చెదలు పట్టిన నోటరీలు! | Notary officials of termite | Sakshi
Sakshi News home page

చెదలు పట్టిన నోటరీలు!

Published Fri, May 6 2016 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

చెదలు పట్టిన నోటరీలు!

చెదలు పట్టిన నోటరీలు!

దస్తావేజులను తినాలంటూ తాము చెదలను ఆహ్వానించలేదని, చెదల వల్ల రికార్డులు దెబ్బతినడం ఒక యాదృచ్ఛిక దైవఘటన అని నోటరీ అధికారులు వాదించారు. ఇది తీవ్ర నిరక్ష్యమేకాదు, నోటరీ చట్టాల ఉల్లంఘన కూడా.
 
 తన ఆస్తిని తనకు తెలియ కుండా న్యాయవాది ఎవరికో అమ్మేశాడని, ఆ కాగితాలను ధృవీకరించిన నోటరీ రిజిస్టర్ వివరాలు ఇవ్వాలని, 2008 నుంచి 2013 వరకు ప్రతి సంవత్సరం ధృవీకరించిన మొదటి, చివరి పత్రాల రిజిస్ట్రేషన్ వివరాలు కూడా సమా చార చట్టం కింద తనకు అందించాలని ఒక వ్యక్తి అడి గాడు. ఆ సమాచారం కలిగి ఉన్న నోటరీ న్యాయ వాది మీనా శర్మ దానిని ఇవ్వాలని చట్టాల వ్యవహారాల శాఖ సీపీఐఓ అడిగితే దాన్ని మూడో వ్యక్తి సమాచారం అని చెప్పి ఇవ్వడానికి నిరాకరించారు. ఇక రెండో అప్పీలులో నోటరీ రిజిస్టర్లను చెదలు తినేశాయని కనుక ఇవ్వజా లమని వివరించారు. మొదటి అప్పిలేట్ అధి కారి ముందు చెదల విషయం ప్రస్తావనే లేదు. మొదట మూడో వ్యక్తి సమాచారమనీ, తరువాత చెదలు తిన్న దనీ నిరాకరించడం అనుమానాస్పదం అంటూ సీపీఐఓ తో పాటు అన్ని రిజిస్టర్లతో నోటరీ కూడా తన ముందు హాజరు కావాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
 
 పనికిరాకుండా పోయిన రికార్డుల జాబితాను, మిగి లిన రికార్డుల జాబితాను, సెక్షన్ 4 కింద తమంత తామే ప్రకటించాలని, అప్పుడు ఏ రికార్డులు ఉన్నాయో లేవో పౌరులకు తెలుస్తుందని లేకపోతే అడిగిన ప్రతి కాగితం చెదలకు బలైందని చెప్పి పబ్బం గడుపు కుంటారని, కమిషన్ భావించింది. కనుక చెదలకు పూర్తిగా దెబ్బ తిన్న రిజిస్టర్ల జాబితా, మిగిలిన రిజిస్టర్ల జాబితా, కొంత భాగం దెబ్బతిన్న రిజిస్టర్లు తేవాలని ఆదేశించింది. అందుకు బాధ్యులైన వారిపై విచారణ జరపాలని  కమి షన్ ఆదేశించింది. దీంతో సీపీఐఓ తోపాటు నోటరీ మీనా శర్మ కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. దెబ్బతిన్న రిజిస్టర్లు, పూర్తిగా ధ్వంసం అయిన రికా ర్డులు, మిగిలినవి కూడా చూపారు. నోటరీ సమర్పించిన వార్షిక నివేదికల కాపీలను ఇచ్చినట్టు వివరించారు. మిగతా వివరాలు చెదలవల్ల ఇవ్వలేదన్నారు.  
 
 కీలకమైన సాక్ష్య పత్రాలను ధృవీకరించిన వివ రాలను పుస్తకంలో నమోదు చేయవలసిన బాధ్యత నోటరీ న్యాయవాదిపైన ఉంటుంది. రికార్డులు నాశనం అయ్యాయి కనుక అవి లేనట్టేనని, కాబట్టి వాటిని ఇవ్వజాలమన్న వివరణను కమిషన్ అంగీకరించలేదు. రిజిస్టర్లు పాడైనాయని కనుక ఇవ్వలేమనే వాదాన్ని రికార్డుల చట్టం, సమాచార చట్టం, నోటరీ చట్టం అంగీకరించదు. ఆస్తి దస్తావేజులను తదితర కీలకమైన పత్రాలను అధికారికంగా ధృవీకరించే బాధ్యతను చట్టాల శాఖ నోటరీలకు అప్పగించింది. వృత్తిపర మైన అనుచిత ప్రవర్తనకు నోటరీలపై చర్య తీసుకోవ చ్చునని, ఆ నోటరీని  తొలగించాలని సెక్షన్ 10 వివరిస్తున్నది.
 నోటరీలు ధ్రువీకరించడం, దస్తావేజులో నోటింగ్స్ చేయడం, నిరసనలు ఉంటే వాటిని కూడా నమోదు చేయాలని నియమాలు నిర్దేశిస్తున్నాయి.
 
 నోటేరియల్ రిజిస్టర్ వారు నిర్వహించాలి. జిల్లా జడ్జి లేదా ఎవరైనా నియమిత అధికారి ఈ రిజిస్టర్లను తనిఖీ చేయవచ్చు. అవి సరిగా లేకపోతే జిల్లా జడ్జి నోటరీపైన చర్య తీసుకోవాలని సంబంధిత అధికారిని కోరవచ్చు. ప్రతి జనవరి నెలలో ప్రభుత్వానికి తన నోటరీ కార్యక్రమాల వార్షిక నివేదిక ఇవ్వాలి. దీన్ని ఫారం 14 రిటర్న్ అంటారు. నోటరీ కార్యక్రమాలకు తగినంత ఫీజును వసూలు చేసే అధికారం నోటరీలకు ఉంది. ఈ ఫీజు లను మార్చి 2014లో పెంచుతూ భారత ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. ప్రపంచంలో కొన్ని దేశాలు నోటరీ దస్తావేజుల రిజిస్టర్లను కంప్యూటరీకరించాయి. దానివల్ల నకిలీ పత్రాలను, అవినీతిని నివారించడానికి వీలుం టుంది. నోటరీలు రికార్డులను ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా తనిఖీకి అనుకూలంగా ఉంచాలి, ఏ విధంగా ప్రతులు ఇవ్వాలనే వివరాలను నోటరీ నమూనా చట్టం వివరించింది.
 
 నకిలీ దస్తావేజుల నివారణలో నోటరీలు ప్రభుత్వ ఏజెంట్లుగా న్యాయబద్దంగా వ్యవహరించాలి. రికార్డులు సత్యం ఆధారంగా ప్రమాణీకరించాలి. ఆ వివరాలను చిత్తశుద్ధితో రికార్డుకెక్కించాలి. అధికారులు తాము దస్తా వేజులు తినాలంటూ చెదలను ఆహ్వానించలేదని, చెదల వల్ల రికార్డులు దెబ్బతినడం ఒక యాదృచ్ఛిక దైవఘ టన అని వాదించారు.
 
 ఇది తీవ్రమైన నిర్లక్ష్యానికి ప్రతీక అని, నోటరీ రికార్డులను కాపాడడంలో విఫలమై, సమాచార హక్కు చట్టాన్ని, పబ్లిక్ రికార్డు చట్టాన్ని, నోటరీ చట్టాన్ని ఉల్లం ఘించారని కమిషన్ నిర్ధారించింది. నోటరీని పీఐఓగా భావించి 25 వేల రూపాయల జరిమానా విధించింది. నోటరీపైన ఏ చర్యా తీసుకోకపోగా నోటరీ నిర్లక్ష్యాన్ని సమర్థించి, సమాచార నిరాకరణ చేసినందుకు ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలని చట్టాల శాఖ పీఐఓకు నోటీసు జారీ చేసింది.

సమాచార అభ్యర్థికి వేయి రూపాయల పరిహారం నోటరీ న్యాయవాది చెల్లిం చాలని ఆదేశించింది. నోటరీ రికార్డుల రక్షణకు సరైన చర్యలు తీసుకొనేందుకు అంతర్జాతీయ పద్ధతులను అనుసరించి సమగ్ర నోటరీ చట్టాన్ని చేయాలని సిఫార్సు చేసింది. కీలకమైన రికార్డులను చెదలకు అప్పగించే నిర్లక్ష్యం దారుణమైన పాలనకు నిదర్శనమని సమాచార హక్కు చట్టానికి ఇది తీవ్రమైన ఉల్లంఘన అని విమర్శించింది.
 న్రందలాల్ వర్సెస్ లీగల్ ఐఫైర్స్ డిపార్ట్‌మెంట్ (CIC/SA/A/2015/001769) కేసులో మే 3న ఇచ్చిన తీర్పు ఆధారంగా
 వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
 - మాడభూషి శ్రీధర్
 professorsridhar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement