కొత్త సూర్యోదయాన్ని చూసిన శివరాత్రి
ఆ త్యాగాలను నేటి తరం పాలకులు గౌరవిస్తున్నారా? ఈ తరం ప్రజలు గుర్తుంచుకుంటున్నారా? నాటి కాలపు దేశభక్తులు ‘క్విట్ ఇండియా’ అన్నారు. ఇప్పుడో! అభివృద్ధి ముసుగులో నల్లదొరలు బహుళజాతి సంస్థలకు స్వాగతం పలుకుతున్నారు.
‘సై సై చిన్నపరెడ్డీ! నీ పేరే బంగరు కడ్డీ!’
తెలుగు ప్రాంతంలో ఇప్పటికీ జనం నాలుకల మీద నర్తిస్తున్న పాట ఇది. కాలం గుర్తు పెట్టుకున్న వీరుడి మీద జానపదులు కట్టిన పాట ఇది. ఆయనే గాదె చిన్నపరెడ్డి. చరిత్రపుటలలో చిన్న స్థానానికే నోచుకున్నా, ప్రజల గుండెలలో ఆయన చిరస్మరణీయునిగానే ఉన్నాడు.
భారతీయులను కలసి కట్టుగా కదిలేటట్టు చేసిన తొలి రాజకీయ నినాదం ‘వందేమాతరం’. బెంగాల్ విభజన నేపథ్యంలో 1905లో మిన్నంటిన ఆ నినాదమే దేశ ప్రజలను తొలిసారి రాజకీయంగా ఏకం చేసింది. వంగ సాహిత్యం మాదిరిగానే, వందేమాతరం ఉద్యమం ప్రభావం తెలుగు ప్రాంతాల మీద బలంగానే పడింది. అందుకు కారణం- 1906లో బిపిన్‌చంద్రపాల్ చేసిన పర్యటన. రాజమండ్రి, బెజవాడ, గుంటూరు, ఆపై మద్రాసు వరకు సాగిన పాల్ ఉపన్యాసాలు తెలుగువారిని ఉద్యమం దిశగా నడిపించాయి. జూలై 13, 1907న ఒంగోలులో జరిగిన బహిరంగ సభలో మిట్టదొడ్డి వెంకట సుబ్బారావు బెంగాల్ విభజనను తీవ్రంగా విమర్శించారు. వెనుకబడిన కొత్తపట్నం వంటి చోట కూడా ‘లాలా లజపతిరాయ్‌కీ జై’ అన్న నినాదాలు మిన్నంటాయి. రాజమండ్రిలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు తదితరుల ఉద్యమం, కాకినాడలో కెంప్ అనే అధికారికి వ్యతిరేకంగా జరిగిన అలజడి- అన్నీ అప్పుడే. ఆ తరువాత చరిత్రలో చోటు చేసుకున్న వీరోచిత ఘట్టమే కోటప్పకొండ శివరాత్రి ఉత్సవంలో చిన్నపరెడ్డి తిరుగుబాటు.
గాదె చిన్నపరెడ్డి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వాడు. 1864లో జన్మించాడు. తండ్రి సుబ్బారెడ్డి, తల్లి లింగమ్మ. ఆయన గుర్రం మీదే మద్రాసులో కూనం న ది ఒడ్డున జరిగే సంతకు వెళ్లేవాడు. అలా వెళ్లినపుడే 1907లో బాలగంగాధర తిలక్‌ను చూశాడు. ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ నినాదంతో తన గ్రామాన్ని కదిలించాడు. రైతుకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, నీలిమందు రైతుకు గిట్టుబాటు ధరకు కోసం పోరాటాలు చేశాడు. అప్పుడే జన హృదయ నేతగా ఆవిర్భవించాడు. కానీ పోలీసులకు మాత్రం సహించరాని శత్రువుగా మారాడు. ఆ నేపథ్యంలో జరిగినదే కోటప్పకొండ ఘటన.
