయితే నిను వీడని నీడను నేనే..... అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి నట్వర్ సింగ్ మళ్లీ వెంటాడేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’ పుస్తకం పేరు సోనియాపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగిన ఆయన...ఈసారి సీక్వెల్ పుస్తకంలో కడిగి పారేస్తానని చెబుతున్నారు. తన పుస్తకానికి కొనసాగింపుగా మరో పుస్తకాన్ని (సీక్వెల్) రాసి మరిన్ని విషయాలు బయట పెట్టేందుకు నిర్ణయించుకున్నారట. ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’ పుస్తకంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నా నట్వర్ సింగ్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ఈసారి ‘మై ఇర్రెగ్యులర్ డైరీ’ పేరుతో పుస్తకం రాస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ పుస్తకం అందుబాటులోకి రావాలంటే వచ్చే ఏడాది మార్చి వరకూ వేచి చూడాల్సిందే. ఇటీవలి విడుదల అయిన ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’ పుస్తకానికి మాత్రం మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ బుక్ హాట్ కేక్‌ల్లా 50వేల ప్రతులు అమ్ముడు పోవటంతో... ఈ పుస్తకాన్ని ప్రచురణకర్తలు పునర్ ముద్రిస్తున్నారు. మరి ఈసారి నట్వర్ సింగ్ తన డైరీ ద్వారా ఎలాంటి మాటల తూటాలు వదులుతారనేది ఇప్పటి నుంచి ఆసక్తి నెలకొంది. -
'ఆత్మ' తక్కువ కథ ఎక్కువ!
దేశంలో ఆత్మకథల పరంపర కొనసాగుతోంది. నట్వర్ సింగ్ వివాదం ఇంకా చల్లారకముందే తెర మీదకు మరో ఆత్మ కథ వచ్చింది. ఇప్పటికే తమ ఆత్మకథలతో సంజయ్‌బారు, పీసీ పరేఖ్, నట్వర్ సింగ్ తదితరులు సంచలనం సృష్టించగా.... తాజాగా మార్గరెట్ అల్వా ఈ జాబితాలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మార్గరెట్ అల్వా కూడా త్వరలో తన ఆత్మకథ రాయబోతున్నారు. రాజస్థాన్ గవర్నర్ గా పదవీ విరమణ చేసిన ఆమె త్వరలో పెన్ను పట్టుకోనున్నారు. సాధారణ కుటుంబం నుంచి రాజ్ భవన్ వరకూ సాగిన తన పయనం గురించి ఆమె ఈ పుస్తకంలో వివరించనున్నట్లు సమాచారం. అయితే వివాదాలు సృష్టించేందుకు ఈ పుస్తకం రాయటం లేదని మార్గరెట్ స్పష్టం చేయటం విశేషం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్‌బారు రచించిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ద మేకింగ్, అన్‌మేకింగ్' అప్పట్లో టాక్ ఆఫ్ ది నేషన్ అయిన విషయం తెలిసిందే. మహా భారతంలో భీష్ముడితో మన్మోహన్‌ను పోల్చిన సంజయ్ బారు, సోనియా ఎలా చెబితే అలా మన్మోహన్ నడుచుకున్నారని ఆ పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరుకే మన్మోహన్ ప్రధాని అని, సోనియా కనుసన్నల్లోనే ఆయన పాలన సాగించారంటూ విమర్శలు గుప్పించారు. ఇక సంజయ్ బారును స్పూర్తిగా తీసుకున్నారో ఏమో....కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శిగా పని చేసిన పీసీ పరేఖ్ కూడా 'క్రూసేడర్ అండ్ కాన్స్పిరేటర్' పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం ద్వారా తీవ్ర సంచలనం సంచలనం సృష్టించింది. తన పుస్తకంలో బొగ్గు మసి మొత్తం బయటపెట్టిన ఆయన కోల్గేట్ వ్యవహారంలో ప్రధాని పాత్రపై నిగ్గుతేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక అంతకు ముందు బీజేపీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ 'మై కంట్రీ.. మై లైఫ్' పేరుతో ఆత్మకథను రాశారు. రాజకీయాల్లో ఉక్కుమనిషిగా తన ఇమేజ్ను పెంచుకునే విధంగా ఈ పుస్తక రచన సాగిందనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. అధికారం అనుభవించిన వారి జీవితాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఎక్కడ రహస్యం ఉంటుందో అక్కడ ఆసక్తి ఉంటుంది. అధికారం అన్నప్పుడు, అధికారం ఉన్నవారి వద్ద పని చేసినప్పుడు.... వారి మధ్య ఎన్నో రహస్యాలు ఇమిడి ఉంటాయి. అలాంటి వారు ఆత్మకథలు రాస్తే అవి మిగతావారికి ఆసక్తిని రేకెత్తించటంలో సందేహం లేదు. అయితే అధికారం చేతులు మారాక... ప్రయివేట్ సంభాషణలను ఆత్మకథల పేరుతో బయట పెట్టడం ఎంత వరకూ సమంజసం. సంచలనాల కన్నా మీడియా మాత్రం మాస్ మసాలా దొరికినట్లే. గతంలో మన్మోహన్పై సంజయ్ బారు, తాజాగా సోనియాపై నట్వర్ సింగ్ వెల్లడించిన విషయాలు అందరికి ముందు నుంచి తెలిసినవే. వారంటూ కొత్తగా చేసిన ఆరోపణలు ఏమాత్రం లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుస్తకాల అమ్ముకోవటానికి, వార్తల్లో నిలవటానికి జిమ్మిక్కులని కొట్టి పారేస్తున్నారు. నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఆత్మ కథల్లో ...'కథ'లు తప్ప దానిలో ఆత్మ కనిపించటం లేదని వినికిడి. -
నా ఆత్మకథకు సీక్వెల్ వస్తోంది: నట్వర్ సింగ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ, ఇతర నేతలపై పదునెక్కిన విమర్శల్ని ఎక్కుపెడుతూ మాజీ కేంద్రమంత్రి నట్వర్ సింగ్ రాసిన ఆత్మకథ చుట్టు వివాదం ముసురుకున్న సంగతి తెలిసిందే. అయితే మరికొన్ని ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చేందుకు తన ఆత్మకథకు సీక్వెల్ రూపొందించనున్నట్టు నట్వర్ సింగ్ నిర్ణయించుకున్నారు. ఆత్మకథకు సీక్వెల్ గా వచ్చే పుస్తకానికి 'మై ఇర్రెగ్యులర్ డైరీ' అని పేరు పెట్టారు. సీక్వెల్ ను మార్చి నెలలో మార్కెట్ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. గాంధీ కుటుంబ వ్యవహారతీరును, కాంగ్రెస్ పార్టీ నడిపించిన నాయకత్వంపై మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉంటాయని సూచనప్రాయంగా నట్వర్ వెల్లడించారు. నట్వర్ సింగ్ రచించిన 'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్' అనే ఆత్మకథ మరో నాలుగు రోజుల్లో మార్కెట్ లోకి రానుంది. సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ కలిసిన నేపథ్యంలో ఏమైనా అంశాలను తొలగించారా అనే ప్రశ్నకు ఒక పదాన్ని కూడా తీయకుండా తన ఆత్మకథ మార్కెట్ లోకి రాబోతుందన్నారు. -
నట్వర్ సింగ్ పద్దతి బాలేదు: షర్మిష్టా ముఖర్జీ
న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై విదేశాంగ మాజీ మంత్రి నట్వర్ సింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్టా ముఖర్జీ తప్పుబట్టారు. ఈవిధంగా వ్యవహరించడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. నట్వర్ వ్యవహారం ఏమీ బాలేదని అన్నారు. నట్వర్ ను నమ్మి ఆయనతో రాజీవ్ గాంధీ పంచుకున్న విషయాలను బహిర్గతం చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఇంట్లో తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ రాజకీయాల గురించి మాట్లాడరని చెప్పారు. ఓసారి కేబినెట్ లో చర్చించిన విషయం గురించి తాను అడిగినా తన తండ్రి చెప్పలేదని షర్మిష్టా గుర్తు చేసుకున్నారు. -
సోనియా గాంధీపై నట్వర్ సింగ్ వ్యాఖ్యలు వాస్తవమే!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలను పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ పునురుద్ఘాటించారు. సోనియా గాంధీ ప్రధాని కాకుండా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ అడ్డుపడ్డారన్న నట్వర్ వ్యాఖ్యలు వాస్తవమేనని ఆయన స్పష్టం చేశారు. 2004 లో సోనియా గాంధీ ప్రధాని పదవిని చేపట్టడానికి ఆసక్తి చూపినా. ఆ పదవిపై ఆమె వెనక్కు తగ్గడానికి రాహులే ప్రధాన కారణం అయ్యి ఉండవచ్చని మణిశంకర్ తెలిపారు. సోనియా ప్రధాని అయితే రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీలను ఉగ్రవాదులు హతమార్చినట్టుగా ఆమెను కూడా చంపుతారేమోనని రాహుల్ బయపడ్డారని నట్వర్ సింగ్ వాఖ్యలను మణిశంకర్ తాజాగా పునరుద్ఘాటించారు. అయితే తల్లి సంరక్షణపై కొడుకు ఉండే ఆందోళనలో భాగంగానే రాహుల్ అలా చెప్పి ఉండవచ్చన్నారు. ప్రధాని పదవిని ఆమె తిరస్కరించడానికి ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నా అవి నట్వర్ కు తెలియకపోవచ్చన్నారు. నట్వర్ సింగ్ గాంధీ కుటుంబానికి ఎంత దగ్గరగా ఉన్నా కాంగ్రెస్ పార్టీలోని వాస్తవాలను ఆత్మకథ రూపంలో బయటకు తేవడం కష్టసాధ్యమన్నారు. 100 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో నిజాలను వెల్లడిస్తానని నట్వర్ చెప్పినా.. అంతర్లీనంగా ఉన్న పూర్తి వాస్తవాలను ఆవిష్కరించడం మాత్రం సాధ్యపడదని మణిశంకర్ తెలిపారు. -
ఎన్ని జన్మలు కావాలి?
సోనియాగాంధీకి ఒకప్పుడు సన్నిహితుడైన నట్వర్‌సింగ్ ఆమె వ్యక్తిత్వం గురించి, యూపీఏ హయాంలో ఆమె చేసిన అధికార వినియోగం లేదా దుర్వినియోగం గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తారు. సోనియా దాచి ఉంచాల్సింది ఏమైనా ఉందా? అనేదే కేంద్ర సమస్య. ‘అవును’ లేదా ‘కాదు’ అనే సరళమైన ఓ చిన్న సమాధానం చెబితే చాలు. ఒక్క వాక్యంలో చెప్పగలిగేదానికి పెద్ద పుస్తకం రాయడం అవసరమా? సోనియాగాంధీ తన జ్ఞాపకాలను గ్రంథస్తం చేయాల్సి ఉండటానికి ప్రశస్తమైన కారణాలెన్నో ఉన్నాయి. కున్వర్ నట్వర్‌సింగ్ రాసిన ‘ఒక్క జన్మ చాలదు’ ఆత్మకథ మాత్రమే అందుకు కారణంగా సరిపోదు. నేడు సోనియా పాలిటి శాపంగా మారిన నట్వర్‌సింగ్ ఒకప్పుడు ఆమెకు ‘సన్నిహిత మిత్రుడు.’ సోనియా గాంధీ వ్యక్తిత్వం గురించి, యూపీఏ అధికారంలో ఉన్న 2004-2014 దశాబ్దంలో ఆమె అధికార వినియోగం లేదా దుర్వినియోగం గురించి ఆయన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తారు. ఆయన వెల్లడించిన విషయాలు, చేసిన వ్యాఖ్యలు విశ్వసనీయమైనవిగా అనిపిస్తున్నాయి. కాబట్టే మీడియాలోనూ, ప్రజల్లోనూ అవి కొంత కాక పుట్టించ గలుగుతున్నాయి. అందువల్ల ఆ ప్రశ్నలకు ఎప్పుడో కొన్నేళ్ల తర్వాత కాదు, ఇప్పుడే సోనియా గాంధీ సమాధానం చెప్పాలి. సోనియా దాచి ఉంచాల్సింది ఏమైనా ఉందా? అనేదే కేంద్ర సమస్య. ‘అవును’ లేదా ‘కాదు’ అనే సరళమైన ఓ చిన్న పదంతో సమాధానం చెబితే సరిపోతుంది. సోనియా దాచుకోవాల్సిందేమీ లేకపోతే... ఆమె, ఆమె కూతురు ప్రియాంకాగాంధీ మే నెలలో నట్వర్‌సింగ్‌ను కలసి ఆ పుస్తకంలోని కొన్ని భాగాలను తొలగించాలని ఎందుకు ప్రాధేయపడాల్సి వచ్చినట్టు? తన ఒకప్పటి సహచరుడు, సలహాదారు, మిత్రుడు కట్టుకథలను కల్పించారనుకుంటే అందుకు అత్యంత సమర్థవంతమైన తరుణోపాయం ఆమెకుంది. ఆ రచయితపైనా, ప్రచురణకర్తలపైనా పరువు నష్టం దావా వేయవచ్చు. గెలిస్తే భారీగా పరిహారాన్ని కోరవచ్చు. ఆమె తరఫున కోర్టుకు హాజరుకావడానికి పార్టీ పరివారంలో కావాల్సినంత మంది లాయర్లున్నారు. గంటలోగానే కోర్టు నోటీసు పంపవచ్చు. కాంగ్రెస్ ప్రతిస్పందన ఇంతవరకు జనాంతికంగా గుంజాటనపడటానికి లేదా బహిరంగంగా రంకెలేయడానికి మధ్య తారట్లాడుతోంది. టీవీ ముందుకు వచ్చే నిస్సహాయులైన కాంగ్రెస్ అధికారిక ప్రతినిధులు తీవ్ర స్థాయి స్వరాలతో విషయాన్ని దారి మళ్లించే క్రీడకు పాల్పడుతున్నారు. ఢిల్లీ గురించి అడుగుతుంటే ముంబైపై తీవ్ర దాడికి దిగుతారు. విస్తృతంగా ప్రచారం సాగినట్టుగా 2004లో సోనియాగాంధీ తమ అంతరాత్మ ప్రబోధం మేరకే ప్రధాన మంత్రి పదవి వద్దనుకున్నారా? లేక ఆమె కుమారునిలోని భయాల వల్ల కాదన్నారా? అని అడిగి చూడండి. సూటిగా సమాధానం చెప్పక పోగా రచయితపై అంతులేని దూషణలకు దిగుతారు. ఏది ఏమైనా, పులోచ్ ఛటర్జీ అనే ఉన్నత ప్రభుత్వోద్యోగి అధికారిక ఫైళ్లను సోనియాకు చూపిన వైనం ముందు అది వెలవెలబోతుంది. భయపడటం చట్టవిరుద్ధం కాదు. అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రం చట్టవిరుద్ధం. సోనియాగాంధీకి ఏ ఫైళ్లను చూపిన సంగతి తనకు తెలియదని మన్మోహన్ సింగ్ ప్రశాంతంగా చెప్పొచ్చు. కానీ ఆయన అలా అంటారా? అనరా? అనకపోతే ఆయన కూడా దోషే అవుతారు. సోనియా తనను బలిపశువును చేయాలని అనుకోవడం వల్లనే సద్దాం హుస్సేన్ ‘చమురుకు బదులు ఆహారం’ కార్యక్రమంలో ‘‘కాంట్రాక్టేతర లబ్ధిదారుల’’లో ఒకరిగా చేర్చి 2005లో తనను ఉన్నత పదవి నుంచి, తదుపరి కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించారని నట్వర్‌సింగ్ ఆరోపించారు. ఆయన అన్నదానిలోని బహువచనం ‘లబ్ధిదారులు’ను గమనించాలి. వారిలో ‘‘ఏఐసీసీ’’ ఉంది. సోనియా, నట్వర్‌సింగ్‌పై చేసినంత తీవ్ర దాడిని ఏఐ సీసీలో మరెవరిపైనా, ఎన్నడూ చేయలేదనడం నిస్సందేహం. ఏఐసీసీలో ఇద మిద్దంగా ఎవరు ఆ పాత్రను నిర్వహించారో కనిపెట్టే ప్రయత్నాన్ని సోనియా గానీ లేదా కాంగ్రెస్ గానీ చేసింది లేదు. తర్వాతి కాలంలో టెలికాం లేదా బొగ్గు అవినీతి కుంభకోణాలు బద్దలైనప్పుడు గానీ లేదా ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రా గంతులేస్తూ సంపన్నుడైపోయినప్పుడు గానీ ఆమె అలాంటి తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించలేదు. నట్వర్‌సింగ్ తన గౌరవానికి విలువనిచ్చే మనిషి. దౌత్య రంగలో ఆయన విశిష్టమైన పదవులను నిర్వహించినవారు. మంచి విషయ పరిజ్ఞానం గల వారు. సోనియా, కుటుంబంలోని మూడు తరాలకు ఆయన సన్నిహితుడు. మే సమావేశంలో సోనియా ఆయన తాను పిల్లలతో సైతం పంచుకోలేని విషయాలను పంచుకోగలిగిన ఆంతరంగికుడని కుమార్తె ప్రియాంకాగాంధీకి చెప్పారు. సోనియా, కాంగ్రెస్‌లు ఆయనను దుష్టునిగానో లేదా కపటిగానో చిత్రించే ప్రయత్నం చేయవచ్చు. కానీ మౌలికమైన ప్రశ్న మాత్రం మాయమై పోదు. ఆయన రాసిన పుస్తకం ఒట్టి చెత్త కుప్పే అయితే, ఆయన ఇంటికి పోయి ప్రాధేయపడటం కోసం ఆమె అంతటి అపారమైన మానసిక ప్రయాస పడి ఉండేవారేనా? తన నైతికతను ముక్కలు చెక్కలు చేసి, నిర్దాక్షిణ్యమైన రాజకీయ యంత్రంలో వేసి తోలు వలిచేయడంతో 2005లో నట్వర్‌సింగ్ కుంగిపోయా రనేది స్పష్టమే. అలాంటి గాయాల గుర్తులను తాత్వికత దాచలేదు. అయితే ఆయన సార్వత్రిక ఎన్నికలకు ముందే తన పుస్తకాన్ని ప్రచురించడాన్ని అనుమతించ లేదు. తద్వారా ఆయన సోనియాగాంధీకి, కాంగ్రెస్‌కు గొప్ప మేలు చేశారు. లేకపోతే మరింత ఎక్కువ నష్టం వాటిల్లేది. సోనియాగాంధీ కేవలం కాస్త గడువును సంపాదించుకోవడం కోసం మాత్రమే గాక, నిజంగానే ఆమె వైపు నుంచి తన కథనాన్ని వినిపించదలు చుకుంటే ఓ కరపత్రాన్ని గాక పుస్తకాన్నే తన పేరిట వెలువరిస్తారని ఊహించవచ్చు. ఒకప్పటి చక్రవర్తులు తమ అధికారిక కథన రచనకు అత్యుత్తములైన మేధావులను నియమించేవారు. మొఘల్ చక్రవర్తుల తర్వాత భారత్‌ను పరిపాలించిన బ్రిటిష్ రాజ్‌లోని దొరలు, దొరసానులు, దండిగా జ్ఞాపకాలను రచించిన వారు. అది, పదవీ విరమణకు చిట్టచివరి వీడుకోలుకు మధ్యన తప్పక చేయాల్సిన కర్మకాండ. 1947 తర్వాతి వారి వారసులు ‘ఇంగ్లిష్ ఇండియన్లు’ సైతం ఈ రచనా రంగంలో ఏమంత వెనుకబడింది లేదు. అదో గొప్ప వారసత్వం. అధికారాన్ని రుచి చూసినవారికి తమ చారిత్రక ప్రాధాన్యాన్ని కొలిచేది జ్ఞాపకం కొలబద్ధతోనే అని తెలుసు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశలో యాల్టా కాన్ఫరెన్స్ జరిగింది. ఆ సందర్భంగా రోజంతా సాగిన క్లిష్టమైన సంప్రదింపుల తదుపరి ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, జోసెఫ్ స్టాలిన్, విన్స్టన్ చర్చిల్ లు విశ్రాంతిగా గడుపుతుండగా... చరిత్ర తమను గురించి ఎలా అంచనా వేస్తుందోనని రూజ్వెల్డ్ విస్తుపోయారు. రూజ్వెల్డ్ నిరాశావాది, స్టాలిన్ అంతుబట్టనివాడు, చర్చిల్ ఉల్లాసవంతుడు. తనను లిఖించి తన పట్ల చర్చిల్ దయతో ప్రవర్తించాడని చరిత్ర తేల్చి చెప్పింది. దానికి తథాస్తు. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) ఎంజే అక్బర్ -
సోనియా కాదు...ప్రియాంకా రాస్తుందట!
