‘కమలం’తోనే ‘చంద్ర’ కళ
మోడీకి మన చంద్రబాబు మక్కికి మక్కి నకలు అనలేం. ఈయన ఇంకాస్త నాజూకుగా కనిపిస్తారు. కానీ చంద్రబాబు అభివృద్ధి అంటే అంబానీల పల్లకీని మోయడమే. చిత్రంగా ఇతరులను అవినీతి అనకొండలని దూషిస్తూనే, అవినీతి కొండచిలువలను పెంచి పోషించిన పెద్దమనిషి చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తొలి ఎన్నికల ఫలితాలు జనం చేత ఎంతగా ఉత్కంఠతో ఎదురు చూసేటట్టు చేశాయో, అంతటి అనూహ్యమైన రీతిలోనే వెలువడినాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం విజయం అనూహ్యమే అయినా ఇప్పుడొక వాస్తవం. పదేళ్ల తరువాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడానికి బీజేపీతో పొత్తు కీలకపాత్ర వహించింది. బీజేపీ మతతత్వాన్ని గురించీ, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీల గురించి గతంలో చేసిన విమర్శలను చంద్రబాబు ఇప్పుడేమీ పట్టించుకోకుండా వ్యవహరించినందుకు బాగానే లాభించింది. 1999లో చంద్రబాబు ‘వాజపేయి గాలి’లో కొట్టుకొచ్చారు. ఇప్పుడు ‘మోడీ మోత’తో ఈ ఫలితాలను సాధించారని చెప్పడం నిర్వివాదాంశం.
మోడీ గాలికి ఎదురొడ్డిన ఆంధ్ర
నిజానికి ఉత్తర భారత రాష్ట్రాలతో పోల్చి చూస్తే, తెలుగు ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మోడీ గాలి బలంగా వీచినట్టు కాదు. మోడీని ఎదుర్కొనడంలో ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్ (ఎస్పీ), మాయావతి(బీఎస్పీ), అజిత్‌సింగ్ (ఆర్‌ఎల్‌డీ) సహా అంతా చేతులెత్తేశారు. బీహార్‌లో నితీశ్‌కుమార్ (జేడీ-యు), లాలూ (ఆర్జేడీ) కూడా అడ్డుకోలేకపోయారు. ఈ ఉధృతిలో కూడా వైఎస్‌ఆర్‌సీపీ ఎదురొడ్డి నిలబడడం అభినందనీయమే. వాస్తవం చెప్పాలంటే, వైఎస్‌ఆర్‌సీపీ లేకుంటే గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి చోట మోడీ, బీజేపీల నడక ఏకపక్షమైనట్టే ఇక్కడ కూడా కమల వికాసం ఏకపక్షంగా ఉండేది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు విజయం ఆయన గొప్ప కానేకాదు. అది మోడీతో పొత్తు వల్ల వచ్చిన ఫలితం. మోడీ వెనుక చేరిన కార్పొరేట్ శక్తులన్నీ మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అధ్యక్ష తరహా పాలన దిశగా నడిపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ‘భారతమాత’ను ఉద్ధరించడానికి ఒక ‘కల్కి’ అవతరించాడన్న తీరులో చెవులు చిల్లులు పడేటట్టు ప్రచారం చేశాయి.
కాంగ్రెస్, ఎస్పీల నిర్వాకం
పదేళ్ల కాంగ్రెస్ అసమర్థ, అవినీతి పాలన పుణ్యమా అని దేశం అధోగతి పాలైందని దేశమంతా ప్రచారం జరిగింది. ఈ సంగతి సత్య దూరం కాదని భావించక తప్పని పరిస్థితిని ఆ పార్టీయే కల్పించింది. ఎన్నికలకు కాస్త ముందు వరకు జరిగిన కుంభకోణాలు, లక్షల కోట్లలో ప్రజాధనం దుర్వినియోగమైన సంగతి కాంగ్రెస్ పార్టీ పట్ల కనీవినీ ఎరుగని రీతిలో ఏహ్యభావాన్ని, ఆగ్రహాన్నీ కలిగించాయి. దీనికి ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ మత కల్లోలాలు తోడైనాయి. కొద్ది మాసాలలో ఎన్నికలు జరుగుతాయనగా చోటు చేసుకున్న ఈ అల్లర్లు కేంద్రంలోని యూపీయే ప్రభుత్వం చేతగానితనంతో పాటు, ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అసమర్థత ఏపాటిదో కూడా తేటతెల్లం చేశాయి. దీని నుంచి బీజేపీ లాభం పొందింది.
కాశీపట్నం చూడరబాబూ!
మోడీ తన ప్రసంగంలో తరచూ ‘భారత మాతకు జై!’ అంటారు. అంటే భరతమాత బిడ్డలైన భారతీయులే కదా! కానీ ఆ భారతమాత బిడ్డలలోని వారే అయిన పేదవారి యెడల, అణచివేతకు గురౌతున్నవారి పట్ల ఆయనకు ఏమాత్రం సానుభూతి లేదు. ఈ వర్గాల ప్రజలను అలాగే అణచి ఉంచుతూ, అంబానీ వంటి శక్తులను నెత్తికెత్తుకోవడమే మోడీ ఎజెండా. కాంగ్రెస్ అయినా దీనికి భిన్నంగా ప్రజానుకూల ఎజెండాను ముందుకు తీసుకురాలేకపోయింది. అంబానీ అభివృద్ధి ఎజెండాయే, దేశాభివృద్ధి ఎజెండా అన్న తన వాదనను ప్రజల చేత మోడీ నమ్మించి, మభ్యపెట్టగలిగారు. అభివృద్ధి అంటే విమానాశ్రయాలూ, ఫ్లైఓవర్లూ, బహుళ అంతస్తుల భవనాలూ, కంప్యూటర్లూ వంటి వినియోగ సంస్కృతి మాత్రమేనని భ్రమ కల్పించడంలోనూ మోడీ విజయం సాధించారు.
నిరుద్యోగ సమస్యతో కునారిల్లుతున్న యువతను ‘కాశీపట్నం చూడర బాబూ!’ అన్న రీతిలో మోళీ చేశారు. విదేశీ భాగస్వామ్యంతో దేశం పారిశ్రామికంగా వృద్ధి చెందుతుందనీ, దానితో కోట్లాది ఉద్యోగాలు దొరుకుతాయనీ, యువతకు విరివిగా భృతి దొరుకుతుందనీ తనదైన ‘అభివృద్ధి నమూనా’ను యువత ముందు పెట్టి మాయ చేశారు. ఉగ్రవాదాన్ని నిరోధించడం, ప్రస్తుత ప్రభుత్వానికి చేతగాక ఊరుకున్నదనీ, తాను మావోయిస్టు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాలను అణచివేస్తానని వాగాడంబరం ప్రదర్శించారు. ఇక కాంగ్రెస్ నిర్వాకంతో నిరాశా నిస్పృహలకు లోనైన ప్రజలు ‘బలమైన నేత’ కావాలని కోరుకుంటున్న తరుణమిది. ఆ బలమైన నేతను నేనేనని మోడీ ముందుకొచ్చారు. తాత్కాలికంగానే కావచ్చు, వీటన్నిటితో ఆయన విజయం సాధించారు.
బాబుకు అధికార పక్షం కృతజ్ఞత
అలాంటి మోడీకి మన చంద్రబాబు మక్కికి మక్కి నకలు అనలేం. ఈయన ఇంకాస్త నాజూకుగా కనిపిస్తారు. కానీ చంద్రబాబు అభివృద్ధి అంటే అంబానీల పల్లకీని మోయడమే. కానీ ఇతరులను అవినీతి అనకొండలనీ దూషిస్తూనే, అవినీతి కొండచిలువలని పెంచి పోషించిన పెద్దమనిషి చంద్రబాబు. ప్రస్తుతం చంద్రబాబుతో దోస్తీ కట్టిన బీజేపీయే గతంలో ఆయనకు వంద ప్రశ్నలు గుప్పించింది. ఆ ప్రశ్నలు ఆ ఇరువురికీ కూడా ఇప్పుడు అప్రస్తుతమే. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయి ఉన్నట్టయితే, చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేయడానికి ఏమాత్రం సంకోచించని పార్టీ సీపీఎం. ఈ పార్టీ గతంలో ‘చంద్రబాబు జమానా- అవినీతి ఖజానా’ అంటూ ఒక పుస్తకమే వెలువరించింది.
చంద్రబాబు బీజేపీతో బాహాటంగా జట్టు కట్టారు. కాంగ్రెస్ వారు చంద్రబాబుతో దొడ్డితోవ చెలిమి నెరపారు. అందుకు కృతజ్ఞతగా ఈ ఎన్నికలలో చంద్రబాబుకు కాంగ్రెస్ వారు సహకరించారు. చంద్రబాబు ‘సామర్థ్యాన్ని’, ‘అభివృద్ధి దృక్పథాన్ని’ వేనోళ్ల కొనియాడుతూ ఎన్నికలకు కాస్త ముందే తెలుగుదేశం పార్టీలో చేరి సర్వం సమకూర్చి పెట్టారు. తెలుగుదేశంలో దారి లేకుంటే, పొత్తు పెట్టుకున్న బీజేపీలోకి కూడా వెళ్లిపోయారు. దీనికి తోడు ఈ కూటమికి సినీ మాయాజాలం కూడా జతైంది. అన్నను మించిన ‘తమ్ముడు’ ఒకరు వెండితెరకు మించి నటనా సామర్థ్యం ప్రదర్శించారు. తెదేపా, బీజేపీ, కాంగ్రెస్, జనసేన అనే దుష్టచతుష్టయం దివంగత నేత డాక్టర్ వైఎస్ మీద అక్కసు వెళ్లగక్కి తమ కుసంస్కారాన్ని చాటుకుంది.
ఆదుకున్న సామాన్య ప్రజానీకం
ఈ కూటమి నిజ స్వరూపాన్ని ప్రజలు గమనించకపోలేదు. అందుకే అణగారిన వర్గాలూ, గ్రామీణ పేదలూ, అణగారిన ప్రజానీకం వైఎస్‌ఆర్‌సీపీతో చేతులు కలిపి ఎదిరించారు. అందుకే ఈ మాత్రంగా అయినా కొన్ని మంచి ఫలితాలు వచ్చాయి. ప్రత్యర్థుల నుంచి దారుణమైన ఆరోపణలు వచ్చాయి. దుష్ర్పచారం జరిగిపోయింది. అయినా వైఎస్ పట్ల, ఆయన కుటుంబం పట్ల, ఆ కుటుంబానికి ఉన్న విలువల పట్ల తమ గౌరవాన్ని ప్రజలు చాటుకున్నారు. తమ కుటుంబానికి ఉన్న విశ్వసనీయతను కాపాడుతూ యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ సతీమణి విజయమ్మ, కూతురు షర్మిల ఈ పోరాటానికి నాయకత్వం వహించారు.
వారి అవిశ్రాంత కృషి వల్లనే ఈ విజయం సాధ్యమైంది. అనితర సాధ్యమైన ఈ విజయానికి అభినంద నలు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాకపోవచ్చు. కానీ, కమ్యూనిస్టులు మాత్రమే ఈ కారు చీకటిలో కాంతిరేఖలని భావించిన నా వంటి వారు సైతం తీవ్ర నిరాశలో పడిపోకుండా వైఎస్‌ఆర్‌సీపీ సాధించిన ఫలితాలు కాపాడాయి. మత తత్వవాదులనూ, కోటీశ్వరులనూ ముందుకు తేవాలన్న వర్గాల అడుగులకు మడుగులొత్తకుండా ఎదురొడ్డి నిలబడిన వారందరినీ అభినందించాలి. ఇది దేశభక్తియుత, ప్రజాస్వామిక, లౌకికశక్తుల తక్షణ కర్తవ్యం కూడా.
- (వ్యాసకర్త మార్క్సిస్ట్ విశ్లేషకులు)
డాక్టర్ ఏపీ విఠల్