
‘ప్రధాని’ పోరు... మోడీ జోరు
మోడీ పోటీదారులు రాహుల్‌గాంధీలాగా బలహీనులు, నితీశ్‌కుమార్‌లాగా ఏకాకులు. లేదంటే ముగ్గురు ప్రాంతీయ నేతలు మమతాబెనర్జీ, జయలలిత, మాయావతి లాగా ఇంకా ఎటూ తేల్చుకోనివారు. బీజేపీయేతర కూటమికి ప్రత్యామ్నాయ అయస్కాంతం కాగలిగే పార్టీ కాంగ్రెస్ తప్ప మరేదీ లేదు.
ఆగ్రహం ఒక బలీయమైన ఆయుధం. ఎన్నికల ప్రకటనలకార్యక్రమం కోసం బీజేపీ ఏర్పాటు చేసిన అతుకుల బొంత కమిటీలన్నీ ఆ ప్రాథమిక తార్కిక ప్రమేయంపైన కచ్చితంగా ఆధారపడినవే . అయితే అవధులు దాటిన ఆగ్రహం మాత్రం ప్రతికూల ఫలితాలనిస్తుంది. స్వరాన్ని కొద్దిగా పెంచడానికి, ఒళ్లు మరచి సమతూకాన్ని కోల్పోడానికి మధ్య చాలా తేడా ఉంది.
హాస్యం రాజకీయరంగంలో గిలిగింతలు పెట్టే ప్రాంతం. అది ఒక జాతీయ పార్టీ ప్రచార కార్యక్రమం ఆ పరిధిలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి. భీతావహులైన ఇద్దరు స్త్రీ, పురుషులపై ఆధారపడ్డ రెండు ప్రకటనలు వెలువడ్డాయి. మోడీ ఢిల్లీ దారి పట్టడాన్ని చూసి అవినీతి, అధిక ధరలుగా మూర్తీభవించిన ఆ ఆడ, మగ భయపడి దేశం విడిచి విదేశాలకు పారిపోతుంటారు. చాలా చక్కగా ఉంది. హాస్యం అంటువ్యాధిలాంటిది. ఇంటర్నెట్ లేదా ఎస్సెమ్మెస్ సందేశాల ప్రపంచంలో అలా విహరించి చూస్తే అది రుజువవుతుంది. ఒకప్పటి, పురాతన, మొబైల్ ఫోన్ పూర్వ కాలంలో మార్క్సిస్టులు గోడల నిండా చక్కటి కార్టూన్లు గీసేవారు. ఎన్నికల కమిషన్ ఆ ప్రచార కార్యక్రమాన్ని నిజంగానే తుడిచిపారేసింది. ఎర్ర కార్టూన్ ఏడ్చుకుంటూ అస్తిత్వంలోంచి తప్పుకుంది.
నవ్వుకు ఔషధ గుణం ఉంది. సూచించిన చికిత్సకు తోడు అది కొంత నెమ్మదిని కలుగజేస్తుంది. వీధుల్లోని హింసను తట్టుకొని ప్రభుత్వాలు నిలబడగలవు. నిర్దాక్షిణ్యంగా పొట్టలోని పేగులను బయటకులాగేలా చేసే టీ కొట్టు యజమాని హాస్యాన్ని మాత్రం తట్టుకోలేవు. హాస్యోక్తి మహా వాడి. ధర్మోపన్యాసమేదీ సందేశాన్ని అంత కంటే ఎక్కువ సమర్థవంతంగా నాటుకునేట్టు చేయలేదు. ఉపదేశాలు ఓటర్లను ఆవలింతల ప్రపంచంలోకి పంపేస్తాయి.
అధ్వానమైన యూపీఏ పాలన మార్పును జాతీయ ఆవశ్యకతగా మార్చింది. ఆ మార్పు మోడీయే అనే సందేశంలో ఎలాంటి గందరగోళమూ లేదు. అదే ఆయనకున్న అనుకూలత. ఆయన వెనుక నిలవాలనుకునే మిత్రుల బారు పెరుగుతూనే ఉంది. వారికి ఆయన ఇచ్చే సందేశం ఒక్కటే... చెప్పిన చోట సంతకం చేయడమే. మోడీ పోటీదారులు రాహుల్‌గాంధీలాగా బలహీనులు, నితీశ్‌కుమార్‌లాగా ఏకాకులు. లేదంటే ముగ్గురు ప్రాం తీయ నేతలు మమతాబెనర్జీ, జయలలిత, మాయావతి లాగా ఇంకా ఎటూ తేల్చుకోనివారు. రాహుల్‌ను వెలుగులోకి తేవడానికి కాంగ్రెస్ రూ.750 కోట్లు ఖర్చుపెడుతోంది. కానీ ప్రజా జీవితంలోని అత్యంత కష్టభరితమైన బాధ్యతకు తమ నాయకునికున్న అర్హతల విషయంలో వారిలో అనిశ్చితి ఉంది. అసలు సాధించినదంటూ ఏదీ లేకుండానే ఉన్నట్టు నమ్మించలేరు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మమతాబెనర్జీ, జయలలిత, మాయావతి వ్యక్తిగతంగా పోటీకి సైతం దిగడం లేదు.
అలా అని అదేమీ ప్రధాని పదవి కోసం చెంచాలో గుడ్డును పెట్టుకొని పరుగెత్తే పోటీలోంచి వారిని సాంకేతికంగా తప్పించజాలదు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆరు నెలల్లోగా ఎప్పుడైనా పార్లమెంటు సభ్యులు కావొచ్చు. విధి వరించిన నేతగా పీవీ నరసింహారావు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఆయన పార్లమెంటు సభ్యులు కారు. కెమెరా పరిధికి వెలుపల ఈ ముగ్గురు మహిళలూ వాస్తవికవాదులే. మోడీ గుజరాత్ నుంచి కాక మరో స్థానం నుంచి కూడా అదనంగా పోటీ చేస్తున్నారు. కీలకమైన గంగ-జమున రణరంగంలో ఎన్నికలపరమైన ఉత్సాహాన్ని గరిష్ట స్థాయికి చేర్చడం కోసం ఆయన వారణాసి నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అన్ని యుద్ధతంత్రాలకు స్వపక్షపు కాల్పుల్లో చిక్కుకోవడం వల్ల కలిగే నష్టాలు అనే చెప్పరాని కొలబద్ధ ఒకటుంటుంది. ఆధిపత్య స్థానాల కోసం కొట్లాట అత్యంత తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు టికెట్ల పంపిణీ సమయంలో అలాంటి స్వయం కల్పిత గాయాలు భారీగా ఉంటాయి.
గాయాలు పతాక శీర్షికలను సృష్టిస్తాయి. ఎన్నికలు ప్రతి స్థాయిలోనూ సంక్లిష్టమైన పోటీయే. అహం గాయపడకుండా పూర్తి రక్షణను కల్పించే ఆయుధాన్ని దేన్నీ ఇంత వరకు కనుగొనలేదు. అయితే, ప్రతి కవాతులోనూ పతకాల ధగధగలతో వెలిగే సైన్యాధిపతులు తీరా యుద్ధం సమీపించే సరికి చిదంబరంలాగా భయంతో వణకడంతో ఈ స్వపక్ష కాల్పులను గందరగోళ పరచకూడదు. ఓటర్ల ముందుకు రావడానికి నిరాకరిస్తున్న కాంగ్రెస్ అత్యున్నత నేత ఆయనొక్కరే కారు. వాస్తవంగా ఒక్కసారి సంఘర్షణ మొదలయ్యాక ఇలాంటి ఘటనలు కనిపించకుండా జారుకుంటాయి.
ఎన్నికల్లో తప్ప మరెప్పుడూ నరాలు అంత ఎక్కువ గట్టిగా కిర్రెక్కిపోవు. సూపర్ స్టార్లు సైతం సురక్షితమైన సీటును వెతుక్కుంటారు. నిజానికి వారు వెతుక్కునేది సురక్షితమైన వాతావరణాన్ని. వారి వ్యక్తిగత శక్తిసామర్థ్యాలు లేదా అంతస్సారాన్ని బట్టి విభిన్నమైన అంశాలపై ఆధారపడి ఆ వాతావరణం ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటేనే అనిశ్చితితో కూడిన వ్యవస్థ. అదే దానిలోని అందమూ, బలమూను. ఓటరు చిత్తం తిరిగిందంటే 1977లో జరిగినట్టుగా ఇందిరాగాంధీ రాయ్‌బరేలీలో ఓడిపోవచ్చు. అత్యంత దక్షులనిపించుకున్న అనుభవజ్ఞులు సైతం క్షేత్ర స్థాయిలోని ప్రకంపనలను తప్పుగా గ్రహించవచ్చు. 2009లో లాలూ ప్రసాద్‌యాదవ్ శరాన్ నుంచి ఓడిపోయాననే అనుకున్నారు. బీమాగా ఉంటుందని పాటలీపుత్రకు పరుగెత్తారు. తీరా చూస్తే శరాన్ నుంచి గెలిచి, పాటలీపుత్రలో ఓడారు.
తమిళనాడులాంటి రాష్ట్రంలో బీజేపీ ఓట్లు కాంగ్రెస్ స్థాయిలకు పెరుగుతూ ఇంకా గరిష్ట స్థాయికి చేరుకోనప్పుడు ఉపరితలంలోని ఎత్తులు పై ఎత్తులకు దిగువ అసాధారణమైనదేదో జరుగుతుంటుంది. ఎవరు ఎన్ని స్థానాలు గెలుస్తారు అనే దానితో నిమిత్తం లేకుండా ఒక విషయం స్పష్టమౌతోంది. దేశవ్యాప్తంగా మోడీ ఓట్లు పెరుగుతుండగా, కాంగ్రెస్ కుచించుకుపోతోంది. మోడీ అవకాశాలను దెబ్బతీయగల చివరి అంశంగా ‘ఆప్’ను ప్రోత్సహించారు. కానీ అది తనను సృష్టించిన వాడిపైకే ఎదురు తిరిగిన డాక్టర్ ఫ్రాంకిన్‌స్టీన్ యంత్రాన్ని గుర్తుకు తెస్తోంది. ముస్లింలు ఆప్ వేపు తిరిగితే, బీటలు వారుతున్న కాంగ్రెస్ మొత్తంగానే తుడిచిపెట్టుకుపోతుంది. ముస్లింల మద్దతు తమకు లభించినట్టేనని అనుకోడానికి లేదని కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే గ్రహిస్తున్నారు.
కట్టలు తెగిన అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం ఆప్ విశ్వసనీయతలో కొంత భాగాన్ని ఇప్పటికే హరించేసింది. కానీ సమస్య అంతకంటే ఎక్కువ సూక్ష్మమైనది. బీజేపీయేతర కూటమికి ప్రత్యామ్నాయ అయస్కాంతం కాగలిగే పార్టీ కాంగ్రెస్ తప్ప మరేదీ లేదు. ఆప్ రాత్రికి రాత్రే కాంగ్రెస్ కాలేదు. కేజ్రీవాల్ ఎత్తుగడలు పాదరసం లాంటివే. కానీ వాటికున్న అస్థిరత అనే లక్షణాన్ని 2014లో ఓటర్లు కోరుకోవడం లేదు.
ఓటరుదే చివరి నవ్వు కావడమే ఎల్లప్పుడూ ఎన్నికల సమయపు హాస్యంలోని అత్యుత్తమ అంశం.
బైలైన్: ఎంజే అక్బర్
(వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)