అమ్మ ఆత్మకథ రాసేందుకు కుమార్తె సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఎవరి ఆత్మ కథ ఎవరు రాస్తున్నారనే కదా.... ఇప్పటికే మీకు అర్థం అయ్యి ఉండాలి. ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆత్మకథను ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ రాయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సోనియానే స్వయంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా అన్ని వాస్తవాలను ప్రజల ముందు పెట్టేందుకు తాను కూడా పుస్తకం రాస్తానని సోనియా రెండు రోజుల క్రితం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మాజీ కేంద్ర మంత్రి నట్వర్‌సింగ్, సోనియా ప్రధాని కాలేకపోవడానికి రాహుల్ గాంధీనే కారణమనీ, తన నానమ్మ ఇందిరాగాంధీలా తన తల్లి సోనియా కూడా రాజకీయ కుట్రలకు బలైపోతారన్న ఆవేదనతోనే రాహుల్, తన తల్లి ప్రధాని కాకుండా అడ్డుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. దీనిపై సోనియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా జీవిత చరిత్ర నేనే రాసుకుంటాను.. అందులో తానెందుకు ప్రధాని కాలేకపోయానో వెల్లడిస్తాను.. ఆ విషయమై ఇతరులెవరూ మాట్లాడకపోతేనే మంచిది అంటూ సోనియా నట్వర్‌సింగ్‌పై మండిపడ్డారు. ఇంతకీ నట్వర్‌సింగ్ వ్యాఖ్యలపై సోనియాగాంధీకి ఎందుకు అంత కోపమొచ్చినట్లు.? నిజంగానే సోనియా జీవిత చరిత్రను ప్రియాంకా గాంధీ రాస్తే అందులో అమ్మ ప్రధాని కాలేకపోవడానికి గల కారణాల్ని వివరిస్తారా.? అనేది వేచి చూడాల్సిందే. మరోవైపు సోనియా గాంధీ తన ఆత్మకథను తానే రాసుకుంటానన్న వ్యాఖ్యలపై నట్వర్ సింగ్ స్పందించారు. సోనియా నిర్ణయం సంతోషకరమన్నారు. ఆ ఆత్మకథ కోసం తాను ఎదురు చూస్తుంటానన్నారు. ప్రియాంకా గాంధీ తాజాగా తెరమీదకు రావటంతో ఆత్మకథ ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. -
సోనియాపై మరోసారి నట్వర్ వివాదస్పద వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై మాజీ విదేశాంగ మంత్రి, కాంగ్రెస్ నేత నట్వర్ సింగ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలోని ఓ హోటల్ నుంచి జాంబియా సీనియర్ నేత కెన్నెత్ కౌండాను మరో హోటల్ కు అమర్యాదపూర్వకంగా తరలించారు అని తన ఆత్మకథంలో నట్వర్ సింగ్ పేర్కొన్నారు. స్వాతంత్రం సిద్ధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 1997లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కౌండా బరకాంబ రోడ్డులోని లలిత్ సూరి హోటల్ లో బస చేశారు. లలిత్ సూరి హోటలో బస చేశారని తెలుసుకున్న సోనియా.. తనను పిలిచి కౌండాను ఒబెరాయ్ హోటల్ కు షిప్ట్ చేయాలని చెప్పారని తన ఆత్మకథ 'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్' అనే పుస్తకంలో వెల్లడించారు. ఏన్నో ఏళ్లుగా పరిచయం ఉన్న కౌండాను ఈ సమాచారాన్ని చేరవేయడం బాధించిందని నట్వర్ తెలిపారు. ఇందిరా, రాజీవ్ గాంధీలు కూడా ఆయనతో అమర్యాదపూర్వకంగా ప్రవర్తించలేదని నట్వర్ వెల్లడించారు. -
నా కథ... నేనే రాస్తా: సోనియా
-
నా కథ... నేనే రాస్తా: సోనియా
న్యూఢిల్లీ: విదేశాంగశాఖ మాజీ మంత్రి, తమ కుటుంబానికి ఒకప్పటి సన్నిహితుడైన నట్వర్‌సింగ్ తన జీవితకథపై రాసిన పుస్తకం (వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్: యాన్ ఆటోబయోగ్రఫీ)లో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా ప్రతిస్పందించారు. రాహుల్‌గాంధీ వారించటం వల్లే 2004లో సోనియాగాంధీ ప్రధాని పదవిని చేపట్టలేదంటూ నట్వర్‌సింగ్ వెల్లడించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజాలను తెలిపేందుకు త్వరలో తాను ఓ పుస్తకం రాయనున్నట్లు సోనియాగాంధీ ప్రకటించారు. గురువారం పార్లమెంట్ భవనం వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘నేనే సొంతంగా ఓ పుస్తకం రాస్తా. అప్పుడు మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. నిజం తెలియాలంటే ఏకైక మార్గం నేను రాయటమే. దీని గురించి తీవ్రంగా పరిశీలిస్తున్నా’ అని సోనియా పేర్కొన్నారు. నట్వర్‌సింగ్ వ్యాఖ్యలు తనను బాధించలేవని... ఇంతకు మించిన దారుణాలను తాను చూశానన్నారు. తన భర్త రాజీవ్‌గాంధీ హత్యకు గురి కావటం, అత్త ఇందిరాగాంధీ దేహం తూటాలతో ఛిద్రం కావటం లాంటి విషాదాలతో పోలిస్తే ఇలాంటివి తనను బాధించలేవన్నారు. సోనియా విదేశీయతను లేవనెత్తిన నట్వర్ తాను రాసిన పుస్తకంపై నట్వర్‌సింగ్ గురువారం ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరికొన్ని అంశాలను బయటపెట్టారు. ముఖ్యంగా తనపట్ల సోనియా గాంధీ వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. 45 ఏళ్లపాటు నెహ్రూ కుటుంబానికి విధేయుడిగా ఉన్న తన వంటి వ్యక్తిని భారతీయులెవరూ అంతగా అవమానించరని పరోక్షంగా సోనియా ఇటలీ విదేశీయతను ప్రస్తావించారు. భారత్‌లోనైతే ఎన్నటికీ అలా జరగదన్నారు. కానీ సోనియాలో నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడమనే రెండో భాగం ఉందన్నారు. నెహ్రూ, రాజీవ్, ఇందిరా గాంధీల ప్రవర్తన ఎప్పుడూ అలా ఉండేది కాదన్నారు. సోనియా ఎప్పుడూ రాజీవ్ భార్యలాగా ప్రవర్తించలేదని దుయ్యబట్టారు. మరోవైపు 1987లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఎవరినీ సంప్రదించకుండానే శ్రీలంకకు భారత శాంతిపరరక్షక దళాలను పంపారన్నారు. శ్రీలంక విషయంలో రాజీవ్ అనుసరించిన విదేశాంగ విధానమే చివరకు ఆయన హత్యకు దారితీసిందని చెప్పారు. పుస్తకాల మార్కెటింగ్ కోసమే: మన్మోహన్ నట్వర్‌సింగ్ కేవలం ఆయన పుస్తకానికి ప్రచారం కోసమే ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతున్నారని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ విమర్శించారు. తాను ప్రధానిగా ఉండగా ఫైళ్లు సోనియాగాంధీ ఆమోదం కోసం ఆమె ఇంటికి వెళ్లేవన్న ఆరోపణలను ఖండించారు. తనవద్ద మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్‌బారు సైతం ఆయన రాసిన పుస్తకానికి ప్రచారం కోసం తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. ‘వారు తమ ఉత్పత్తులను విక్రయించుకోవటానికి ఎంచుకున్న మార్గం ఇది’ అని మన్మోహన్ వ్యాఖ్యానించారు. వాస్తవాల వక్రీకరణ: నట్వర్‌సింగ్ వాస్తవాలను వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కాంగ్రెస్ నుంచి బహిష్కరించటంతో బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారని గుర్తు చేసింది. నట్వర్‌సింగ్ తనయుడు రాజస్థాన్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వ్యహరిస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. నట్వర్‌సింగ్‌పై పరువు నష్టం దావా వేసే అంశాన్ని ఇంకా నిర్ణయించలేదన్నారు. ప్రధాని కార్యాలయం నుంచి ఫైళ్లు సోనియా నివాసానికి ఆమోదం కోసం వెళ్లేవన్న ఆరోపణలను రాజ్యసభలో విపక్షనేత గులాం నబీ ఆజాద్ ఖండించారు. -
ఆత్మకథాస్త్రం!
సంపాదకీయం ‘ఆత్మకథలు సాధారణంగా నిజాయితీగానే ఉంటాయి. కానీ, అందులో నిజాలు ఉంటాయని మాత్రం చెప్పలేం’ అంటాడు ఒక రచయిత. బాగా సన్నిహితులైన వ్యక్తులు రాసిన ఆత్మకథలు చదివి ఆయనకు ఆ అభిప్రాయం ఏర్పడివుండొచ్చు. మహాత్మా గాంధీ ఇందుకు భిన్నం. జీవితంలో తనకు ఎదురైన సమస్యలు, వాటిపట్ల తాను అను సరించిన ధోరణులను దాచుకోకుండా వెల్లడించారు. తన కుటుంబం గురించి, తన సంతానం గురించి, వారి పోకడల గురించి కూడా నిర్మొ హమాటంగా, నిష్కల్మషంగా ఆయన రాశారు. వ్యక్తులకు ఇష్టాయిష్టా లుంటాయి. అనుభవాలుంటాయి. అనుభూతులుంటాయి. అందులో చేదువీ, తీపివీ కూడా ఉంటాయి. అయితే, ఆ వ్యక్తి రాజకీయవేత్తగానీ, మరే రంగంలోనైనా మెరిసిపోయే సెలబ్రిటీగానీ అయితే అలాంటివారి అనుభవాలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఆ గ్రంథాల్లో ఆయా ప్రము ఖులు ఎదుర్కొన్న కష్టాలు, ఎదురుదెబ్బలే కాదు... ఆ క్రమంలో వారికి తారసపడిన వ్యక్తుల గురించి వారికేర్పడివున్న అభిప్రాయాలు తెలుసు కోవాలన్న తహతహ ఉంటుంది. ఇదే సమయంలో ఆ ప్రముఖులతో పేచీ ఏర్పడినవారికి ఎంతో కొంత గుబులు కూడా ఉంటుంది. తన గురించి వారికి గుర్తున్నవేమిటో, అందులో గ్రంథస్తం చేస్తున్నవేమిటో నన్న దిగులు ఏర్పడుతుంది. ఇదంతా సర్వసాధారణం. కనుకనే దౌత్య వేత్తగా, కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడిగా, ప్రత్యేకించి రాజీవ్‌గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన నట్వర్‌సింగ్ వెలువరి స్తానన్న గ్రంథం గురించి ఎదురుచూస్తున్నవాళ్లు ఈ దేశంలో చాలా మందే ఉన్నారు. అలాంటివారిలో సహజంగానే సోనియాగాంధీ కూడా ఉంటారు. సోనియాగాంధీపై గత ఆరేళ్లుగా నట్వర్సింగ్కున్న ఆగ్రహావేశాలు గానీ, అందుకుగల కారణాలుగానీ రాజకీయాల్లో ఆసక్తిగలవారందరికీ తెలుసు. నట్వర్‌సింగ్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ‘చమురుకు ఆహారం’ స్కాంలో ఇరుక్కుని రాజీనామాచేశారు. ఆ తర్వాత ఆయన 2008లో పార్టీనుంచి కూడా తప్పుకు న్నారు. నిజానికి తప్పుకున్నారనడం కంటే ఆయన్ను తప్పించారనడమే సరైంది. కాలం గాయాలు మాన్పుతుందంటారుగానీ... ఆరేళ్ల కాలం గడిచినా నట్వర్‌ను ఆనాటి అవమానాలు దహిస్తూనే ఉన్నాయని ఆయన ఆత్మ కథ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్’ గ్రంథంనుంచి పరిమితంగా వెల్లడి చేసిన అంశాలు చదివితే అర్ధమవుతుంది. ఇవన్నీ తెలియబట్టే కాంగ్రెస్ నేతలు, మరీ ముఖ్యంగా సోనియాగాంధీ ఈ ‘బుక్ బాంబు’ గురించి బెరుకుగానే ఉన్నారు. నట్వర్ చెబుతున్నదాన్నిబట్టి చాన్నాళ్ల తర్వాత మొన్నటి మే నెలలో సోనియా తన కుమార్తె ప్రియాంకా వాద్రా వెంట రాగా ఆయన ఇంటికెళ్లారు. తాను ప్రధాని పదవి స్వీకరించకపోవడా నికి సంబంధించిన ఉదంతాన్ని గ్రంథంలో ప్రస్తావించవద్దని సోనియా విజ్ఞప్తిచేశారని, అయితే ‘వాస్తవాలను ఉన్నవి ఉన్నట్టు’గా వెల్లడిం చాలన్న దృఢనిశ్చయంతో అన్ని వివరాలనూ పొందుపరిచానని నట్వర్ చెబుతున్నారు. కానీ, అందుకు ఇంత సమయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఆయన వివరించలేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూలేని విధంగా 44 స్థానాలు మాత్రమే తెచ్చుకుని అట్టడుగుకు పోయిన కాంగ్రెస్ పార్టీకి స్వల్పకాలంలోనే నట్వర్ రూపంలో ఎదురైన మరో చేదు అనుభవమిది. దేశంలోనే అత్యంత ఉన్నతమైన ప్రధాని పదవిని అధిష్టించడానికి అవకాశం వచ్చినప్పుడు సోనియాగాంధీ తన అంతరాత్మ చెప్పినట్టే నడుచుకున్నారని, ఆ పదవిని త్యాగం చేశారని ఇన్నాళ్లుగా సాగుతున్న ప్రచారాన్ని నట్వర్ తన గ్రంథంలో తిప్పికొ ట్టారు. తన నానమ్మలా, తన తండ్రిలా తల్లి కూడా దూరమవుతుం దేమోనని రాహుల్‌గాంధీలో గూడుకట్టుకుని ఉన్న భయమే అందుకు కారణమని చెప్పారు. పార్టీ మొత్తం ఆమె వెనకున్నా, ఆమె స్వయంగా ప్రధాని పదవి చేపట్టడానికి సిద్ధపడినా రాహుల్ మాటే చివరకు నెగ్గిందని చెప్పడమంటే కాంగ్రెస్ వ్యవహారాల్లో ఆయన అప్పటినుంచే క్రియాశీలంగా వ్యవహరించారని తెలియజేయడమే. అంతేకాదు... ఆయనది ఊగిసలాట ధోరణని, దృఢమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన ధైర్యసాహసాలు ఆయనలో లేవని చెప్పడమే. ఈ ఉదం తాన్ని విశ్లేషించుకుంటే రాహుల్ నాయకత్వంలో గుజరాత్, యూపీ, బీహార్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోగానీ, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో గానీ కాంగ్రెస్ పార్టీకి ఎదురైన ఓటముల వెనకున్న కారణాలు సుల భంగానే అర్ధమవుతాయి. ఆత్మకథలో దీనిని ప్రస్తావించవొద్దని సోనియాగాంధీ నట్వర్‌ను ఎందుకు కోరివుంటారో కూడా అవగతమవుతుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక ఫైళ్లు సోనియా వద్దకు వెళ్లేవని గతంలో సంజయ బారు చెప్పినట్టుగానే ఇప్పుడు నట్వర్‌సింగ్ కూడా చెప్పారు. యూపీఏ పదేళ్ల పాలనాకాలంలో సోనియాగాంధీ ఎంత శక్తిమంతంగా వ్యవహరించారో తెలిసినవారికి ఇదేమంత ఆశ్చర్యమని పించదు. సామాన్యుడిని సమస్యలు చుట్టుముడుతున్నా యూపీఏ సర్కారు పట్టనట్టుగా వ్యవహరించడానికి ప్రధాన కారణం ఇలా రెండు అధికార కేంద్రాలు పనిచేయడమేనని ఆ సమయంలోనే రాజకీయ నిపు ణులు చెప్పివున్నారు. ఈ నిర్ణయరాహిత్యం ఎన్ని అనర్ధాలు తెచ్చిందో అందరికీ తెలుసు. అందువల్లే మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణమైన ఓటమిని చవిచూడాల్సివచ్చింది. ఇప్పుడు నట్వర్‌సింగ్ వెల్లడించిన విషయాల్లో చాలా భాగం ఆనోటా ఈనోటా పాకి దాదా పుగా అందరి ఎరుకలోనికీ వచ్చినవే. ఇక సోనియాగాంధీ రాస్తానని చెబుతున్న గ్రంథం వీటన్నిటినీ ఎలా పూర్వపక్షం చేస్తుందో చూడాలి. అంతకన్నా ముందు... నట్వర్ ఇప్పుడు వెల్లడించిన అంశాలకు అదనంగా ఆత్మకథలో ఇంకేమి ఉన్నాయో ఎదురుచూడాలి. -
పీవీ కాదు.. శంకర్ దయాళ్ శర్మ!
-
పీవీ కాదు.. శంకర్ దయాళ్ శర్మ!
1991లో ప్రధాని పదవికి సోనియా మొదటి చాయిస్ శర్మనే ఆయన ఒప్పుకోకపోవడంతో పీవీకి చాన్స్ రాహుల్ వ్యతిరేకతతో 2004లో సోనియా పీఎం కాలేదు మాజీ కేంద్రమంత్రి నట్వర్‌సింగ్ వెల్లడి న్యూఢిల్లీ: ‘1991లో మొదట అప్పటి ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మను ప్రధాన మంత్రిని చేయాలని సోనియా భావించారు. అయితే, అనారోగ్య కారణాల వల్ల ఆ ఆహ్వానాన్ని శర్మ తిరస్కరించారు. దాంతో పీవీ నరసింహారావుకు అవకాశం దక్కింది. అప్పటికి పీవీ నరసింహరావు గురించి ఆమెకేమీ తెలియదు. ఆ తరువాత కూడా వారిద్దరి మధ్య సత్సంబంధాలు ఎప్పుడూ లేవు’. ‘2004లో సోనియాగాంధీ ప్రధాని కాకుండా ఆమె తనయుడు రాహుల్ గాంధీనే అడ్డుకున్నారు. తన తండ్రి, నానమ్మ లాగానే తల్లిని కూడా చంపేస్తారేమోనన్న భయంతో సోనియా ప్రధాని పదవి చేపట్టడాన్ని రాహుల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ విషయంలో రాహుల్ చాలా మొండిగా వ్యవహరించారు. సోనియా ప్రధాని కాకపోవడానికి కారణం రాహుల్ వ్యతిరేకతే కానీ.. సోనియా చెప్పినట్లు ఆమె అంతరాత్మ చెప్పడం కాదు’.. ఇలాంటి సంచలనాత్మక సమాచారంతో విదేశాంగ శాఖ మాజీ మంత్రి, ఒకప్పుడు గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన నట్వర్ సింగ్ రాసిన ఆత్మకథ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్’ త్వరలో విడుదల కానుంది. సోనియా ప్రధాని కాకపోవడానికి వెనకున్న కారణాలను తన ఆత్మకథలో వివరించానని ఒక ఆంగ్ల వార్తాచానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో నట్వర్ సింగ్ వెల్లడించారు. ‘కుమారుడిగా రాహుల్‌కు ఫుల్ మార్కులు వేయాలి’ అని వ్యాఖ్యానించారు. ఆ విషయాలన్నీ ఆత్మకథలో రాయవద్దని కోరుతూ సోనియాగాంధీ, ఆమె కూతురు ప్రియాంక గాంధీ ఈ మే 7న తన ఇంటికి వచ్చారని నట్వర్ తెలిపారు. అయితే, వాస్తవాలను ఉన్నదున్నట్లుగా వెల్లడించాలన్న ఉద్దేశంతో అన్ని వివరాలను తన ఆత్మకథలో పొందుపర్చానని నట్వర్ స్పష్టం చేశారు. 2004, మే 18న మన్మోహన్, ప్రియాంక గాంధీ, గాంధీల కుటుంబ స్నేహితుడు సుమన్ దూబే, తాను సమావేశమైన వివరాలను ఇంటర్వ్యూలో నట్వర్‌సింగ్ గుర్తు చేసుకున్నారు. రాహుల్ వ్యతిరేకత గురించి ఆ సమావేశంలోనే ప్రియాంక తమకు వివరించారన్నారు. యూపీఏ 1 హయాంలో నట్వర్ విదేశాంగమంత్రిగా పనిచేశారు. ‘చమురుకు ఆహారం’ కుంభకోణంలో ఇరుక్కుని 2005లో పదవిని కోల్పోయారు. అనంతరం 2008లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే, కుంభకోణం విషయంలో యూపీఏ ప్రభుత్వం తననెలా బలిపశువును చేసిందో మే 7న తనతో సమావేశమైనప్పుడు సోనియాగాంధీకి వివరించానని, అప్పుడు ఆమె విచారం వ్యక్తం చేశారని నట్వర్‌సింగ్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనకా విషయాలేవీ తెలియదన్నారని, అయితే ఆమె మాటలను తాను విశ్వసించలేదని పేర్కొన్నారు. సోనియాకు తెలియకుండా, ఆమె అనుమతి లేకుండా కాంగ్రెస్‌లో ఏమీ జరగదని అందరికీ తెలుసునని నట్వర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమైన ప్రభుత్వ ఫైళ్లను పీఎంఓలోని పులోక్ చటర్జీ అనే అధికారి సోనియాగాంధీ వద్దకు తీసుకువెళ్లేవాడం టూ ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్ మీడియా సలహాదారు సంజయ్ బారు వెల్లడించిన విషయాలను నట్వర్ సింగ్ సమర్ధించారు. -
సోనియా ప్రధాని కాకుండా రాహుల్ అడ్డుకున్నారు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004 ఎన్నికల అనంతరం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని కాకుండా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ అడ్డుపడ్డారని చెప్పారు. సోనియా ప్రధాని అయితే రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీలను ఉగ్రవాదులు హతమార్చినట్టుగా ఆమెను కూడా చంపుతారేమోనని రాహుల్ బయపడ్డారని నట్వర్ సింగ్ వ్యాఖ్యానించారు. దీంతో ప్రధాని పదవిని చేపట్టరాదని రాహుల్ సోనియాకు ఖరాఖండిగా చెప్పారని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సమావేశంలో మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ, సుమన్ దూబే ఉన్నారని నట్వర్ సింగ్ వెల్లడించారు. ఈ విషయంలో ఒక కుమారుడిగా రాహుల్ ఆవేదనను అర్థం చేసుకున్నానని, అతని అభిప్రాయాన్ని పూర్తిగా గౌరవిస్తున్నాని నట్వర్ సింగ్ అన్నారు. ఈ విషయాన్ని తన ఆత్మకథలో రాయవద్దంటూ ప్రియాంక గాంధీ ఇటీవల తనను కోరారని తెలిపారు.