నా ఆత్మకథకు సీక్వెల్ వస్తోంది: నట్వర్ సింగ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ, ఇతర నేతలపై పదునెక్కిన విమర్శల్ని ఎక్కుపెడుతూ మాజీ కేంద్రమంత్రి నట్వర్ సింగ్ రాసిన ఆత్మకథ చుట్టు వివాదం ముసురుకున్న సంగతి తెలిసిందే. అయితే మరికొన్ని ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చేందుకు తన ఆత్మకథకు సీక్వెల్ రూపొందించనున్నట్టు నట్వర్ సింగ్ నిర్ణయించుకున్నారు.
ఆత్మకథకు సీక్వెల్ గా వచ్చే పుస్తకానికి 'మై ఇర్రెగ్యులర్ డైరీ' అని పేరు పెట్టారు. సీక్వెల్ ను మార్చి నెలలో మార్కెట్ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. గాంధీ కుటుంబ వ్యవహారతీరును, కాంగ్రెస్ పార్టీ నడిపించిన నాయకత్వంపై మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉంటాయని సూచనప్రాయంగా నట్వర్ వెల్లడించారు.
నట్వర్ సింగ్ రచించిన 'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్' అనే ఆత్మకథ మరో నాలుగు రోజుల్లో మార్కెట్ లోకి రానుంది. సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ కలిసిన నేపథ్యంలో ఏమైనా అంశాలను తొలగించారా అనే ప్రశ్నకు ఒక పదాన్ని కూడా తీయకుండా తన ఆత్మకథ మార్కెట్ లోకి రాబోతుందన్నారు.