
నల్లధనాన్ని పంచిపెడతాం: నరేంద్ర మోడీ
‘చాయ్ పే చర్చ’లో నరేంద్ర మోడీ ఉద్ఘాటన
అధికారంలోకి వస్తే విదేశాల్లోని నల్లధనాన్ని స్వదేశానికి రప్పిస్తాం
ఇందుకోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్.. అవసరమైతే చట్టంలో సవరణలు
అహ్మదాబాద్: బీజేపీ అధికారంలోకి వస్తే.. కొంత మంది అవినీతిపరులు విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని తిరిగి స్వదేశానికి రప్పిస్తుందని ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. తాము ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే ఇందుకోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని, అవసరమైతే చట్టాలను సవరిస్తామని అన్నారు. స్వదేశానికి తిరిగి రప్పించిన ఆ నల్ల ధనంలో 5 నుంచి 10 శాతం వాటాను ప్రస్తుతం నిజాయితీగా పన్ను చెల్లిస్తున్నవారికి బహుమానంగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. బుధవారం ‘చాయ్ పే చర్చ’(టీ కబుర్లు) కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 1,000 ప్రాంతాల్లోని సామాన్యులతో వీడియో ద్వారా మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీ తాగుతూ ఆయన వారితో సంభాషించారు.
అది నా వ్యక్తిగత సంకల్పం: ‘‘నల్లధనాన్ని వెనక్కు తీసుకురావడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. తదుపరి ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదు.. పైగా ఇది నా వ్యక్తిగత సంకల్పం’’ అని మోడీ అన్నారు. ‘‘భారతీయ పౌరులు విదేశాల్లో అక్రమంగా దాచిపెట్టిన ప్రతి పైసా వెనక్కు తెస్తాం. దీనికి నేను కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే.. ఇది దేశంలోని పేద ప్రజల సొమ్ము. ఇలాంటి జాతి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే హక్కు ఎవరికీ లేదు. దేహం ఎంత దృఢంగా ఉన్నప్పటికీ కూడా.. దానికి మధుమేహం వస్తే అది పలు రకాల వ్యాధులకు దారితీస్తుంది. అలాగే చెడు ప్రభుత్వం మధుమేహం లాంటిది. ఒకసారి అవినీతి ప్రవేశిస్తే.. ఇక అభివృద్ధే ఉండదు.. ప్రజలు కష్టాల్లో కూరుకుపోతారు’’ అని యూపీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.