సమన్యాయసాధనలో ‘సమవర్తి’ | Great Tribute to Advocate Padmanabha Reddy | Sakshi
Sakshi News home page

సమన్యాయసాధనలో ‘సమవర్తి’

Published Tue, Aug 6 2013 11:55 PM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM

సమన్యాయసాధనలో ‘సమవర్తి’

సమన్యాయసాధనలో ‘సమవర్తి’

నివాళి:  న్యాయవాద వృత్తిలో విలువలు, నీతి నిజాయితీల కోసం పాటుపడిన అరుదైన న్యాయవాది పద్మనాభరెడ్డి. న్యాయవాదులు వృత్తి విలువల కోసం నిలబడితే ప్రజల హక్కులు కాపాడవచ్చునని నిరూపించారు. కేసులను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, అవసరమైతే ఉచితంగానే వాదించడం, వామపక్ష ఉద్యమాల వైపు మొగ్గు చూపడం, అండదండలు ఇవ్వడం, ప్రభావాలకు లొంగకపోవడం ఆయన నుంచి అందరూ నేర్చుకోవాలి.
 
 హైకోర్టు సీనియర్ న్యాయ వాది సి.పద్మనాభరెడ్డి మృతితో ప్రజా ఉద్యమాలకు అండదం డలందించే గొప్ప మానవతావా దిని సమాజం కోల్పోయింది. 1931, మార్చి 18న అనంతపురంజిల్లా యాడికి గ్రామంలో మధ్యతరగతి కుటుం బంలో పద్మనాభరెడ్డి జన్మించారు. తండ్రి ఓబుల్‌రెడ్డి, తల్లి సోమక్క. 5వ తరగతి వరకు యాడికి వీధి బడిలో చదివారు. 6 నుంచి 8 తరగతుల వరకు మున్సిపల్ హైస్కూ లు, తాడిపత్రిలో చదివారు. 9, ఎస్‌ఎస్‌ఎల్‌సీ లండన్ మిషన్ హైస్కూల్, గుత్తిలో చదివారు.
 
  గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్, అనంతపురం గవర్నమెంట్ కాలేజీలో బీఎస్సీ, మద్రాస్ యూనివర్సిటీలో ‘లా’ చదివారు. 1953 లో లాయర్‌గా మద్రాస్ హైకోర్టులో నమోదు చేసుకు న్నారు. అక్కడ కొంతకాలం ప్రాక్టీస్ చేసి 1954లో గుం టూరు (ఆంధ్ర హైకోర్టు)లో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 1956లో వచ్చారు.
 
 ‘‘నన్ను గుంటూరు కాలేజీలో చేర్పించిందీ, మద్రాసు లోని లా కాలేజీలో చేర్చించిందీ చిన్నపరెడ్డే. వారి ఇంట్లోనే నేను పెరిగాను. నా హైస్కూలు రోజుల నుంచి ఆయన నా గురువూ, మార్గదర్శకుడూనూ. ఇప్పుడు నేను ఏమైనా సాధించానంటే అదంతా ఆయన చలవే. జస్టిస్ చిన్నపరెడ్డి మమ్ములను ఎంత ప్రేమగా, అభిమానంగా చూశారో, దానంతటినీ నేను, నా కుటుంబ సభ్యులందరం ఎన్నటికీ మరిచిపోలేం. వాస్తవానికి నేను ఆయన లా ఛాంబర్‌లో 14 ఏళ్ల పాటు పనిచేశాను’’ అని జస్టిస్ చిన్నపరెడ్డిని గురించి చివరివరకు ఎంతో వినమ్రంగా చెప్పుకున్నారు పద్మనాభరెడ్డి.
 
 పద్మనాభరెడ్డి 60 ఏళ్ల సుదీర్ఘ కాలం క్రిమినల్ లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. హైకోర్టులో అరవై వేలకు పైగా కేసులు వాదించారు. సాధారణ ప్రజలు, పేదలు హైకోర్టులో సీనియర్ లాయర్లను నియమించుకోలేరు. వాళ్ల ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. ఫీజులు ఇవ్వలేని కేసులలో కూడా పద్మనాభరెడ్డి వాదించి గెలిపించారు. జైలులోని ముద్దాయిలు కార్డుముక్క రాసినా ఆయన స్పందించేవారు. కేసులో ముద్దాయి ధనికుడా, పేదవాడా అనే తేడా లేకుండా వాదించారు. ఆయన గురించి చెప్పడ మంటే ముద్దాయిలు, ఖైదీలు, కార్మికులు, పేదలు, న్యాయాన్యాయాల గురించి చెప్పడమే!
 
