దేశ దుర్గతి ‘చేతి’ చలువే | Congress is responsible for this mean condition | Sakshi
Sakshi News home page

దేశ దుర్గతి ‘చేతి’ చలువే

Published Fri, Aug 30 2013 1:04 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM

దేశ దుర్గతి ‘చేతి’ చలువే

దేశ దుర్గతి ‘చేతి’ చలువే

 విశ్లేషణ: ప్రస్తుత పాలకుల దృష్టిలో సంస్కరణలంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 66 ఏళ్ల తర్వాత కూడా పేదరికం అంటే ఏమిటో నిర్వచించలేకపోవడం. పోషకాహార విలువలున్న భోజనాన్ని చిన్నపిల్లలకు అందజేయలేకపోవడం. నిరుద్యోగాన్ని పెంచి పోషించడం. మహిళలకు మానరక్షణ కల్పించలేకపోవడం. విదేశీ రుణాలు ఇంకా ఇంకా పెరగడం.  
 
 ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇప్ప టికే సవాలక్ష సమస్యలతో సత మతమవుతుండగా, బొగ్గు కుం భకోణానికి సంబంధించిన ఫైళ్లు మాయం కావడంతో తాజాగా మరో చక్రబంధంలో చిక్కుకు న్నారు. ఆయన వద్ద బొగ్గు మం త్రిత్వశాఖ ఉన్నప్పుడే ఎడమ చేత్తో, కుడిచేత్తో బొగ్గు గనులను అనేక ప్రైవేట్ సంస్థలకు (వీరిలో టాటాలు కూడా ఉన్నారు) దారాదత్తం చేసిన వైనం ఆ మధ్య పార్లమెం టులో చర్చకు వచ్చి నానా అభాసుపాలయ్యారు. ఇప్పుడు అందుకు సంబంధించిన ఫైళ్లే మాయమయ్యాయంటే ఆయన చేతికంటుకున్న మసిని తుడిచివేయడానికి చేస్తున్న ప్రయత్నమే అది అని ఎవరైనా అనుకుంటే అది సత్య దూరం కాబోదు. కామన్‌వెల్త్ గేమ్స్ స్కామ్‌తో ప్రారం భమై, కాగ్ నివేదికతో మరిన్ని స్కామ్‌లు వచ్చి చేరగా, అవన్నీ ఈ తాజా స్కామ్ కాళ్ల కింద బలాదూర్. ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంటు సమావేశాల్లో ఆహార భద్రత బిల్లు, తెలంగాణ వంటి అంశాలపై రభస జరిగి ఉండక పోతే, ప్రతిపక్షం బొగ్గు ఫైళ్లు మాయమైన అంశమే ప్రధానంగా చర్చకు వచ్చి ప్రధానిని బోనులో నిలబెట్టి ఉండేది.
 
 2009లో రెండవ విడత ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన సాధించిన ఘనకార్యాలేమిటని లెక్కవేయ బోతే చేతివేళ్లు, కాలివేళ్లు చాలేటట్లు లేవు. దేశ ఆర్థిక ద్రవ్య పరిస్థితులు మంటగలిశాయి. అన్ని రంగాల్లో మాంద్యం తాలూకు కారుమబ్బులు కమ్ముకొస్తున్నాయి. పీకల దాకా ధాన్యరాసులున్నా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒక వేళ తిండి గింజలు జనానికి అందుతున్నాయని అను కున్నా, పోషకాహార విలువలు లేనితనం వెంటాడుతూనే ఉంది. వ్యవసాయరంగం నాలుగు శాతం పెరుగుదల లక్ష్యంగా పెట్టుకొని రెండు పంచవర్ష ప్రణాళికలు అమలు పరచిన తర్వాత కూడా ఎక్కడి గొంగళి అక్కడే ఉంది. వంటనూనె, పప్పుదినుసుల దిగుమతులు ఈ నాటికీ తప్పడం లేదు. తిండిగింజల ఉత్పాదకత పెరుగుదల అంతంత మాత్రమే. చైనాలో 6 టన్నులు, ఎప్పటి నుంచో పండిస్తుంటే మనం ఇంకా మూడు టన్నుల దగ్గరే లెఫ్ట్ రైట్ కొడుతున్నాం.
 
 విత్తనాల సరఫరా అమెరికన్ గుత్త సంస్థ ‘మాన్‌శాంటో’ పరమైంది. వ్యవసాయం యాంత్రికీకరణ చెందడంతో రైతు కూలీలు వలసలు పోతున్నారు. ఆహార పంటల స్థానాన్ని వ్యాపార పంటలు భర్తీ చేస్తున్నాయి. వ్యవసాయ భూములను సెజ్‌లు ఆక్రమించాయి.  పంట భూములన్నీ పారిశ్రామికవేత్తల హక్కు భుక్తమవుతు న్నాయి. పరదేశీయులు, కార్పొరేట్లు భూములు కాజేసి, రైతులను కూలీలుగా మార్చేస్తున్నారు. మితిమీరిన ఎరు వుల వాడకంతో, పంట భూములు నిస్సారమైపోతున్నా యి. వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనే తక్కువ. ఆ తక్కువ కూడా రైతులకు అందటం లేదు. వ్యవసాయం గురించి మాటలు ఘనం, చేతలు శూన్యం. ప్రభుత్వం దృష్టి అంతా పారిశ్రామికరంగం మీదే.
 
 పోనీ ఆ రంగం ఏమైనా పచ్చగా ఉందా అని చూడ బోతే ప్రస్తుతం ఎండిపోయిన చేనులా ఉంది. పారిశ్రామి కోత్పత్తి సూచీ పూర్తిగా దిగజారిపోయింది. ఉత్పత్తి పడిపో యింది. ప్రభుత్వరంగ పరిశ్రమల్లో షేర్లను బజారులో అమ్మకానికి పెట్టారు. దేశంలో 248 ప్రభుత్వరంగ సంస్థ లున్నాయి. వాటిలో ప్రభుత్వ పెట్టుబడులు రూ.1,66, 849 కోట్లు. వీటి ఆదాయం రూ.1,93,903 కోట్లు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు 1991-2012 మధ్య రూ.1,13,939 కోట్ల విలువ గల షేర్లను విదేశీ, స్వదేశీ పరిశ్రమలకు అమ్మే శారు. ఈ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చుట్టింది బీజేపీ పాలనలోనే. నష్టాలు వస్తున్నాయి. అందు చేత అమ్మేస్తున్నామంటుంది మన్మోహన్ ప్రభుత్వం. ఆ ముసుగులో లాభాలు వస్తున్న  సంస్థల్లో షేర్లు కూడా అమ్మేస్తోంది. ఈ షేర్లను కొనుక్కోవడానికి బహుళజాతి సంస్థలు ఎగబడుతున్నాయి. అది సహజం. కాని అమ్మడా నికి ప్రభుత్వం అంతే ఆసక్తి చూపడం దురదృష్టకరం. అయినా అమ్మేస్తున్నదంటే సమస్తం ప్రైవేటీకరణ చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. అలాంటి లక్ష్యాన్ని పాల కుల తలల్లోకెక్కించింది ప్రపంచ బ్యాంకు.
 
 ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల సలహాలకు తలవం చి, ప్రైవేట్ రంగం, కార్పొరేట్ సంస్థలకు ప్రోత్సాహకాల పేరుతో గత మూడేళ్లలో రూ.15 లక్షల కోట్లు కుమ్మరించి నట్లు బడ్జెట్ పుస్తకాలు చెబుతున్నాయి. దేశ ఆర్థిక, ద్రవ్య పరిస్థితులు నేలచూపు చూస్తున్న మాటవాస్తవం. కానీ వారేమీ నష్టాలతో పరిశ్రమలను నడపడం లేదు. లాభాల పెరుగుదల వేగం మాత్రమే తగ్గింది. ఒక పక్క బ్యాంకుల వడ్డీరేట్లు తగ్గించకపోతే తమ పరిశ్రమలు వడ్డీ భారాన్ని భరించలేవని దొంగ ఏడుపులు ఏడుస్తూనే, మరోపక్క తమ దగ్గరున్న ధనంతో విదేశాల్లో పెట్టుబడులు పెడుతు న్నారు. పరిశ్రమలను సొంతం చేసుకుంటున్నారు. దక్షిణా ఫ్రికాలో వేలాది ఎకరాల భూములను చాప చుట్టేస్తున్నా రు.
 
 రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగిస్తున్నారు. ఓ చిన్న ఉదాహరణ. కోస్తా తీరంలో చమురు గనుల్లో నుంచి చము రు లభ్యత తగ్గిపోతోంది, గిట్టుబాటు కావడం లేదని, ధర పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి చమురు ధరను రెట్టింపు చేయించుకుంది రిలయన్స్ సంస్థ. ఇలా లాభ పడిన తర్వాత మరో చమురు భావి లభించిందని ఆ సంస్థ ప్రకటించింది. ఇదీ కార్పొరేట్ సంస్థల దేశభక్తి! పన్నులు ఎగ్గొట్టడం, దొంగలెక్కలు సృష్టించటం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇందుకు ప్రభుత్వ నిఘా విభాగమే సాక్ష్యం. 2012-13 చివరి త్రైమాసికంలో కొన్ని అనుమానాస్పద లావాదేవీల ద్వారా రూ.2,158 కోట్ల పన్నుల మేర ఎగ్గొట్టి నట్లు ఈ ప్రభుత్వశాఖ కనిపెట్టింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (సీబీడీటీ) తనిఖీల్లోనే రూ.1,408 కోట్లు లెక్క ల్లోకి రాని ఆదాయాలు, ఆస్తులు బయటపడ్డాయి.
 
 కేంద్ర ఇంటెలిజెన్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంస్థల తనిఖీల్లో మరో రూ.750 కోట్ల లావాదేవీలు వెలుగుచూశాయి. మొత్తం రూ.34,347 కోట్ల అనుమానాస్పద లావాదేవీ లను ఆర్థికశాఖ పరిశీలించింది. ఈ విధంగా ప్రభుత్వం కళ్లు కప్పి పారిశ్రామికవేత్తలు ప్రజాధనాన్ని దోచుకుంటూ, విదేశాల బాట పడుతుంటే పట్టించుకోకుండా, నిఘాను మరింత కట్టుదిట్టం చేసి ప్రభుత్వ ఖజానాకు పడిన తూట్లను మూసివేయకుండా ఆర్థిక మంత్రి నిధుల కోసం, పెట్టుబడుల కోసం జోలెపట్టుకుని దేశ దేశాలు భిక్షాటన చేయడం మన ప్రజాస్వామ్యం అసలు రూపాన్ని బట్టబ యలు చేస్తున్నది. ఇటు ప్రభుత్వం, అటు కార్పొరేట్లు జం టగా ప్రజాధనాన్ని రెండు చేతులతో దోచుకుంటున్నా యని చెప్పేందుకు ఇంతకన్నా ఏం దాఖలా కావాలి? ఖజా నాలో లోటు ఏర్పడిందనే నెపంతో పన్నులు పెంచుతు న్నారు. ధరలు పెంచడాన్ని ప్రోత్సహిస్తున్నారు. మొత్తంగా దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూడండి.
 
         పరిశ్రమల్లో ఉత్పత్తి రెండు సంవత్సరాల నుంచి స్థం భించింది.
         నిరుద్యోగం పెరుగుతోంది.
         {దవ్యోల్బణం పెరుగుదల పది శాతానికి దరిదాపుల్లో ఉండటం.
         కరెంట్ అకౌంటు లోటు సుమారు 5 శాతం.
         పెట్టుబడులు విదేశాలకు తరలిపోతున్నాయి. ప్రస్తుత సంవత్సరంలో (2013) 170 మిలియన్ డాలర్లపైనే.
         రూపాయి విలువ వారం వారం దిగజారుతున్నది.
         ఎగుమతులు, దిగుమతుల మధ్య అగాథం పెరుగు తోంది.
         అవినీతి స్కామ్‌లు వెల్లువెత్తుతున్నాయి.
         {పాజెక్టుల నిర్మాణంలో మందగమనం, ఫలితంగా వ్యయం పెరుగుదల, లాభాలు పొందడంలో ఆల స్యం, రావాల్సిన ఆదాయం తరుగు.
         దశాబ్దాలుగా తయారీ రంగం 15-17 శాతం దగ్గర నిలిచిపోవడం.
         పెరుగుదల సేవల రంగానికే పరిమితం కావడం.
         మౌలిక వసతుల కల్పన నత్తనడక.
         అన్నివిధాలా పెరుగుదలకు తోడ్పడే భూసేకరణలో అమిత జాప్యం.
         ఉపాధి పెరుగుదల నిలిచిపోవడం.
 
 మాజీప్రధాని సలహాదారు శంకర్ ఆచార్య స్వయానా ఆవిష్కరించిన  నిజాలు ఇవి. ఈ దుష్పరిణామాలన్నీ  మొదటి విడత సంస్కరణల పుణ్యమే. ఈ లెక్కన గత సెప్టెంబర్‌లో ప్రారంభించిన రెండవ విడత సంస్కరణల ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించవచ్చు.
 
 సంస్కరణలు అవసరమే కానీ ఎలాంటి సంస్కర ణలు? వితంతు వివాహాలతో కందుకూరి వీరేశలింగం, భాషా సంస్కరణల ద్వారా గిడుగు, పాతతరం కాంగ్రెస్ నాయకులు సాధించిన జమీందారీ విధానం రద్దు  వం టివి సంస్కరణలు అవుతాయే తప్ప ప్రపంచీకరణ ప్రక్రియలో పాలుపంచుకుంటూ చేపట్టేవి సంస్కరణలు కాజాలవు. ప్రస్తుత పాలకుల దృష్టిలో సంస్కరణలంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 66 ఏళ్ల తర్వాత కూడా పేద రికం అంటే ఏమిటో నిర్వచించలేకపోవడం. పోషకాహార విలువలున్న భోజనాన్ని చిన్నపిల్లలకు అందజేయలేకపో వడం. నిరుద్యోగాన్ని పెంచి పోషించడం. మహిళలకు మానరక్షణ కల్పించలేకపోవడం. విదేశీ రుణాలు ఇంకా ఇంకా పెరగడం. మన ఏలికలు సంస్కరణల పేర సాధిం చినవేమైనా ఉన్నాయంటే అవి ఇవే!
 
 తాజాగా ప్రవేశపెట్టబోతున్న సంస్కరణలలో కొన్ని మచ్చుకు ఇలా ఉన్నాయి. చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టు బడులకు తలుపులు బార్లా తెరవడం, రక్షణశాఖలో విదేశీ సంస్థల ప్రవేశానికి మార్గం సుగమం చేయడం, విదేశీ పెట్టుబడుల ప్రవేశానికి ప్రతిబంధకాలను సడలించడం, దేశంలో కార్పొరేట్ రంగం మరింతగా విస్తరించడానికి ఉన్న అవరోధాలను తొలగించడం, ప్రభుత్వరంగ పరి శ్రమల్లోకి కార్పొరేట్ రంగ ప్రవేశాన్ని వేగిరపరచడం. ఇవీ రాబోయే సంస్కరణలు కొన్ని మాత్రమే. స్వాతంత్య్రమా! నీ జాడ ఎక్కడ? ఈ ప్రశ్నకు జవాబు కోసం 2014 ఎన్నికల వరకూ వేచి ఉండాల్సిందే. తప్పదు.    
 - వి. హనుమంతరావు
 సీనియర్ పాత్రికేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement