
- సురవరం సుధాకరరెడ్డి, (వ్యాసకర్త సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి) మొబైల్ 9440066066, 09868180505
నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా దేశ వ్యాప్త పోరాటం నిర్వహించాలని సీపీఐ, సీపీఐ(ఎం), ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌బ్లాక్, సీపీఐ ఎంఎల్. ఎస్‌యూసీఐ (కమ్యూ నిస్టు) పార్టీలు నిర్ణయించాయి. జూలై 20వ తేదీన ‘అవినీతి వ్యతిరేక పోరాటం దినం’గా జరపాలని కూడా భావిస్తున్నా యి. వాస్తవానికి మోదీ ప్రభుత్వ తొలి వార్షికోత్సవం సందర్భంగా తమది ‘అవినీతి రహిత ప్రభుత్వమ’ని బీజేపీ ప్రకటించింది. 13వ నెలలోనే ఈ ప్రకటన బండారం బద్దలైంది.
ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ ఇంగ్లండ్ నుండి పోర్చుగల్ వెళ్లేందుకు సహాయం చేయాల్సిందిగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ బ్రిటిష్ హైకమిషనర్‌ను కోరినట్లు లండన్ నుండి వార్త వచ్చింది. లలిత్ మోదీ భార్య పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లోని క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందునే మానవతా దృక్పథంతో సహాయం చేసినట్లు సుష్మా వివరించారు. 1,700 కోట్ల రూపాయల ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల నుండి తప్పించుకునేందుకు లలిత్‌మోదీ లండన్‌లో దాగాడు. నేరగాళ్లను కూడా మానవతా దృక్పథంతో ఆదుకోవడం మాటెలా ఉన్నా, ఢిల్లీకి తిరిగి వచ్చి విచారణను ఎదుర్కోమని ఆయనకు చెప్పకపోవటం, సుష్మా భర్త స్వరాజ్ 23 సంవత్సరాలుగా అడ్వొకేట్‌గా, ఆయన కుమార్తె రెండేళ్లుగా సుప్రీం కోర్టులో లలిత్ మోదీ తరఫున వకాల్తా పుచ్చుకోవడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, లలిత్‌మోదీ తరపున గతంలో విదేశాలకు వీసా కోసం రహస్యంగా ఒక అఫిడవిట్ సమర్పించిన విషయం కూడా బహిర్గతమైంది. ఈ రహస్యం ఎందుకో ఆమె వివరించాలి.
వసుంధరా రాజే కుమారుడు దుష్యంత్ కూడా పార్లమెం ట్ సభ్యుడు. మహారాజా దుష్యంత్‌కు ఒక పరిశ్రమ ఉంది. ఆ సంస్థ షేరు ధర పది రూపాయలు. లలిత్‌మోదీ ఒక షేరు రూ 98,000 చొప్పున 11 కోట్ల రూపాయల షేర్లు కొన్నాడు. రాజస్తాన్ ప్రభుత్వానికి చెందిన రెండు రాజ భవ నాలను (అంబర్ ప్యాలెస్) నామ మాత్రపు ధరకు మహారాజా దుష్యంత్ లలిత్‌మోదీకి అమ్మేశాడు. ఇవి వారి కుటుంబ వార సత్వ ఆస్తులని బీజేపీ నాయకులు చెప్తున్నారు. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భవనాలు స్వాధీనం చేసుకొని తాళాలు వేస్తే, ఈ మహారాజుల కుటుంబం తేలుకుట్టిన దొంగల లాగా నిశ్శబ్దంగా ఎందుకు ఉంది?
గతంలో కూడా వసుంధరా రాజే రాజస్తాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లలిత్‌మోదీ పరిపాలన సాగించాడని, ప్రభుత్వంతో పనులు చేయించేందుకు 10% కమీషన్లు వసూలు చేసేవాడని, ఆయనకు మిస్టర్ టెన్ పర్సంట్‌గా పేరుండేదని పత్రికా విలేకరులు బయటపెట్టారు.
మహారాష్ట్ర మహిళా మంత్రి పంకజ్ ముండే చట్ట ప్రకారం పిలవాల్సిన టెండర్లు పిలవకుండా, అంగన్‌వాడీలకు సరఫరా చేసే చిక్కీల కాంట్రాక్టు 2,600 కోట్ల రూపాయల మేరకు ప్రైవేటు కాంట్రాక్టర్లకిచ్చింది. ప్రపంచంలో ఎక్కడ చీమచిటుక్కుమన్నా ట్వీట్ చేసే నరేంద్ర మోదీ ఈ అంశాలపై మౌనంగా ఉంటున్నారు.
క్రికెట్ పిచ్చిని వ్యాపారం చేసేందుకు ఐపీఎల్ పేరుతో ఒక సంస్థను లలిత్‌మోదీ స్థాపించాడు. ఆ క్రీడను బాగా కుదించి 20:20గా చేశాడు. ఏనాడూ బ్యాట్ పట్టని రాజకీయ నాయకులు, కార్పొరేట్ల అధిపతులు రాష్ట్రాల క్రికెట్ బోర్డు అధ్యక్షులయ్యారు. నేషనలిస్టు కాంగ్రెస్ అధ్యక్షులు శరద్ పవార్, బీజేపీ నరేంద్ర మోదీ, అమిత్‌షా, అరుణ్‌జైట్లీ, కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్ శుక్లా, శశిథరూర్, జ్యోతిరాదిత్య సింథియా, ఆర్‌జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్, కార్పొరేట్ల అధినేతలు శ్రీనివాసన్, దాల్మియాలు ఇందులో భాగమే. నరేంద్రమోదీకీ, బీజేపీకీ అవినీతిని నిర్మూలించాలని గానీ, స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గానీ లేదు. అవినీతి కారణంగా కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన యడ్యూరప్పను మోదీ ఆహ్వానించి, పార్లమెంట్ సభ్యుడినిగా చేయటమేగాక, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిని చేశారు.
నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో ముద్దాయిగా ఉండి మంత్రి పదవిని కోల్పోయి, జైలుకెళ్లే స్థితిలో ఉన్న అమిత్‌షాను బీజేపీ జాతీయ అధ్యక్షునిగా చేసి, కేసులు ఉపసంహరింపజేసిన ఘనుడు నరేంద్ర మోదీ. మధ్యప్రదేశ్ బీజేపీ సర్కారు ఆధ్వ ర్యంలో జరిగినది ‘వ్యాపమ్ స్కాం’. వృత్తి విద్యల పరీక్షల బోర్డులో, రాష్ట్ర గవర్నర్, అధికారులు, మంత్రులు, బీజేపీ నాయకుల మాయాజాలంతో రెండు వేల కోట్ల రూపాయల అవినీతి, రెండు వేల మంది ముద్దాయిలు, 48 మంది మిస్టరీ మరణాలు, విచారణకు వెళ్లిన జర్నలిస్టులను హత్య చేయటం వంటి వాటితో వ్యాపమ్ కేసు క్రైమ్ థ్రిల్లర్‌ను తలదన్ను తున్నది.
తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఒక నామినేటెడ్ శాసన సభ్యుడిని ఐదు కోట్లకు బేరం చేసి, యాైభై లక్షలు లంచం ఇస్తూ పట్టుబడిన టీడీపీ నాయకుడు రేవంత్‌రెడ్డి సిగ్గు పడకపోగా మీసం దువ్వి, తొడలు కొట్టి వేలాది మందితో బెయిల్ విజయోత్సవం జరుపుకుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు ఈ దురంతానికి మద్దతు ఇస్తున్నారు. ఆ పార్టీకి బీజేపీ మద్దతి స్తున్నది. బీజేపీ నిజరూపం ఇప్పుడిప్పుడే బహిర్గత మవుతున్నది.
‘‘అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ల కాదేది కవితకనర్హం’’ అని మహాకవి శ్రీశ్రీ చెప్పారు. క్రికెట్, ఇసుక, కాంట్రాక్టులు, కాలువలు, మరుగుదొడ్లు, చౌకడిపోలు, మందుల పంపిణీ, స్పెక్ట్రమ్, బొగ్గు గనుల వేలం, ఉద్యోగాల కేటాయింపులు, ఎంఎల్‌సీల ఎన్నికలు, కావేవి దోపిడీకనర్హమని కాంగ్రెస్, బీజేపీ నాయకులు రుజువు చేశారు. జూలై 20వ తేదీని ‘అవినీతి వ్యతిరేక పోరాట దినం’గా జరుపుకుందాం. నయవంచకుల బీజేపీ పార్టీ నిజ స్వరూపాన్ని బహిర్గతం చేయవలసిన తరుణం వచ్చింది. దీనిని ప్రజాస్వామిక లౌకికశక్తులు గుర్తించాలి.
(జూలై 20న ‘అవినీతి వ్యతిరేక పోరాట దినం’
నిర్వహిస్తున్న సందర్భంగా)