ధూళి నేలకు చేరితే దృశ్యం స్పష్టం | guest colum special story on pm modi surgical strike on black money | Sakshi
Sakshi News home page

ధూళి నేలకు చేరితే దృశ్యం స్పష్టం

Published Fri, Nov 11 2016 12:13 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

ధూళి నేలకు చేరితే దృశ్యం స్పష్టం - Sakshi

ధూళి నేలకు చేరితే దృశ్యం స్పష్టం

ఇకపై అన్నీ ఆన్‌లైన్, ఈ-బదిలీ డబ్బు మార్పిళ్లు జరగాలని, రాజకీయ విరాళాలూ పార దర్శకంగా ఉండాలంటూనే రాజకీయ పక్షంగా తాము ఆర్టీఐ పరిధిలోకి రామనడం పరస్పర విరుద్ధ వాదనలు. వాటిపై ప్రజల సందేహాలకతీతంగా పాలకులు సమాధానం చెప్పా ల్సిన అవసరం ఉంది. తమ భావోద్వేగాలపై ఏలికలు ఆడుకోకుండా పౌరులు ప్రతిఘటిం చాల్సి ఉంది. రాజకీయ ప్రచార కాలుష్యంతో ఎగసిన ధూళి నేలకు చేరి దృశ్యం కనిపిస్తే స్పష్టత వస్తుంది. తొందర పడకుండా ఆగి అప్పుడు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి.

సమకాలీనం
పూర్వమొక సంపన్న రైతు ఖరీదైన చేతి గడియారం దుక్కిదున్నుతున్న తన పొలంలో పడిపోయింది. వెతికిపెట్టండని, తగిన బహుమతిస్తానని అక్కడే పనిచేస్తున్న కూలీలు, ఫామ్ పనివాళ్లు, ఇరుగుపొరుగుని కోరాడతను. అంతా పొలంలో కలయతిరుగుతున్నారు. పొలమంతా దుమ్మురే గిపోయింది. ఒక యువకుడు పక్కన నిలబడి ఇదంతా గమనిస్తున్నాడు. చీకటి పడేవరకు వెతి కారు. కానీ దొరకలే! ఆరోజుకి వెతకడం ఆపారు. పాపం రైతు నిరాశ చెందాడు. ఉదయమే ఆ గడియారంతో వచ్చాడు నిన్నటి యువకుడు. ‘ఎలా దొరికింది?’ విస్మయంగా అడిగాడు రైతు. ‘నిన్నటి సందడి చూశాక నాకర్థ మైంది అదలా దొరకదని. అందుకే, అందరూ వెళ్లిపోయాక టార్చ్‌లైట్ తీసు కొని వచ్చాను. మీరు పొలం దున్నిన ప్రాంతంలో నేలపై పాకుతూ వెతికాను. ఆ ప్రశాంతతలో... మీ గడియారం ఒకచోట, కిల్ కిల్ కిల్ కిల్ అని చిన్నగా శబ్దం చేస్తూ మట్టిపొరల్లో దొరికింది’ అని గొప్ప రహస్యం విప్పాడు.

 నూతన ఆర్థిక సరళీకరణ విధానాల నేపథ్యం, మితవాద సాంస్కృతిక శక్తులు విశ్వమంతా బలోపేతమౌతున్న ఈ తరుణంలో... పాలకుల ఏయే చర్యల వెనుక ఏ ఉద్దేశాలు దాగున్నాయో నిశిత పరిశీలనతో గుర్తిస్తే తప్ప ప్రజలు సరైన భవిష్యత్తును నిర్ణయించుకోలేని సందిగ్ధ స్థితి ఇప్పుడు నెల కొంది. దేశంలో పెద్దనోట్ల రద్దు నుంచి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలువు వరకు అన్నిటికీ ఇది వర్తిస్తుందేమో అనిపిస్తుంది. రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లయినా ఇంకా ఉద్యమ పదజాలంతో నెట్టజూస్తున్న తెలంగాణలో, రాబోయే ప్రపంచస్థాయి రాజధానే రాష్ట్ర పౌరులకు  సర్వస్వమన్నట్టు వ్యవ హరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో సర్కార్లు కల్పించే భ్రమలు ఈ కోవలోకే వస్తు న్నాయి. ప్రజల భావోద్వేగాలపైన ఆటలాడటం రాజకీయాల్లో మామూలైపో యింది. ఆ ఉచ్చులో పడకుండా తప్పించుకొని, స్థిమితంగా ఆలోచించడం ప్రజలకు కర్తవ్యంగా మారింది. ఆ కర్తవ్య నిర్వహణని బట్టే వారి భవిష్యత్తు ఉంటుందేమో! ప్రజలెదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపడం కన్నా... తమకు అనుకూలంగా మలచుకునే తెలివితేటలు రాజకీయాల్లో పెరి గాయనే భావన కలుగుతోంది. బొల్తాపడ్డ తర్వాత వారికి తెలిసొస్తోంది మోస పోయామని. ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలు, మేలు చేస్తుందను కున్న ఆయన అనుభవం విషయంలో నమ్మిన జనానికి ఎదురైందదే!

ఒక గెలుపు అనేక పాఠాలు
అమెరికా సంక్లిష్ట జననాడి పట్టడంలో మీడియా మరోమారు విఫలమైంది. జర్నలిస్టుల నైపుణ్యతా లోపం కంటే, అక్కడి మీడియాలో ‘ధృడపరచుకున్న ముందస్తు అభిప్రాయమే’ వారి రాతల్లో రాజ్యమేలినట్టు కనిపిస్తోంది. ఎప్పటి కప్పుడు ఆ రిపోర్టులు, సర్వేల ఫలితాలు చూసి అమెరికా లోపల, బయట చాలామంది ట్రంప్ గెలవడేమో అనే అనుకున్నారు. కానీ, గెలిచాడు. ప్రజా బలం ఉండి కాదని ఫలితాల తర్వాత పాపులర్ ఓటు శాతాల్ని బట్టి (47.5- 47.7) వెల్లడైంది. అదొక ఫలించిన వ్యూహం. డెమాక్రాట్ల ‘యథాతథస్థితి’పై మొహం మొత్తిన అమెరికన్ ఓటర్లకు రిపబ్లికన్ పార్టీ కన్నా కూడా వారి అభ్యర్థి ట్రంప్ ఎక్కువ నచ్చాడు. ఆయన బృందం ఎత్తుగడలు, అమెరికా సగటు పౌరుల మానసిక స్థితి, భావోద్వేగాలపై వ్యూహాత్మకంగా మాటలు చెప్పడం ఆయన విజయ రహస్యంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మహిళలకు వ్యతి రేకంగా వ్యాఖ్యలు, ఇతర దేశాల నుంచి వచ్చే ఉద్యోగ వలసల్ని నియంత్రి స్తామని, ముస్లింలను దేశంలోకి అనుమతించకూడదని చెప్పడం ఇందులో భాగమే! అందుకే, ట్రంప్ తన ప్రచార యుద్ధాన్ని ఒక్క డెమాక్రాట్లపైనే కాక కొందరు బలమైన రిపబ్లికన్లపైనా సాగించాల్సి వచ్చింది. రెండు పర్యాయాలు తనను గెలిపించడంలో కీలకపాత్ర పోషించిన శ్వేత శ్రామికుల విశ్వాసాన్ని బరాక్ ఒబామా  కోల్పోవడం తాజా ఫలితాల్లో ప్రస్ఫుటించింది. పోనీ, వారికి కొత్తగా హిల్లరీ ఏమైనా విశ్వాసం కల్పించిందా అంటే సున్నా! ఒకరకంగా,  గెలవజాలని హిల్లరీ క్లింటన్ గెలవడనుకున్న ట్రంప్‌ను గెలిపించినట్లయింది. ట్రంప్ మాటల్లో ఎంత తెంపరితనం! ఎంతటి పరస్పర విరుద్ధత! అయినా గెలవడమే విస్మయం కలిగిస్తుంది.

శాస్త్ర-సాంకేతికత, సమాచార విప్లవం తర్వాత నిజానికి అభివృద్ధి చెందుతున్న సమాజాల్లో ఏది జరక్కూడదో అదే జరుగుతోంది. ‘అమెరికాను శక్తిమంతం చేస్తా, సాంస్కృతిక వారసత్వాన్ని పునరుజ్జీవింపజేస్తా, స్థానిక నిరుద్యోగాన్ని పారద్రోలుతా, ఆర్థికవృద్ధి రేటును రెట్టింపు చేస్తా’ అన్నది ట్రంప్ ప్రధాన ఎన్నికల ప్రచార ఎజెండా. నేతలు తమ పొంతన లేని మాటల్ని విశ్వసించేలా.... పౌరుల స్థితిగతుల్ని, అవసరాల్ని, అశక్తతని ఆసరా చేసుకొని భావోద్వేగాల్ని రెచ్చగొడుతూ వారిని వశీకరించు కుంటున్నారు. అమెరికాలో 70 శాతంగా ఉన్న శ్వేతజాతి ఓటర్లలో మూడో వంతు శ్రామిక శ్వేతజాతీయులే (డబ్ల్యూడబ్ల్యూసీ) కావడం ఆయనకు, ఆయన ప్రచార ఎత్తుగడకి కలిసొచ్చింది. అందులోనూ అత్యధికులు డిగ్రీ కూడా లేని నిరుద్యోగులు. రిపబ్లికన్ల విధానాలేవీ నిరుద్యోగులకు కొత్త విశ్వాసాన్ని కలి గించేవి కాదు, స్థానిక నిరుద్యోగం వంటి జటిల సమస్యలకు పరిష్కారమున్న పరిస్థితీ కాదు.

కానీ... ‘ట్రంప్ ఏదో చేసేలా ఉన్నాడు’అనే భావన వారిలో కలిగించిందాయన ప్రచార బృందం. అలాంటప్పుడు దేశానికి నాణ్యమైన, నైపుణ్యం గల శ్రామికశక్తి ఎలా వస్తుంది? పారిశ్రామికవృద్ధి మందగించదా? ఒకవైపు పన్నులు తగ్గిస్తామని చెప్పి మరోవైపు ఆర్థికవృద్ధి రేటు రెట్టింపు చేస్తామనడమూ పరస్పర విరుద్దమైన మాటే అనే అభిప్రాయ ముంది. ఇరుగు పొరుగుతో కుదుర్చుకున్న స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాల గతేంటి? కార్పొరేట్లకు వ్యతిరేకంగా వెళ్లగలరా? ఇప్పుడివన్నీ శేషప్రశ్నలే! కొంత కాలం గడిచాక ప్రజ లకివన్నీ గుణపాఠాలవుతాయి. ఓ యూరప్ మేధావి విశ్లేషించినట్టు, ‘సంపన్నులు పేదల మధ్య పెరుగుతున్న అంతరాలు పాలకుల పట్ల పేదల్లో అసంతృప్తి, నిస్పృహకు దారితీస్తాయి. అవి క్రమంగా బలపడి వారిలో వివేచనకు బదులు అసహనాన్నీ, విరకిన్తీ పెంచుతున్నాయి. సదరు విరక్తి నుంచి విముక్త మౌతున్నామన్న భ్రమల్ని అవకాశవాద నేతలు సొమ్ముచేసుకోవడానికి ప్రత్యక్ష నిదర్శనం యూరోపియన్ యూనియన్ నుంచి ‘బ్రెగ్జిట్’ సాధించిన క్యాంపు, ట్రంప్ బృంద విజయాలు’ అన్న ఆయన విశ్లేషణ అక్షర సత్యం!

 ఈ మెరుపుదాడి ముందడుగే, కానీ...
నల్లధనం, నకిలీ నోట్లపై మన ప్రధాని మోదీ జరిపిన మెరుపుదాడి ఈ దిశలో ముందడుగే అయినప్పటికీ కొన్ని సందేహాలున్నాయి. అవినీతికి, అసమాన తలకు కారణమవుతున్న నల్లధనాన్ని నియంత్రించే చర్యల పరంపరలో రూ. 1000, 500 నోట్లను రద్దు చేయడం ఒకటనుకున్నా... ఇదే సర్వస్వం కాదు. అనుమానితుల అపరిమిత స్థిరాస్తుల మూలాలు వెతకడం, పెట్టుబడుల నైతి కతను పరీక్షించడం, విదేశీ సంపదని వెలికితీయడం, బినామీ వ్యవహారాల నిగ్గుతేల్చడం, బ్యాంకుల్లోని ఎన్పీయేల్ని ముక్కుపిండి రాబట్టడం... ఇలా వివిధ చర్యల్ని సమీకృతం చేసి నల్లకుబేరుల ఆట కట్టించాలి.

లేకుంటే సామాన్యుల కష్టాలు తప్ప ఏమీ మిగలవు. మళ్లీ స్వల్ప కాలంలోనే నల్లనగదు గుట్టలుగా పేరుకుపోవడం ఖాయం. విస్తృతార్థంలో వాడే ‘నల్లధనం’కు కేంద్ర ప్రభుత్వ పెద్దలిస్తున్న పరిమిత నిర్వచనమే లోపభూయిష్టంగా ఉంది. నిజానికి చట్టపరిధి, చట్టవ్యతిరేక వ్యవహారాలేవైనా... వాటి ద్వారా గడించి, పన్ను ఎగవేతతో లెక్కచూపని స్థూల ‘సంపద’నంతా మనం నల్లధనమని  వ్యవహరిస్తాం. అది ఎన్నెన్నో రూపాల్లో ఉంటూ వస్తోంది. స్థిరాస్తులు, షేర్లు, కంపెనీల్లో వాటాలు, నగలు, విదేశీ ఆస్తులు, విలాస జీవితాలు.. ఇలా రక రకాలుగా ఉండొచ్చు. దాంట్లోంచి గోప్యంగా దాచుకునే/చలామణిలో పెట్టే ‘నగదు’ ఒక భాగం మాత్రమే!  వివిధ మార్గాల్లో కొంత తెలివిగా వ్యవహరిస్తే అదంతా కూడా నల్లధనంగా దొరక్కపోవచ్చు, కొంతైనా మార్చుకోవచ్చనేది మరో విశ్లేషణ. 25 కోట్ల జన్‌ధన్ ఖాతాలున్నాయి.

అటువంటి వాటిలోకి మళ్లించే యత్నాలు సాగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కానీ, నల్లధనాన్ని కొల్ల గొట్టడంలో ఇదొక్కటే సర్వరోగ నివారిణి అన్నట్టు చేస్తున్న ప్రచారం, తద్వారా లభించే ఖ్యాతి అంతా తమ రాజకీయ ఖాతాలో పడాలని పాలకపక్షం పడు తున్న పాట్లు విస్మయం కలిగిస్తున్నాయి. ఇంతపెద్ద నిర్ణయం తీసుకున్నపుడు, ప్రజల పక్షంలో యోచించి, వారికి అసౌకర్యం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం ముఖ్యం. 1946లో అంటే, అది స్వతంత్రానికి పూర్వం, 1978 నాటి పెద్ద నోట్ల రద్దుకి నేటి పరిస్థితికి చాలా తేడా ఉంది. నాడు 500, 1000, 10,000 నోట్లు కలిగి ఉండటం దేవుడెరుగు, కళ్ల చూసిన వాళ్ల సంఖ్య కూడా నామమాత్రం. సగటు జీవితాల్లో ఇప్పుడదొక అవిభాజ్య భాగం. మన మొత్తం కరెన్సీలో 87 శాతం ఈ రెండు నోట్లే అంటే అర్థం చేసుకోవాలి. ప్రధాని ప్రకటన తర్వాత 4 గంటల్లో రద్దు చేసి, సగటు పౌరులకు లెక్కలేని కష్టాలు చవిచూపిస్తున్నారు.

 వైరుధ్యాలొద్దనేది జనవాణి
ప్రతినోటూ బ్యాంకుల తనిఖీకి వస్తుంది కనుక దాచుకున్న నల్లధనంతోపాటు చెలామణిలో ఉన్న నకిలీనోట్లూ దొరికిపోనున్నాయి. ఇవన్నీ బాగున్నా ప్రభుత్వ పెద్దల ప్రకటనల్లో అనేక వైరుధ్యాలున్నాయి. ‘విదేశాల్లో మగ్గుతున్న మనదేశపు పెద్దమొత్తపు నల్లధనాన్ని దేశానికీడ్చితెస్తామని రెండున్నరేళ్ల కింద ఇచ్చిన ఎన్నికల హామీకి అతీగతీలేదేం?’ అని ఎవరూ ప్రశ్నించకుండా ఇదొక ఎత్తుగడ తప్ప పెద్దనోట్ల రద్దు కొత్తదేమీ కాదని ఇతర రాజకీయ పక్షా లంటున్నాయి. ఎన్డీయే ముఖ్యుల ప్రచారం మాత్రం గోరంత చర్యలకు కొండంతగా ఉంది. ముఖ్యంగా పెద్దనోట్ల రద్దుకు నిర్ణయించిన సమయం, డబ్బు కదలికలపై విధించిన ఆంక్షలు... ఉత్తరాది ముఖ్య రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లతో పాటు గోవా, మణిపూర్‌లలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అవినీతిని అందరూ వ్యతిరేకిస్తారు.

అక్రమంగా సంపాదించిన నల్లడబ్బుతో నడుపుతున్న సమాంతర ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేస్తామంటే కచ్చి తంగా మద్దతిస్తారు. కానీ, ఇవే భావోద్వేగాల్ని రాజకీయంగా వాడుకొని పబ్బం గడుపుతామంటే హేతుబద్ధంగా ఆలోచించే వారెవరైనా విమర్శిస్తారు. అంత మాత్రాన వారంతా నల్లకుబేరులకు వత్తాసు పలుకుతున్నారని ఎదురు దాడి చేయడం సముచితం కాదు. పెద్దనోట్ల రద్దు ‘తగినంత’ ముందుగానే అస్మదీయులకు లీకైందని, ఆమేరకు ఎక్కడికక్కడ సర్దుకున్నారనేది ఓ విమర్శ.

2000 నోటు కూడా తీసుకురావడం అనుమానాస్పదమే. ఇకపై అన్నీ ఆన్‌లైన్, ఈ-బదిలీ డబ్బు మార్పిళ్లు జరగాలని, రాజకీయ విరాళాలూ పారదర్శకంగా ఉండాలంటూనే రాజకీయ పక్షంగా తాము ఆర్టీఐ పరిధిలోకి రామనడం పర స్పర విరుద్ధ వాదనలు. వాటిపై ప్రజల సందేహాలకతీతంగా పాలకులు సమా ధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తమ భావోద్వేగాలపై ఏలికలు ఆడు కోకుండా పౌరులు ప్రతిఘటించాల్సి ఉంది. రాజకీయ ప్రచార కాలుష్యంతో ఎగసిన ధూళి నేలకు చేరి దృశ్యం కనిపిస్తే స్పష్టత వస్తుంది. తొందర పడ కుండా ఆగి అప్పుడు తీసుకునే ప్రజల నిర్ణయాలు వారికే మేలు చేస్తాయి.

 

 




ఈ-మెయిల్: dileepreddy@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement