రెవెన్యూ, పట్టణ-నగరపాలక విభాగాల్లో అందరూ అవినీతిపరులే అని స్వయంగా ఒక ముఖ్యమంత్రే ప్రకటించిన పరిస్థితి తెలుగునాట నెలకొంది. అవినీతి నిరోధక చర్యలు అంతంతే! టౌన్ ప్లానింగ్ అధికారులు, నగర పాలనలోని ఇతర ముఖ్యులపై ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు అప్పుడప్పుడు ఏసీబీ కేసులు నమోదయినా, వారిలో శిక్షలు పడేవారు అరుదే! సంవత్సరాలుగా ఒకేచోట పాతుకుపోయిన అధికారులు అన్నీ తమ కనుసన్నల్లోనే జరిగేలా వ్యవస్థల్ని శాసిస్తున్నారు.
కాపురం చేసే కళ కల్యాణవేదికపై కాళ్లుతొక్కినపుడే తెలిసింద’ని సామెత. హైదరాబాద్ రాత్రికి రాత్రి విశ్వనగరం అయిపోతుందని ఎవరూ అనుకోరు. అయిపోవాలని ఆశించరు కూడా! విశ్వనగరం చేసే సంకల్పం నెరవేర్చే క్రమంలో సరైన అడుగులు పడుతున్నాయా అన్నది ప్రశ్న! ప్రపంచ పటంలో సగర్వంగా నిలిపామంటున్న హైదరాబాదు సొబగు నిన్నటి అసాధారణ వర్షాలతో నిగ్గుతేలింది. వారం పాటు సాగిన వర్ష బీభత్సానికి జనజీవనం అస్తవ్యస్థమైంది. తప్పు చేసిన వాళ్లు తప్పించుకు తిరుగుతుంటే, ఏ పాప మెరుగని వాళ్లు శిక్ష అనుభవించడం నగరాల్లో మామూలైపోయింది. అటు ముంబాయి, ఇటు చెన్నై మహానగరాల చేదు అనుభవాలు కళ్లెదుట ఉన్నా పాఠం నేర్వని మన పాలనావ్యవస్థలు ఎప్పటికి మేల్కొంటాయో తెలియదు.
లేడికి లేచిందే పరుగన్నట్టు కాకుండా ఏ నిర్మాణాత్మక/ నియంత్రణా చర్య లైనా ప్రణాళికాబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నది నేటి పౌరస మాజం అభిలాష. అడ్డదిడ్డంగా దురాక్రమణలు, అక్రమ నిర్మాణాలకు కారకులైన అధికారుల్ని బాధ్యుల్ని చేయకపోగా... వారినే ముందుంచి కూల్చి వేతలకు దిగడం విస్మయం కలిగిస్తోంది. చిన్నపాటి వర్షానికే మహానగరం అతలాకుతలం కావడానికి ప్రణాళికారహిత వృద్ధే కారణమన్నది జగమెరిగిన సత్యం. చెరువులు, కుంటల దురాక్రమణలు, నాలాలు, కాలువలపై అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనలు వెరసి నగరాన్నొక నరకకూపం చేశాయి.
అలాంటి దురాక్రమణలు, అక్రమ నిర్మాణాల్ని తొలగించడానికి ఇది సరైన సమయమే! కొందరి దురాశ ఎందరెందరికో వేదన మిగిల్చిన దుస్థితిని తలచుకొని వెల్లువెత్తిన ప్రజాగ్రహం వేడిలో సర్కారు విరుగుడు చర్యలకు పూనుకోవడం సముచితమే! ఈ సమయంలో అక్రమనిర్మాణాల్ని కొట్టేస్తే జనం మద్దతు కూడా లభిస్తోంది. అభినందించే వాళ్లే తప్ప తప్పుబట్టేవాళ్లు తక్కువ. కానీ, జరుగుతున్నది వేరు. ఈ చర్యల్లో సమ్యక్‌దృష్టి, ప్రణాళిక, బాధ్యత-జవాబుదారీతనం లోపించాయి. చిత్తశుద్ధి కన్నా దుందుడుకుతనమే అధికమన్న విమర్శ ఉంది. కార్యాచరణ పారదర్శకంగా, ప్రణాళికా బద్దంగా లేదన్నది జనాభిప్రాయం. న్యాయస్థానం కూడా తప్పుబట్టిందిందుకే! ప్రజా స్థలాల దురాక్రమణ, అక్రమనిర్మాణాలు యథేచ్ఛగా సాగుతుంటే నిద్ర పోయి, ఇప్పుడు కనీస పద్ధతుల్ని పాటించకుండా దూకుడు చర్యలేంటి? ఇన్నాళ్లు ఏం చేశారన్న హైకోర్టు ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేదు. వర్షం పడగానే పరుగులు తీయడం, ఎండలు కాయగానే మరచి పోవడం రివాజయిందని గత అనుభవాలు తేటతెల్లం చేస్తున్నాయి.
ప్రణాళిక, చిత్తశుద్ధి తక్షణావసరం
ఏవేవి దురాక్రమణలో స్పష్టంగా వెల్లడించాలి. ఎక్కడెక్కడ నాలాలు, కుంటలు, చెరువులు ఇతర ప్రజాస్థలాల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయో ప్రకటించాలి. కారకుల్ని గుర్తించి సదరు వివరాలన్నింటినీ పారదర్శకంగా ఆన్‌లైన్‌లో పెట్టి చర్యలకు పూనుకోవాలి. అప్పుడే ప్రజామద్దతు పెరిగి, ప్రతిఘటన తగ్గుతుంది. అంతే తప్ప, అన్నింటినీ ఒకే గాటన కట్టి నాయ కులు-అధికారులు ఇష్టానుసారం కూల్చివేతలకు పూనుకోవడం వల్ల ప్రజా ప్రతిఘటన ఎదురవుతోంది. లంచమివ్వలేదనో, వాటా తేల్చలేదనో నేతలు- అధికారులు కక్షగట్టి కొందరిపై ప్రతీకారం తీర్చుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
కూల్చివేతల్లోనూ తరతమ భేదాలున్నాయని, అయిన వారిని వదిలి కానివారిని కాటేస్తున్నారన్నది ముఖ్య విమర్శ. నగరంలో అక్రమ నిర్మాణాలు ప్రధానంగా రెండు రకాలుగా ఉన్నాయి. తమ తమ స్వస్థలాల్లో నగరపాలక సంస్థ నిబంధనలకు విరుద్ధంగా, అనుమతుల్ని ఉల్లంఘిస్తూ జరిపిన నిర్మాణాలు ఒక రకం. మురుగునీటి-వర్షపు నీటి నాలాలు, చెరువులు-కుంటలు, పార్కులు ఇతర ప్రజాస్థలాల దురాక్రమ ణతో జరిపినవి మరోరకం. రెండోరకం ఆక్రమణల తొలగింపుపై పెద్దగా అభ్యంతరాలు లేవు. మొదటి రకం వాటిల్లో తగిన నోటీసులివ్వకుండా, నిర్వహణాపరమైన పద్ధతులు పాటించకుండా, కనీసం వారి వాదననైనా వినకుండా ఏకపక్షంగా కొట్టివేయడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమౌ తోంది.
ఈ విషయంలోనే హైకోర్టు అభ్యంతరపెట్టింది. ఆయా నిర్మాణాలకు అనుమతులెలా లభించాయి? నిర్మాణం జరుగుతున్న పుడు నిఘా ఏమైంది? విద్యుత్తు-తాగునీటి సదుపాయాలు, మురుగునీటి వ్యవస్థ ఎలా అందు బాటులోకి వచ్చింది? వీటన్నంటికీ బాధ్యులైన అధికారులెవరు? వారిపై చర్యలేంటి? అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. బహుళ అంతస్తు భవనాలు, అపార్టుమెంట్లయితే... అభివృద్ధిపరచి సొమ్ము చేసుకున్న బడా బిల్డర్లు, రియల్టర్లు అన్నీ అమ్ముకొని పక్కకు తప్పుకున్న సందర్భాలే అధికం. వారెవరిపైనా చర్యలు లేకుండా, తెలిసో తెలియకో ఒకటొకటిగా కొనుగోలు చేసిన సామాన్యులే ఇప్పుడు సమిధలవుతున్నారు. అలా కొనడమూ తప్పే అయినా, వాటి కూల్చివేతకొక పద్ధతి పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇకపై అటువంటివి జరక్కుండా నియంత్రించాలంటే బాధ్యులైన అధికారులతో సహా ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులైన వారందరిపైనా చర్యలుంటే భవిష్యత్తులో ఈ తప్పులు పునరావృతం కావనేది వారి వాదన. అక్రమనిర్మాణాలకు పాల్పడ్డవారితో సమానంగా, వాటిని అనుమతించిన అధికారులూ బాధ్యులవుతారంటూ లోగడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు తన తాజా ఆదేశాల్లో ఉటంకించింది. అక్రమ నిర్మాణాలని ఇప్పుడు కూల్చివేస్తున్నారు, వసూలు చేసిన విద్యుత్తు, నీటి చార్జీలు వెనక్కి ఇస్తారా? వసూలు చేసిన అధికారుల్ని శిక్షిస్తారా? అని పౌర సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.
రోగమొకటి మందొకటి కావద్దు!
మన మహానగరాలు ఎదుర్కొంటున్న మానవకారక సమస్యల్లో అవినీతి ప్రధానమైనది. ప్రభుత్వ నియంత్రణ పాటించడమా? నియంత్రణా వ్యవ స్థల్ని కొనేయడమా? ఏది చౌక అని లెక్కలేసి రెండోదాని వైపే మొగ్గు తున్నారు. ప్రజాప్రయోజనాల్ని గాలికొదిలి ఆక్రమణదారులు- అధికారులు ఉభయప్రయోజనకరమైన ‘విన్-విన్ సిచ్యు వేషన్’ సృష్టించుకుంటు న్నారు. రెవెన్యూ, పట్టణ-నగరపాలక విభాగాల్లో అందరూ అవినీతిపరులే అని స్వయంగా ఒక ముఖ్యమంత్రే ప్రకటించిన పరిస్థితి తెలుగునాట నెలకొంది.
అవినీతి నిరోధక చర్యలు అంతంతే! టౌన్ ప్లానింగ్ అధికారులు, నగర పాలనలోని ఇతర ముఖ్యులపై ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు అప్పు డప్పుడు ఏసీబీ కేసులు నమోదయినా, వారిలో శిక్షలు పడేవారు అరుదే! సంవత్సరాలుగా ఒకే చోట పాతుకుపోయిన అధికారులు అన్నీ తమ కను సన్నల్లోనే జరిగేలా వ్యవస్థల్ని శాసిస్తున్నారు. దురాక్రమణల్ని, అక్రమ నిర్మా ణాల్ని చూసీచూడనట్టు వదిలి సొమ్ము చేసుకుంటున్నారు. అవి రాష్ట్ర పోస్టు లుగా ప్రకటించి, వారికి తరచూ బదిలీలు చేయడం ఒక విరుగుడనే అభి ప్రాయముంది.
శివునాజ్ఞలేకుండా చీమైనా కుట్టదనే సామెత చందంగా అన్ని అక్రమాలూ తప్పుడు అధికారుల కనుసన్నల్లో జరుగుతాయంటూ ‘సుపరి పాలనా వేదిక’ నిర్వహిస్తున్న పద్మనాభరెడ్డి చేసిన వ్యాఖ్య అక్షరసత్యం అని పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసిన అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీఆర్‌ఎస్)కు న్యాయస్థానం బ్రేకు వేసింది. నిబంధనలకు నీళ్లొదిలి నిర్మాణాలు సాగిస్తుంటే... అప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుండే సర్కారు, అంతా అయ్యాక ‘క్రమబద్ధీకరణ’ పేరుతో తప్పుల్ని ఒప్పులు చేసి తాను సొమ్ముచేసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయస్థానం దాన్ని నిలుపుదల చేసింది. అప్పటివరకున్న అక్రమ నిర్మాణాల్ని క్రమ బద్ధీకరించుకోవచ్చని గత సంవత్సరం అక్టోబరు 28న ప్రభుత్వం ఉత్తర్వు లిచ్చింది. పొలోమంటూ దరఖాస్తులు వచ్చాయి. చిత్రమేమిటంటే అలా దరఖాస్తు సమర్పించిన తర్వాతే తొలి ఇటుక కొనుగోలు చేసి నిర్మాణాలు జరిపిన అక్రమార్కులూ ఉన్నారు. వారికి దండిగా అధికారుల అండదండ లున్నాయి. 2015 అక్టోబరు 28కి ముందరి, తర్వాతి గూగుల్ మ్యాప్ ఆధా రంగా పరిశీలన జరిపితే బండారం ఇట్టే బయటపడుతుంది.
రాబడిపై కన్నే తప్ప వ్యూహమేది?
ఏకకాలంలో అనేక విషయాలపై దృష్టి కేంద్రీకరించి వ్యూహాత్మకంగా వెళితేనే ముఖ్యమంత్రి చెబుతున్నట్టు ఓ దశాబ్ద కాలంలోనైనా హైదరాబాద్‌కు విశ్వ నగర యోగం దక్కొచ్చు. క్రమబద్ధీకరణ (ఎల్లారెస్, బీఆరెస్) ద్వారా హెచెమ్డీయే పరిధిలో దాదాపు 3వేల కోట్ల రాబడి ఖజానాకు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. 2008-15 మధ్య కాలంలో లక్షా 37 వేల అక్రమ కట్టడాలున్నట్టు పౌరుల స్వచ్ఛంద వెల్లడిని బట్టి తెలుస్తోంది. ఖజానాకు రాబడే తప్ప వీటిని క్రమబద్ధీకరించడం వల్ల నగరమెలా మెరుగవుతుందో ఎవరికీ తెలియదు. నాలాలు, కుంటలు-చెరువుల స్థలాల్లో తొలగించాల్సిన దురాక్రమణలు 28 వేలని ఇప్పుడు ముఖ్యమంత్రి చెబుతున్న లెక్క కూడా పక్కా కాదు. అందుకు సంబంధించిన స్పష్టమైన వివరాలు పాలకసంస్థ వద్ద లేవు. ఇది, లోగడ కిర్లోస్కర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చెబుతున్న ఉజ్జాయింపు లెక్క. అవన్నీ దురాక్రమణలనడానికి లేదు.
నగరంలో కురిసే వర్షపు-మురుగు నీటి ప్రవాహాన్ని తట్టుకునే సామర్థ్యం సాధించడానికి నాలాలూ, కుంటలు, చెరువుల విస్తరణ అవసరాన్ని ఈ కమిటీ నివేదిక నొక్కి చెప్పింది. అవి చాలా చోట్ల నిర్వహణ లేక, దురాక్రమణల వల్ల కుంచించుకు పోయాయి. నగరంలో దాదాపు 173 ప్రధాన నాలాలు మొత్తం 390 కిలో మీటర్ల నిడివి విస్తరించి ఉన్నాయి. అందులో 3 మీటర్లున్న వాటిని వేర్వేరు ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి నాలుగు, నాలుగున్నర, అయిదున్నర, ఏడు మీటర్లకు విస్తరించాల్సిన అవసరాన్ని ప్రతిపాదించింది. ఈ విస్తరణలో... అప్పటివరకు అధికారికంగా, అనధికారికంగా (ఆక్రమణలుగా) ఎన్ని నిర్మా ణాల్ని తొలగించాల్సి రావచ్చో అంచనా వేసి చెప్పింది. ఈ 28 వేల నిర్మాణాల్లో దురాక్రమణలు పోను, కొన్నిటికి నష్టపరిహారం చెల్లించో, ప్రత్యా మ్నాయ నివాసాలు చూపించో తగిన పునరావాసం కల్పించి తొలగించాల్సి ఉంటుంది.
నగరంలో 2000 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలు, వరద లకు జరిగిన నష్టం దృష్ట్యా నియమించిన ఈ కమిటీ తదుపరి సంవత్సరం సమగ్ర నివేదిక ఇచ్చింది. తదనంతరం ఏర్పాటయిన ‘ఓయంటస్ సొల్యూ షన్స్’ కన్సల్టెన్సీ కూడా కొన్ని ప్రతిపాదనలతో ఓ నివేదిక ఇచ్చింది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఒక ఎజెండా రూపొందించాలి. దానిపై, నిపుణుల్ని, నగరంలో క్రియాశీలకంగా పనిచేసే పౌర సంస్థల్ని భాగస్వాములు చేస్తూ చర్చలు జరపాలి.
ఒక కార్యాచరణ రూపొందించి చిత్తశుద్ధితో అమలు చేయాలి. ‘‘హైద్రాబాద్‌కీ బల్దియా (నగరపాలక సంస్థ), కాకే పీకే చల్దియా (తినీ-తాగి జారుకున్నారు)’’ అన్న పాత నానుడికి స్వస్తి చెప్పాలి. కోటి మంది నివసించే కోట్ల జనుల కలల సౌధాన్ని విశ్వనగరం చేయాలి. ఎవరో మొక్కుబడిగా తర్జుమా చేసినట్టు ‘స్మార్ట్‌సిటీ’ అంటే ఆకర్షణీయ నగరం కాదు, ఆవాసయోగ్య (లివబుల్) నగరం అని విశ్వానికి చాటిచెప్పాలి. అప్పుడే మనది విశ్వనగరం.
- దిలీప్ రెడ్డి
సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్
ఈమెయిల్ : dileepreddy@sakshi.com
కార్యాచరణతో కదిలితేనే..
Published Fri, Sep 30 2016 1:19 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
Advertisement