భగవంతుడు కరుణామయుడు
ఆపదనుంచి కాపాడటమైనా, విజయాలు సమకూర్చడమైనా భగవంతుడు మనపట్ల మమకారంతో చేస్తాడు. ఆయన కరుణాకటాక్షాలు అటువంటివి. ఒకరోజు పొద్దుటే భక్తుడొకరు తలపై గాయంతో గుడికి వచ్చాడు. గాయం ఇంకా ఆరలేదు కాబోలు కట్టు నెత్తురోడుతూనే ఉంది. నా దగ్గరకొచ్చి ‘స్వామీ! ఆ దేవుడు నన్ను శిక్షించాడా?’ అని అడిగాడు. ‘లేదు. నీకు తగలవలసిన పెద్ద గాయాన్ని చిన్నది చేశాడు’ అని చెప్పాను.
నా మాటలు బహుశా ఆయనకు సందేహ నివృత్తి చేయలేకపోయాయి. తర్వాత వచ్చాడు. ‘అయ్యా! సరిగ్గా మీరు చెప్పినట్టే జరిగింది’ అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఆయన అడిగినదేమిటో, నేను చెప్పినదేమిటో మరిచిపోయాను. పెద్దవాడినయ్యాను కదా! అందుకే ‘ఏమి జరిగిందని?’ అడిగాను.
‘స్వామీ! నేను కారులో తిరిగి వెళ్తుండగా నా కారు టిప్పరును ఢీకొట్టింది. కారునుండి నేను పక్కకు పడిపోయాను. కారుకు జరిగిన నష్టం చూసిన వారెవరైనా డ్రైవర్ మరణించివుంటాడనే అనుకుంటారు. కానీ, నాకు చిన్న గాయం కూడా కాలేదు. ఈ ఘటన మైకులో చెప్పండి. నన్ను భగవంతుడే కాపాడాడు’ అని ఎంతో ఉద్వేగంతో అన్నాడు. భగవంతుడు మనిషి తలరాతను మార్చడు. కానీ, ఆయన కరుణాకటాక్షాలవలన దుర్ఘటన తీవ్రతను తగ్గించగలడు. ఎంసెట్ ఫలితాలు వచ్చాయి. ప్రతివారూ తమ విజయం వెనక కోచింగు సెంటర్ల ప్రోద్బలం గురించి, తల్లిదండ్రుల ప్రోత్సాహం గురించి ఏకరువుపెట్టారే తప్ప భగవంతుని ఆశీర్వచనాల గురించి ఎవరూ చెప్పలేదు. మరుసటి రోజు చిలుకూరుకు వచ్చిన విద్యార్థిని తనకు మెడిసిన్‌లో 6వ ర్యాంకు వచ్చిందని ఎంతో ఆనందంగా తెలిపింది. టీవీ ఇంటర్వ్యూలో భగవంతునికి ధన్యవాదాలు ఎందుకు చెప్పలేదని అడిగాను. ఆ అమ్మాయి మౌనంగా ఉండిపోయింది. ‘చిలుకూరు బాలాజీ వలన ర్యాంకు వచ్చిందని చెప్పకున్నా కనీసం ఆ భగవంతుని ఆశీర్వాదంవల్ల విజయం సాధించానని చెప్పవలసింది’ అన్నాను. మన విజయాలకు అతనిని కర్తగా చేస్తే, మన అపజయాలను ఆయన భరిస్తాడు.
‘కర్మణ్యే వాధికారస్తే....’
సంవత్సరాంత పరీక్షలు దగ్గరకొచ్చాయి. ఎందరెందరో విద్యార్థులు హాల్ టికెట్లు తెచ్చి, చిలుకూరు బాలాజీ ముందు పెట్టి తీసుకువెళ్తారు. అక్కడికి వచ్చే తల్లిదండ్రులకు మేము ఒకటే చెబుతాము.... ‘ఏ పరీక్ష అయినా జీవన్మరణ సమస్య కాదు. అందులో మార్కులు సాధించనివారికి బతుకులేదని కాదు. పరీక్షల గురించి పిల్లలను భయపెట్టవద్దు. అది వారి ఆలోచనాశక్తిని ఆటంకపరుస్తుంది’. అలాగే, పిల్లలకు కూడా నేను చెప్పేదొక్కటే.... ‘మీరు బాధ్యతాయుతంగా, శ్రద్ధగా చదవండి. చక్కగా పరీక్షలు రాయండి. ఫలితాన్ని భగవంతుడికి వదిలేయండి’ కృషి చేయడం మాత్రం మన కర్తవ్యం. ఫలితంపై మనకు హక్కు లేదు. మన కృషికి తగ్గ ఫలితం భగవంతుడు తప్పక ఇస్తాడు.
- సౌందర్‌రాజన్
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు