చేనేతకు జీఎస్టీ వాత
అభిప్రాయం
జీఎస్టీ పేరుతో చేతివృత్తులను, చేనేతను పూర్తిగా నాశనం చేయడానికి ప్రభుత్వం పూనుకుందా అనిపిస్తోంది. ‘స్వదేశీ’, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి నినాదాలను వినిపించే ప్రభుత్వం చేనేతలను, చేతివృత్తులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నది?
మన గ్రామీణ ఆర్థిక వ్యవ స్థలో వ్యవసాయం తరువాతి స్థానం చేనేతకు ఉంది. వలసవాదుల పరిపాలన నుండి ఈ రంగం ఎన్నో ఆటుపోట్లను చవిచూసింది. పారిశ్రామికీకరణలో భాగంగా బ్రిటన్ నుంచి వచ్చిపడిన మిల్లు దారంతో 1830లలో దేశంలోని చేతి రాట్నాలు మూలనపడ్డా యి. వాటిపై ఆధారపడ్డ స్త్రీలు ఉపాధి కోల్పోయారు. మన మగ్గాలు మిల్లు దారం వాడడం ఈ సమయం లోనే ప్రారంభమైంది. అంటే ఇంటిలో తన మగ్గంపై స్వతంత్రంగా పని చేసుకునే నేతకారుడు కూడా దారం కోసం ఎక్కడో దూరంగా ఉన్న స్పిన్నింగు మిల్లులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. దీని వలన చేనేత కొంతవరకు తన ప్రత్యేక ఉనికిని కోల్పో యింది. ఇదే తరువాత వచ్చిన పవర్‌లూమ్ అనుకర ణలకు సులభమైన తోవ చూపింది. ఈనాడు చేనేత పేరుతో అమ్మకం జరిగే ఉత్పత్తుల్లో 70% పవర్ లూమ్ అనుకరణలే.
ఆర్థిక సరళీకరణ పేరుతో రెండు దశాబ్దాల క్రితం మనదేశంలో పత్తి, దారం ఎగుమతులపై ఆంక్షలు సడలించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి పత్తి, కాటన్ దారం కోసం విపరీతమైన డిమాండ్ ఉంది. జాతీయ మార్కెట్ అవసరాలను పట్టించుకోకుండా, ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం వలన దారం కోసం అంతర్జాతీయ మార్కె ట్‌తో పోటీ పడవలసి వచ్చింది. తత్ఫలితంగా దారం ధరలకు రెక్కలొచ్చాయి. పెరుగుతున్న దారం ధరలు, విదేశీ మార్కెట్ ఒత్తిడి వలన సమయానికి దారం అందకపోవడం వంటి కారణాలతో చేనేత రంగం బాగా దెబ్బతింది. 1995లో 66లక్షలు ఉన్న చేనేత కుటుంబ జనాభా, 2010 లెక్కల ప్రకారం 44 లక్షలు మాత్రమే ఉంది. 1990వ దశకంలో దేశీయ మార్కెట్‌లో విశేష ఆదరణ పొందిన మంగళగిరి బట్ట, ఈ రోజు పవర్ లూమ్ అనుకరణల వలన తన ప్రత్యేకతను కోల్పోయింది. 1995లో 20,000ల మగ్గాలు ఉన్న మంగళగిరిలో, నేడు కేవలం 6,000 మగ్గాల వరకే పని చేస్తున్నాయి. పెరుగుతున్న నూలు ధరలు, పవర్ లూమ్ పోటీతో నలుగుతున్న చేనేత రంగంపై జీఎస్టీ గొడ్డలి పెట్టయింది.
స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తరువాత మొట్ట మొదటి సారిగా చేనేతపై పన్ను విధించారు. జీఎస్టీ కింద పేర్కొన్న ఉత్పత్తుల్లో, చేతివృత్తుల ప్రస్తావన కనిపించదు. ఇప్పటివరకు జౌళి రంగంలో మిల్లు, పవర్‌లూమ్, చేనేత అనే మూడు రంగాల విభజన జీఎస్టీతో ముగిసింది. అంటే ఇక నుంచి చేతితో తయారయ్యే బట్ట, యంత్ర సహాయంతో తయా రయ్యే బట్ట సమానం. అందుకే జీఎస్టీ సూచికలో వాడిన పదజాలం ఎగుమతుల కోసం జౌళి రం గంలో వాడే పదాలకు దగ్గరగా ఉంది. ఉదాహరణకు జీఎస్టీ లిస్టులో ‘చీర’ అనే పదం కనపడదు. ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడుపోయే ‘కుర్తా’ లేదా ‘పంజాబీ డ్రస్సు’ ప్రస్తావన కూడా లేదు.
జీఎస్టీ ‘ఒక పన్ను, ఒకే దేశం’ నినాదంతో ముందుకెళ్తూ, ఎన్నో గ్రామీణ చేతివృత్తులు, అసం ఘటిత రంగంలోని ఉపాధులను అణగదొక్కేసింది. ఈ పన్ను వలన లాభం కలిగేది పెద్ద ఎత్తున పెట్టు బడులతో నడిచే పెద్ద ఫ్యాక్టరీలకు మాత్రమే. ఉదాహ రణకు కార్ల తయారీ తీసుకుంటే, అన్ని దశల తయారీ ఒకే కప్పు కింద నిర్వహిస్తే, ప్రతి దశలో ఉత్పత్తిపై పడే పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. అందు వలన జీఎస్టీ తరువాత పెద్ద పెద్ద కార్ల రేటు తగ్గింది. ఇంటిలోని మగ్గంపై తయారయ్యే చేనేత బట్ట రేటు పెరిగింది. చేనేత వస్త్ర తయారీలో వివిధ దశలైన రంగు అద్దకం, పడుగుకు గంజిపెట్టడం, వాషింగ్ వంటి సర్వీసులపైన కూడా జీఎస్టీ విధించారు. అంటే దారం నుంచి బట్ట తయారీ ఒక కప్పు కింద ఉత్పత్తి జరిగితేనే చేనేతకు జీఎస్టీ వలన లాభం కలు గుతుంది. ఈ పన్ను తరువాత చేనేత ధరలు 5%– 10% వరకు పెరగే అవకాశం ఉంది. కొనుగోలు దార్లను చేనేత బట్ట నుంచి దూరం చేస్తుంది.
పై అంశాలను గమనిస్తే జీఎస్టీ పేరుతో చేతి వృత్తులను, చేనేతను పూర్తిగా నాశనం చేయడానికి ప్రభుత్వం పూనుకుందా అనిపిస్తోంది. ‘స్వదేశీ’, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి నినాదాలను తరచూ వినిపించే ప్రభుత్వం ‘స్వదేశీ’ ఉత్పత్తికి అద్దంపట్టే చేనేతలను, చేతివృత్తులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తు న్నదో అర్థం కాదు. చేనేతపై ఆధారపడి 44 లక్షలు, చేతివృత్తులపై ఆధారపడి 68 లక్షలు, దాదాపు కోటి కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. వీరికి కేవలం ‘బ్రాండు’ కల్పించడం, పండుగలు జరపడం వలన ప్రయోజనం కలుగదు. వారు వాడే ముడి సరుకులను పన్ను చట్రంలో ఇరికించకూడదు. వాటిపై ధరల నియంత్రణ ఉండాలి. చిన్న ఉత్పత్తి దార్లను అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీపడి ముడి సరుకుల్ని కొనుక్కోమనడం భావ్యం కాదు. వారికి అదనపు ఇబ్బందుల్ని కలిగించకపోతే, చేతివృత్తుల ఉత్పత్తులకు మార్కెట్ కొరత లేదు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వారిపై జీఎస్టీ భారం పడకుండా చేసే బాధ్యత ప్రభుత్వానిదే. చేతిలో ఉన్న అవకాశాలకు గండికొట్టి కొత్త అవకాశాలు వెదుక్కోవడం అవివేకం.
వ్యాసకర్త దస్తకార్ ఆంధ్ర‘ 9000199920
శ్యామసుందరి