మగ్గాల ఆకలికేకలు ఇంకెన్నాళ్లు?
పర్యావరణాన్ని కాపాడుతూ, గ్రామీణ స్థాయిలో ఉపాధి కల్పిస్తూ, ఆర్థిక రంగంపై భారం పడకుండా మనగలిగే సామర్థ్యం కేవలం చేనేత రంగానికే ఉంది. ఈ రంగం వృద్ధి చెందితే ప్రభుత్వం చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ వృద్ధి రేటు సాధించవచ్చు.
తెలంగాణలో చేనేత రంగం విస్తృత స్థాయిలో ఉన్నది. నిజామాబాద్, ఆదిలా బాద్, ఖమ్మం జిల్లాల్లో మినుకు మినుకు మంటున్న ఈ పరిశ్రమ ఇతర జిల్లాల్లో పూ ర్తిస్థాయిలోనే ఉంది. తెలంగాణలో వలస వెళ్లిన మొట్టమొదటి కుటుంబాలు చేనేత రంగంనుంచే. వీళ్లు గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వెళ్లారు. కొందరైతే భివాండి వంటిచోట్ల పవర్‌లూమ్ పని నే ర్చుకుని వచ్చి ఇక్కడ మరమగ్గాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆధునిక కాలంలో చేనేతకు మంచి భవిష్యత్తు ఉంది. అయితే, ఆదుకోవాల్సిందీ, ఆసరా కల్పించాల్సిందీ తెలం గాణ సమాజమే. చేనేత కుటుంబాలకు ప్రధాన సమస్య చాలినంత ఆదాయం ఈ వృత్తిలో లభించకపోవడమే.
యాం త్రికీకరణవల్లా, అనైతిక పోటీవల్లా, ప్రభుత్వాల వివక్ష వల్ల చేనేత ఎంతో నష్టపోతున్నది. ఇటు నూలు ధరల మధ్య విప రీత భేదం ఉండటం చేనేత వస్త్రాల ధరలను పెంచుతోంది. దీనివల్ల మార్కెట్‌లో దానికి తగినంత ఆదరణ కరువవుతు న్నది. ఎన్ని కష్టాలొచ్చినా ఆ వృత్తిపట్ల మక్కువ, గౌరవం ఉన్న కుటుంబాలూ, వ్యక్తులూ అనేకం. ఇలాంటివారివల్లే ఈ రంగం ఇంకా నిలబడింది. అయితే, నిధుల లేమి, లోపిం చిన చిత్తశుద్ధి, సమన్వయ లేమి, అవగాహనాలోపం, వివక్ష, చట్టాల్లో లొసుగులవంటి కారణాలవల్ల అలాంటి కుటుం బాలకు అన్యాయం జరుగుతున్నది.
అరకొర కేటాయింపులు
చేనేత రంగానికి చేసే కేటాయింపులే అసలు సమస్య. స్వ ర్ణాంధ్రప్రదేశ్, విజన్ -2020 వంటి విధానాలతో చేనేతను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో చేనే తకు ఇచ్చే బడ్జెట్ చాలా తక్కువ. కేంద్ర నిధులు మురిగిపో తున్నాయి. పథకాల సంఖ్య తగ్గిపోయింది. ఆ పథకాల అమలులో కూడా అనేక లోపాలు, అవినీతి! పర్యవసానంగా చేనేత రంగాన్ని నమ్ముకున్న ఎన్నో కుటుంబాలు సంక్షో భంలో కూరుకుపోయాయి. ఎందరో ఆత్మహత్యలకు పాల్ప డ్డారు.
ఈ ఆత్మహత్యలవల్ల పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. 2004లో వైఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అంతక్రితం సంవత్సరాలతో పోలిస్తే 2005-06, 2006-07 చేనేత రం గంపై చేసిన ఖర్చు కేటాయింపులకంటే ఎక్కువుంది. 2005- 06లో రూ. 76.68 కోట్లు కేటాయిస్తే, రూ. 80.27 కోట్లు ఖర్చయింది. 2006-07లో 99.52 కోట్లు కేటాయిస్తే రూ. 136.25 కోట్లు వ్యయం అయింది. ఖర్చు పెంచడమే కాక ఈ కాలంలో చేనేత కుటుంబాలకు అవసరమైన ఇల్లు, పింఛను పథకాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 2009లో ఓటాన్ అకౌంట్‌లో పెట్టి ఎన్నికల తర్వాత ఆమోదించిన రుణమాఫీ పథకం చేనేత కుటుంబాల్లో కొత్త ఆశలు నింపింది. అయితే, 2009-10లో దీని అమలు సరిగాలేక కేవలం 44.38 కోట్లు మాత్రమే ఖర్చయింది. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ యంత్రాంగం నిర్లిప్తత ఇందుకు కారణం.
తెలంగాణలో అభివృద్ధికి మార్గాలు
పర్యావరణాన్ని కాపాడుతూ, గ్రామీణ స్థాయిలో ఉపాధి కల్పిస్తూ, ఆర్థిక రంగంపై భారం పడకుండా మనగలిగే సామర్థ్యం కేవలం చేనేత రంగానికే ఉంది. ఈ రంగం వృద్ధి చెందితే ప్రభుత్వం చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ వృద్ధి రేటు సాధించవచ్చు. తెలంగాణలో చేనేత రంగం అభివృద్ధికి సానుకూల రాజకీయ దృష్టి అవసరం. అందుకు ఈ అంశా లను పరిగణనలోకి తీసుకోవాలి. 1. చేనేత రంగంలో సర్కా రు పెట్టుబడులు పెరగాలి. కనీసం రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరగాలి.
చేనేతకు అవసరమైన రుణాలు బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకి అందించాలి. 2. సహకార ఉత్పత్తి విధానాలకు ప్రథమ స్థానం ఇస్తూనే ఇతర ఉత్పత్తి పద్ధతులకు మద్దతివ్వాలి. 3. వికేంద్రీకృత టెక్నాలజీ ద్వారా చిన్న నూలు మిల్లులకు ప్రాధాన్యమివ్వాలి. ప్రత్తి రైతుకు, చేనేత కార్మికులకూ నేరుగా సంబంధం ఏర్పరచాలి. పట్టు రీలింగ్ పరిశ్రమకు ప్రోత్సాహమివ్వాలి. 4. చేనేత ఉత్పత్తుల మార్కెట్లను కాపాడటానికి రక్షణ చట్టాలను పటిష్టంగా అమ లుచేయాలి. మార్కెట్ వసతులు, సౌకర్యాలు కల్పించాలి. ఎగుమతులకు అవకాశం కల్పించాలి. 5. చేనేత సంక్షేమ పథకాలు చేపట్టి, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, పిల్లలకు అవసరమైన సంక్షేమ పథకాలు చేకూర్చాలి. విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించాలి. 6. తెలంగాణకు ప్రత్యేక అపెక్స్ సహకార సంస్థ ఏర్పాటుచేసి ఈ ప్రాంత సహకార సంఘాలకు తగిన వనరులు అందించాలి. ఉత్పత్తులను మార్కెటింగ్ చేయాలి. 7. చేనేత కార్మికులకు కనీస రోజు కూలీ వచ్చేవిధంగా కనీస వేతన చట్టం అమలు చేయాలి.
- వ్యాసకర్త చేనేత రంగ నిపుణులు
డాక్టర్ డి. నరసింహారెడ్డి