ఫిబ్రవరి 18, 1909, శివరాత్రి పర్వదినం. జిల్లాలో నర్సరావుపేటకు సమీపంలో ఉన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కోటప్పకొండలో ఉత్సవం జరుగుతోంది. అంబరాన్ని చుంబించినట్టు ఉండే ప్రభలు, అలంకరించిన ఎద్దులు ఈ ఉత్సవం ప్రత్యేకత. ఆ రోజు జరిగే సంత కూడా అప్పటికే జాతీయ స్థాయిలో పేరెన్నికగన్నది. చిన్నపరెడ్డి కూడా స్వగ్రామం నుంచి అరవై అడుగుల ఎత్తు ప్రభ కట్టుకుని, ఎడ్లతో తిరనాళ్లకు వెళ్లాడు. ఆ సంరంభంలో ఆయన ఎద్దులు అదుపు తప్పాయి. చిన్న తొక్కిసలాట జరిగింది. దీనితో పోలీసులు జరిపిన కాల్పులకు చిన్నపరెడ్డి ఎడ్లు చనిపోయాయి. దీనిని ఆయన తీవ్రంగా ప్రతిఘటించాడు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న పోలీసులు చిన్నపరెడ్డిని అరెస్టు చేశారు. అక్కడే తాత్కాలికంగా తాటాకులతో నిర్మించిన పోలీసు స్టేషన్‌లో బంధించారు. చిన్నపరెడ్డిని విడుదల చేయాలని కోరుతూ ప్రజలు ఆందోళనకు దిగారు. వారి నోటి నుంచి వినిపించిన నినాదం - వందేమాతరం. పోలీసులు మళ్లీ కాల్పులు జరిపితే ఇద్దరు యువకులు మరణించారు. కోపోద్రిక్తులైన ప్రజలు తాటాకుల పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. చిన్నపరెడ్డితో పాటు మరో వందమందిపై కూడా కేసులు నమోదైనాయి.
విచారణ ఒక ప్రహసనంగా మారిపోయింది. ఈ కేసులో గుంటూరు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఐషర్ కార్షన్ 21 మందికి ఉరిశిక్ష, 24 మందికి కఠిన శిక్షలు విధించాడు. అయితే ఈ తీర్పు ఇచ్చిన తరువాత అతడు పదవికి రాజీనామా చేశాడు. ఈ తీర్పును చిన్నపరెడ్డి మద్రాసు హైకోర్టులో సవాలు చేశాడు. కావాలంటే తనను శిక్షించి, మిగిలిన వారిని వదిలివేయమని ఆయన కోరాడు. ఆగస్టు 13, 1910న న్యాయమూర్తి మన్రో తీర్పు వెలువరించాడు. చిన్నపరెడ్డికి మరణశిక్ష, 21 మందికి ద్వీపాంతర శిక్ష పడింది. ఆ వెంటనే శిక్షను అమలు చేశారు.
స్వేచ్ఛకోసం, స్వాతంత్య్రం కోసం, న్యాయం కోసం ఇలాంటి త్యాగాలు ఆధునిక చరిత్రలో ఎన్నో కనిపిస్తాయి. కానీ ఆ త్యాగాలను నేటి తరం పాలకులు గౌరవిస్తున్నారా? ఈ తరం ప్రజలు గుర్తుంచుకుంటున్నారా? నాటి కాలపు దేశభక్తులు ‘క్విట్ ఇండియా’ అన్నారు. ఇప్పుడో! అభివృద్ధి ముసుగులో నల్లదొరలు బహుళజాతి సంస్థలకు స్వాగతం పలుకుతున్నారు. సామ్రాజ్యవాదం ఏ రూపంలో ఉన్నా నిరోధించడానికి యత్ని స్తేనే మన త్యాగమూర్తులకు నిజమైన నివాళి కాగలదు.
సందర్భం: చిట్టిపాటి వెంకటేశ్వర్లు (వ్యాసకర్త సీపీఐ యంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు)