ఉద్యమించిన మానవత్వం | Movements humanity | Sakshi
Sakshi News home page

ఉద్యమించిన మానవత్వం

Published Fri, May 16 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM

ఉద్యమించిన మానవత్వం

ఉద్యమించిన మానవత్వం

రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా:
 హేతువాదం-కాంతికిరణాలు-చీకటి వెలుగులు వంటి నవలలు, భారతీయ భాషలలోకి అనువాదమైన ‘హిందూయిజం అండ్ ఉమెన్: రీజనల్ పర్‌స్పెక్టివ్ 1860 - 1993’ వంటి వ్యాససంపుటిలు అనేకం ఆమె వెలువరిం చారు. సమాజంలో మహిళల స్థానం (1985), మహిళలు - శాంతి (1986), వరకట్న దురాచారం (1987), అశ్లీలత (1987), లైంగిక స్వేచ్ఛ (1989), సాహిత్యం-మహిళ- సంస్కరణ-విప్లవం(1992), పెళ్లి-నాడు-నేడు(1993) వంటి అంశాల మీద గోష్టులు నిర్వహించారు.

‘నల్లవారి స్వేచ్ఛ-సమానత్వం కోసం కృషి చేసిన అబ్రహాం లింకన్, కెనడీ తెల్లవారిచేత హత్యచేయబడినట్లే నల్లవారికోసం పనిచేస్తోన్న మార్టిన్ లూథర్ కింగ్ కూడా తెల్లవాడి చేత హత్యచేయబడ్డాడు’ 1964లో రేడియోలో ఈ వార్త విన్న కోట్లాది ప్రజలు దుఃఖించారు. కొందరు అందులో దాగిన జాతి వివక్షను గుర్తించి ఆక్రోశం చెందారు. ఆగ్రహించారు. అటువంటి వారిలో గురువారం కన్నుమూసిన మల్లాది సుబ్బమ్మ ఒకరు. ఈ సంఘటన ఆమెను నిలువనివ్వలేదు. ఈ వివక్షత తెల్లవారిలోనే ఉందా? మనలో లేదా! ఆలోచనల దొంతరలు.

‘నల్ల భార్యవల్ల నల్ల పిల్ల పుట్టిందని ఒక భర్త భార్యాపిల్లలను వదలివేసి తెల్లగా ఉన్న భార్యను మరోపెళ్లి చేసుకుంటాడు.’ సుబ్బమ్మ రాసిన తొలి కథ ‘పనికి రాని ముత్యం’ పత్రికల నుంచి తిరుగు టపాలో వచ్చింది. ఎందుకని? ఇతివృత్తాన్ని కొంచెం మార్చి, అనేక కథలు చదవగా అలవడిన మెరుగుపడిన శైలితో అదే ఇతివృత్తాన్ని మార్చి పంపింది. పదేళ్ల తర్వాత కథ ప్రచురితం అయ్యింది! తనను తాను నిత్యం సానబెట్టుకున్న మల్లాది సుబ్బమ్మ వ్యక్తిత్వానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ!

‘మలిన’గురువులు!
 గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతార్లంకలో 1924 ఆగస్టు 2న జన్మించిన సుబ్బమ్మకు బాపట్లకు చెందిన ఎం.వి.రామమూర్తితో బాల్యంలోనే వివాహం అయ్యింది. ‘శుద్ధ’ శోత్రియ కుటుంబం. 22వ ఏటకే నలుగురు బిడ్డలను కన్నారు. భర్త లిబరల్. అత్త అమాయక అద్వైతి. ఆమె గురువు ఆషాఢభూతి. శిష్యులు ధన-మాన-ప్రాణాలను సంతోషంగా సమర్పించుకోవాలన్న ‘మలిన’ గురువు మహత్యం(ఆమె మాటల్లోనే)తో  సుబ్బమ్మ రెబెల్ అయ్యింది. మెతకవాడయినా మంచివాడయిన భర్త సహకారంతో మరచిపోయిన అక్షరాలను మళ్లీ దిద్దారు. గ్రంథా లయాలలో ప్రపంచ సాహిత్యాన్ని చదువుతూ అనుభవానికి నిలిచే పరీక్షలతో హేతువాదిగా రూపొందారు.

ఆత్మవిశ్వాసోద్యమం!
మూఢనమ్మకాలను  స్వానుభవంతో వ్యతిరేకించిన మల్లాది సుబ్బమ్మకూ విశ్వాసం ఉంది. అది మతగ్రంథాలలోంచి, సిద్ధాంతాలలోంచి వచ్చింది కాదు. తనలోని చైతన్యానికి  కారణం తనలోని ఆత్మవిశ్వాసమేనని పలుమార్లు, పలు వేదికలపై వ్యాసాల ద్వారా చెప్పారు. తనపై తాను విశ్వాసం కోల్పోయిన వ్యక్తి బానిసేనని, బానిసలు స్వేచ్ఛను కోరవచ్చేమో కాని పొందలేరని స్పష్టం చేసేవారు. తన వ్యక్తిగత జీవితానుభవాలలోంచే సిద్ధాంతాలను, పార్టీలను, సంఘాలను చూశారు. కాబట్టే లిబరల్ ఫెమినిస్టులు పెట్టుబడిదారుల ప్రయోజన చట్రాల్లో పనిచేస్తారని, మార్క్సిస్ట్ ఫెమినిస్ట్‌లు వర్గసిద్ధాంతాల ప్రయోజనాల పరిధిలోనే పనిచేస్తారని భావించారు. ప్రతి మహిళ తనను తాను ముందుగా మనిషిగా భావించాలని, పురుషుడూ అలా భావించాలని, సహజాతాలరీత్యా అంగీకరించని పురుషాధిక్యతపై పోరాడేందుకు ‘రాడికల్ హ్యూమనిజం’ ఆసరా తీసుకోవాలని సూచించారు.

ఫెమినిస్ట్‌లను స్త్రీత్వం కోల్పోయిన వారిగా విమర్శించే పురుషాధిక్యులను చీల్చి చెండాడుతూనే ‘అశ్లీలతా ఛాందసం’పై కూడా చురకలం టించారు. సమానుల మధ్య నిజమైన ప్రేమ ఉంటుంది. అసమానుల మధ్య ప్రేమ ఎలా సాధ్యం అంటూ పురుషప్రపంచాన్ని ప్రేమాస్పదులు కావలసినదిగా హితవు పలికారు. ఏది అశ్లీలం? ఏది అసభ్యత? ఎవరు నిర్ణయిం చాలి!’ అనే వ్యాసంలో  ‘కాంతుడు నీవు ఏకాంతమున పెనగువేళ’ తరహా రామదాసు తదితరుల అభివర్ణనలను ఉదహరిస్తూ సాహిత్యాన్ని చూడాల్సిన సౌందర్యదృష్టినీ ప్రతిపాదించారు. మల్లాది సుబ్బమ్మకు తనదైన పరిశీలన ఉంది. విషపానం చేస్తూ ‘మగువను మగవారితో సమానం చేస్తే ఆమె అతనికంటే అధికురాలవుతుంద’న్న  సోక్రటీస్ పట్ల మల్లాది సుబ్బమ్మ కారుణ్యాన్నే ప్రదర్శించారు ‘భార్యపరమగయ్యాళి కాబట్టి అపోహ పడ్డారని’ వ్యాఖ్యానించడం ద్వారా!    
 పున్నా కృష్ణమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement