
నిలదీస్తేనే దారికొస్తారు...
కొత్త కోణం
ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండేలా ఒత్తిడి తేవాలి. ఎందుకంటే కార్య నిర్వాహక వ్యవస్థ, ప్రజా ప్రతినిధులతో కూడిన శాసన వ్యవస్థకు లోబడి పనిచేయాల్సిందే. పాలనా వ్యవస్థలు విఫలమైనప్పుడు ప్రజలే వాటిని సంస్కరించే బాధ్యతను చేపట్టాలి. మలి తెలంగాణ పోరాటంలో అలాంటి చైతన్యాన్ని చూశాం. తెలంగాణ నినాదాన్నివ్వని ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రజలు గ్రామాల్లోకి అడుగుపెట్టనివ్వలేదు. ప్రజాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించని వారికి ప్రజాప్రతినిధులుగా ఉండే అర్హత లేదని నిలదీశారు.
ఓ వైపు విశ్వవిద్యాలయాల్లోని కుల దురహంకారం పేర్చిన చితిపై కాలే విద్యార్థుల శవాల కమురు వాసనలు ప్రభుత్వాధినేతల, ప్రజాప్రతినిధుల ముక్కుపుటాలకు సోకనైనా సోకవు, ఎన్నటికీ తీరని అప్పులకు తాకట్టుపడ్డ ఆడపడుచుల దేహాలు మరోవైపు వడ్డీకాసులు కురిపిస్తుంటాయి. ఇంకోవైపు అవే అప్పుల కుప్పలు రైతన్నల పాలిట యమపాశాలై రక్తాశ్రువులను కురిపిస్తుంటాయి. నాలుగన్నం మెతుకులు కరువై కాటికెళుతున్న కాగజ్‌నగర్ -సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల కుటుంబాల్లో ఆరని ఆకలి మంటలు నిత్యాగ్ని జ్వాలలై మండుతుంటాయి. నగరం నడిబొడ్డున ప్రభుత్వా సుపత్రిలో మురికినీరే తాగునీరై రోగుల ప్రాణాలు తోడేస్తుంటే... కార్పొరేట్ వైద్యం కోసం ఆడపడుచుల తాళిబొట్లు తాకట్ల చీకట్లలోకి జారుకుంటాయి. అయినా అవే అప్పులు... మళ్లీ మళ్లీ కాల సర్పాలై వెన్నాడుతూనే ఉంటాయి.
ప్రజలు ఎన్నుకున్న పాలకులు ఎవ్వరూ కిమ్మనరు. ఏ మంత్రీ నోరు విప్పడు. ‘కాల్‌మనీ పాపం’లో మేమే కాదు, ప్రతిపక్షమూ భాగస్వామేనని దబాయించైనా తప్పించుకోజూస్తారు. గొంతెత్తిన ప్రజాప్రతినిధుల నోళ్లు నిబంధనలతో మూస్తారు. నిలదీస్తేవెలివేస్తారు. ఇంతటి ఘోరంపై, నేరంపై ప్రజలకు జవాబుదారీ వహించాల్సిన చట్టసభలో చర్చకు అనుమతి లభించదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాట సరే, చట్టసభైనా వారికి అభయం ఇవ్వలేక ప్రజాప్రాతినిధ్య వ్యవస్థకే అపవాదమై నిలుస్తుంది. ప్రజా స్వామ్యంలో ప్రజాప్రతినిధులు, ప్రత్యేకించి పాలకులై అధికారం చలాయి స్తున్న వారు ప్రజల పట్ల చూపుతున్న నిర్లక్ష్యానికి ఇవన్నీ సజీవ సాక్ష్యాలు. అధికారం తమను అధికారంలోకి తెచ్చిన ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం నిత్యకృత్యమైంది. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజా స్వామ్య దేశంలో ప్రజాస్వామ్యమెక్కడని వెతుక్కోవాల్సి వస్తోంది.
ప్రజల ప్రజాస్వామ్యానికి పునాది
ప్రజాస్వామ్యాన్ని ఎందరు ఎన్ని రకాలుగా నిర్వచించినా దాని సారాంశం మాత్రం ప్రజల ప్రాతినిధ్యంతో కూడిన పాలనే. ప్రజాస్వామ్యం నిజంగానే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల నుంచి మొదలై... అంచెలంచెలుగా సమాజంలోని చిట్టచివరి మెట్టునున్న పౌరులకు సైతం అందేవరకు ప్రజా స్వామ్యాన్ని పదే పదే మనం నిర్వచించుకోవాల్సిందే. మన దేశంలో 1920 నాటి తొలి ఎన్నికల నుంచి 1935 వరకు పూర్తిస్థాయి ప్రజాస్వామ్యం లేదు. 1919 మాంటెగ్-చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలకు కొనసాగింపుగా 1920లో మన దేశంలో ఎన్నికలు జరిగాయి.
ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులేగాక బ్రిటిష్ ప్రభుత్వం లేదా కంపెనీలు సూచించిన ప్రతినిధులు సైతం ఆనాడు పాలనలో భాగస్వాములుగా ఉండేవారు. ఇదే వ్యవస్థ 1935 వరకు కొన సాగింది. 1935లో ఈ ద్వంద్వ ప్రాతినిధ్య విధానం స్థానంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులే కీలకంగా ఉండే విధానం ముందుకొచ్చింది. అయితే వ్యాపారులు, భూస్వాములు, విద్యావంతులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. స్వాతంత్య్రానంతరం ఏర్పడిన రాజ్యాంగసభ మొట్టమొదటి సారిగా 21 ఏళ్ళు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి సార్వజనీన ఓటు హక్కును అమలులోకి తెచ్చింది.
రాజ్యాంగ సభలో మనం ఎటువంటి ప్రజాస్వామ్య విధానాన్ని అవలం బించాలనే చర్చ ఉత్పన్నమైనప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు... అధ్యక్ష తరహా పాలనలో ఒకే వ్యక్తి చేతిలో అధికారం ఉండడం వల్ల అది నిరంకుశత్వానికి దారితీసే ప్రమాదం ఉంటుందని, సమష్టి ఆలోచన లకు, నిర్ణయాలకు అవకాశం ఉండే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మాత్రమే నిజమైన ప్రజల ప్రజాస్వామ్యానికి బాటలు వేస్తుందని భావిం చారు. భారత దేశంలోని భిన్నత్వానికి అదే సరైన పరిష్కారమని కూడా భావించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతి నిధులే కీలకమైన శక్తి.
సామాజిక, ఆర్థిక సమానత్వమూ కావాలి
మానవ సమాజం, చిన్న చిన్న సమూహాల నుంచి జనపదాల పరిపాలన వరకు, అటు నుంచి ఏకఛత్రాధిపత్యంగా సాగిన సామ్రాజ్యాల వరకు సాగిన చర్రితలో రకరకాల పాలనా వ్యవస్థలు అమల్లోకి వచ్చాయి. జనపదాలలో తప్ప ఇతర వ్యవస్థలన్నిటిలోనూ ప్రజల భాగస్వామ్యం శూన్యం. చక్రవర్తి లేదా రాజు తమ ఇష్టానుసారం పాలన చేశారు. మన దేశంలో బ్రిటిష్ వలస పాలనకు ముందు ఇలాంటి పాలనే సాగింది. వలస పాలకులు కొన్ని కొత్త మార్పులను తెచ్చినా... సంపూర్ణ ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పలేదు. వలస పాలకులు స్వీయ ప్రయోజనాల కోసం రాజులు, మత పెద్దలు తదితర స్థానిక అధికార వ్యవస్థలతో కుమ్మక్కయ్యారు. 19వ శతాబ్దం చివరి దశలో పాశ్చాత్య ప్రజాస్వామ్య విధానాలను ఆకళింపు చేసుకున్న జాతీయ నాయకత్వం, మధ్య తరగతి వర్గం నిజమైన ప్రజల పాలన కోసం ఉద్యమం సాగించాయి. ఫలితంగా 1920లో, 1937లో ఎన్నికలను నిర్వహించారు. అయితే పరిమిత ప్రజల భాగస్వామ్యాన్ని కలిగిన ఈ ఎన్నికల విధానాన్ని జాతీయ నాయకత్వం తిరస్కరించింది.
సంపూర్ణ ప్రజాస్వామ్యమే భారత ప్రజల లక్ష్యంగా ప్రకటించింది. ఈ క్రమానికి సమాంతరంగా సాగిన అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాటం మరో కీలక అంశం. ఆయన 1919లోనే సౌత్‌బరో కమిటీ ముందు భావి భారత ప్రజాస్వామ్య వ్యవస్థ రూపురేఖలు ఎలా ఉండాలనే దానిపై అనేక అంశాలను ప్రస్తావించారు. ఆ తరువాత సైమన్ కమిషన్ ఎదుట దేశానికి స్వాతంత్య్రం సిద్ధిస్తే అంటరాని కులాలకు ఆ పాలనలో భాగస్వామ్యం ఉండేలా చూడాలని, లేనట్లయితే అది సంపూర్ణ ప్రజాస్వామ్యం కాజాలదని వాదించారు. 1930-31 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లలో అంటరాని కులాలతో పాటు అట్టడుగు వర్గాలకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ప్రత్యేక రాజకీయ ఏర్పాట్లను కోరారు.
ప్రత్యేక ఓటింగ్ వ్యవస్థ ద్వారా అంటరాని కులాల ప్రతినిధులను ఆ సామాజిక వర్గాలే ఎన్నుకునే విధానం కోసం పట్టుబట్టి సాధించారు. అయితే గాంధీజీ నిరవధిక నిరాహార దీక్ష తో ఆ ప్రత్యేక ఓటింగ్ విధానానికి గండిపడినా, అంటరాని కులాలకు రిజర్వుడు నియోజక వర్గాలనే రాజకీయ హక్కును అంబేద్కర్ సాధించగలిగారు. ఈ కృషిచేస్తూనే ఆయన భావి భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై లోతైన అధ్యయనం చేశారు. ప్రజాస్వామ్యం అంటే వయోజన ఓటింగ్, క్రమం తప్పకుండా జరిగే ఎన్నికలు మాత్రమే కాదనీ, రాజకీయ సమానత్వంతోపాటూ సామాజిక , ఆర్థిక ప్రజాస్వామ్య ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందిస్తేనే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందని ఆయన ఒక సందర్భంగా స్పష్టం చేశారు.
గత ఆరు దశాబ్దాల్లో మన ప్రజాస్వామ్య పాలన ప్రజలకు చేరువ కాకపోగా, ప్రజాస్వామ్య భావనకే భిన్నంగా కొనసాగుతున్నది. ప్రజలను ఓట్లుగా మాత్రమే పరిగణిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళ పాత్ర మీద పెద్దగా చర్చ జరగడం లేదు. పాలనా సౌలభ్యం కోసం నిర్ణీత జనాభాకు, ప్రాంతానికి తమ ప్రతి నిధులుగా ప్రజలు ఎన్నికల ప్రక్రియ ద్వారా పార్లమెంటు, అసెంబ్లీలకు సభ్యులను పంపుతుంటారు. ప్రజల తరఫున వారే ఆయా సభలలో ప్రజల ఆర్థిక, సామాజికాభివృద్ధికి, అన్ని రకాల సమస్యల పరిష్కారానికి బాధ్యత వహించాలి. కానీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్న వారిలో అత్యధికులు తమ కోసం, తమ పార్టీ కోసం, తమ ప్రభుత్వం మనుగడ కోసమే పని చేస్తున్నారు. తమను ఎవరు ఎన్నుకున్నారో వారి ప్రయోజనాలను కాపాడాలనే స్పృహను కోల్పోతున్నారు. పైగా తమ హోదాను తరచుగా ఒక వ్యాపారంగా చూస్తున్నారు. అందువల్లనే ఎన్నికల్లో ఓట్లను నోట్లతో కొని గద్దెనెక్కాలని, గెలిచాక ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి కోట్లకు పడగలెత్తాలని తాపత్రయం. దీంతో ఎన్నికల వ్యవస్థ పైన, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపైన ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతున్నది.
నేతలు జవాబుదారీ వహించాల్సిందే
ప్రజలు ఎన్నుకున్నవారు నిజమైన ప్రతినిధులుగా చట్టసభల్లో నిలవాలంటే... ఆ ప్రక్రియ క్షేత్రస్థాయిలోనే ప్రారంభం కావాలి. అటువంటి చైతన్యం మలి తెలంగాణ పోరాటంలో చూశాం. తెలంగాణ నినాదాన్నివ్వని ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రజలు గ్రామాల్లోకి అడుగుపెట్టనివ్వలేదు. ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళు ప్రజాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించకపోతే వారికి ప్రజా ప్రతినిధులుగా ఉండే అర్హత లేదని నడి బజారులో నిలదీశారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజల డిమాండుకు తలొగ్గక తప్పలేదు. ఈ అనుభవాన్ని దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మనుగడ కోసం శక్తివంతంగా వినియోగించుకోవాలి. వివిధ నియోజకవర్గాలలోని ప్రజా సమస్యల పరిష్కా రానికి బాధ్యులు సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపీలేననే ప్రజాచైతన్యం రూపు దిద్దుకోవాలి.
చౌక్‌లు, కలెక్టర్ కార్యాలయాలు మాత్రమే కాదు ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన ప్రతినిధుల కార్యాలయాలు సైతం సమస్యల పరిష్కారం కోసం చేసే ధర్నాల వంటి పోరాటాలకు వేదికలు కావాలి. ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండేలా వారిపై ఒత్తిడి తేవాలి. ఎందుకంటే అధికా రులతో కూడిన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, ప్రజా ప్రతినిధులతో కూడిన శాసన వ్యవస్థకు కట్టుబడి పనిచేయాల్సిందే. రాజ్యాంగ రచనా సమయంలో ఆనాటి నిపుణులు చెప్పినట్టు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పాలనా వ్యవస్థలు విఫలమైనప్పుడు ప్రజలే వాటిని సంస్కరించే బాధ్యతను చేపట్టాలి. ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీ వహించేలా చేయడానికి ప్రజలు ఉద్యమించడం తప్ప ఈ రుగ్మతలకు పరిష్కారం లేదు.
మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213