 ప్రతి క్రిమినల్ అప్పీలు కేసులో సుమారు 100 పేజీల నుంచి వెయ్యి పేజీలకుపైగా రికార్డు ఉంటుంది. తనకున్న అపరిమిత పరిజ్ఞానంతో అన్ని పేజీలను స్కాన్ చేసి అందులో మూడో, నాలుగో అంశాల మీద కేసును తీసుకొచ్చి కేసులో వైరుధ్యాలను, చట్టవ్యతిరేక అంశాలు, నిపుణుల అభిప్రాయాలు, సాక్ష్యుల సాక్ష్యాలను, సహజ న్యాయశాస్త్ర ఉల్లంఘనలను ఎత్తి చూపేవారు. వీటితో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను జోడించేవారు. ఇంత పరిజ్ఞానం ఉన్నా ఆయన అతి సాధారణ వ్యక్తిగా మన కళ్లముందు, మనతో కలిసి ఉండటం ఆయనకే చెల్లింది. ఆయన నిగర్వి, గర్వపడేవాళ్లను అసహ్యించుకునేవారు. ఏనాడు ఎవరి మీద కోపాన్ని ప్రదర్శించి ఎరుగరు. ఎవరు ఏ సలహా అడి గినా ఓపిగ్గా, వివరంగా తెలియజేసేవారు. ఎంత తీరికలేని పనిలో ఉన్నా అడిగినవారికి నవ్వుతూనే సమాధానం చెప్పేవారు. ఏ గ్రామంలోనైనా, జైలులోనైనా క్రిమినల్ కేసుల మీద చర్చ జరిగిందంటే పద్మనాభరెడ్డి పేరు చర్చకు వచ్చేది.
 
 అధికారంలో ఉన్న పార్టీ ప్రజలనే కాదు ప్రతిపక్షాల నాయకులను కూడా పి.డి. కుట్ర కేసులు పెట్టి, జైలులోకి నెట్టడం ఈ రోజుల్లో మాదిరే, ఆరోజుల్లోనూ సర్వసాధా రణంగా మారిపోయింది. ఏ రాజకీయ పార్టీతో సంబం ధంలేకుండా ఆయన కేసులు వాదించారు. ప్రభుత్వ సర్వీ సులలో ఉన్న ప్రముఖులు, ఇంచుమించు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఏదో ఒక కాలంలో కేసుల కోసమో, సలహాల కోసమో ఆయనను సంప్రదించిన వారే. ఎంతో ఓపికగా వాళ్లు చెప్పింది విని, రికార్డులు పరిశీలించి వాళ్లకు సలహాలిచ్చారు. ఆయన సలహా తిరు గులేనిది. దాన్ని వాళ్లు పాటించేవారు. ఒక్కోసారి కోర్టుకు అనుమానం వచ్చినా ఆయననే సంప్రదించేవారు. రాష్ట్రం లో వేలాది మంది న్యాయవాదులు, ప్రజలు, కొందరు న్యాయమూర్తులు ఆయనంటే అభిమానంతో ఉండేవారు. ఆయన మరణించిన తర్వాత వేలాది మంది ప్రముఖులు తరలివచ్చి నివాళులర్పించడమే ఇందుకు నిదర్శనం.
 
 ‘ఎదురుకాల్పులు’ జరిగినప్పుడు ఉద్యమకార్య కర్తలు, ప్రజలు చనిపోతుంటారు. ఎన్‌కౌంటర్లలో పోలీసు లకు కనీసం పెల్లెట్ల గాయాలైనా కావు. ‘ఎదురుకాల్పులు’ జరిగినప్పుడు పోలీసుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలా? వద్దా? అనే ప్రశ్న హైకోర్టులో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందుకువచ్చింది. కోర్టు పద్మనాభరెడ్డిని ‘అమికస్ క్యూరీ’గా నియమించింది. ‘‘ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు, పోలీసుల మీద కేసు నమోదుచేయాల్సిందే. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపా మని పోలీసులు కోర్టులో నిరూపించుకోవాలి. కేసు రిజి స్టర్ చేయకుండా పోలీసులే తీర్చునివ్వడం చట్టవ్యతిరేకం’’ అని ఆయన వాదించారు. ఆయన వాదనలను కోర్టు అంగీకరించింది. సుదీర్ఘమైన తీర్పును వెలువరించింది.
 
 అత్యవసర పరిస్థితికి ముందు నుంచే అనధికారి కంగా ఎమర్జెన్సీ ఈ రాష్ట్రంలో కొనసాగింది. పట్టుబడిన వారిని కాల్చిచంపడం, చిత్రహింసలకు గురిచేయడం, కేసులలో ఇరికించి జైళ్లలో నిర్బంధించడం పరిపాటైంది. మొదటిసారి రాష్ట్రంలో తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, మండ్ల సుబ్బారెడ్డి తదితరులపై హైదరాబాద్ కుట్రకేసును రాజ్యం బనాయించింది. ఆ తర్వాత కానూ సన్యాల్, నాగభూషణ్ పట్నాయక్, తేజేశ్వరరావు, సొరెన్‌బోస్ తదితరులపై పార్వతీపురం కుట్రకేసు పెట్టింది. రెండు కేసులలో ట్రయల్ కోర్టులు కొంత మందికి శిక్షలు విధించాయి. అప్పీళ్లు హైకోర్టుకు వచ్చాయి. హైకో ర్టులో పద్మనాభరెడ్డి వాదించారు. పార్వతీపురం కుట్ర కేసులో అందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. హైదరా బాద్ కుట్ర కేసులో నెలరోజులు పద్మనాభరెడ్డి వాదిం చారు. హైకోర్టు శిక్షను ఖరారు చేసింది. కోర్టు నుంచి బయ టకు వచ్చీరాగానే హృదయం ద్రవించి ఆయన కళ్లనీళ్లు పెట్టుకున్నారు. నాగిరెడ్డి అంటే తనకు ప్రత్యేక అభిమా నమని చెప్పు కునేవారు.
 
 విద్యార్థి దశ నుంచి ఏ ఉద్యమాలలో ఆయన పాల్గొన లేదు. అయితే వామపక్ష భావజాలమంటే మొగ్గు చూపే వాడినని ఆయనే చెప్పుకున్నారు. ఆ కారణంగానే ఆయన న్యాయవ్యవస్థకు, ప్రజలకు, న్యాయవాదులకు ఎంతో తోడ్పాటునందించారు. మన రాష్ట్రంలో నక్సలైటు ఉద్య మం మొదలైనప్పుడు ప్రజల హక్కుల అణచివేత పెరి గింది. రాజకీయ ఖైదీల కోసం డిఫెన్స్ కమిటీ రావి సుబ్బా రావు ప్రేరణతో ఏర్పడింది. ఆయన నాయకత్వంలో పత్తిపాటి వెంకటేశ్వర్లు, బి.పి.జీవన్‌రెడ్డి, కన్నాభిరాన్, మనోహర్‌రాజ్ సక్సేనా, పద్మనాభరెడ్డి కమిటీ సభ్యులుగా ఉండేవారు. ఎమర్జెన్సీ కాలంలో రాజకీయ ఖైదీల విడుదల కోసం హైకోర్టులో పద్మనాభరెడ్డి వాదించారు. రావి సుబ్బారావు చనిపోయిన తర్వాత డెమోక్రటిక్ లాయర్స్ ఫోరంకు ఆయనే ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అదే సంఘం ఇండియన్ లాయర్స్ అసోసియేషన్‌గా మారింది. చివరివరకు ఆయనే ఆ సంఘానికి ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
 
 రాజకీయ విశ్వాసాలు కలిగి ఉండటం నేరం కాదని జస్టిస్ చిన్నపరెడ్డి ఎన్నో చరిత్రాత్మక తీర్పులు హైకోర్టు, సుప్రీంకోర్టులో ఇచ్చారు. రాజ్యం మాత్రం ఇప్పటికీ రాజ కీయ విశ్వాసాలను నేరంగానే పరిగణిస్తోంది. రాజకీయ విశ్వాసాలకు సంబంధించి వాదించిన కేసుల కారణంగా ఇంటెలిజెన్స్ నివేదిక ఆయనకు వ్యతిరేకంగా ఇవ్వడంతో పద్మనాభరెడ్డి హైకోర్టు జడ్జిగా నిమాయకం రద్దయింది. జస్టిస్ కృష్ణయ్యర్, చిన్నపరెడ్డి, భగవతి వంటి వారు లాయర్స్ యూనియన్‌లో నాయకులుగా ఉండి హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులయ్యారు. ఈ వాస్తవాన్ని ఇం టెలిజెన్స్ నివేదిక తొక్కిపెట్టింది. పద్మనాభరెడ్డి జడ్జి అయి ఉంటే ప్రజలకు మరెంతో న్యాయం చేసి ఉండేవారు.
 
 క్లయింట్ ఏ రాజకీయ పార్టీకి చెందినవాడనే దాంతో లాయర్‌కు నిమిత్తం లేదు. నిషిద్ధ పార్టీకి చెందిన వాడైనా, రాజ్యాంగం మీద విశ్వాసం లేని వాడైనా కోర్టును ఆశ్ర యించవచ్చు. వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన పౌర హక్కు ను పొందవచ్చు. న్యాయం చేయమని కోరి వచ్చినప్పుడు తన విధి నిర్వహించడమే న్యాయవాది బాధ్యత. అదే సూత్రాన్ని ఆయన పాటిస్తూవచ్చారు.
 
 కేసు త్వరగా పరిష్కరించడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అది అమలుకు నోచుకోలేదు. టాలెంట్ ఉన్న సీనియర్ న్యాయవాదులను జడ్జీలుగా నియమించి మరికొన్ని కొత్త కోర్టులు ఏర్పాటు చేయటం వలన పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించవచ్చు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు మంచివే. రిటైర్డ్ జడ్జీలను ఈ కోర్టులలో నియ మిస్తే వారు అవినీతికి పాల్పడే అవకాశం ఉంది. ట్రయల్ కోర్టులు త్వరగా తీర్పులిచ్చినా అప్పీలు కోర్టులలో కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి. అప్పీలులో కొన్ని కేసులు గెలుస్తున్నాయి. దీర్ఘకాలం కేసులు పెండింగ్‌లో ఉండటం, నిందితులు జైలులో ఉండటం వలన వాళ్ల భవిష్యత్తు, కుటుంబ పరిస్థితి, ఆర్థికస్థితి నాశనమయ్యే అవకాశం ఉందని ఆయన భావించేవారు.
 
 మీ అరవై సంవత్సరాల అనుభవాలను, సమాజానికి మీరిచ్చే సందేశాలను నమోదు చేస్తే బాగుంటుందని కోరినప్పుడు మే నెలలో పూర్తి చేస్తానన్నారు. న్యాయవాద వృత్తిలో విలువలు, నీతి, నిజాయితీల కోసం పాటుపడిన అరుదైన న్యాయవాది పద్మనాభరెడ్డి. న్యాయవాదులు వృత్తి విలువల కోసం నిలబడితే ప్రజల హక్కులు కాపా డవచ్చునని నిరూపించారు. కేసులను క్షుణ్ణంగా అధ్య యనం చేయడం, అవసరమైతే ఉచితంగానే వాదించడం, వామపక్ష ఉద్యమాల వైపు మొగ్గు చూపడం, అండదండ లివ్వడం, ప్రభావాలకు లొంగకపోవడం ఆయన నుంచి అందరూ నేర్చుకోవాలి. ఆయనో విజ్ఞానఖని. ఆయన మరణం ప్రజలకు ముఖ్యంగా పీడిత వర్గాలకు తీరని లోటు. పీడిత పక్షపాతి పద్మనాభరెడ్డికి జోహార్లు.    

- వి. నారాయణరెడ్డి
 న్యాయవాది
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement