ఇది సాంస్కృతిక నిరంకుశత్వం | cultural absolutism of in BJP rule | Sakshi
Sakshi News home page

ఇది సాంస్కృతిక నిరంకుశత్వం

Published Thu, Sep 17 2015 12:58 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

ఇది సాంస్కృతిక నిరంకుశత్వం - Sakshi

ఇది సాంస్కృతిక నిరంకుశత్వం

గోవధపై సార్వత్రిక నిషేధం విధించాలన్నది బీజేపీ ప్రభుత్వ ఆలోచన. దాని అమలుకి జైనుల పండుగను ఒక అవకాశంగా ఎంచుకున్నారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం శాకాహార ఎజెండాను తెరపైకి తెస్తున్నాయి. వివిధ కులాలకు, తెగలకు ప్రత్యేక ఆహారపు అలవాట్లున్నాయి. హిందువులలో ఎక్కువ మంది మాంసాహారులే. దళితులు, ఆదివాసులు, వెనుకబడిన కులాలు, వ్యవసాయ కులాలు మాంసాహారులే. హిందువులంతా ఒక్కటేనంటూ కొందరి ఆహారపుటలవాట్లను అందరిపై రుద్దాలనుకోవడం బీజేపీ చింతనలోనే ఉన్న లోపం.
 
 చందమామను, జాబిల్లిని రమ్మని, గోగుపూలు తెమ్మని సున్నితంగా ప్రకృ తిని ఆహ్వానించిన అనుభవం చాలా మందికి ఉంది. కానీ అదే పాటలో తమ దైన సంస్కృతిని ప్రతిబింబించే ఆహారాన్ని, అలవాట్లను కలబోసిన భాష అణగారిన వర్గాలకే బాగా పరిచయం. చందమామ రావే, సక్కంగ రావే... గొల్కొండకు బోయి. గొర్రెను తెచ్చి, నడి ఇంట్లో వేసి నాలుకపీకి, సియ్య బువ్వ మనం తిని, చీకిన బొక్క కుక్క కేస్తే... అనేది కొన్ని కులాల పాట, ఆ కులాలే పాడగల పాట. అందుకే భాషకు కులముంది. అలాగే ఆహారానికీ కులముంది. అది తెగకు, కులానికి, మతానికి ముడిపడి ఉంది. మన దేశంలో ప్రస్తుతం మతాధిపత్యాన్ని, అధికారాన్ని చలాయించడానికి ఆ ఆహారాన్నే ఆయుధంగా వాడుకుంటున్నారు. మాంసాహార నిషేధం పేరుతో అది జోరుగా సాగుతోంది.
 
 ప్రజల తిండిపై ప్రభుత్వ పెత్తనం?
 ‘‘మనం తీసుకునే ఆహారానికి ఒక స్వీయ వ్యక్తీకరణ, ఒక అస్థిత్వం కలగలసి ఉన్నాయి. అది సంస్కృతికి, సంప్రదాయానికీ సంబంధించిన అంశం. తర తరాల మానవ పరిణామ క్రమంలో ఆహారపుటలవాట్లు ఏర్పడతాయి’’ అని ఏమేలా గోమన్, కత్రిన్ సుచెర్‌లు తమ ‘ఆహారం - సంస్కృతి’ అనే పుస్తకం లో అన్నారు. అయితే ఆధిపత్య భావాలు అన్నింటిపైనా ఆంక్షలు విధించ గలవు. భాష, యాస, యోచన, తినే తిండి ఇలా దేనిపైనైనా నిషేధించగలవు. మతం పేరిటో, మరో సాకుతోనో ప్రజలు తినే తిండిని సైతం ప్రభుత్వాలు నిషేధించడాన్ని ముస్లింలే కాదు, హిందువులు సైతం జీర్ణించుకోలేకపోతు న్నారు.
 
 ఇది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు పూర్తిగా భంగకరం. మొదట మహా రాష్ట్రలో ఎద్దులు, దూడలను వధించకూడదని, వాటిని ఆహారంగా తీసుకోకూ డదని చట్టం తెచ్చారు. రాజస్థాన్ ప్రభుత్వం దాన్ని అనుసరించింది. కాగా, కొద్దిరోజుల క్రితం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రభు త్వాలు జైనుల సంప్రదాయక పండుగ ‘పర్షుయాన్’ సందర్భంగా ఒక వారం రోజులపాటు అన్ని రకాల మాంసం విక్రయాలను నిషేధిస్తున్నట్టు ప్రకటించాయి. తర్వాత ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం దాన్ని రెండు రోజులకు కుదించింది. నేటి ప్రజాస్వామ్య వ్యవ స్థలో ప్రజలు ఏ తిండి తినాలి, ఏం తినకూడదు అనేవి ప్రభుత్వాలు నిర్ణయిం చాల్సినవి కావు. అలా చేస్తే అది నిరంకుశత్వం అవుతుంది.
 
 వివిధ దేశాల ప్రజలకు విభిన్నమైన సంప్రదాయాలు, ఆచారాలు, ఆహారపుటలవాట్లున్నాయి. చైనాలో అన్నం, సోయాసాస్ తింటే, మెక్సికోలో మొక్కజొన్నలు, మిరియాలు ఉపయోగిస్తారు. ఐర్లాండు ప్రజలు ఆలుగడ్డలు, బ్రిటిష్ వాళ్లు టీ, వెన్న, ఫ్రెంచి వాళ్ళు వైన్ తమ ప్రత్యేక ఆహారంగా భావి స్తారు. అలాగే మాంసాహారంలోనూ భిన్నత్వం ఉంది. కొరియాలో కుక్కలు, చైనాలో పాములు, కప్పలు అలవాటుగా తినే మాంసాహారమే. మన దేశంలో కొన్ని కులాలలో ఎలుకలను, పిల్లులను తినే అలవాటుంది. ముస్లింలకు ఆవు, ఎద్దు మాంసం ప్రియమైనది. పైగా అది చవక. కాబట్టి నిరుపేదలైన దళి తులు, ముస్లింలకు ఆవు, ఎద్దు ప్రధాన మాంసాహారం. ఎవరి ఆహారపుటల వాట్లు వారి ప్రత్యేక సంస్కృతిని, అస్థిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక ఇక పోతే జైనులు మాంసాహారులు కాదు. కూరగాయలు తినడం కూడా వారి దృష్టిలో హింసే. అది వాళ్ళ సంస్కృతి. ఇతరులు దానిని గౌరవించడం సంస్కారం. అందరి ఆహారపుటలవాట్లను గౌరవించడం ప్రజాస్వామ్యం. అందరూ మాం సాహారులో లేదా శాకాహారులో కావాలనుకోవడం పూర్తిగా తప్పు.
 
 బీజేపీ చింతనలోనే ఉంది లోపం
 నేటి మాంసాహార నిషేధం ఏ అహింసా సామ్రాజ్యస్థాపనకో జరిగింది కాదు. గుజరాత్‌లో చాలాకాలం క్రితమే గోవధను నిషేధించారు. మహారాష్ట్రలో దాన్ని అనుసరించారు. పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు అదే బాటలో ఉన్నాయి. గోవధపై సార్వత్రిక నిషేధం విధించాలన్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆలోచన. దాని అమలులో భాగంగా జైనుల పండుగను అవకాశంగా ఎంచు కున్నారు. హిందూత్వ రాజకీయాల బీజేపీ ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం తమ శాకాహార ఎజెండాను తెరపైకి తెస్తున్నట్లుంది.
 
 మన దేశం కులాలు, తెగ లుగా విభజింపబడి ఉన్నది. వాటికి తమ ప్రత్యేక ఆహారపు అలవాట్లు న్నాయి. హిందువులలో సైతం ఎక్కువ మంది మాంసాహారులే. పైగా వారి దేవుళ్ళు, దేవతలకు మాంసం ప్రధాన నైవేద్యం. దళితులు, ఆదివాసులు, వెనుకబడిన కులాలు, వ్యవసాయ కులాలన్నీ మాంసాన్ని ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నాయి. బీజేపీ చింతనలోనే పెద్ద లోపం కనిపిస్తోంది. హిందువు లందరూ ఒక్కటేననే పేరు మీద మైనారిటీ ఆహారపుటలవాట్లను మెజారిటీ ప్రజల మీద రుద్దుతున్నారు.
 
 ముస్లిం వ్యతిరేకత కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నది. ఈనెల 25వ తేదీన ముస్లింల బక్రీద్ పండుగ ఉన్నది. జైనుల పేరు మీద ముస్లింలను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. పైగా మాంసాహారం అంటేనే ముస్లింలు తీసుకొచ్చిన అపచారంగా ప్రచారం చేస్తున్నారు. దేశంలో నేడు సంపూర్ణ శాకాహారులుగా ప్రకటించుకుంటున్న బ్రాహ్మణులతో సహా అందరూ ఒకప్పుడు మాంసాహారులే. ఆవు, ఎద్దు లేత దూడల మాంసాన్ని అత్యంత ప్రియమైన ఆహారంగా భావించినది బ్రాహ్మ ణులేనని వేదాల నుంచి పురాణాల వరకు స్పష్టంగా తెలుపుతున్నాయి. యాగాలు, క్రతువులలో వేలాది పశువులను బలిచేసేవారు. అయితే బౌద్ధాన్ని దెబ్బతీయడానికి తర్వాతి కాలంలోని వైదిక మతపెద్దలు వారికంటే ముం దుకు వెళ్ళి ‘పవిత్రత’ పేరుతో గోవధని నిషేధించారు.
 
 బుద్ధుడు మాంసాహార వ్యతిరేకి కాదు
 బౌద్ధం పశువుల హత్యాకాండను నిరసించడానికి ప్రధాన కారణం వ్యవ సాయ సంక్షోభం. ఆనాటి వ్యవసాయాధారిత సమాజంలో పశుసంపద వ్యవ సాయ పనులకు కీలకంగా ఉండేది. మితిమీరిన యాగాలు, క్రతువుల వల్ల పశు సంపద క్షీణించిపోయే ప్రమాదం వచ్చింది. అందుకే పశు సంపదను కాపాడడం కోసం బుద్ధుడు పెద్ద ఉద్యమాన్ని నడపాల్సి వచ్చింది. అయితే బుద్ధుడు ఏనాడూ మాంసాహారానికి వ్యతిరేకం కాదు. ప్రజల తిండిని, ఆహా రపుటలవాట్లను ఆయన చులకనగా చూడలేదు, వ్యతిరేకించ లేదు. పైగా ప్రజలు మాంసం పెట్టినా తినాలని, తిరస్కరించకూడదని బోధించాడు. మాంసాహారం పట్ల బుద్ధుడికి ఉన్నది వ్యతిరేకత కాదు. వ్యవసాయక సమాజ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న విచ్చలవిడి పశుసంహారాన్ని మాన్పించాలని ప్రయత్నించాడు, అదే బోధించాడు. బౌద్ధం స్వీకరించిన అశోకుడు జంతు వధపై కొన్ని ఆంక్షలు విధించినా ఏనాడూ తన అధికారాన్ని ప్రయోగించి మాంసాహారాన్ని నిషేధించేందుకు ప్రయత్నించలేదు. వారంలో కొన్ని రోజు లు మాత్రమే తమ వంటశాలలో మాంసాహారాన్ని వండకూడదనే ఆంక్ష విధించాడు.
 
 అయితే నేడు మాంసాహారంపై నిషేధం విధిస్తున్న పాలకులు పండు గలు, సంప్రదాయాల గురించే మాట్లాడుతున్నారు. కానీ మాంసాహారం వల్ల మంచి, చెడులను వివరించడం లేదు. గుండె సంబంధిత వ్యాధులున్న వాళ్ళు తప్ప మిగతా వారందరికీ మాంసాహారం తీసుకోవడం మంచిదేనని అధ్యయ నాలన్నీ భావిస్తున్నాయి. భారతదేశంలోని అత్యంత ప్రాచీన వైద్యశాస్త్రం ప్రామాణిక గ్రంథమైన ‘చరక సంహిత’ మాంసాహారం విశిష్టతను వివరిం చింది. బాలింతలు మాంసాహారం తీసుకుంటే త్వరగా కోలుకుంటారని అం దులో స్పష్టం చేశారు.
 
 ముఖ్యంగా మేక, గొర్రె మాంసాలు రక్త వృద్ధిని కలగ జేస్తాయని పేర్కొన్నారు. శరీరంలోని వివిధ అంగాల నిర్మాణంలోనూ, వాటి పనిలోనూ మాంసాహారం ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతు న్నారు. శరీరకశక్తిని పెంచే ప్రొటీన్లు ఎక్కువగా మాంసాహారం వల్లనే లభి స్తాయి. ఈ ప్రొటీన్లు గాయపడిన శరీర భాగాలను త్వరగా కోలుకునేటట్టు చేస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా అందిస్తాయి. మాంసాహారంలో ఐరన్, జింక్ సెలినియం లాంటి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఐరన్ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందని తెలిసిందే. అంతేకాదు విట మిన్ ఏ, బీ, డీలు పుష్కలంగా లభ్యమవుతాయి.
 
 వైవిధ్య విధ్వంసం అవివేకం
 అనారోగ్యకరం కాని, పోషకాహార విలువలు కలిగిన ఆహారపు అలవాట్ల విష యంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం ఒకరకంగా మూర్ఖత్వమే అవు తుంది. ఆహారపుటలవాట్లు ఒక్క రోజులో ఏర్పడేవి కావు. ఒక ప్రాంతానికి, ఒక కాలానికి పరిమితమైనవి అంతకన్నా కాదు. మనిషి చారిత్రక పరిణా మక్రమంలో పలురకాల ఆహారపుటలవాట్లను ఏర్పర్చుకున్నాడు, కొన్నింటిని తిరస్కరించాడు కూడా. రుచికరంగా ఉన్నదాన్ని, శక్తినిచ్చేదాన్ని,  ఆరోగ్యకర మైనదాన్ని స్వీకరించి కొనసాగించాడు. ఆయా దేశాల, ప్రాంతాల, ప్రదేశాల వాతావరణ, భౌగోళిక, జీవావరణ పరిస్థితులకు అనుగుణంగానే మనిషి ఆహారపుటలవాట్లు ఉన్నాయి. అంతేగానీ ప్రభుత్వాల, పాలకుల ఆదేశాలను బట్టి ఏర్పడినవి కావు.
 
కాబట్టి ఏ మతం వారు ఆ మత సంప్రదాయాలను కొనసాగించుకోవచ్చు. అందుకు భిన్నంగా అన్ని మతాలవారు ఒకే ఆహా రాన్ని తినాలనడం తప్పే, తినకూడదనడమూ కూడా తప్పే. ఆహారపుటలవా ట్లలో ఒకరి అభిప్రాయాలను మిగతా వారి మీద రుద్దడం అప్రజాస్వామికం. శాకాహారమైనా, మాంసాహారమైనా దానిని వ్యక్తి, సమూహాల స్వేచ్ఛకు వదిలిపెట్టాలి. ప్రభుత్వాలు చట్టాలు దానిని నియంత్రించడం అవివేకం. నిషే ధమే ఆయుధంగా ప్రజల సాంస్కృతిక వైవిధ్యాన్ని ధ్వంసం చేయాలనుకోవ డం మూర్ఖత్వం. అది ప్రజాస్వామ్యం మనుగడకే ముప్పు.
 (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213
 - మల్లెపల్లి లక్ష్మయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement