జనసభలో మాట్లాడుతున్నా..ఆశీర్వదించండి!
అహ్మదాబాద్: గుజరాత్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. లోక్ సభలో మాట్లాడనివ్వడంలేదనీ అందుకే తను జనసభలో మాట్లాడుతున్నానంటూ పార్లమెంటులో ప్రతిపక్షాల చేస్తున్న ఆందోళనపై విరుచుకుపడ్డారు. పేదల వికాసం కోసమే పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా, నల్ల డబ్బు కు వ్యతిరేకంగా, నకిలీ కరెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్టు మోదీ చెప్పారు. గుజరాత్‌లో దీసాలో శనివారం ఓ సభలో మోదీ పెద్ద నోట్ల రద్దును పూర్తిగా సమర్థించుకన్నారు. దేశాన్ని పట్టిపీడిస్తోన్న నల్లధనాన్ని నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు నిలబడి సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని, బ్యాంకర్లు ఈ-వ్యాలెట్‌ల ద్వారా బ్యాంకులనే మీ మొబైల్ ఫోన్లలోకి తీసుకొచ్చారని చెప్పారు. వాటిని ఉపయోగించుకుంటూ నగదురహిత లావాదేవీలు జరపాలని పిలుపునిచ్చారు. నల్లధనం దాచుకున్న అక్రమార్కులు ఒక్కరు కూడా తప్పించుకోవడానికి వీల్లేదని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రైతుల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చామని అన్నారు. నన్ను విమర్శించండి...కానీ నగదు రహిత లావాదేవీలు, మొబైల్ బ్యాంకింగ్ పై ప్రజలకు అవగాహన క్పలించాలని ప్రతిపక్షాల్నికోరారు.
నల్లధనంపై పోరులో 50 రోజులు గడువు అడిగాం.. ఇపుడు ఎలాంటి మార్పులు వస్తున్నాయో మీరు చూస్తున్నారని మోదీ చెప్పారు. నకిలీ కరెన్సీని, అవినీతిని దేశం ఎట్టి పరిస్తితుల్లోనూ సహించదు. ఈ విషయంలో మీ దీవెనలు కావాలంటూ ప్రజలనుద్దేశించి మోదీ కోరారు. ఇపుడు ప్రజల శక్తి బలం పెరుగుతోంది. రూ.100నోట్లను సరఫరాను పెంచామంటూ ప్రధాని ప్రసంగిచారు.